ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
భారతీయ సాక్ష్య అధినియం -2023
ప్రాథమిక, ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యాలు
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సాక్ష్యాలను ప్రాథమిక, ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యాలుగా వర్గీకరించింది. నిజప్రతిని ప్రాథమిక సాక్ష్యంగా, అందులోని అంశాలను వేరే ప్రతి రూపంలో సమర్పిస్తే దాన్ని ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యంగా పరిగణించింది. నిజప్రతి ధ్వంసమైనప్పుడు లేదా ఎవరికి వ్యతిరేకంగా ఈ డాక్యుమెంట్‌ను సమర్పించి రుజువు చేయాలో ఆ వ్యక్తి వద్దనే ఈ డాక్యుమెంట్ ఉన్నప్పుడు, ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యం అవసరమవుతుంది. ఈ డాక్యుమెంట్లు లిఖితపూర్వకంగా, మ్యాప్‌లు, క్యారికేచర్ల రూపంలో ఉండవచ్చు. బీఎస్బీ2 ఈ నిబంధనను యధాతథంగా కొనసాగిస్తూనే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను కూడా ప్రాథమిక సాక్ష్యాల పరిధిలోకి చేర్చింది.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎలక్ట్రానిక్ రికార్డులను ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యాలుగా పరిగణించింది. వాటిని స్వీకరించడానికి అవసరమైన నిబంధనలను కూడా స్పష్టంగా పేర్కొంది. బీఎస్బీ2 దీన్ని సవరించి, సరైన భద్రతా ప్రమాణాలతో భద్రపరచిన ఎలక్ట్రానిక్ రికార్డులను ప్రాథమిక సాక్ష్యాలుగా స్వీకరించవచ్చునని స్పష్టం చేసింది. వివాదరహితంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని ప్రాథమిక సాక్ష్యాలుగా గుర్తించాలని పేర్కొంది. ఒకవేళ ఎలక్ట్రానిక్ రికార్డులు వివిధ ఫైల్స్ రూపంలో స్టోర్ చేసి ఉంటే, ప్రతి ఫైల్‌ను ఒక ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించాలని బీఎస్బీబి2 పేర్కొంది. ఎలక్ట్రానిక్ రికార్డుల నిర్వచనాన్ని మరింత విస్తృతం చేస్తూ, సెమీకండక్టర్ లేదా మెమరీ లేదా స్మార్ట్ఫోన్ల (ఈమెయిల్స్, లొకేషన్ వాయిస్ మెయిల్స్ సహా)లో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా ప్రాథమిక సాక్ష్యంగా స్వీకరించవచ్చునని వివరించింది.
ఎలక్ట్రానిక్ రికార్డులతో ఎదురయ్యే సమస్యలు
ఎలక్ట్రానిక్ రికార్డులను తేలిగ్గా ట్యాంపరింగ్, మార్పులు చేయవచ్చునని 2014లో సుప్రీంకోర్టు గుర్తించింది. తగిన రక్షణలో లేని ఎలక్ట్రానిక్ రికార్డులపై పూర్తిగా ఆధారపడి విచారణ కొనసాగించడం వల్ల న్యాయం అవహేళనకు గురవుతుందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఎస్బీ2తో ఎలక్ట్రానిక్ రికార్డులను ఆమోదించడానికి కోర్టులకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఏదైనా ఎలక్ట్రానిక్ సమాచారం సరైనదా కాదా అని నిర్ధారించుకునేందుకు కోర్టులు ఒక పరిశీలకుడి అభిప్రాయాన్ని కోరవచ్చు. అయితే ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ, స్వాధీనం చేసుకునేటప్పుడు లేదా విచారణ సమయంలో అందులోని సమాచారం ట్యాంపరింగ్‌కు గురి కాకుండా తీసుకోవలసిన భద్రతా ప్రమాణాల వివరాలను బీఎస్బీ2 పేర్కొనలేదు. స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ 2023 ఈ సమస్యను గుర్తించింది. ఇవి ట్యాంపరింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నందున, సాక్ష్యాలుగా సేకరించిన డిజిటల్ రికార్డుల్లో సమాచారం తారుమారు కాకుండా సరైన భద్రత కల్పించాలని సిఫారసు చేసింది.
ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ, స్వాధీనం సమయంలో తీసుకోవలసిన కనీస జాగ్రత్తలపై 2021లో కర్ణాటక హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అర్హత కలిగిన ఫోరెన్సిక్ పరిశీలకుడు తనిఖీ టీమ్‌తో పాటు ఉండాలి. ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ, స్వాధీనం సమయంలో తనిఖీ అధికారి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించ రాదు. పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌ల వంటి ఎలక్ట్రానిక్ స్టోరేజీ పరికరాలను ‘ఫారడే బ్యాగ్’ (ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ను నిరోధించే సామర్థ్యమున్న బ్యాగ్. ఇందులో ఉంచడం ద్వారా ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా వీటిల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని మార్చడం లేదా ట్యాంపరింగ్ చేయకుండా నిరోధించవచ్చు. అంతేకాకుండా నిక్షిప్తమైన సమాచారం పాడైపోకుండా కాపాడుతుంది)లో భద్రపరచాలి. ఇవీ కోర్టు సూచించిన మార్గదర్శకాలు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో, క్రిమినల్ ప్రొసీడింగ్స్ సమయంలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాన్ని స్వీకరించడానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ ఒక డ్రాఫ్ట్ డైరెక్టివ్ ప్రపోజల్‌ను రూపొందించింది. ఇందులోని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.
1. సాక్ష్యంగా స్వీకరించే ఎలక్ట్రానిక్ ఉపకరణంలోని సమాచారాన్ని మరుగు పరచడం లేదా ఫోర్జరీకి గురికాకుండా ఉంచాలి.
2. అందులోని సమాచారం సాక్ష్యంగా
తీసుకోవడానికి అనువుగా ఉండాలి.
3. సదరు ఉపకరణంలోని సమాచారాన్ని తగిన రక్షణల మధ్య భద్రంగా, ఏవిధమైన మార్పులకు గురికాకుండా ఉంచాలి.
4. నిందితుని అభ్యర్థనమేరకు ఐ.టి. నిపుణుల సహాయం తీసుకోవచ్చు.
5. అమెరికాలో ఇటువంటి సాక్ష్యాన్ని ప్రవేశపెట్టే సమయంలో ఈ ఎలక్ట్రానిక్ రికార్డు ప్రామాణికతను తగిన సాక్ష్యాధారాలతో నిరూపించాలి.
6. ఒకవేళ సమాచారం ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ లేదా సిస్టమ్ ద్వారా రూపొందించినప్పుడు క్వాలిఫైడ్ వ్యక్తి దాన్ని ధ్రువీకరించాలి.
ఎలక్ట్రానిక్ సాక్ష్యాల విషయంలో అస్పష్టత
సాక్ష్యాలుగా పరిగణించే డాక్యుమెంట్ల నిర్వచనంలో బీఎస్బీ2 ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను కూడా చేర్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో పేర్కొన్న ప్రాథమిక సాక్ష్యాల స్వీకరణకు సంబంధించి నియమాలను యధాతథంగా ఉంచింది. అదేవిధంగా ద్వితీయ ప్రాధాన్య సాక్ష్యాలుగా పరిగణించాలంటే అవి అందుకు అర్హమై ఉండాలి. ముఖ్యంగా ఒరిజినల్ డాక్యుమెంట్లు (నిజప్రతులు) ధ్వంసం కావడమో లేక నేరం మోపబడిన వ్యక్తి వద్దనే సదరు డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఈ ద్వితీయ సాక్ష్యాలను ప్రవేశపెట్టవచ్చు. ఎలక్ట్రానిక్ రికార్డుల సమాణికతను ధ్రువీకరించే సర్టిఫికెట్‌ను కూడా విచారణ సమయంలో స్వీకరించాలన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని నిబంధనను కూడా బీఎస్బీ2 కొనసాగించింది. అయితే ఇది మిగిలిన నిబంధనలపై మితిమీరిన ప్రభావం చూపే అవకాశముండటం వల్ల, సాక్ష్యం గా స్వీకరించడంలో కొంత సందిగ్ధత ఏర్పడ వచ్చు.
పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన సమాచారం వల్ల ఒక నిజం వెలికి తీయగలిగినప్పుడు, సదరు వాస్తవానికి సంబంధించిన ఈ సమాచారాన్ని సాక్ష్యంగా స్వీకరించవచ్చునని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేర్కొంటున్నది. బీఎస్బీ2 ఈ నిబంధనను కొనసాగించింది. కస్టడీలోని వ్యక్తిని హింసకు గురిచేయడం వల్ల అటువంటి వాస్తవాలు బయటపడి ఉండవచ్చునని సుప్రీంకోర్టు, వివిధ లాకమిషన్ల నివేదికలు చెబుతున్నాయి. ఆవిధంగా కస్టడీలో హింసించడం ద్వారా రాబట్టిన వాస్తవాల ఆధారంగా చూపిన సాక్ష్యాన్ని నిరూపణగా తీసుకోవాల్సిన అవసరం లేదని లా కమిషన్ (2003) తన సిఫారసుల్లో స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన అంశం..
పోలీసు కస్టడీలో వెల్లడించిన సమాచారాన్ని సాక్ష్యంగా స్వీకరించవచ్చునని, అదే పోలీస్ స్టేషన్ బయట చెప్పే సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేర్కొంది. బీఎస్బీ2 దీన్ని యధాతథంగా కొనసాగించింది. ఈ నిబంధనలోని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ 1960లో కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. కస్టడీ లోపల ఉన్న వ్యక్తి చెప్పిన సమాచారాన్ని నమ్మి, పోలీస్ స్టేషన్ వెలుపల ఒక వ్యక్తి చెప్పిన సమాచారాన్ని విశ్వసించకపోవడం కేవలం వివక్ష కిందికే వస్తుందన్నది పిటిషన్ సారాంశం. ఒక సమాచారాన్ని పోలీస్ కస్టడీ లోపల లేదా వెలుపల వెల్లడించడం అనేది కాకుండా, అసలు వాస్తవాన్ని వెలికి తీయడానికి సంబంధించి ఒక నిర్దిష్ట నిబంధన రూపొందించాలని లా కమిషన్ (2003) సిఫారసు చేసింది.
ఉపసంహారం
మొత్తంమీద చెప్పాలంటే భారతీయ సాక్ష్య (రెండవ)బిల్లు ఎలక్ట్రానిక్ రికార్డులను స్వీకరించడంపై స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ముఖ్యంగా ఈ రికార్డులను ప్రవేశపెట్టేముందు నిపుణుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొనడమే కాకుండా, అటువంటి సమాచారాన్ని భద్రపరచడానికి హ్యాష్ అల్గారిథిమ్లు అవసరమని పేర్కొంది. దీనివల్ల సైబర్ ల్యాబొరేటరీస్‌కు మరింత పనిభారం పెరుగుతుందనడంలో సందేహంలేదు. ఈ చట్టాలు అమల్లోకి వచ్చేలోగా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు ఎన్క్రిప్షన్ పద్ధతులపై మంచి అవగాహన పెంచుకొని, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవాలి.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు