చేనేత కార్మికుల కోసం ‘నేతన్న బీమా’ పథకాన్నిప్రారంభించిన రాష్ట్రమేది ?

జాతీయం
ఎక్స్ వజ్ర ప్రహార్
13వ ఎడిషన్ భారత్-అమెరికా మిలిటరీ ఎక్సర్సైజ్ ‘ఎక్స్ వజ్ర ప్రహార్-2022’ ఆగస్టు 8న ప్రారంభమయ్యింది. ఈ విన్యాసం హిమాచల్ ప్రదేశ్‌లోని బక్లోహ్లో నిర్వహించారు. ఉమ్మడి మిషన్ ప్రణాళిక, కార్యాచరణ వ్యూహాలు వంటి రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన, అనుభవాలను పంచుకోవడం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ఈ ఎక్సర్సైజ్ను చేపడుతున్నారు. 12వ ఎడిషన్ ఎక్సర్సైజ్ 2021లో వాషింగ్టన్లో నిర్వహించారు.
స్పార్క్
దేశంలో తొలి వర్చువల్ స్పేస్ మ్యూజియం ‘స్పార్క్’ను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆగస్టు 10న ప్రారంభించారు. ఇస్రో వివిధ మిషన్లకు చెందిన డిజిటల్ కంటెంట్‌ను ఇంటరాక్టివ్ పద్ధతిలో ప్రజలకు అందించడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇస్రోను 1969, ఆగస్ట్ 15న స్థాపించారు. దీని వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటర్
ఇస్రో క్య్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్)కు చెందిన లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటర్ (ఎల్ఈఎం)ను ఆగస్ట్ 10న విజయవంతంగా పరీక్షించింది. దీంతో గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన మైలురాయి పూర్తయ్యింది. సీఈఎస్ ఏదైనా సంఘటన జరిగినప్పుడు గగన్‌యాన్ మిషన్ క్య్రూ మాడ్యూల్‌ను తీసివేస్తుంది, వ్యోమగాములను రక్షిస్తుంది. సీఈఎస్‌కు అవసరమైన థ్రస్ట్‌ను ఎల్ఈఎం అందిస్తుంది.
ఏషియన్ రీజినల్ సమ్మిట్
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఏషియన్ రీజినల్ సమ్మిట్’ను వర్చువల్‌గా ఆగస్ట్ 11న నిర్వహించింది. ‘మేకింగ్ అవర్ ఎలక్షన్ ఇన్‌క్లూజివ్, యాక్సెసబుల్ అండ్ పార్టిసిపేటివ్’ అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సును వచ్చే నెలలో నేషనల్ ఎలక్టోరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెక్సికో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘సమ్మిట్ ఫర్ ఎలక్టోరల్ డెమొక్రసీ’ సమావేశం కోసం నిర్వహించారు. భారత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్.
వార్తల్లో వ్యక్తులు
ఆర్యా వాల్వేకర్
‘మిస్ ఇండియా యూఎస్ఏ’గా భారతీయ అమెరికన్ ఆర్యా వాల్వేకర్ ఎంపికయ్యారు. ఆగస్టు 7న న్యూజెర్సీలో ఈ పోటీల్లో 30 రాష్ట్రాల నుంచి 74 మంది పాల్గొన్నారు. సౌమ్యాశర్మ తొలి రన్నరప్‌గా, సంజన్ చేకూరి రెండో రన్నరప్‌గా నిలిచారు. అలాగే మిసెస్ ఇండియా యూఎస్ఏగా అక్షి జైన్, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా తన్వీ గ్రోవర్ ఎంపికయ్యారు.
జేమ్స్ మరాపే
దక్షిణ పసిఫిక్ ద్వీప దేశంలోని పపువా న్యూగినియా దేశ ప్రధాన మంత్రిగా జేమ్స్ మరాపే ఆగస్టు 9న ఎన్నికయ్యారు. ఈ దేశ ఎన్నికలు జూలై 4న నిర్వహించగా 22న ముగిశాయి. భద్రతా సమస్యలు తదితర కారణాలతో ఆగస్టు 8న ఓట్లను లెక్కించారు. మొత్తం 118 పార్లమెంట్ సీట్లలో 39 సీట్లు మరాపే నాయకత్వంలోని ‘పంగు’ పార్టీ గెలిచింది. ప్రధాని కావడానికి 97 ఓట్లు సాధించారు.
జగదీప్ ధన్ఖర్
దేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ఆగస్ట్ 11న పదవీ బాధ్యతలు చేపట్టారు. 1951, మే 18న రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా కిథనా గ్రామంలో ఆయన జన్మించారు. 1979లో రాజస్థాన్ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1989లో ఝున్ఝును (జనతాదళ్) ఎంపీగా గెలిచారు. 1990లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొద్దికాలం పనిచేశారు.
తెలంగాణ
నేతన్న బీమా
రాష్ట్రంలో రైతు బీమా తరహాలో చేనేత కార్మికుల కోసం ‘నేతన్న బీమా’ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 80 వేలకు పైగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఎల్ఐసీ ద్వారా అమలు చేస్తుండగా.. కార్మికుల వంతు ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికుడు ప్రమాదవశాత్తు గాని, సహజ మరణం గాని పొందితే రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది.
1905, ఆగస్టు 7న కలకత్తా టౌన్హాల్లో నిర్వహించిన సమావేశంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని మోదీ 2015లో ప్రకటించారు.
రాష్ట్రానికి పురస్కారం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో రాష్ట్రం ఎకనామిక్ టైమ్స్ పురస్కారానికి ఎంపికయినట్లు ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్ టీ రాధాకృష్ణ ఆగస్టు 9న సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సరళతర వ్యాపార నిర్వహణ, సంస్కరణల కోసం అమలుచేస్తున్న కార్యాచరణతోపాటు మీ సేవ పోర్టల్‌తో ప్రజలకు అందిస్తున్న మెరుగైన డిజిటల్ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ఈ నెల 25న ఢిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్టానిక్స్ శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్ రాయబార కార్యాలయాలు జాయింట్‌గా నిర్వహించే ‘ది డిజీటెక్ కాంక్లేవ్-2022’లో అందిస్తారు.
దినేశ్ పరుచూరి
డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అడిషనల్ డైరెక్టర్‌గా దినేశ్ పరుచూరి నియమితులయ్యారు. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ జితేంద్రకుమార్ గోగియా దినేశ్‌ను నియమిస్తూ ఆగస్ట్ 10న ఉత్తర్వులు జారీచేశారు.
సంజయ్ రెడ్డి
రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ (టీఎస్పీసీ) అధ్యక్షుడిగా ఆకుల సంజయ్ రెడ్డి ఆగస్టు 11న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో కౌన్సిల్ సభ్యులు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
అంతర్జాతీయం
సింగపూర్ జాతీయ దినోత్సవం
ఆగస్టు 9న సింగపూర్ 57వ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దేశంలోని పాడాంగ్ ప్లేస్ (11 ఎకరాల పచ్చిక మైదానం)ను 75వ జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు. ఇది 200 ఏండ్ల నాటి ఐకానిక్ గ్రీన్ ఓపెన్ స్పేస్. ఇక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943లో తన ‘ఢిల్లీ చలో’ నినాదాన్ని ఇచ్చారు. అదేవిధంగా పురాతన హిందూ దేవాలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని కూడా జాతీయ చిహ్నంగా 1978లో సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిని 1885లో నిర్మించారు.
ఖయ్యామ్ ఉపగ్రహం
రష్యా రాకెట్ ఇరాన్ ఉపగ్రహాన్ని ఆగస్టు 9న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రష్యా లీజుకు తీసుకున్న కజకిస్థాన్‌లోని బైకనూర్ ప్రయోగ కేంద్రం నుంచి సోయజ్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహానికి 11వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి, ఫిలాసఫర్ ఒమర్ ఖయ్యామ్ పేరు పెట్టారు.
నౌరోజీ నివాసానికి గుర్తింపు
‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిన దాదాభాయ్ నౌరోజీ లండన్‌లో నివసించిన గృహానికి బ్లూ ప్లేక్ (నీలి ఫలకం)ను ఇంగ్లిష్ హెరిటేజ్ చారిటీ ఆగస్ట్ 10న అలంకరిచింది. లండన్‌లో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన భవనాలకు బ్లూ ప్లేక్‌ను అలంకరించే పథకాన్ని ఇంగ్లిష్ హెరిటేజ్ నిర్వహిస్తుంది. దాదాభాయ్ అప్పట్లో లండన్‌లోని ఒక భవనంలో ఎనిమిదేండ్లు నివసించారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది. మహాత్మగాంధీ, బీఆర్ అంబేద్కర్లు నివసించిన భవనాలను కూడా ఇదేవిధంగా గౌరవించింది.
వరల్డ్ బయోఫ్యూయల్ డే
వరల్డ్ బయోఫ్యూయల్ డే (ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం)ని ఆగస్టు 10న నిర్వహించారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీవో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్) ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంప్రదాయ శిలాజ ఇంధనాల స్థానంలో శిలాజ రహిత ఇంధనాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ రోజు పాటిస్తారు. జర్మన్ సైంటిస్ట్, మెకానికల్ ఇంజినీర్ సర్ రుడాల్ఫ్ క్రిస్టియన్ కార్ల్ డీజిల్ కనుగొన్న ఇంజిన్‌ను వేరుశనగ నూనెతో 1893లో విజయవంతంగా నడిపి చూపినందుకు జ్ఞాపకార్థంగా ఈ రోజును నిర్వహిస్తున్నారు. భారత్‌లో ఈ దినోత్సవాన్ని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో 2015 నుంచి నిర్వహిస్తున్నారు.
ఇంటర్నేషనల్ యూత్ డే
ఇంటర్నేషనల్ యూత్ డే (అంతర్జాతీయ యువజన దినోత్సవం)ని ఆగస్టు 12న నిర్వహించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని చేపడుతున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ఇంటర్ జనరేషనల్ సాలిడరిటీ: క్రియేటింగ్ ఏ వరల్డ్ ఫర్ ఆల్ ఏజెస్’.
క్రీడలు
విశ్వనాథన్ ఆనంద్

ది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే-అంతర్జాతీయ చెస్ సమాఖ్య) ఉపాధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్ ఎంపికయ్యాడు. ఒలింపియాడ్ సందర్భంగా ఆగస్ట్ 7న ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఫిడే గత అధ్యక్షుడు ఆర్కాడీ డ్వొర్వోవిచ్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా.. విశ్వనాథ్ ఆనంద్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఫిడేని 1924, జూలై 20న పారిస్‌లో స్థాపించారు.
కామన్వెల్త్ గేమ్స్
ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్లో నిర్వహిం చిన కామన్వెల్త్ గేమ్స్-2022 ఆగస్టు 8న ముగిశాయి. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన ఈ గేమ్స్‌లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (67, 57, 54= 178) మొదటిస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్ (57, 66, 53= 176) 2, కెనడా (26, 32, 34= 92) 3, న్యూజిలాండ్ (20, 12, 17= 49) 5, స్కాట్లాండ్ (13, 11, 27= 51) 6వ స్థానాల్లో నిలిచాయి.
బంగారు పతకం సాధించినవారు
నిఖత్ జరీన్ (బాక్సింగ్), పీవీ సింధు (బ్మాడ్మింటన్), ఆకుల శ్రీజ-శరత్ (టేబుల్ టెన్నిస్), లక్ష్యసేన్ (బ్యాడ్మింటన్), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), జెరెమీ లాల్రినుంగా (వెయిట్‌లిఫ్టింగ్), అచింత షూలీ (వెయిట్‌లిప్టింగ్), లవీ బే, పింకీ, నయన్మోని, సైకియా, రూపారాణి టిర్కీ (లాన్ బౌల్స్ మహిళల టీమ్), శరత్ కమల్, సాథియా జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, సానిల్ శెట్టి (టేబుల్ టెన్నిస్-పురుషుల టీం), సుధీర్ (పారా లిఫ్టింగ్), బజరంగ్ పునియా (రెజ్లింగ్), సాక్షి మాలిక్ (రెజ్లింగ్), దీపక్ పునియా (రెజ్లింగ్), రవికుమార్ దహియా (రెజ్లింగ్), వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్), నవీన్ మాలిక్ (రెజ్లింగ్), భవీన పటేల్ (పారా బ్యాడ్మింటన్), నీతూ గంగాన్ (బాక్సింగ్), అమిత్ పంగల్ (బాక్సింగ్), ఎల్డోస్ పాల్ (అథ్లెటిక్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (బ్మాడ్మింటన్), శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్).
2010లో భారత్‌లో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ రెండో స్థానంలో, 2018లో మూడో స్థానంలో నిలిచింది.
RELATED ARTICLES
-
Current Affairs March 27th | జాతి వివక్ష నిర్మూలన దినంగా ఏ రోజును పాటిస్తారు?
-
Current Affairs March 27th | క్రీడలు
-
Current Affairs March 27th | అంతర్జాతీయం
-
Current Affairs March 27th | వార్తల్లో వ్యక్తులు
-
Current Affairs March 27th | జాతీయం
-
February Current Affairs | 2023లో ఏ చిత్రం ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది?
Latest Updates
Indian History | బల్వంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు?
Telangana History | తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేసిన సంవత్సరం?
PHYSICS Groups Special | విశ్వవ్యాప్తం.. దృష్టి శక్తి స్వరూపం
CPRI Recruitment | సీపీఆర్ఐలో 99 ఇంజినీరింగ్ పోస్టులు
INCOIS Recruitment | ఇన్‌కాయిస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు
Power Grid Recruitment | పవర్ గ్రిడ్ లో 138 ఇంజినీరింగ్ ఉద్యోగాలు
ICMR-NIRTH Recruitment | ఎన్ఐఆర్టీహెచ్ జబల్పూర్లో ఉద్యోగాలు
NIEPID Recruitment | ఎన్ఐఈపీఐడీలో 39 పోస్టులు
DPH&FW, Nagarkurnool | నాగర్‌కర్నూలు జిల్లాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
TSNPDCL Recruitment | టీఎస్ఎన్పీడీసీఎల్లో 100 ఉద్యోగాలు