తెలంగాణ పోలీసులకు రాష్ట్రపతి పతకాలు
తెలంగాణ
పోలీస్ మెడల్
కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చే పురస్కారాలు రాష్ట్ర పోలీసులకు లభించాయి. ఆగస్టు 14న ప్రకటించిన వీటిలో 2 రాష్ట్రపతి పోలీస్ పతకాలు, 17 పోలీస్ పతకాలు దక్కాయి. రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ (ఎన్సీ) ఎస్పీ దేవేందర్ సింగ్‌లకు రాష్ట్రపతి పతకాలు దక్కాయి.
న్యాయమూర్తుల ప్రమాణం
హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన ఆరుగురిని ఆగస్టు 16న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేయించారు. శాశ్వత న్యాయమూర్తులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్, అదనపు న్యాయమూర్తులుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావు ప్రమాణం చేశారు.
విష్ణుస్వరూప్ రెడ్డి
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ ఎన్ విష్ణుస్వరూప్ రెడ్డి చేసిన చెవి ఆపరేషన్ల అధ్యయన వివరాలు కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి వెలువడే ప్రఖ్యాత జర్నల్ ‘లారింగాలజీ అండ్ ఓటాలజీ సంచికలో వెలువడినాయి. ఆయన 16 సంవత్సరాల్లో చేసిన వెయ్యికి పైగా ఆపరేషన్లలో 99 శాతం విజయవంతమయ్యాయి. వీటి వివరాలు ఆ సంచికలో ప్రచురించారు. దీంతో ఈ ఘనత సాధించిన వైద్యుల్లో ప్రపంచంలో ఆయన రెండో వ్యక్తి కావడం విశేషం. ఈ విషయాన్ని ఆయన ఆగస్టు 18న మీడియాకు వెల్లడించారు.
జాతీయం
గోల్డెన్ జాయింట్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ‘చీనాబ్ బ్రిడ్జ్ గోల్డెన్ జాయింట్’ను ఆగస్టు 13న ప్రారంభించారు. దీనిని జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించారు. ఈ బ్రిడ్జి కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఉంది. కత్రా, బనిహాల్ మధ్య 111 కి.మీ. మార్గంలో ఇది కీలకమైన అనుసంధానంగా నిలుస్తుంది. దీని ఎత్తు 359 మీ., పొడవు 1315 మీ.. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేశారు. కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరకు రవాణా ట్రక్కులకు ప్రస్తుతం 48 గంటల సమయం పడుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చు.
మాండ్లా
మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే మాండ్లా జిల్లా దేశంలోనే మొదటి సంపూర్ణ ‘క్రియాత్మక అక్షరాస్యత’ జిల్లాగా అవతరించిందని రాష్ట్ర మంత్రి బిసాలాల్ సింగ్ ఆగస్టు 15న వెల్లడించారు. ప్రజలను క్రియాత్మకంగా అక్షరాస్యులను చేయడానికి పాఠశాల విద్యా శాఖ, అంగన్వాడీ, సామాజిక కార్యకర్తలు, మహిళా శిశు అభివృద్ధి శాఖ కలిసి పనిచేశాయి. దీంతో రెండేండ్లలోనే ప్రజలు తమ పేర్లను రాయడం, చదవడం, లెక్కించడం వంటివి చేయడంతో దేశంలో ఈ మార్కును చేరుకున్న మొదటి జిల్లాగా మాండ్లా నిలిచింది.
కొత్త ఆయుధాలు
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొత్త ఆయుధ వ్యవస్థలను ఎఫ్-ఐఎన్ఎస్ఏఎస్, నిపుణ్ మైన్స్, ఎల్‌సీఏలను సైన్యానికి ఆగస్టు 17న అందజేశారు. ఎఫ్-ఐఎన్ఎస్ఏఎస్ (ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్)ను సైనికుడిని స్వీయ-నియంత్రణ పోరాట యంత్రంగా మార్చడానికి రూపొందించారు. దీనిలో రాత్రి, పగలు చూడగలిగే హోలోగ్రఫిక్, రిఫ్లెక్స్ సైట్లతో కూడిన ఏకే-203 అసాల్ట్ రైఫిల్‌ను సమకూర్చారు. దీనిని తుపాకీపైన, సైనికుడి హెల్మెట్‌పైన ఏర్పాటు చేశారు. నిపుణ్- శత్రు పదాతిదళం, యుద్ధ ట్యాంకులు, ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను తిప్పికొడుతుంది. ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ (ఎల్సీఏ)- సైన్యం తన బలగాలను మరింత సమర్థవంతంగా సమీకరించడంలో సహాయపడుతుంది.
ఎలక్టిక్ డబుల్ డెక్కర్ బస్
దేశంలో మొట్టమొదటి ఏసీ ఎలక్టిక్ డబుల్ డెక్కర్ బస్‌ను కేంద్ర ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు 18న ప్రారంభించారు. స్విచ్ ఈఐ22 అని పేరుపెట్టిన ఈ బస్సును అశోక లేల్యాండ్ తయారుచేసింది.
అంతర్జాతీయం
డోర్నియర్ మారిటైమ్
భారత నౌకాదళ వైస్ చీఫ్ అడ్మిరల్ ఘోర్మడే రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆగస్టు 15న శ్రీలంకకు చేరారు. ఈ సందర్భంగా శ్రీలంకకు సముద్ర నిఘా విమానం ‘డోర్నియర్’ను భారత హై కమిషనర్ గోపాల్ భాగ్లేతో కలిసి బమతిగా అందజేశారు. ఈ విమానం తీరప్రాంత జలాల్లో మానవ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.
క్లైమేట్ చేంజ్ బిల్లు
అమెరికాలో వాతావరణ మార్పుల నియంత్రణ, ప్రజారోగ్యానికి ఉద్దేశించిన, డెమొక్రాట్లు రూపొందించిన ‘క్లెమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్’ బిల్లుకు అధ్యక్షుడు జో బైడెన్ ఆగస్ట్ 16న ఆమోదముద్ర వేసి చట్టరూపం కల్పించారు. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు పన్ను రాయితీలను ఇవ్వడంతోపాటు రానున్న దశాబ్దంలో వాతావరణ మార్పుల నిరోధానికి 37,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని ఈ బిల్లును రూపొందించారు.
ఇంటర్నేషనల్ సెక్యూరిటీ-2022
అంతర్జాతీయ భద్రతపై 10వ మాస్కో కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ-2022 సమావేశం ఆగస్టు 16న ముగిసింది. రష్యాలోని మాస్కోలో ఆగస్టు 15న ప్రారంభమైన ఈ సమావేశాన్ని రష్యా రక్షణ శాఖ నిర్వహించింది. ఈ సమావేశంలో 35 దేశాలకు చెందిన రక్షణ మంత్రులు పాల్గొన్నారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు.
వరల్డ్ ఫొటోగ్రఫీ డే
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఆగస్ట్ 19న నిర్వహించారు. అత్యంత ముఖ్యమైన కళారూపాల్లో ఒకటైన ఫొటోగ్రఫీని కెరీర్‌గా కొనసాగించుకునే వ్యక్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1837లో ఫ్రెంచ్కు చెందిన లూయిస్ డాగురే, జోసెఫ్ నైస్‌ఫోర్ నీప్పే ‘డాగ్యురోటైప్’ అనే ఫొటోగ్రఫిక్ ప్రక్రియను అభివృద్ధి చేశారు. ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 1839, జనవరి 9న డాగ్యురోటైప్‌ను ఆమోదించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం దీని ఆవిష్కరణకు పేటెంట్‌ను పొంది, దానిని ప్రపంచానికి ఉచితంగా ఇచ్చింది. నాణ్యమైన మొదటి కలర్‌ఫొటోను 1861లో, మొదటి డిజిటల్ ఫొటోను 1957లో తీశారు. ఈ ఏడాది దీని థీమ్ ‘పాండమిక్ లాక్డౌన్ థ్రూ ది లెన్స్’.
క్రీడలు
సిమోనా హలెప్
రొమేనియా టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్ డబ్ల్యూటీఏ 1000 కెనడియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆగస్ట్ 14న టొరొంటోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్ క్రీడాకారిణి బెయాట్రిజ్ హడాడ్ను ఓడించింది.
ఈశాన్య ఒలింపిక్ గేమ్స్
2వ ఎడిషన్ నార్త్ ఈస్ట్ (ఈశాన్య) ఒలింపిక్ గేమ్స్‌ను మేఘాలయలోని షిల్లాంగ్‌లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు నిర్వహించనున్నారు. నార్త్ ఈస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ, ది డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్ అండ్ యూత్ అఫైర్స్ అండ్ ది నార్త్ ఈస్ట్ ఒలింపిక్ అసోసియేషన్ (ఎన్ఈవోఏ)లు ఈ గేమ్స్ నిర్వహణ కోసం ఆగస్ట్ 13న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేఘాలయ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పోర్ట్ అండ్ యూత్ అఫైర్స్ డిపార్ట్మెంట్ మంత్రి అధ్యక్షత వహించారు. ఈ గేమ్స్‌లో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మొదటి ఎడిషన్‌ను 2018లో మణిపూర్‌లో నిర్వహించారు.
కెవిన్ ఓబ్రియెన్
ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ జోసెఫ్ ఓబ్రియెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆగస్టు 16న ప్రకటించాడు. అతడు క్రికెట్లో 2006లో అడుగుపెట్టాడు. 3 టెస్టుల్లో 258, 153 వన్డేల్లో 3619, 110 టీ20ల్లో 1973 రన్స్ చేశాడు.
వార్తల్లో వ్యక్తులు
సైమన్ స్టియెల్
యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లెమేట్ చేంజ్ (యూఎన్ఎఫ్సీసీసీ)కి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గా సైమన్ స్టియెల్ నియమితులయ్యారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ స్టియెల్ను ఆగస్టు 15న నియమించారు. ఈయన గ్రెనడా ప్రభుత్వంలో వాతావరణ స్థితిస్థాపకత, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు.
అల్కేష్ కుమార్ శర్మ
కేంద్ర ఎలక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ అల్కేష్ కుమార్ శర్మ ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై నియమించిన ప్రముఖ నిపుణుల బృందంలో ఆగస్టు 16న నియమితులయ్యారు. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం (ఐజీఎఫ్)లో పదిమంది సభ్యులు ఉన్నారు. దీనిలో అల్కేష్ ఒకరు. ఐజీఎఫ్ ప్యానెల్‌ను డిజిటల్ కార్పొరేట్లో భాగంగా యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు. దీనిలోని ఇతర సభ్యులు.. వింట్ సెర్ఫ్ (యూఎస్), హతెమ్ డోవిడర్ (ఈజిప్ట్), లైజ్ ఫహ్ర్ (డెన్మార్క్), మారియా ఫెర్నాండ గర్జా (మెక్సికో), టూమస్ హెండ్రిక్ ఇల్వ్ (ఎస్తోనియా), మారియా రెస్సా (ఫిలిప్పీన్స్, యూఎస్ఏ), కరోలినా ఎడ్స్టాడ్లర్ (ఆస్ట్రియా), బెంగా సెసన్ (నైజీరియా), లాన్ గ్జూ (చైనా).
విలియం రూటో
కెన్యా అధ్యక్షుడిగా విలియం రూటో ఆగస్టు 16న ఎన్నికయ్యారు. రూటోకు 50.49 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి, మాజీ ప్రధాని రైలా ఒడింగాకు 48.85 శాతం వచ్చాయి. రూటో ఇప్పటి వరకు కెన్యా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కెన్యా రాజధాని నైరోబి. కరెన్సీ షిల్లింగ్.
సునీల్‌కుమార్ గుప్తా
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కార్యదర్శిగా సునీల్‌కుమార్ గుప్తా ఆగస్టు 17న నియమితులయ్యారు. ఈయన 1987 బ్యాచ్ పశ్చిమబెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారి. 2023, డిసెంబర్ 31న పదవీ విరమణ చేసేంతవరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
ఆశిష్ ధవన్
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సభ్యుడు)గా భారత్‌కు చెందిన మానవతావాది ఆశిష్ ధవన్ ఆగస్టు 18న నియమితులయ్యారు. ఈయన కన్వర్జెన్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవలందిస్తున్నారు. ఆయనతో పాటు యూఎస్‌లోని స్పెల్మాన్ కాలేజీ అధ్యక్షురాలు డాక్టర్ హెలెన్ డి గేల్ కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా నియమితులయ్యారు.
రాజ్‌కిరణ్ రాయ్
నేషనల్ బ్యాంకింగ్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) ఎండీగా రాజ్‌కిరణ్ రాయ్ ఆగస్టు 18న నియమితులయ్యారు. ఈ పదవికి ఆయన పేరును ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో సిఫారసు చేసింది. ఆర్బీఐ, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ (డీఎఫ్ఐ) నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ అతని నియామకాన్ని ఆమోదించింది. ఆయన ఈ పదవిలో ఐదేండ్లు ఉంటారు.
అర్చన కే
ఉపాధ్యాయురాలు, విషయనిపుణులు
నల్లగొండ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?