రాజ్యాంగ రక్షణలు – ప్రభుత్వ పథకాలు (పాలిటీ)
మహిళల, బాలబాలికల సంక్షేమం కోసం వారి హక్కులను కాపాడటానికి రాజ్యాంగం కొన్ని రక్షణలను కల్పించింది. రాజ్యాంగ రక్షణలు నిబంధనల ద్వారా ప్రభుత్వాలు అనేక చట్టాలను చేశాయి. తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతకు, వారి రక్షణకు అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించింది. ఆ వివరాలు సంక్షిప్తంగా…
1. రాజ్యాంగం బాలలకు అందించిన రక్షణలు, సంక్షేమ అంశాలు వివరించండి?
l నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా ఎదగడానికి కావాల్సిన కొన్ని నిబంధనలు రాజ్యాంగంలో పొందుపర్చారు. అవి..
1) ఆర్టికల్ 15(3): స్త్రీ, శిశు సంక్షేమం కోసం రాజ్యం ప్రత్యేక సదుపాయాల్ని కల్పించవచ్చు.
2) ఆర్టికల్ 21(ఎ): 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత.
3) ఆర్టికల్ 23(1): వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా, బలవంతంగా శ్రమ చేయించుకోవడం నిషేధం
4) ఆర్టికల్ 24: 14 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న చిన్నపిల్లలతో ఫ్యాక్టరీల్లో, గనుల్లో, ఇతర ప్రమాదకర ఉత్పత్తి సంస్థల్లో పని చేయించరాదు.
5) ఆర్టికల్ 39(ఇ): బాలల శ్రమశక్తి
దుర్వినియోగం కాకుండా కాపాడటం
6) ఆర్టికల్ 39(ఎఫ్): బాలల యవ్వనం, బాల్యం దోపిడీకి గురికాకుండా చూడాలి, పిల్లలు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తగిన అవకాశాలు కల్పించాలి.
7) ఆర్టికల్ 45: 6 సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకు బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యావసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషిచేయాలి.
8) ఆర్టికల్ 51-ఎ(కె): 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు విద్యను అందించేలా చేయడం తల్లిదండ్రుల ప్రాథమిక విధి.
2. బాలల సంక్షేమ చట్టబద్ధమైన హక్కుల్ని వివరించండి?
లీగల్ రైట్స్
1) బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టం -1986
2) నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యాచట్టం (ఆర్టీఈ) -2009
3) బాల్యవివాహాల నిషేధ చట్టం -2006
4) జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ -2015
5) హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ -1956
6) మానవ అక్రమ రవాణా నిషేధ చట్టం -1956
7) లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ – 1987
8) ఇండియన్ పీనల్ కోడ్ – 1860
9) ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ – 1984
10) జాతీయ బాలల హక్కుల కమిషన్- 2005
11) పోక్సో యాక్ట్ 2012 (Protection of Children from Sexual Offences Act)
12) రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్- 2016
3. బాలల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు?
1) బేటీ బచావో బేటీ పడావోను 2015, జనవరి 1న ప్రారంభించారు. పథకం ముఖ్యోద్దేశం
ఎ) భ్రూణ హత్యలు నివారించడం
బి) బాలికల మనుగడ, సంరక్షణ కోసం పాటుపడటం
సి) బాలికలకు విద్యను కల్పించడం, బాలికల భాగస్వామ్యం పెంపొందించడం
-ఈ పథకం అమలుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.
2) పోక్సో ఈ-బాక్స్
– Protection of Children from Sexual Offences Act-2012 ద్వారా ఎలక్టానిక్ కంప్లెంట్ బాక్స్ (ఈ బాక్స్)ను ఏర్పాటు చేశారు. బాధిత బాలలు, ఎన్జీవోలు, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు పోక్సో ఈ బాక్స్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.
3) నేషనల్ క్రెచె స్కీమ్ (National Creche Scheme)
– పనిచేసే మహిళల పిల్లల ఆలన పాలన చూసుకోవడం కోసం ఉద్దేశించిన పథకం (డే కేర్ సెంటర్స్).
4) బాల న్యాయ చట్టం-2015
– విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలల హక్కుల సంక్షేమం కోసం సంఘర్షణ పడుతున్న బాలలకు పునరావాస సేవలు అందించడం
5) చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ స్కీమ్
– 2009లో ఈ పథకాన్ని ప్రారంభించారు. బాలల అక్రమ రవాణా అరికట్టడం,
బాలకార్మికతను నివారించడం, బాలలపై జరుగుతున్న అనేక రకాలైన హింసలను నివారించడం, బాలల హక్కుల పట్ల బాలలకు అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
6) అంగన్వాడీ సర్వీసెస్ పథకం
-ఐసీడీఎస్‌లో భాగంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే మహిళా శిశు సంరక్షణ, పూర్వ పాఠశాలకు
సంబంధించిన అతిపెద్ద పథకం. ఈ పథకం ద్వారా 6 సంవత్సరాల్లోపు బాలలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద 6 రకాల సేవలు అందిస్తున్నారు.
1) టీకా కార్యక్రమం 2) ఆరోగ్య పరీక్షలు
3) అనుబంధ పోషణ కార్యక్రమం
4) పోషణ, ఆరోగ్య విద్యాసేవలు
5) పూర్వ పాఠశాల విద్యాసేవలు
6) తల్లి ఆరోగ్య సంరక్షణ సేవలు
7) పోషణ్ అభియాన్ (POSHAN- Pm Overa rching Scheme for Holistic Nourishment)t)
– 2018, మార్చి 8న రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూలో ప్రధాని మోదీ ప్రారంభించారు. 0 నుంచి 6 సంవత్స రాల్లోపు బాలబాలికలకు, కౌమార బాలికలకు, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందించి 3 సంవత్సరాల్లో పౌష్టికాహారపరమైన లోపాల్ని అధిగమించడమే దీని లక్ష్యం.
4. తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు/సంక్షేమ పథకాలు
-2014లో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు మహిళా సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం కృషిచేస్తుంది. అందులో భాగంగా మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆరోగ్య, భద్రతా పరమైన
సాధికారతకు కింది చర్యలు తీసుకొంది.
1) 24/7 మహిళల హెల్ప్ లైన్ (181)
l 2017, ఆగస్ట్ 19న తుమ్మల నాగేశ్వరరావు కొంపల్లిలో ప్రారంభించారు. మహిళలు ఏ రకమైన హింసకు గురైనా తక్షణమే స్పందించడానికి నిర్భయ సెంటర్/ పోలీస్/హాస్పిటల్/అంబులెన్స్‌లకు అత్యవసరంగా తెలియజేయడం. బాధితుల్ని కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం.
2) ఆశ (ASHA-Accredited Social Health Activist)
-శిశు, ప్రసూతి ఆరోగ్య కార్యకలాపాలపై ఆశ వర్కర్స్ అవసరమైన సేవలు అందిస్తారు. రాష్ట్రంలో 27,730 మంది ఆశ వర్కర్స్ ఉన్నారు.
3) షీ క్యాబ్స్/షీ ట్యాక్సీ
– 2015, సెప్టెంబర్ 8న మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడానికి నాటి రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించారు. అర్హులైనవారికి ప్రతి ట్యాక్సీకి 25 శాతం సబ్సిడీని ప్రభుత్వం సమకూరుస్తుంది.
4) ఉజ్వల
-బాలికలను అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించకుండా నిరోధించడం ఈ పథకం ప్రధానోద్దేశం. బాధిత మహిళ లకు వసతి, ఆహారం, దుస్తులు, న్యాయ సహాయం, స్వయం ఉపాధి శిక్షణ కల్పిస్తారు.
తెలంగాణలో 5 ఉజ్వల హోమ్‌లు నిర్వహిస్తున్నారు.
5) టీ షీ బాక్స్
-ఇది ఒక యాప్. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు దాఖలు చేసి పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించవచ్చు. 2021-22లో దాదాపు 4,400 ఫిర్యాదులు అందాయి.
6) షీ (సెక్యూరిటీ, హెల్త్, ఎన్విరాన్మెంట్) టీమ్స్
– యువతులు, మహిళలు, విద్యార్థినులపై నిరంతరం కొనసాగుతున్న ఈవ్‌టీజింగ్ సమస్య పరిష్కారానికి షీ టీమ్స్‌ను 2014, అక్టోబర్ 24న ప్రారంభించారు. దీని మోటో ఫర్ యూ, విత్ యూ ఆల్వేస్.
7) సఖి కేంద్రాలు
-హింసకు గురైన మహిళలకు ఒకేచోట వైద్య, న్యాయ, మానసిక సహాయం సేవలు అందించేందుకు ఈ సఖి కేంద్రాలు ఉపయోగపడుతాయి. తెలంగాణలో ప్రస్తుతం 19 జిల్లాల్లో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
8) స్వయం సహాయక బృందాలు
-మహిళల్లో ఆర్థిక సాధికారత పెంపొందించడం సమష్టీకరణ ద్వారా సాధ్యమవుతుంది. ఇందుకు స్వయం సహాయక సంఘాల (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్-ఎస్‌హెచ్‌జీ)ను ఏర్పాటు చేశారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీలను సులభతరం చేయడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 2014లో రూ.3738 కోట్ల నుంచి 2020-21లో రూ.10,448 కోట్లకు పెరిగింది.
9) టీ షటిల్ బస్సులు
-దీనిని 2015, జూన్ 29న హైదరాబాద్‌లోని రహేజా మైండ్ స్పేస్ లో ప్రారంభించారు. మహిళా ఐటీ ఉద్యోగుల సురక్షిత ప్రయాణం కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం దేశంలోనే మొదటిది. దీనికోసం రీచ్ సేఫ్ అనే యాప్‌ను రూపొందించారు.
10) షీ ఫర్ హర్
– విద్యార్థినులు కాలేజీల్లో ఎదుర్కొంటున్న వేధింపుల నిరోధం కోసం షీ టీమ్స్ ఆధ్వర్యంలో షీ ఫర్ హర్ అనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
11) ఒంటరి మహిళలకు పెన్షన్
-ఈ కార్యక్రమం 2017, జూన్ 4న జూపల్లి కృష్ణారావు ఆమన్‌గల్‌లో ప్రారంభించారు. ఒంటరిగా ఉన్న మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నెలకు రూ.2016 ప్రభుత్వం అందజేస్తుంది.
12) మహిళా శక్తి కేంద్రాలు
-రాష్ట్రంలో అమలు చేస్తున్న మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తారు.
13) ఆరోగ్య లక్ష్మి
– ఈ పథకాన్ని 2015, జనవరి 1న ప్రారంభించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు.
14) అమ్మఒడి పథకం
– బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో గర్భిణుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి 3 నెలలకోసారి చెకప్‌లు చేయించుకోవడానికి, ప్రసవానికి ముందు హాస్పిటల్‌కు తీసుకురావడానికి, ప్రసవానంతం ఇంటికి తీసుకెళ్లడానికి 102 నంబర్ వాహనాలను ఉపయోగించుకోవచ్చు.
15) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
– రాష్ట్ర మహిళ కమిషన్‌లో ఒక చైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు. వీరు ఐదేండ్లు పదవీ బాధ్యతలు
నిర్వర్తిస్తారు. ప్రస్తుత మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి.
-తెలంగాణలోని మహిళలు లింగ సమానత్వం, సత్వర న్యాయం, సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి సాధించే విధంగా దిశానిర్దేశం చేయడం ఈ కమిషన్ లక్ష్యం.
విధులు: 1) ప్రతిభ గల మహిళల భావాలను ప్రపంచ సదస్సుల్లో వినిపించేలా చేయడం
2) విధానాల రూపకల్పన చేసేవారికి పరిశోధనాపరమైన సమాచారం, అమలుకు యోగ్యమైన అంశాలను అందించడం.
3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మహిళలకు సంబంధించిన పథకాలు, విధానాలు, రాజ్యాంగ లక్ష్యాలపై అవగాహన కల్పించడం.
4) జెండర్ సెన్సిటైజేషన్ విధానాలను ప్రోత్సహించడం, తద్వారా మహిళల పట్ల వివక్షను తగ్గించడం వంటి విధులు నిర్వహిస్తుంది.
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు