షాహిద్ బెహెస్టి పోర్ట్ ఏ దేశంలో ఉంది?
1. కుషియారా నీటి పంపకానికి సంబంధించి ఇటీవల ఏ దేశంతో భారత్ ఒప్పందాన్ని
కుదుర్చుకుంది? (సి)
1) నేపాల్ 2) భూటాన్
3) బంగ్లాదేశ్ 4) మయన్మార్
వివరణ: కుషియారా నదీ జలాల పంపకానికి సంబంధించి భారత్, బంగ్లాదేశ్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు దేశాలకు చెందిన మంత్రుల స్థాయి ఉమ్మడి నదుల కమిషన్ 38వ సమావేశం ఇటీవల నిర్వహించారు. కుషియారా నది అనేది ఒక శాఖ లాంటిది. బరాక్ నదికి సంబంధించింది. బరాక్ నది కుషియారా, సుర్మగా విడిపోతుంది. కుషియారా భారత దేశంలో నాగాలాండ్ రాష్ట్రంలో ఉద్భవిస్తుందని చెప్పుకోవచ్చు. అస్సాం, సిల్హేట్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది పొడవు 160 కిలోమీటర్లు. మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా నీటిని పంచుకోవడం, అలాగే వరద సమాచారాన్ని తెలియజేయడం, నదీ కాలుష్యాన్ని అరికట్టడం, నదీ తీరాల పరిరక్షణకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు.
2. షాహిద్ బెహెస్టి పోర్ట్ ఏ దేశంలో ఉంది? (4)
1) ఇరాక్ 2) లిబియా
3) అఫ్గానిస్థాన్ 4) ఇరాన్
వివరణ: కేంద్ర జల రవాణా, ఓడ రేవులు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ ఇటీవల ఇరాన్‌లోని షాహిద్ బెహెస్టి ఓడరేవును సందర్శించారు. దీని అభివృద్ధి పనులను సమీక్షించారు. చాబహర్ ఇరాన్లో ఉంది. ఇందులో రెండు వేర్వేరు ఓడ రేవులు భాగం. అవి షాహిద్ కలాంతరి, షాహిద్ బెహెస్తి. చాహర్ అనేది పారశీక పదం, నాలుగు అని అర్థం. బహర్ అంటే వసంత రుతువుగా చెప్పొచ్చు. సముద్రం నుంచి నేరుగా అనుసంధానం కలిగిన అతి లోతైన సముద్ర ఓడరేవు ఇరాన్లో చాబహర్ మాత్రమే. భారత్ ఆర్థిక సాయంతో దీనిని నిర్మిస్తున్నారు. పాకిస్థాన్‌కు వెళ్లకుండా, నేరుగా మధ్య ఆసియాతో పాటు పశ్చిమ దేశాలకు వెళ్లేందుకు దీని ద్వారా భారత్‌కు వీలు కల్పిస్తుంది.
3. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-26 సదస్సులో ప్రధాని మోదీ పంచామృత్ అనే అంశాన్ని ప్రస్తావించారు. ఇవి దేనికి సంబంధించినవి? (3)
1) భారత్‌లోని పంచారామాలు
2) భారత ఉపఖండపు దేశాలు
3) పర్యావరణ పరిరక్షణ
4) విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు, చమురు
వివరణ: పర్యావరణ పరిరక్షణను ఉద్దేశించి పంచామృత వ్యూహాన్ని ప్రధాని మోదీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-26లో ప్రస్తావించారు. అవి.. 1. 2030 నాటికి శిలాజేతర ఇంధనాల సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడం 2. 2030 నాటికి భారత్ తన శక్తి అవసరాల్లో 50% పునరుత్పాదక శక్తులపై ఆధారపడుతుంది 3. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 1 బిలియన్ టన్నులు తగ్గించడం 4. కర్బన వ్యవస్థ తీవ్రతను 45 శాతం కంటే దిగువకు తీసుకురావడం 5. శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని 2070 నాటికి సాధించడం. అయితే భారత్ శూన్య ఉద్గారాలు 2070 నాటికి సాధించాలంటే భారత్‌కు 10.1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అని ఇటీవల ‘గెటింగ్ ఇండియా టు నెట్ జీరో’ అనే నివేదిక పేర్కొంది.
4. బోయింగ్ 787 ఎయిర్‌క్రాఫ్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు? (2)
1) ప్రపంచంలో అత్యంత వేగాన్ని అందుకున్న విమానంగా చరిత్ర సృష్టించింది
2) గగన్ నావిక వ్యవస్థ నిబంధనల నుంచి 2025 వరకు మినహాయింపు పొందింది
3) బోయింగ్ 787ను కర్బన ఉద్గార తటస్థ విమానంగా ప్రకటించారు
4) ఏదీకాదు
వివరణ: దేశీయంగా అభివృద్ధి చేసిన గగన్ నావిక వ్యవస్థ నుంచి డిసెంబర్ 2025 వరకు బోయింగ్ 787 ఎయిర్‌క్రాఫ్ట్‌కు మినహాయింపు ఇచ్చారు. 2016 పౌర విమానయాన విధానం ప్రకారం అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు గగన్ (జీఏజీఏఎన్) వ్యవస్థ నిబంధనలను పాటించాలి. మొదట 2019 జనవరి 1లోగా ఈ మార్పు జరగాలని చెప్పినా, తర్వాత 2020 జూన్ 30 వరకు, ఆ తర్వాత 2021 జూలై 1 వరకు పొడిగించారు. ప్రస్తుతం బోయింగ్‌కు మినహాయింపు ఇవ్వడానికి కారణం ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది.
5. దేశంలో మొట్టమొదటి జియో థర్మల్ శక్తి ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభం అయింది? (4)
1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) లడఖ్
వివరణ: భారత్‌లో తొలి జియో థర్మల్ శక్తి ప్రాజెక్ట్‌ను లడఖ్‌లోని పుగాలో అందుబాటులోకి తేనున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న జియోథర్మల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా ఇదే. ఇక్కడ భూమి అంతర్భాగం నుంచి వస్తున్న వేడిని అందిపుచ్చుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నిర్ణయించింది. పుగా అనేది ఒక లోయ ప్రాంతం. 14,000 అడుగుల ఎత్తులో ఉంది.
6. భారత్‌తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తి అయినందున పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసిన ఆఫ్రికా దేశం కింది వాటిలో ఏది? (3)
1) దక్షిణాఫ్రికా 2) సూడాన్
3) ఈజిప్ట్ 4) లైబీరియా
వివరణ: భారత్, ఈజిప్ట్‌ల మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయ్యాయి. ఇరు దేశాల మధ్య ఈ సంబంధాలు ఆగస్ట్ 18, 1947లో ప్రారంభమయ్యాయి. అంటే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన మూడు రోజుల తర్వాత ఈ సంబంధాలు ఏర్పడ్డాయి. అదే రోజున భారత్‌ను ఒక దేశంగా ఈజిప్ట్ గుర్తించింది. అలీన ఉద్యమం ఏర్పాటులో కూడా ఇరు దేశాలకు చెందిన నాయకులు కీలక పాత్ర పోషించారు. నాటి భారత ప్రధాని నెహ్రూ, ఈజిప్ట్ అధ్యక్షుడు గామల్ అబ్దెల్ నాసర్ వ్యవస్థాపకుల్లో భాగం. 1955లో ఇరు దేశాల మధ్య చరిత్రాత్మక స్నేహ పూర్వక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం అలీన ఉద్యమంలో 120 దేశాలు భాగంగా ఉన్నాయి.
7. అనంగ్ తాల్ సరస్సు ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? (1)
1) ఢిల్లీ 2) పుదుచ్చేరి
3) హర్యానా 4) హిమాచల్ ప్రదేశ్
వివరణ: దక్షిణ ఢిల్లీలో ఉన్న అనంగ్ తాల్ సరస్సును జాతీయ ప్రాధాన్య స్మారకంగా ప్రకటించారు. దీనికి సంబంధించి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాతీయ ప్రాధాన్య స్మారకాలను గుర్తించేది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వీటి సంరక్షణ కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ప్రాచీన స్మారకాలను తొలిసారిగా 1958లో చట్టం ద్వారా నిర్వచించారు. 100 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉన్న ప్రదేశాలను మాత్రమే ఈ జాబితాలో చేరుస్తారు. అనంగ్ తాల్ సరస్సు క్రీ.శ 1060 నాటిది. దీని వైశాల్యం 10.599 ఎకరాలు. దీనిని తోమర వంశస్థుడైన అనంగ్ పాల్ నిర్మించారు.
8. భారత్‌కు చెందిన పాండురంగ్ ఖాంఖోజే విగ్రహాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నారు? (4)
1) కెనడా 2) నార్వే
3) ఫ్రాన్స్ 4) మెక్సికో
వివరణ: వ్యవసాయ శాస్త్రవేత్త, భారత స్వాతంత్య్ర సమర యోధుడు పాండురంగ్ ఖాంఖోజే విగ్రహాన్ని మెక్సికో దేశంలో ఏర్పాటు చేయనున్నారు. ఆయన మహారాష్ట్రలోని వార్ధాలో 1884లో జన్మించారు. బాలగాంగధర తిలక్ పోరాటంతో పాటు ఫ్రెంచి విప్లవం, అమెరికా స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొందారు. 1914లో ఏర్పాటైన గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడటమే. మెక్సికో విప్లవ కారులతో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన మెక్సికో నగర సమీపంలోని చాపింగోలో ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. మొక్కజొన్న, గోధుమ, పప్పుధాన్యాలు, రబ్బర్‌పై పరిశోధనలు చేశారు. కరువు ప్రాంతాల్లో పెరిగే రకాలను అభివృద్ధి చేశారు. ఇదే తర్వాత కాలంలో హరిత విప్లవానికి దారి తీసింది.
9. భారత దేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? (3)
1) పుణె 2) కొహిమా
3) బెంగళూర్ 4) నాగ్‌పూర్
వివరణ: భారత దేశపు మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించే భవనానికి అయ్యే వ్యయంలో నాలుగో వంతు మాత్రమే 3డీ ప్రింట్ భవనానికి అవుతుంది. లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ దీనిని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌లో భవనాలను నిర్మిస్తున్న ఏకైక సంస్థ ఇదే.
10. డీఆర్డీవో కొత్త చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? (2)
1) ఉన్నికృష్ణన్ నాయర్ 2) కామత్
3) కేవీ సుబ్రమణియన్ 4) మనోజ్ సోని
వివరణ: డీఆర్డీవో కొత్త చైర్మన్‌గా సమీర్ వి కామత్ నియమితులయ్యారు. ఇది రక్షణ రంగ పరిశోధన సంస్థ. ఇప్పటి వరకు ఈ పదవిలో సతీష్ రెడ్డి కొనసాగారు. ప్రస్తుతం సతీష్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు శాస్త్ర సాంకేతిక సలహాదారుగా నియమించారు. దీంతో డీఆర్డీవో చైర్మన్ పదవికి కామత్‌ను ఎంపిక చేశారు. ఆయన ఇదే సంస్థలో నేవల్ సిస్టమ్స్-మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే ఉన్నికృష్ణన్ నాయర్ కేరళలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నారు. కేవీ సుబ్రమణియన్ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు కార్యనిర్వాహక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది నవంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. మనోజ్ సోని యూపీఎస్సీ చైర్మన్.
11. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాను ప్రోత్సహించడానికి యునెస్కో ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? (4)
1) ఇన్ఫోసిస్ 2) గూగుల్
3) హోండా 4) రాయల్ ఎన్ఫీల్డ్
వివరణ: ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాను ప్రోత్సహించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో యునెస్కో జత అయింది. యునెస్కో ప్రధాన కేంద్రం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ఆయా అంశాలు, ప్రాంతాల పరిరక్షణ, ప్రాచుర్యం ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం. పశ్చిమ హిమాలయాలు, ఈశాన్య ప్రాంతాలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.
12. ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లను ఏ దేశంలో ప్రవేశపెట్టారు? (3)
1) జపాన్ 2) నార్వే
3) జర్మనీ 4) దక్షిణ కొరియా
వివరణ: హైడ్రోజన్ శక్తి ఆధారిత రైళ్లను ప్రపంచంలో తొలిసారిగా జర్మనీ దేశంలో ప్రవేశపెట్టారు. హైడ్రోజన్ ఇంధనంతో రూపొందించిన బ్యాటరీలతో అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దాని సాయంతో ఈ రైళ్లను నడుపుతారు. గతంలో డీజిల్‌తో నడిచిన 15 రైళ్లను హైడ్రోజన్ శక్తి ఆధారిత రైళ్లుగా మార్చారు.
13. పులిట్జర్ ప్రైజ్-2022 పొందిన ఫమిదా ఆజిమ్ ఏ దేశానికి చెందినవారు? (1)
1) బంగ్లాదేశ్ 2) పాకిస్థాన్
3) ఇండోనేషియా 4) మాల్దీవులు
వివరణః అమెరికాకు చెందిన ఇన్సైడర్ అనే ఆన్లైన్ మ్యాగజైన్లో విధులు నిర్వహిస్తున్న ఫమిదా ఆజిమ్కు 2022 పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ‘ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ’ అనే విభాగంలో ఈ అవార్డ్‌ను గెలుచుకుంది. అదే విధంగా ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఈ అవార్డ్‌ను గెలుచుకున్న వాళ్లు ఆంటోని డెల్, జోష్ ఆడమ్స్, వాల్డ్ హిక్కే ఉన్నారు.
14. యునెస్కో పీస్ ప్రైజ్-2022ను ఎవరికి ప్రకటించారు? (2)
1) కమలా హారిస్ 2) ఏంజెలా మెర్కెల్
3) శాంతి సేథి 4) ఎవరూ కాదు
వివరణ: జర్మనీ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ యునెస్కో శాంతి బమతి 2022కు ఎంపికయ్యారు. శరణార్థులను అనుమతిస్తూ కీలక నిర్ణయం ఆమె తీసుకున్నారు. 2015 వేసవిలో విపరీతంగా శరణార్థులు సురక్షిత ప్రాంతాల కోసం వెతికారు. సిరియా, అఫ్గానిస్థాన్, ఇరాక్లలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శరణార్థులు మధ్యధరా సముద్రం దాటి వలస వెళ్లారు. చాలా దేశాలు తమ సరిహద్దులను మూసివేయగా జర్మనీ మాత్రం వారికి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆమె పేర్కొన్న పదాలు ‘విర్ స్కాఫెన్ డాస్’ ప్రాచుర్యం పొందాయి. దీని అర్థం మేం చేయగలం అని (వుయ్ కెన్ డూ దిస్).
15. దేశంలో మొట్టమొదటి సారిగా ‘విద్య టౌన్షిప్’ను ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? (3)
1) కేరళ 2) పశ్చిమబెంగాల్
3) ఉత్తర్‌ప్రదేశ్ 4) మహారాష్ట్ర
వివరణ: రాష్ట్రంలో విద్య టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది. ‘ఒక ప్రవేశం.. బళ నిష్క్రమణ’ అనే విధానాన్ని ఇక్కడ అమలు చేయనున్నారు. యువతకు అత్యంత నాణ్యతతో కూడిన విద్యను అందిస్తారు. అలాగే ఉద్యోగ నైపుణ్యాలను పెంచేలా విద్య ఉంటుంది. వసతి సదుపాయం కూడా ఇక్కడే ఉంటుంది. అధ్యాపకులు, ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?