రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
- గ్రూప్స్ ప్రత్యేకం జనరల్ స్టడీస్
రక్షణాత్మక నిర్మాణ శైలి
- కోట అంటే సాధారణ పరిభాషలో ‘ఆవాసులందరికీ రక్షణ భద్రతనిచ్చే బలమైన స్థావరం’ అని అర్థం. అలాగే కోటను సంస్కృతంలో ‘దుర్గం’గా వ్యవహరిస్తారు. అంటే ప్రవేశం కష్టసాధ్యం లేదా అసాధ్యం అని. తెలుగులో కోట అని.. కన్నడలో కోటె అని, తమిళంలో కోైట్టె అని అంటారు. దేశంలోని కోటల నిర్మాణశైలి ప్రాచీన సింధూ నాగరికత నాటిది. ఈ నాగరికత పరిఢవిల్లిన ప్రాంతాల్లో పురావస్తు శాఖ తవ్వకాల సందర్భంగా దిగువ, ఎగువ కోటలు, వాటిలో భారీ రక్షణ ప్రాకారాలు బయల్పడ్డాయి. జనపద యుగంలో నగరాలు ఉనికి అంతగా కనిపించినప్పటికీ, సాహిత్యంలో పురాణాల ప్రస్తావన కనిపిస్తుంది. సాధారణంగా ఈ కోటలు మట్టితో నిర్మించిన భారీ ప్రాకారాలు లేదా గోడలతో రక్షణ కల్పించినవి. కౌటిల్యుడు ప్రతిపాదించిన ‘సప్తాంగాల’లో దుర్గం 4వ స్థానంలో ఉంది.
- కాలక్రమేణ చారిత్రక యుగారంభం స్థావరాలు, పట్టణాలు లేదా నగరాల చుట్టూ కందకాలతో కూడిన ఏటవాలు మట్టికట్టలను భారీస్థాయిలో నిర్మించారు. ఇలాంటి కోటల గురించి ప్రాచీన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన రచనల్లో ప్రస్తావించాడు.
- తర్వాత రోమన్ చరిత్రకారుడు ప్లీనీ ఆంధ్రదేశంలో అంటే నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల్లో 30 దాకా ప్రాకార పట్టణాలు అనేక గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
- వీటిలో తెలంగాణలో రక్షణ ప్రాకారాలతో ఉన్న పెద్దబంకూరు, ధూళికట్ట, కోటిలింగాల, కొండాపూర్ వంటివి పురావస్తు తవ్వకాల్లో బయల్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ధాన్యకటకం, దంతపురం, సాతానికోట ముఖ్యమైనవి.
- మధ్యయుగాల రాజ్యాలు లేదా సామ్రాజ్యాల పాలనలో కోటలకు బలమైన బురుజులు, పిట్టగోడల బురుజులు, లోతైన కందకాలు, ద్వారాల విస్తరణ వగైరాల రూపంలో రక్షణ నిర్మాణ శైలి ప్రముఖ పాత్ర పోషించింది.
- ఈ కాలంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల పరిధిలో స్థానిక పరిపాలన రక్షణలు సహా కొత్త కోటలు, దుర్గాలు, ఏర్పడ్డాయి.
- ఈ కాలంలోనే రాజులు, రాజధానులు, ప్రజలకు, దేశ ఆస్తులకు బాహ్య దాడుల నుంచి మెరుగైన రక్షణ, భద్రత రీత్యా కోటలు, దుర్గాల నిర్మాణంలో మట్టి ఇటుకలకు బదులు రాతి వినియోగం ప్రారంభమైంది.
- ప్రాచీన అవశేషాల పరిశీలన ప్రకారం రెండు రాష్ర్టాల పరిధిలో 160 కోటలు లేదా పటిష్ట గ్రామాలు/పట్టణాల ఉనికి వెల్లడైంది. ఈ మేరకు తెలంగాణలో 37, కోస్తాంధ్రలో 73, రాయలసీమలో 50 కోటలు కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి.
- ప్రాదేశిక ఆధారంగా ఈ కోటలు ‘స్థల, గిరి, జల, వన’ దుర్గాలుగా వర్గీకరించారు. తెలుగు రాష్ర్టాలు రెండింటిలోనూ చారిత్రకంగా, నిర్మాణశైలి పరంగా విశేష ప్రాధాన్యంగల కోటలు చాలా ఉన్నాయి.
- తెలంగాణ పరిధిలో నిర్మల్ కోట, బోధన్, కౌలాస్, ఖమ్మం, జగిత్యాల, ఎలగందుల, రామగిరి, మెదక్, భువనగిరి, రాచకొండ, కొయిల్కొండ, దేవరకొండ, పానగల్, వరంగల్, గోల్కొండ కోటలు ముఖ్యమైనవి. ఇవన్నీ రెండు రాష్ర్టాల పరిధిలో ఉన్నప్పటకీ కొన్నిటి మధ్య చారిత్రక అనుబంధం ఉండటం గమనార్హం.
- తదనుగుణంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని మినహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మధ్య యుగాలనాటి ముఖ్యమైన కోటలు పరస్పరం ముడిపడి ఉన్నాయి.
- రాయలసీమలోని కోటలు విజయనగర సామ్రాజ్యం, కాకతీయులతోపాటు స్థానిక పాలకుల, మరాఠాల అధికార పరిధిలో ఉండేవి.
- తెలంగాణలోని కోటలు ప్రధానంగా కాకతీయ, కుతుబ్‌షాహీ, నిజాం రాజవంశాల ఏలుబడిలో ఉండేవి. ఈ సామ్రాజ్యాలు, వాటి రక్షణ నిర్మాణ శైలి విశిష్టతను వివరించే దిశగా ఎంపిక చేసిన కొన్ని కోటల గురించి తెలుసుకుందాం.
భువనగిరి కోట..
- తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. పూర్వం ఇది కాకతీయుల ఆధీనంలో ఉండేది. 1355లో అల్లావుద్దీన్ ఖిల్జీ దాడిలో ధ్వంసమైంది.
- వెలమ రాజుల హయాంలో వరంగల్, రాచకొండ కోటలతో సమానంగా భువనగిరి కూడా పరిపాలన విభాగంగా మారింది. 1433లో అహ్మద్‌షా బహమనీ తన సామంతుల్లో ఒకరికి ఈ కోటను జాగీరుగా బహూకరించాడు.
- తెలంగాణలో కుతుబ్‌షాహీల నియంత్రణలోని తొలినాటి కోటల్లో ఇదొకటి. దౌలత్ కులీ, ఇబ్రహీం కుతుబ్షాల మధ్య వారసత్వ పోరులో భువనగిరి కీలకపాత్ర పోషించింది.
- ఇది భూ మట్టం నుంచి 500 అడుగుల ఎత్తుగల ఏటవాలు కొండపై దాదాపు ఒక మైలు చుట్టుకొలతతో రూపొందించిన విశిష్ట గిరిదుర్గం.
- ఏటవాలు కొండపై ఉన్న ఈ దుర్గంలో ఎగువ, దిగువ కోటలున్నాయి. వీటి లోపలి గోడలు కాకతీయ, కుతుబ్ షాహీ రాజవంశాలు అనుసరించిన వివిధ నిర్మాణ రీతులను సూచిస్తాయి.
- కోట పై భాగానికి మూడు ప్రవేశాల ద్వారా చేరుకోవచ్చు. శిఖర భాగాన మూడు మందిరాలు, అన్ని వైపులా కమానులతో కూడిన ప్రవేశ మార్గాలతో బారాదరి కనిపిస్తుంది.
- సున్నపు పూతతో అతికిన అలంకరణలతో కూడిన గార జాడలు కుతుబ్ షాహీ శైలిని సూచిస్తాయి. వీరి పాలన తర్వాత ఈ కోట చివరకు నిజాంల ఆధీనంలోకి వెళ్లింది.
కోయిల్‌కొండ కోట..
- తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. దీని భౌగోళిక ప్రాదేశికత కారణంగా ఇది విజయనగర, కుతుబ్ షాహీ రాజ్యాల మధ్య సరిహద్దు కోటగా ఉండేది.
- కొంతకాలం బీజాపూర్ దళాల నియంత్రణలో ఉన్న ఈ కోటను బహమనీ సుల్తాన్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకోగా, ఆ తర్వాత మళ్లీ అబ్దుల్లా కుతుబ్ షా పాలనలోకి వచ్చింది.
- ఈ కోటను నిర్మించిన కొండకు పడమటి వైపు లోయ ఉండగా, కొండచుట్టూ రక్షణ ప్రాకారంతో పాటు తెర గోడలు, బురుజులు ఉన్నాయి.
- మొత్తం నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటే వాటి కమానులు అలంకరణతో కూడా ఉంటాయి. సైన్యాధిపతి నివాసంతో పాటు సైనికుల ఇళ్లు, ఆయుధగారాలు, ధాన్యాగారం, ఈద్గా వంటి కీలక ప్రదేశాల ఆనవాళ్లు ప్రస్తుతం ఈ కోటలో కనిపిస్తాయి.
ఎలగందుల కోట..
- తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. దీన్ని వెలిగుండాల కోటగానూ వ్యవహరిస్తారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ కోట ముసునూరి నాయక రాజుల పాలనలో బలమైన స్థావరంగా ఉండేది.
- అనంతర కాలంలో ఇది కుతుబ్ షాహీల హయాంలో వారి శక్తిమంతమైన సామంత రాజ్యాల్లో ఒకటిగా ఉంది.
- తర్వాత అబుల్ హసన్ కుతుబ్‌షా కాలంలో 21 పరగణాల (తాలూకా)తో సర్కారుగా మార్చారు. అనంతరం ఈ కోటను మొఘలులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నిజాం రాజులు పాలనలోకి వచ్చింది.
- ఈ దుర్గం రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యుల తర్వాత కాకతీయులు, ముసునూరి నాయకులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, నిజాంల నియంత్రణలో కొనసాగుతూ వచ్చింది.
- దీంతో సాపేక్షంగా చూస్తే కౌలాస్ కోట మరికొంత ఎగువ స్థాయిలో నిర్మించారు. 400 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ కోటకు అనేక బురుజులతో పటిష్ట నిఘా ఉండేది.
- దీనికి గల నాలుగు ద్వారాలు, బురుజుల్లో కొన్నిటి నిర్మాణ శైలి గోల్కొండ నయా ఖిల్లా బురుజుల తరహాలో అద్భుత లక్షణాలు కలిగి ఉంటుంది.
- ఇందులో మధ్యయుగాల ఆరంభం, అంతం నాటి ఒక ఆలయం, దర్గాల నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి. ఈ కోటలన్నీ ఒకనాడు అధికార, రాజకీయ కేంద్రాలుగా ఉండి కాలగమనంలో కలిసిపోయినవే. అయినప్పటికీ, ఇవి నిస్సందేహంగా గతించిన సమాజాల చారిత్రక సమాచార మూలాలు.
వరంగల్ కోట..
- ఈ కోట తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఇది నేటికీ కాకతీయుల ఉజ్వల పాలనకు వారసత్వ చిహ్నంగా నిలిచింది.
- ఆనాటి సాహిత్యం, శిలాశాసనాల ప్రకారం దీని పేరు ఓరుగల్లు, వరంగల్, ఏకశిలా నగరం, గణపతిదేవ మహారాజు పాలనలో 1199-1261 కాకతీయ సామ్రాజ్య రాజధానిని హనుమకొండ నుంచి ఇక్కడికి మార్చడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
- రాచరికానికి శక్తిమంతమైన కేంద్రంగా ఇది ఆంధ్రదేశంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా దక్షిణ భారతంలోని అనేక రాజవంశాల ఉత్థానపతనాలు సహా సాహిత్యం, కళ, వాస్తుశిల్పం, రక్షణ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది.
- వరంగల్ కోట 7.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీనికి రెండు ఏక కేంద్రక వృత్తాకార రక్షణ ప్రాకారాలు, రెండు కందకాలు ఉన్నాయి. లోపలి ప్రాకారం భారీ గ్రానైట్ రాతి పలకలతో నిర్మిచారు. చుట్టూ 1.2 కిలోమీటర్ల మేర కందకం, నాలుగు ప్రధాన ప్రదేశాల్లో ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.
- రెండో ప్రాకారం 2.4 కిలోమీటర్ల చుట్టుకొలతతో కందకం సహా నాలుగు వైపులా నాలుగు ద్వారాలతో మట్టితో కట్టిన కోట.
- రుద్రమదేవి పాలనలో 1262-1289 లోపలి రాతికోట 45 బురుజులతో బలోపేతం చేశారు. ఏ సమయంలోనైనా ప్రాకారాల మీది బురుజులకు చేరుకునేలా వీలుగా లోపలివైపు పొడవునా మెట్ల వరసలుంటాయి.
- ఏకశిల కొండపై భద్రత పర్యవేక్షణ కోసం ఎత్తయిన నిఘా గోపురం నిర్మించబడింది. ఈ కోట అనేక ఆలయాలు, లౌకిక నిర్మాణాలు, తీర్థాలు, జలాశయాలు వంటి విశిష్టపురావస్తు అవశేషాలకు నిలయం.
- స్వయంభూ ఆలయ సముదాయం అవశేషాలు, నాలుగు తోరణాల నిర్మాణం, ప్రవేశ ద్వారాలు వంటివి కాకతీయుల వాస్తుశిల్ప వైభవాన్ని చాటితే, నాటి అసమాన ఇంజినీరింగ్ పరిజ్ఞానం అబ్బురపరుస్తుంది.
- కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ కోటను అనేక మంది పాలకులు, స్థానిక నాయకులు, బహమనీలు, కుతుబ్ షాహీ నిజాం రాజవంశాలు పాలించాయి.
- Tags
- General Studies
- Group 1
- nipuna
Previous article
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు