నామ్సాయ్ ప్రకటన ఏ రాష్ట్రాలకు సంబంధించింది?
1. యూఎన్‌ఎంవోజీఐపీ సంస్థకు సంబంధించి భారత్, పాకిస్థాన్‌ల పరిశీలకుడిగా ఎవరిని నియమించారు? (3)
1) స్టేఫెన్ టింగ్
2) యాంటోని టెక్డన్
3) గిలెర్మో పబ్‌లో రియోజ్
4) రికీ బూస్టర్ స్టీఫెన్
వివరణ: యూఎన్‌ఎంవోజీఐపీ అనేది సంక్షిప్త రూపం. దీని విస్తరణ రూపం- యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్. ఇటీవల ఈ మిషన్‌కు నేతృత్వం వహించేందుకు గిలెర్మో పబ్‌లో రియోజ్ను నియమించారు. ఆయన అర్జెంటీనా దేశానికి చెందిన వ్యక్తి. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణను పరిశీలించేందుకు తొలిసారిగా ఈ మిషన్ 1949 జనవరి 24న జమ్ము కశ్మీర్‌కు చేరుకుంది. అయితే 1972 తర్వాత ఈ మిషన్‌కు భారత్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇరుదేశాల మధ్య 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం సమర్థంగా మిషన్ పాత్రను పోషిస్తుంది అని భారత్ భావిస్తుంది.
2. భారత్‌లో 2021లో డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్న ప్రజల శాతం ఎంత? (4)
1) 10.6 శాతం 2) 15.21 శాతం
3) 4.9 శాతం 4) 7.3 శాతం
వివరణ: దేశపు జనాభాలో 2021లో 7.3 శాతం మంది డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా ఉక్రెయిన్ దేశంలో 12.7 శాతం మంది ఈ కరెన్సీని కలిగి ఉన్నారు. ఈ దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో ఉంది. ఉక్రెయిన్ తర్వాత రష్యా, వెనెజులా, సింగపూర్, కెన్యా, అమెరికాలు ఉన్నాయి. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ కరెన్సీని కలిగి ఉన్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
3. ఐఎండీ-యూఎన్డీపీలు భారత్‌లో ఎన్ని రాష్ట్రాల్లో పర్యావరణ మెరుగు కార్యక్రమాలను చేపట్టబోతున్నాయి? (3)
1) 8 2) 9 3) 10 4) 12
వివరణ: దేశంలో పది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐఎండీ-యూఎన్డీపీలు తమ కార్యకలాపాలను చేపట్టనున్నాయి. అవి.. బీహార్, ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్, జారండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలని భారత్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందుకు జపాన్ సాయంతో ఐఎండీ-యూఎన్డీపీలు పలు పర్యావరణ హిత చర్యలు తీసుకోనున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రపంచంలోని 23 దేశాలకు జపాన్ ఆర్థిక సాయాన్ని అందించనుంది.
4. ఏ సంవత్సరంలో భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య సహకార ఒప్పందం కుదిరింది? (2)
1) 1984 2) 1994
3) 2004 4) 2014
వివరణ: భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య 60 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయ్యాయి. ఇరుదేశాల మధ్య 1994లో సహకార ఒప్పందం కుదిరింది. వాణిజ్యం, ఆర్థిక అంశాలతో పాటు మరిన్ని రంగాల్లో సహకారానికి సంబంధించింది ఇది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఇరుపక్షాల మధ్య 2007 నుంచి చర్చలు జరుగుతున్నాయి. 2004లో హేగ్‌లో భారత్, ఈయూల మధ్య జరిగిన చర్చల్లో మంచి పురోగతి ఉంది. తమ సంబంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ దిశగా తీసుకెళ్లాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. అలాగే 2005లో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. దీనినే 2008లో సమీక్షించారు.
5. పడంగ్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ దేశంలో ఉంది? (1)
1) సింగపూర్ 2) నేపాల్
3) భూటాన్ 4) జపాన్
వివరణ: పడంగ్ అనే ప్రదేశం సింగపూర్‌లో ఉంది. 1943 జూలైలో ఇక్కడే ‘ఢిల్లీ చలో’ అనే నినాదాన్ని సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. ఈ ప్రదేశాన్ని జాతీయ స్మారక చిహ్నంగా సింగపూర్ ప్రకటించింది. ఆ దేశంలో ఇది 75వ స్మారక చిహ్నం. ఈ ఏడాది ఆగస్ట్ 9న సింగపూర్ తన 57వ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పడంగ్కు జాతీయ హోదా ప్రకటించింది.
6. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి? (3)
ఎ. పిన్‌కోడ్ పద్ధతి ప్రవేశపెట్టి ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తయ్యింది
బి. ఐసీఏఆర్-నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1923లో ఏర్పాటు చేశారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) రెండూ సరికావు
వివరణ: భారత్‌లో 1972 ఆగస్టు 15న పిన్‌కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. భారత్‌కు స్వతంత్రం వచ్చినప్పుడు 23,344 పోస్టాఫీసులు ఉండేవి. ముఖ్యంగా ఇవి పట్టణ ప్రాంతాలకు పరిమితమయ్యాయి. ఆ తర్వాత వేగంగా విస్తరించారు. దీంతో త్వరగా ఉత్తరాలను బట్వాడ చేసేందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న శ్రీరామ్ భికాజి వెలంకార్ దీనికి ఆద్యులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఐసీఏఆర్-నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ను మొదట బెంగళూర్ కేంద్రంగా 1923లో ప్రారంభించారు. తర్వాత దీనిని హర్యానాలోని కర్నాల్‌కు మార్చారు. శతజయంతి ఉత్సవాలను ఈ కేంద్రంలో ఇటీవల ప్రారంభించారు.
7. పర్యావరణ పరిరక్షణ చట్టానికి ఏ మార్పును ఇటీవల ప్రతిపాదించారు? (1)
1) అధికంగా జరిమానాలు, తక్కువ ఖైదు
2) జరినామానాల స్థానంలో ఖైదు విధించడం
3) జరిమానా, ఖైదు సమానంగా విధించడం
4) ఏదీకాదు
వివరణ: 1986 నవంబర్ 19న భారత్‌లో పర్యావరణ పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిని ఉల్లంఘించిన వాళ్లకు అయిదు సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించేవాళ్లు. అయితే దీనిలో సవరణ కోరుతూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసింది. అధికంగా జరిమానాలు, తక్కువగా ఖైదు ఉండాలన్నది ఉద్దేశం. పర్యావరణ పరిరక్షణ నిధికి వచ్చిన మొత్తాన్ని జమ చేయాలన్న అంశాన్ని కూడా ప్రతిపాదించారు.
8. ఎస్ఎస్ఐ మంత్ర ఇటీవల వార్తల్లో ఉంది, ఇది ఏంటి? (2)
1) సూక్ష్మ సంస్థలకు కొత్త యాప్
2) సర్జికల్ రోబోటిక్ సిస్టమ్
3) లఘు సంస్థలకు కొత్తగా రుణం ఇచ్చే పద్ధతి
4) సూక్ష్మ సంస్థలకు ప్రత్యేకించిన ఉపగ్రహం
వివరణ: రాజీవ్‌గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిసెర్చ్ సెంటర్లో ఎస్ఎస్ఐ-మంత్ర అనే పేరుతో సర్జికల్ రోబోట్‌ను ప్రవేశపెట్టారు. ఇది దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన రోబోటిక్ సర్జరీ. ఇప్పటి వరకు భారత్‌లో ఇలాంటివి 72 వచ్చాయి. అన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన మొదటి రోబోటిక్ సర్జరీ ఎస్ఎస్ఐ మంత్ర. డాక్టర్ సుధీర్ పీ శ్రీవాస్తవ దీనిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
9. వరుణ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (3)
1) అత్యంత వేగపు కంప్యూటర్
2) వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉద్దేశించిన యాప్
3) ఇది ఒక డ్రోన్ 4) ఏదీకాదు
వివరణ: దేశంలో మొట్టమొదటిసారిగా మనుషులు ప్రయాణించే డ్రోన్‌ను వరుణ అనే పేరుతో రూపొందించారు. ఇది ఒక మనిషిని మోసుకెళ్లగలదు. దీని పరిధి 25 కిలోమీటర్లు. 130 కేజీల బరువును ఇది మోయగలదు. 25 నుంచి 33 నిమిషాల పాటు ఇది ఎగరగలదు.
10. భారత్ అంటార్కిటికా బిల్లును ఇటీవల లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం…? (4)
1) అంటార్కిటికాను సైన్య రహితంగా మార్చాలి
2) అంటార్కిటికా ప్రాంతంలో అణు పరీక్షలు నిర్వహించరాదు.
3) శాస్త్ర పరిశోధనకు మాత్రమే అంటార్కిటికా ప్రాంతం పరిమితం కావాలి
4) పైవన్నీ
వివరణ: అంటార్కిటికా ఒప్పందంపై 1959లో సంతకం చేశారు. దీనిని 1961 నుంచి అమలు చేస్తున్నారు. దీనిపై భారత్ 1983లో సంతకం చేసింది. ఒక ఖండం మొత్తానికి సంబంధించి కుదిరిన తొలి ఒప్పందం ఇదే. దీని అమలుకు భారత్ ఇటీవల ఒక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా అది ఆమోదం పొందింది. భారత్ ఇప్పటివరకు అంటార్కిటికాకు 41 సార్లు అన్వేషణ యాత్రను చేపట్టింది. అక్కడ భారత్‌కు సంబంధించి దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అనే పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. అంటార్కిటికాలో స్కిర్మచర్ అనే ప్రాంతంలో ప్రియదర్శిని అనే పేరుతో భారత్ ఒక మంచినీటి సరస్సును కూడా నిర్మించింది.
11. ఎన్ని నగరాల్లో ‘స్ట్రీట్ వ్యూ’ సేవను ప్రవేశపెట్టాలని గూగుల్ నిర్ణయించింది? (2)
1) 5 2) 10 3) 15 4) 20
వివరణ: భారత్‌కు చెందిన జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థల సాయంతో స్ట్రీట్ వ్యూ సర్వీస్‌ను గూగుల్ సంస్థ పది నగరాల్లో ప్రవేశపెట్టింది. అవి.. ఢిల్లీ, ముంబయి, బెంగళూర్, చెన్నై, పుణె, నాసిక్, అహ్మద్ నగర్, వడోదర, అమృత్సర్, హైదరాబాద్. 360 డిగ్రీల్లో వీధులను చూసే వీలు ఈ సేవలో ఉంటుంది. 2022 చివరి నాటికి దీనిని 50 నగరాలకు విస్తరించాలన్నది లక్ష్యం. వేగ పరిమితులు సూచించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది. మొదట బెంగళూర్ నగరంలో దీనిని అందుబాటులోకి తేనున్నారు. ట్రాఫిక్ లైటింగ్ వ్యవస్థ కూడా దీని ద్వారా మెరుగవుతుంది.
12. నామ్సాయ్ ప్రకటన ఇటీవల వెలువడింది. ఇది ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించింది? (3)
1) అరుణాచల్ ప్రదేశ్, మిజోరం
2) నాగాలాండ్, మణిపూర్
3) అసోం, అరుణాచల్ ప్రదేశ్
4) అసోం, మేఘాలయ
వివరణ: రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాలు నిర్ణయించాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరుణాచల్‌ప్రదేశ్‌లోని నామ్సాయ్ అనే ప్రదేశంలో చర్చలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిని నామ్సాయ్ ప్రకటన అని పిలుస్తున్నారు. వివాదాస్పద గ్రామాల సంఖ్య 123 ఉండగా.. దానిని 86కు తగ్గించాలని నిర్ణయించారు. అలాగే సరిహద్దు వివాదానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. రెండు రాష్ట్రాలకు సుమారు 804 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
13. బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) స్థానంలో కొత్తగా ఏ వ్యవస్థను ఏర్పాటు చేశారు? (1)
1) ఎఫ్ఎస్ఐబీ 2) సీఏవీబీ
3) ఏసీవీబీ 4) డీఏవీబీ
వివరణ: పీజే నాయక్ కమిటీ సూచన మేరకు బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోను 2016లో ఏర్పాటు చేశారు. బ్యాంక్‌లతో పాటు ఇతర బీమా రంగ సంస్థల ఉన్నతాధికారుల ఎంపికకు ఉద్దేశించి సూచనలు చేసే వ్యవస్థ ఇది. ఉన్నతాధికారులను ఎంపికచేసే అధికారం బీబీబీకి లేదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరోను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒక చైర్‌పర్సన్‌తో పాటు పలువురు సభ్యులు ఉంటారు. భానుప్రతాప్ శర్మను తొలి చైర్మన్‌గా నియమించారు. బ్యాంక్‌లకు హోల్ టైం డైరెక్టర్లతో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ల ఎంపికలో ఇది కీలక బాధ్యతను పోషిస్తుంది. దీనికి అవసరమైన, చట్టపరమైన అధికారాలు ఇస్తూ ఏర్పాటు చేయనున్నారు.
14. రైట్ టు రిపేర్ ఫ్రేమ్‌వర్క్‌కు ఎవరు నేతృత్వం వహించనున్నారు? (1)
1) నిధి ఖత్రి 2) అమితాబ్ కాంత్
3) వరుణ్ గడ్కరీ 4) శక్తికాంత్ దాస్
వివరణ: రైట్ టు రిపేర్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు వినియోగదారుల శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న నిధి ఖత్రి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా రిపేర్‌ను హక్కుగా అమెరికాలోని న్యూయార్క్ సంస్థ ఇచ్చింది.
15. భారత దేశపు మొట్టమొదటి కార్బన్ తటస్థత విమానాశ్రయం ఎక్కడ రానుంది? (3)
1) గుజరాత్ 2) కేరళ
3) లేహ్ 4) ఢిల్లీ
వివరణ: భారత దేశపు మొట్టమొదటి కార్బన్ తటస్థత విమానాశ్రయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లేహ్‌లో నిర్మించనుంది. జియోథర్మల్ వ్యవస్థ ఆధారంగా ఇది పనిచేయనుంది. సహజంగా లభించే వేడి ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే 900 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?