‘గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్’ దేనికి సంబంధించింది? (కరెంట్ అఫైర్స్ )
1. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశాన్ని భారత్ అక్టోబర్ 29న నిర్వహిస్తుంది. ఏ అంశాన్ని ఇందులో చర్చించనున్నారు? (3)
1) పర్యావరణ పరిరక్షణ
2) సాంకేతిక పరిజ్ఞానం
3) ఉగ్రవాద నిర్మూలన
4) ప్రపంచ వ్యాక్సినేషన్
వివరణ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద వ్యతిరేక కమిటీకి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని అక్టోబర్ 29న భారత్ నిర్వహించనుంది. ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం ‘అధునాతన సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగంపై దృష్టి సారించడం’. భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 15. ఇందులో అయిదు శాశ్వతమైనవి కాగా, మిగతా పది తాత్కాలిక సభ్య దేశాలు. ప్రస్తుతం భారత్ కూడా ఇందులో ఉంది. 2021 జనవరి 1న భారత్ సభ్యత్వం ప్రారంభమయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది.
2. వరల్డ్ బ్యాంక్ తరఫున భారత కంట్రీ డైరెక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? (1)
1) ఆగస్టి తానో కౌమ్
2) అల్వారో లారియో
3) జిల్లెట్ హౌంగ్ బో
4) ఎవరూకాదు
వివరణ: వరల్డ్ బ్యాంక్‌కు సంబంధించి భారత దేశపు డైరెక్టర్‌గా ఆగస్టి తానో కౌమ్ నియమితులయ్యారు. ఆగస్ట్ 1న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయిదు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన కోట్ డి ఐవరీ దేశానికి చెందిన వ్యక్తి. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని దేశం. ఆగస్టి గతంలో టర్కీ దేశానికి ప్రపంచ బ్యాంక్ తరఫున పనిచేశారు. ఇప్పటి వరకు భారత్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన జునైద్ కమల్ అహ్మద్ విధులు నిర్వహించారు. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో ఉంది.
3. తైవాన్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (3)
ఎ. తైవాన్ను ఒక ప్రత్యేక దేశంగా ఇప్పటి వరకు గుర్తించినవి 13 దేశాలే
బి. ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలో ప్రపంచంలోనే తైవాన్ అగ్రస్థానంలో ఉంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి
వివరణ: అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సి పెలోసీ ఇటీవల తైవాన్ దేశానికి రావడం చర్చనీయాంశం అయింది. అమెరికాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తైవాన్‌కు రావడం అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నిజానికి భారత్, అమెరికాతో పాటు పలు అగ్రదేశాలు ‘ఒక చైనా’ విధానానికి కట్టుబడి ఉన్నాయి. ఇప్పటి వరకు తైవాన్ను ఒక దేశంగా గుర్తించింది. కేవలం 13 దేశాలు మాత్రమే. ముఖ్యంగా దక్షిణ అమెరికా, కరేబియన్, ఓషియానియాలోని దేశాలు, వాటికన్ కూడా తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించింది. అలాగే ఎలక్టానిక్ చిప్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే తైవాన్ అగ్రస్థానంలో ఉంది. 65% వాటా ఆ దేశానిదే. తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ కండక్లర్ల సంస్థ. భారత్‌కు కూడా ప్రస్తుతం తైవాన్ దేశంతో దౌత్యపర సంబంధాలు లేవు. అమెరికా కూడా ‘ఒక చైనా’ విధానానికి కట్టుబడి ఉంది. అయితే చర్చల ద్వారా తైవాన్ను విలీనం చేసుకోవాలని కోరుతుంది.
4. మహ్మద్ సోలిహ్ ఏ దేశానికి అధ్యక్షుడు? (4)
1) కువైట్ 2) బహ్రెయిన్
3) మడగాస్కర్ 4) మాల్దీవులు
వివరణ: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ సోలిహ్. ఆగస్ట్ 1 నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. సామర్థ్య పెంపు, సైబర్ భద్రత, గృహ రంగం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించినవి ఈ ఒప్పందాలు. అలాగే 100 మిలియన్ అమెరికన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను కూడా ఆ దేశానికి ఇవ్వనున్న ట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
5. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఎన్ని నదులు సరిహద్దును దాటుతుంటాయి? (2)
1) 57 2) 54 3) 3 4) 2
వివరణ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దును దాటే నదుల సంఖ్య 54. భారత్‌లో అతి పొడవైన గంగా నదిని ఆ దేశంలో పద్మ అని పిలుస్తారు. అలాగే బ్రహ్మపుత్ర నదికి జమున అని బంగ్లాదేశ్‌లో పేరు. ఆగస్ట్ చివరి నాటికి ఇరు దేశాల మధ్య నదులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అసోం నుంచి ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌లోకి వెళ్లే కుషియారా నదీ జలాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
6. గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్ ఎవరికి లభించింది? (3)
1) గ్రెటా థన్‌బెర్గ్ 2) రాజేంద్ర సింగ్
3) కౌశిక్ రాజశేఖర 4) అన్నా హజారే
వివరణ: శక్తి రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అవార్డ్ గ్లోబల్ ఎనర్జీ ప్రైజ్. ఈ ఏడాది ఈ అవార్డ్ ముగ్గురికి ప్రకటించారు. అందులో భారత్‌కు చెందిన కౌశిక్ రాజశేఖర కూడా ఉన్నారు. మిగతా ఇద్దరు-రష్యాకు చెందిన విక్టోర్ ఒర్లోవ్, మరొకరు అమెరికాకు చెందిన మెర్కౌరీ కనట్ జిడిస్. కౌశిక్ రాజశేఖర అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఎనర్జీ అవార్డ్‌ను 2002లో స్థాపించారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బమతి పొందిన జోరెస్ అల్ఫెరోవ్ దీని వ్యవస్థాపకుడు. రష్యా అధ్యక్షుడు లేదా అతడు నియమించిన ప్రతినిధి అవార్డ్‌ను బహూకరిస్తారు. రష్యాలోని మాస్కో కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఎనర్జీ అసొసియేషన్ ఈ అవార్డ్‌ను ఇస్తుంది.
7. ‘పిచ్ బ్లాక్ 2022’ అనే విన్యాసాలను ఏ దేశంలో నిర్వహించనున్నారు? (4)
1) అమెరికా 2) నార్వే
3) జపాన్ 4) ఆస్ట్రేలియా
వివరణ: పిచ్‌బ్లాక్ 2022 అనే వాయు సైనిక విన్యాసాలు ఆగస్ట్ 19 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నారు. భారత్‌తో సహా ఇందులో 17 దేశాలు పాల్గొననున్నాయి. 100 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 2500 మంది సైనిక సిబ్బంది ఇందులో పాల్గొంటారు. 2018 తర్వాత ఈ విన్యాసం ఈ ఏడాదే నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు దీనిని నిర్వహించలేదు. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్‌ఫోర్స్ దీనిని నిర్వహించనుంది. ఇందులో పాల్గొంటున్న దేశాలు- భారత్, యూఎస్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్, యూఏఈ, యూకే.
8. బీహార్‌లోని లంగత్ సింగ్ కాలేజీలో ఉన్న అంతరిక్ష ప్రయోగ శాల వార్తల్లో నిలవడానికి కారణం? (2)
1) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చేర్చారు
2) అంతరించే వారసత్వ ప్రయోగశాలల జాబితాలో చేర్చారు
3) యునెస్కో వర్ణనాతీత అంశాల జాబితాలో చేర్చారు
4) ఏదీ కాదు
వివరణ: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో లంగత్ సింగ్ కాలేజీలో ఖగోళ పరిశోధన శాలను 106 సంవత్సరాల కింద ఏర్పాటు చేశారు. భారత దేశ తూర్పు ప్రాంతంలో ఈ తరహా ప్రయోగశాల ఇక్కడే ఏర్పాటయ్యింది. ఈ కళాశాలను 1899లో, ప్రయోగశాలను 1916లో ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ప్రస్తుతం భీమ్రావ్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయపు గుర్తింపు పొందింది. అంతరించే దశలో ఉన్న ప్రయోగశాలలను యునెస్కో సంబంధిత జాబితాలో చేరుస్తుంది. ఫలితంగా ఇది అందరి దృష్టిని ఆకర్షించి, పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగశాల ఏర్పాటులో ప్రొఫెసర్ రొమేశ్ చ్రందసేన్ కీలక పాత్ర పోషించారు.
9. కింది ఏ దేశాలు నాటో కూటమిలో చేరనున్నాయి? (3)
ఎ. ఉక్రెయిన్ బి. స్వీడన్
సి. బెల్జియం డి. ఫిన్లాండ్
1) ఎ, బి 2) బి, సి 3) బి, డి 4) ఎ, డి
వివరణ: స్వీడన్, ఫిన్లాండ్లు నాటో కూటమిలో చేరేందుకు యూఎస్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు 95 మంది సభ్యులు మద్దతు పలికారు. ఎన్ఏటీవో పూర్తి రూపం- నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనిని 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం బెల్జియంలోని బ్రసెల్స్‌లో ఉంది. ఈ కూటమిలో చేరేందుకు ఉక్రెయిన్ కూడా యత్నించింది. రష్యాతో యుద్ధానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఈ కూటమిలో చేరిన దేశాలకు ఆర్టికల్ 5 ద్వారా రక్షణ లభిస్తుంది. దీని ప్రకారం, సభ్యత్వం ఉన్న ఒక దేశంపై జరిగే దాడిని కూటమిలోని అన్ని దేశాలపై జరిగే దాడిగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఈ ఆర్టికల్‌ను ఒకసారి ప్రయోగించారు. అది అఫ్గానిస్థాన్‌పై దాడి విషయంలో. 9/11 దాడి జరిగినప్పుడు ఈ ఆర్టికల్ 5న వినియోగించారు.
10. ఎన్ని దేశాలతో భారత్ ద్వైపాక్షిక వాయు సేవ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? (4)
1) 100 2) 126 3) 106 4) 116
వివరణ: యూఎస్, యూకే, యూఏఈ, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌తో సహా మొత్తం 116 దేశాలతో ద్వైపాక్షిక వాయు సేవ ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. విదేశీ ఎయిర్‌లైన్ సంస్థలు భారత్ కేంద్రంగా పనిచేసేందుకు ఈ ఒప్పందం వల్ల అవకాశం ఉంటుంది. భారత్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి విమానాలను షెడ్యూల్ చేసుకొనేందుకు కూడా వీలు కల్పిస్తారు.
11. ఏ రాష్ట్రంలో స్థానికులకు ఇచ్చిన 100 శాతం రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది? (4)
1) హర్యానా 2) ఉత్తరాఖండ్
3) ఛత్తీస్‌గఢ్ 4) జార్ఖండ్
వివరణ: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16(2), 16(3), 35 ప్రకరణలకు ఈ నిర్ణయం విరుద్ధం అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. 13 షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2016లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని గతంలో ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ఉటంకించింది.
12. ‘గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్’ దేనికి సంబంధించింది? (3)
1) ఆహార ఉత్పత్తుల ఎగుమతి
2) పేద దేశాలకు ఆహార ధాన్యాల సాయం
3) ఇతర దేశాల్లో భారత పండుగల నిర్వహణ
4) ఏదీకాదు
వివరణ: గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ పేరుతో భారత సాంస్కృతిక మ్రంతిత్వ శాఖ ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయంతో దీనిని నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారత పండుగలు, ఇతర వేడుకలను విదేశాల్లో నిర్వహిస్తారు. అలాగే జానపద కళారూపాలు, ఇతర నృత్య రీతులు, సంగీత, నాట్య వేడుకలతో పాటు సాహిత్య, ఆహార వేడుకలను కూడా వివిధ దేశాల్లో నిర్వహించనున్నారు. యోగాకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. భారత్-విదేశీ స్నేహ సాంస్కృతిక సంస్థలకు కూడా గ్రాంట్లు ఇస్తారు.
13. దేశంలో ప్రస్తుతం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? (2)
1) 54 2) 64 3) 49 4) 74
వివరణ: దేశంలో ప్రస్తుతం 64 రామ్సర్ సైట్లు ఉన్నాయి. చిత్తడి నేలల పరిరక్షణకు 1970 దశకంలో ఇరాన్‌లోని రామ్సర్ అనే నగరంలో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఎంపిక చేసిన చిత్తడి నేలలనే రామ్సర్ సైట్లు అంటారు. ఇటీవల భారత్ నుంచి 10 చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా గుర్తించారు. ఇందులో ఆరు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కోటి ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం రామ్సర్ సైట్ల వైశాల్యం 12,50,361 హెక్టార్లకు చేరింది. దక్షిణాసియాలో ఈ సైట్ల సంఖ్య అతిపెద్ద విస్తీర్ణం కలిగిన దేశం భారత్.
14) ఏ రాష్ట్రంలో పంచామృత్ యోజనను ప్రారంభించారు? (4)
1) గుజరాత్ 2) హర్యానా
3) ఉత్తరాఖండ్ 4) ఉత్తరప్రదేశ్
వివరణ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో పంచామృత్ యోజన అనే పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడంతో పాటు సహ పంట వ్యవసాయ విధానాన్ని పెంపొందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించారు.
15. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు? (3)
1) శ్వేతాసింగ్ 2) సత్యేంద్ర ప్రకాశ్
3) కలాయి సెల్వి 4) సురేశ్ ఎన్ పటేల్
వివరణ: సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ సైంటిస్ట్ కలతంబి కలాయిసెల్లి నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళ ఆమె. శేఖర్ మండే పదవీ విరమణ పొందడంతో ఆమెను నియమించారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో డైరెక్టర్‌గా శ్వేతాసింగ్ నియమితులయ్యారు. అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రిన్స్‌పల్ డైరెక్టర్ జనరల్‌గా సత్యేంద్ర ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిగా ఖాళీగా ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పదవి కూడా భర్తీ అయింది. సురేశ్ ఎన్.పటేల్‌ను సీవీసీగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?