ఎగిరే చేపలు.. మంత్రసాని కప్పలు!
జీవిత చరిత్రలో కనీసం ఏదైనా ఒక దశలో పృష్ఠవంశాన్ని కలిగి ఉండే జీవులన్నింటినీ కార్డెటాలో చేర్చారు. రూపం, శరీర ధర్మ ప్రక్రియలు, అలవాట్లలో కార్డెట్లు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. సముద్ర అధఃస్థలం నుంచి ఎత్తైన ప్రదేశాల వరకు అన్ని రకాల ఆవాసాల్లో కార్డెట్లు నివసిస్తాయి. ఇది జంతు రాజ్యంలోని అత్యున్నత వర్గం. ఇందులో ట్యూనికేట్లు, లాంస్లెట్లతో పాటు సకశేరుకాలను (చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు) చేర్చారు. కార్డెటా వర్గంలో 50 వేలకు పైగా సజీవ జాతులను చేర్చారు. దీన్ని మూడు ఉపవర్గాలుగా వర్గీకరించారు. అవి యూరోకార్డెటా, సెఫలోకార్డెటా, వర్టిబ్రేటా.
కార్డెటా
చతుష్పాదులు
-ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలన్నింటినీ కలిపి టెట్రాపొడా (చతుష్పాదులు) అంటారు. చతుష్పాదులు అంటే నాలుగు పాదాలు కలిగినవి అని అర్థం. టెట్రాపొడాలో నాలుగు పాదాలు గల సకశేరుకాల నుంచి ఉద్భవించిన సర్పాలు, పక్షులు, తిమింగళాలు, నాలుగు పాదాలు లేని సకశేరుకాలు కూడా ఉంటాయి. టెట్రాపొడా తప్ప మిగిలిన సకశేరుకాలన్నీ చేపలు. చేపలు, ఉభయచరాలను కలిపి ఇక్తియోప్సిడాగా సరీసృపాలు, పక్షులను కలిపి సారాప్సిడాగా వ్యవహరిస్తారు.
చేపలు
– దవడలు గల మొట్టమొదటి సకశేరుకాలు. ఇవి సైలూరియన్ యుగంలో ఆస్ట్రకోడర్మ్ల నుంచి ఉద్భవించాయి.
-చేపల అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. డివోనియన్ యుగాన్ని చేపల స్వర్ణ యుగం అంటారు.
-ప్రపంచంలోని అతిచిన్న చేప పీడోసిప్రిస్ ప్రొజెనిటికా (7.9 మిల్లీమీటర్లు).
– ప్రపంచంలోని అతిపెద్ద చేప రైనోడాన్ టైపస్ (తిమింగలం సొరచేప).
చేపల సాధారణ లక్షణాలు
-చేపలు మంచినీరు, ఉప్పునీటి కయ్యలు, సముద్రపు నీటిలోనూ జీవించే శీతల రక్త జలచర జంతువులు.
-బాహ్యాస్థిపంజరం అంతస్తచ పొలుసులు, అస్థి ఫలకాలతో నిర్మితమై ఉంటుంది. అంతరాస్థి పంజరం అస్థి లేదా మృధులాస్థి నిర్మితం.
– పృష్ఠ, ఉదర (పాయు), పరపుచ్చ వాజాలు మధ్యస్థ లేదా అద్వంద్వ వాజాలు. ఇవి ఈదేటప్పుడు దేహాన్ని స్థిరంగా ఉంచడానికి తోడ్పడతాయి. ఉరో, శ్రోణి వాజాలు పార్శ లేదా ద్వంద్వ వాజాలు.
-దంత విన్యాసం బవార దంత, అగ్ర దంత, సమదంత రకానికి చెందింది.-శ్వాసక్రియ ప్రాథమికంగా మొప్పల ద్వారా (జల శ్వాసక్రియ) జరుగుతుంది.
-హృదయంలో రెండు గదులుంటాయి. ఒక కర్ణిక, ఒక జఠరిక రక్తాన్ని మొప్పలకు మాత్రమే పంపుతుంది. కాబట్టి హృదయాన్ని జల శ్వాస హృదయం అంటారు. కాలేయ, వృక్క నిర్వాహక వ్యవస్థలుంటాయి.
-క్రియాత్మక ప్రౌఢ మూత్రపిండాలు మధ్య వృక్క రకానికి చెందినవి.
– మెదడు, వెన్నుపామును ఆవరిస్తూ మెనింక్స్ ప్రిమిటివా అనే ఒక పొర ఉంటుంది. మస్తిష్కార్ధగోళాలు అస్పష్టంగా ఉంటాయి. పది జతల కపాల నాడులుంటాయి.
-అభివృద్ధి శిశూత్పాదక జీవుల్లో ప్రత్యక్షంగానూ, అండోత్పాదక జీవుల్లో పరోక్షంగానూ జరుగుతుంది.
-చేపల్లో సుమారు 25 వేల సజీవ జాతులను గుర్తించారు. హను చేపలను మూడు విభాగాలుగా వర్గీకరించారు.
అవి. 1. ప్లాకోడర్మి 2. కాండ్రిక్థిస్ 3, ఆస్టిక్థిస్
-ప్లాకోడర్మి విభాగంలో విలుప్త చేపలను చేర్చారు. వీటిని మృదులాస్థి చేపల పూర్వీకులుగా పరిగణిస్తారు. కొన్ని మంచినీటిలోనూ, కొన్ని సముద్రపు నీటిలోనూ నివసిస్తాయి. దేహాన్ని కప్పుతూ దృఢమైన అస్థి కవచం ఉంటుంది.
ఉదా: బోత్రియోలెపిస్, డంకెలాస్టియస్
-కాండ్రిక్థిస్ విభాగంలో మృదులాస్థి చేపలను చేర్చారు. చాలా వరకు సముద్ర జీవులు. అంతరాస్థి పంజరం పూర్తిగా మృదులాస్థి నిర్మితం. పేగులో సర్పిల కవాటం ఉంటుంది. అంతర ఫలదీకరణం జరగుతుంది. పిండాభివృద్ధి ప్రత్యక్ష రకానికి చెందినది.
– ఆస్టిక్థిస్ విభాగంలో అస్థి చేపలను చేర్చారు. ఇవి మంచినీటి, ఉప్పు నీరు, ఉప్పునీటి కయ్యల్లో జీవిస్తాయి. అంతరాస్థి పంజరం ప్రధానంగా అస్థి నిర్మితం. నాలుగు జతల తంతురాప మొప్పలుంటాయి. మొప్ప చీలికలు ఉపరికులతో కప్పి ఉంటాయి. బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. ఇవి అధికంగా అండోత్పాదకాలు.
-1938లో దక్షిణాఫ్రికా తూర్పు తీరంలో సజీవ లాటిమేరియా చేపను పట్టుకున్నారు. ఇది ఉక్కు నీలి రంగులో 1.5 మీటర్ల పొడవు ఉంది. ఆఫ్రికా తీరం వెంట చాలమ్నా నదీ ముఖద్వారం వద్ద పట్టుకున్నారు కాబట్టి నది జ్ఞాపకార్థంం దీనికి లాటిమేరియా చాలమ్నే అని నామకరణం చేశారు. జురాసిక్ యుగం నుంచి అతికొద్ది మార్పులతో జీవిస్తున్నది కాబట్టి దీన్ని సజీవ శిలాజంగా వర్ణిస్తారు.
-డిప్నాయ్ చేపలను ఊపిరితిత్తి చేపలు అంటారు. ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. ఇవి ఉభయచరాల వంశ కర్తలైన ఆస్టియో లెపిడ్లతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ‘ఉభయచరాల మేనమామలు’ అని రోమర్ అభివర్ణించారు. వీటిలో 3 ప్రజాతులు మాత్రమే జీవించి ఉన్నాయి.
1. నియోసెరటోడస్ (ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్స్లో బెర్నెట్, మేరీ నదులు)
2. ప్రోటోప్టెరస్ (ఉష్ణ మండల ఆఫ్రికా నదులు)
3. లెపిడోసైరన్ (ఉష్ణ మండల దక్షిణ అమెరికా నదులు)
ప్రత్యేక లక్షణాలు గల చేపలు
విద్యుత్ చేప- టార్పిడో
సుత్తితల చేప- స్పిర్నా లేదా జైగీనా
విషపు చేప- స్టోన్ ఫిష్
ఎగిరే చేప- ఎక్సోసీటస్
ఎలుక చేప- కైమేరా
ఉభయచరాలు
-ఇవి నేలపై చలించగల చతుష్పాదులు. ఇవి నీటిలో కూడా జీవనాన్ని కొనసాగిస్తాయి. డివోనియన్ యుగంలో ఆస్టియోలెపిడ్ల నుంచి ఉద్భవించాయి. ఇవి కార్బోనిఫెరస్ కాలంలో వృద్ధిచెందాయి.
– లాబరింతో డాంట్ ఉభయచరాలు సరీసృపాల పూర్వీకులు.
-ఆంఫీబియన్ల అధ్యయనాన్ని బాట్రకాలజీ అంటారు.
– జీవించిఉన్న ఆంఫీబియన్లను మూడు క్రమాలుగా విభజించారు.1. ఎపొడా- సిసీలియన్లు
2. యూరోడిలా- సాలమాండర్లు, న్యూట్లు
3. ఎన్యూరా- కప్పలు, గోదురు కప్పలు
-ప్రపంచంలో అతిపెద్ద కప్ప రానా గోలియాత్.
ఆఫీంబియా సాధారణ లక్షణాలు
– ఇవి ఉభయచరాలు. పాక్షికంగా నేలపైన, నీటిలోనూ జీవిస్తాయి.
– ఇవి శీతల రక్త జీవులు. శీతాకాల, గ్రీష్మకాల సుప్తావస్థను ప్రదర్శిస్తాయి.
-చర్మం నునుపుగా, తేమగా, గ్రంథియుతంగా పొలుసులు లేకుండా ఉంటుంది. బాహ్యచర్మంలో శ్లేష్మ గ్రంథులు, పారాటాయిడ్ గ్రంథులు అనే విష గ్రంథులు ఉండవచ్చు (బ్యుఫో).
-అగ్ర దంత లేదా పార్శ దంత రకానికి చెందిన సమదంతాలు ఉంటాయి. దంత విన్యాసం బవార రకానికి చెందినది. దంతాలు నమలడానికి ఉపయోగపడవు.
-పుపుస, జల, చర్మీయ శ్వాసక్రియ, ఆస్యగ్రసని కుహర శ్వాసక్రియ జరుగుతుంది.
-రెండు కర్ణికలు, ఒక జఠరికతో కూడిన మూడు గదుల హృదయం ఉంటుంది.
-క్రియాత్మక ప్రౌఢ మూత్రపిండాలు మధ్య వృక్క రకానికి చెందినవి.-
-స్నిగ్ధ పదార్థాన్ని స్రవించే హార్డేనియన్ గ్రంథులు, జలరూప ద్రవాన్ని స్రవించే లాక్రిమల్ గ్రంథులు
-మొదటిసారిగా ఆంఫీబియన్లలో ఏర్పడ్డాయి. అనేక కప్పల్లో నిమేషక పటలం ఉంటుంది.
-ఉభయచరాలు ఉల్బరహితాలు. చాలా జీవుల్లో పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. వాటిలో జలచర డింభకం ప్రౌఢ జీవిగా రూపవిక్రియ చెందుతుంది.
-విలుప్త ఉభయచరాలను లాబరింతోడాన్షియా ఉపవిభాగంలో చేర్చారు. దంతం ఆధారభాగంలో డెంటిన్, ఎనామిల్ ముడతలు పడి ఉంటాయి.
-ఎపొడాలో సిసీలియన్లు లేదా గుడ్డి పురుగులను చేర్చారు. ఇవి భారతదేశం, శ్రీలంక, ఆఫ్రికా ఉష్ణమండల అమెరికాలో ఉంటాయి. గమనాంగాలు, మేఖలలు ఉండవు. తోక లోపిస్తుంది. మగజీవుల్లో అవస్కర కుడ్యం తిరగబడి సంపర్కాంగంగా పనిచేస్తుంది.
-అంతర ఫలదీకరణం జరుగుతుంది.
-యూరోడిలాలో సాలమాండర్లు, న్యూట్లను చేర్చారు. ఇవి ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల, సమశీతోష్ణ మండలాల్లో కనిపిస్తాయి.
-ఉత్తర అమెరికాను యూరోడిలా జీవుల రాజధాని అంటారు.
-వీటి గమనాంగాలు బలహీనంగా ఉంటాయి. లోక జీవితాంతం ఉంటుంది.
-సంపర్కాంగం ఉండదు. సాధారణంగా అంతర ఫలదీకరణం జరుగుతుంది.
-ఎన్యూరాలో కప్పలు, గోదురు కప్పలను చేర్చారు. ఇవి ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ఉంటాయి.
చరమాంగాలు పూర్వాంగాల కన్నా పొడవుగా ఉండి గెంతడానికి, ఈదడానికి, అనుకూలంగా ఉంటాయి.
పాదాలకు అంగుళ్యాంతరజాలం ఉం టుంది.=
-ప్రౌఢదశలో తోక లోపిస్తుంది. దంతాలు కేవలం పైదవడపై ఉంటాయి.
-రానా టైగ్రినా- భారతదేశపు సాధారణ కప్ప
–బ్యుఫో మెలనాస్టికస్- సాధారణ గోదురు కప్ప
ఎలైటిస్- మంత్రసాని కప్ప
ఫిల్లోబేటస్- విషపు కప్ప
రాకోఫోరస్- ఎగిరే కప్ప
హైలా- చెట్టు కప్ప
సరీసృపాలు
– సరీసృపాలు కార్బోనిఫెరస్ యుగంలో లాబరింతోడాంట్ ఆంఫీబియన్ల నుంచి ఉద్భవించాయి. ఇవి మధ్య జీవ మహాయుగంలో వృద్ధిచెంది, జురాసిక్, క్రటేషియన్ యుగాల్లో పెద్ద డైనోసార్లుగా పరిణతి చెందాయి.
-మధ్యజీవ మహాయుగాన్ని (మీసోజాయిక్) సరీసృపాల స్వర్ణయుగంగా పేర్కొంటారు.
– ఆధునిక జీవ మహాయుగంలో జీవించి ఉన్న సరీసృపాలను నాలుగు క్రమాలుగా విభజించారు.
1. కిలోనియా
2. రింకోసెఫాలియా
3. స్కామేటా
4. క్రొకడీలియా
-సరీసృపాలు నేలపైన గుడ్లుపెట్టే మొదటి నిజమైన భూచర సకశేరుకాలు. ఇవి మొదటి ఉల్బసహిత జీవులు.
– సరీసృపాలను అధయనం చేసే శాసా్త్రన్ని హెర్పటాలజీ అంటారు.
– క్రొకడైలస్ పోరోసన్ అనే ఉప్పునీటి మొసలి ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ సరీసృపం.
-స్ఫీరోడక్టెలస్ అరియాసే (మరుగుజ్జు గెకో) అతిచిన్న సరీసృపం.
సరీసృపాల సాధారణ లక్షణాలు
– ఇవి శీతల రక్త జంతువులు. దేహం తల, మెడ, మొండెం, తోక అనే భాగాలుగా విభజించవచ్చు.
– పంచాంగుళీక గమనాంగాలుంటాయి (సర్పాలు, కొన్ని బల్లుల్లో ఉండవు).
అంగుళ్యాలు నఖాలను కలిగిఉంటాయి.
– చర్మం పొడిగా నీటికి అపారగమ్యంగా పొలుసులతో ఉంటుంది. చర్మంలో ఫిమోరల్ గ్రంథులను కలిగి ఉంటుంది.
-అంతశ్చర్మంలో అనేక క్రొమాటోఫోర్లుంటాయి. ఊసరవెళ్లుల వంటి కొన్ని బల్లులు పర్యావరణ ఉద్దీపనలకు ప్రతిచర్యగా వర్ణాన్ని మార్చుకుంటాయి.
– పురె మోనోకాండైలిక్ రకానికి చెందినది. దీనిలో ఒకేఒక అనుకపాల కందం ఉంటుంది.
– దంత విన్యాసం సమదంత, అగ్రదంత, బవార దంత రకానికి చెందినది.
-ప్రాథమికంగా పుపుస వాయు వినిమయం జరుగుతుంది. పర్శుకాంతర కండరాలు శ్వాసక్రియలో సహాయపడతాయి.
-హృదయంలో రెండు కర్ణికలు, అసంపూర్తిగా విభజితమైన జఠరిక ఉంటాయి.
– క్రియాత్మక ప్రౌఢ మూత్రపిండాలు అంత్య వృక్క రకానికి చెందినవి.
– వీటిలో వరాశిక, మృద్వి-లౌతికళ త్వచం అనే రెండు మెనింజస్లు ఉంటాయి.
– సర్పాల్లో తప్ప మిగతావాటిలో కపాలనాడులు 12 జతలు ఉంటాయి.
– స్పీనోడాన్లో తప్ప మిగిలిన వాటిలో గాడి గల సంపర్కాంగాలు ఉంటాయి. ఉల్బదారుల్లో అంతర ఫలదీకరణం జరుగుతుంది.
-అధికంగా అండోత్పదకాలు. గుడ్లు క్లీడాయిక్ (కర్పరంతో కూడిన) రకానికి చెందినవి. ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది.
-స్ఫీనోడాన్ (హట్టేరియా) అనేది అతిప్రాచీన లెపిడోసారియన్ జీవి. దీన్ని సాధారణంగా ‘టుఅటారా’ అంటారు. గమనాంగాలు సాపేక్షంగా బలహీనంగా ఉంటాయి. ఇది న్యూజిలాండ్ దేశానికి పరిమితమై ఉంది. దీన్ని సజీవ శిలాజంగా పరిగణిస్తారు.
నోట్: న్యూజిలాండ్, ఐర్లాండ్లో పాములు ఉండవు.
– బల్లుల గురించి అధ్యయనం చేసే శాసా్త్రన్ని సారాలజీ అంటారు.
– హీలోడెర్మా సస్పెక్టమ్ అనేది విషపు బల్లి. దీనిలోని విషం న్యూరోటాక్సిక్ రకానికి చెందినది.
గోడబల్లి- హెమిడక్టెలస్
తొండ- కెలోటిస్
ఉడుము- వెరానస్ మానిటర్
గాజు బల్లి- ఒఫిసారస్
నాగుపాము- నాజానాజా
కట్లపాము- బంగారస్ సిలూరియస్
రక్తపింజర- వైపర్
రాచనాగు- నాజా హన్న
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు