Telangana budget | తెలంగాణ బడ్జెట్- 2023
- రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సవాళ్లకు పరిష్కారం చూపేదే రాష్ట్ర బడ్జెట్ (Annual Statement of Revenue and Expenditure/ANNUAL FINANCIAL STATEMENT OF STATE – ARTICLE 202, INDIAN CONSTITUTION). ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఆ ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి రాష్ట్ర శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. గడిచిన ఆర్థిక సంవత్సర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం వెతికేదిగా బడ్జెట్‌ను రూపొందిస్తారు.
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఫిబ్రవరి 6న బడ్జెట్‌ను రూ.2,90,396 కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘తెలంగాణ మాడల్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో సంక్షేమం, రైతు అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. రైతుకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ వార్షిక బడ్జెట్లో రైతుబంధు పథకానికి రూ.15,075 కోట్లు కేటాయించింది. దాదాపు అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పారిశ్రామిక వృద్ధి కోసం రూ.4,037 కోట్లు, విద్యారంగానికి రూ.19,093 కోట్లు, సంక్షేమ రంగానికి రూ.35,547 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.32,019 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.12,161 కోట్లు కేటాయించారు.
- 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య కాలంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది. దేశంలో అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న తెలంగాణను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగింది. దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణాలో ఉండగా జీడీపీలో మాత్రం 4.9 శాతం భాగస్వామ్యం అందించడం గర్వకారణం.
- రాష్ట్రం సాధించిన మరో విజయం, అభివృద్ధికి కొలమానం తలసరి ఆదాయం. 2013-14 సంవత్సరంలో రూ.1,12,162 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23కి రూ.3,17,115 ఉండొచ్చని అంచనా వేసింది. ఇది జాతీయ సగటు అయిన రూ.1,70,620 కంటే 86% ఎక్కువ.
- దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4% ఉండగా తెలంగాణ వ్యవసాయ వృద్ధిరేటు 7.4% ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం 2014-15లో 131.33 లక్షల ఎకరాలు కాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2020-21 సంవత్సరానికి 215.37 లక్షల ఎకరాలకు చేరింది. అలాంటి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో రాష్ట్రప్రభుత్వం రూ.26,830 కోట్లు కేటాయించింది. ఆయిల్ పామ్ సాగును 20 లక్షల విస్తీర్ణానికి చేర్చాలనే ఉద్దేశంతో రూ.1000 కోట్లు ప్రతిపాదించింది. నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు ప్రకటించింది.
- తెలంగాణ ఆవిర్భవించిన నాటికి 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే ప్రస్తుతం ఈ సామర్థ్యం 18,453 మెగావాట్లకు చేరింది. విద్యుదుత్పత్తికి ఈ బడ్జెట్లో రూ.12,727 కోట్లు కేటాయించింది.
- 2022 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల్ జీవన్ అవార్డుల్లో మిషన్ భగీరథకు ప్రథమ బహుమతి లభించింది. ఇంటింటికి నల్లా ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించే మిషన్ భగీరథకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పేదలకు రేషన్ బియ్యం పంపిణీపై పరిమితిని ప్రభుత్వం ఎత్తివేసింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నది. అలాంటి ప్రజాపంపిణీ వ్యవస్థకు ఈ బడ్జెట్లో రూ.3,117 కోట్లు కేటాయించింది.
- 2014లో పింఛన్ తీసుకునే వారి సంఖ్య రాష్ట్రంలో 29,21,828 ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రారంభించిన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 44,12,882 కు చేరింది. అలాంటి ఆసరా పెన్షన్ల కోసం రూ.12,000 కోట్లు కేటాయించింది.
- దళితుల జీవితాల్లో వెలుగులు నింపి వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు కార్యక్రమం కోసం ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు, షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్ల నిధులను కేటాయించింది. షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక నిధి కోసం, వారి అభివృద్ధి కోసం రూ.15,233 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
- బాల్య వివాహాల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం ఈ వార్షిక బడ్జెట్లో రూ.3210 కోట్లు కేటాయించింది.
- మహిళా శిశు సంక్షేమానికి రూ.2131 కోట్లు కేటాయించింది.
- పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 2,000 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.2.63 లక్షల మందికి ఈ ఏడాది లబ్ధి చేకూరనున్నది. అందుకోసం బడ్జెట్లో రూ.7,890 కోట్లు కేటాయించారు.
- ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కొత్త ఈహెచ్ఎస్ (హెల్త్ స్కీం) విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకంగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది.
- స్థానిక సంస్థల బలోపేతం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను స్టానిక సంస్థల ఖాతాల్లోకే నేరుగా బదిలీ చేయనున్నది. ఇందుకు ఫైనాన్స్, ట్రెజరీల ఆమోదం అవసరం లేదు.
- గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 9 జిల్లాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం కోసం ప్రస్తుత బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు.
- విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించింది. వర్సిటీలకు ఇంత భారీగా నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.
- ఫార్మా రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జేఎన్టీయూ సుల్తాన్పూర్ క్యాంపస్‌ను ఫార్మాహబ్‌గా చేయనున్నట్లు ప్రకటించింది.
కేటాయింపులు
- 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం రూ.2,90,396 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లు ప్రతిపాదించింది.
- నీటి పారుదల రంగం రూ.26,885 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
- హోంశాఖకు రూ.9,599 కోట్లు
- ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు
- విద్యాశాఖకు రూ.19,093 కోట్లు
- వైద్య రంగానికి రూ.12,161 కోట్లు
- ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1463 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11,327 కోట్లు
- ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
- ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు
- ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ.366 కోట్లు
- రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
- రైతుబంధు పథకానికి రూ.15,075 కోట్లు
- రైతుబీమా పథకానికి రూ.1589 కోట్లు
- కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు
- ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు
- కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.3,210 కోట్లు
- దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు
- ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
- మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు
- గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
- మైనార్టీ సంక్షేమం కోసం రూ.2,200 కోట్లు
- ఆయిల్ పామ్‌కు రూ.1000 కోట్లు
- అటవీ శాఖకు రూ.1471 కోట్లు
- హరితహారం పథకానికి రూ.1471 కోట్లు
- పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ.4,834 కోట్లు
- డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ.12,000 కోట్లు
‘త్రి’శక్తితో ప్రగతి పరుగులు
‘అభివృద్ధి-సంక్షేమం, గ్రామాలు-పట్టణాలు, ఐటీ-వ్యవసాయం ఒకేసారి అభివృద్ధి సాధించే అరుదైన ప్రాంతం తెలంగాణ. ఒకవైపు పరిశ్రమల స్థాపన, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యం. ఇలాంటి సమగ్రమైన, సమ్మిళిత అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు’.. ఇటీవల ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వేను పరిశీలిస్తే మంత్రి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని నిరూపితం అవుతున్నది. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవారంగాల్లో ఏదో ఒకటి గణనీయ వృద్ధిని సాధిస్తుంది. కానీ, తెలంగాణలో మొదటి నుంచీ మూడు రంగాలు.. మూడు చోదకశక్తులుగా పనిచేస్తున్నాయి. ప్రగతిరథాన్ని పరుగులు పెట్టించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జరిగింది. తెలంగాణ ఆర్థిక రంగం ‘త్రి’శక్తితో మూడురెట్ల వేగంతో పరుగులు పెట్టింది.
15.6% వృద్ధి సాధించిన జీఎస్డీపీ
సర్వే ప్రకారం 2022-23లో రాష్ట్ర జీఎస్డీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.13.27 లక్షల కోట్లుగా నమోదైంది. 2020-21తో పోల్చితే ఏకంగా 15.6% వృద్ధిని సాధించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు 15.4% కంటే మెరుగైన వృద్ధిరేటును సాధించింది. 2014-15 నుంచి గమనించినా.. తెలంగాణ వృద్ధిరేటు ప్రతిసారీ దేశ జీడీపీ వృద్ధిరేటును మించి నమోదవుతున్నది.
సుప్రీంకోర్టు
భారత సుప్రాంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సంఆన్ని ఫిబ్రవరి 4న నిర్వహించారు. సుప్రీంకోర్టు వార్షికోత్సవం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ వార్షికోత్సవానికి సింగపూర్ ప్రధాన న్యాయముర్తి సుందరేషన్ మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రోల్ ఆఫ్ జ్యుడీషియరీ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ అనే అంశంపై మాట్లాడారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?