టైగర్ టైమ్ మెరుగుపడ్డట్టే..!
భూమ్మీద సమస్త జీవులు మనుగడ సాగిస్తుంటాయి. అయితే మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా కొన్ని జీవ జాతులు ఇప్పటికే కనుమరుగయ్యాయి. మరికొన్ని జీవ జాతులు క్రమంగా క్షీణిస్తూ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఇలా జీవులు అంతరించిపోవడంవల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఇది పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే జీవజాతుల రక్షణ కోసం దాదాపు అన్ని దేశాలు అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. కాగా, అంతరించిపోతున్న జీవజాతుల గురించి వివిధ పోటీ పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిస్తున్న జీవుల్లో కొన్నింటి వివరాలు నిపుణ పాఠకుల కోసం..
18 రాష్ట్రాలు.. 51 టైగర్ రిజర్వ్ లు
– ఏటికేడు తరిగిపోతున్న పెద్ద పులుల సంఖ్యను వృద్ధి చేయడం కోసం పలు సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పులులు అంతరిస్తే పర్యావరణ పరంగా జరిగే దుష్పరిణామాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏటా ఇంటర్నేషనల్ టైగర్ డేను నిర్వహిస్తున్నారు.
– ఇంటర్నేషనల్ టైగర్ డేను నిర్వహించాలనే ఆలోచనను 2010లో చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
– 2010లోనే 13 టైగర్ రేంజ్ దేశాల ప్రతినిధులు సమావేశమై.. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు (Tx2) చేయాలని నిర్ణయించారు.
– ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు రంగుల పులులు కనిపిస్తాయి. వాటిలో ముదురు వర్ణంపై నలుపు చారలు కలిగిన పులులు, తెల్లటి పులులు, నల్లటి చారలు కలిగిన తెల్ల పులులు, బంగారు వన్నె పులులు ఉన్నాయి.
– ప్రధాన పులి జాతుల్లో నాలుగు జాతులకు చెందిన పులులు పూర్తిగా అంతరించిపోయాయి. కాస్పియన్ టైగర్, టైగర్ హైబ్రిడ్స్, బాలి టైగర్, జవాన్ టైగర్ అంతరించిన పులి జాతులు.
-భారత్‌లో ప్రతి నాలుగేండ్లకు ఒకసారి పులుల జనాభాను అంచనా వేస్తున్నారు. ఆఖరి అంచనాలు 2018లో వెలువడ్డాయి.
ప్రస్తుతం పులుల సంఖ్య
– పెద్దపులి శాస్త్రీయ నామం పాంథెరా టైగ్రిస్. అంతరించిపోతున్న ఈ జీవి ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్
నేచర్ (IUCN) రెడ్ లిస్టులో ఉంది.
– ఒకప్పుడు పెద్ద పులులు మధ్య, తూర్పు, దక్షిణ ఆసియా దేశాల్లో విస్తరించి ఉండేవి. కానీ గత 100 ఏండ్లుగా వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తున్నది. దాదాపు 93 శాతం పులులు తగ్గిపోయాయి. ప్రస్తుతం కేవలం 13 దేశాల్లో మాత్రమే పెద్ద పులులు ఉన్నాయి. వాటి మనుగడ కూడా ప్రమాదంలోనే ఉన్నది. భారత్, ఆగ్నేయ ఆసియా, సుమత్రా, చైనా, రష్యా తూర్పు భాగం మొదలైన ప్రాంతాల్లో పులులు నివసిస్తున్నాయి.
-దాదాపు 100 సంవత్సరాల క్రితం సుమారుగా 1,00,000 ఉన్న పెద్ద పులుల జనాభా 2014 నాటికి 3,500కు పడిపోయింది. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియాలో పులుల జనాభా వేగంగా తగ్గింది.
కీలక అంశాలు
-2015 నుంచి 2021 మధ్య ఆరేండ్ల కాలంలో పెద్ద పులుల సంఖ్య 40 శాతం పెరిగిందని IUCNకు చెందిన టైగర్ ప్రోగ్రామ్ ద్వారా వెల్లడైంది.
– ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద పులుల సంఖ్య 3,900గా ఉన్నదని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) తెలిపింది. మరో ఏడాది కాలంలో ఈ సంఖ్యను డబుల్ చేయాలని వివిధ దేశాలకు సూచించింది.
-దేశంలో పులుల రక్షణకు అనేక చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా మొత్తం 18 రాష్ట్రాల్లో 51 టైగర్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసి, పెద్ద పులులను సంరక్షిస్తున్నారు.
– పులుల సంఖ్య వేగంగా క్షీణించడానికి ప్రధాన కారణం వేట. పులి చర్మం, గోర్లకు మంచి డిమాండ్ ఉండటం, ఔషధాల తయారీలోనూ పులుల శరీర భాగాలకు ప్రాధాన్యం ఉండటం వల్ల ఎక్కువ సంఖ్యలో వేటగాళ్ల బారినపడి నశిస్తున్నాయి. అడవుల నరికివేత వల్ల ఆవాసాలు కోల్పోవడం.. ప్రజలపైన, పశువులపైన దాడి చేసి ప్రతికార దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం కూడా పులుల సంఖ్య తరిగిపోవడానికి కారణాలు అవుతున్నాయి.
రీ-వైల్డిండ్ రెడ్ పాండాస్
-రెడ్ పాండాలు (ఎయిలూరస్ ఫుల్జెన్స్). ఇవి ఒళ్లంతా మెత్తటి వెంట్రుకలు కలిగి, ఆకారంలో ఎలుగుబంటిని పోలి ఉండే క్షీరదాలు. అయితే పరిమాణంలో మాత్రం ఎలుగుబంటితో పోల్చితే చాలా చిన్నగా, ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
– ఇప్పుడు ఈ అరుదైన రెడ్‌పాండా జాతి అంతరించిపోయే దశలో ఉంది. సంఖ్య తగ్గిపోవడంతో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN)కు సంబంధించిన రెడ్ లిస్టులో ఈ రెడ్ పాండా చేరింది.
-ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే దశలో ఉన్న జీవ జాతులను IUCN రెడ్ లిస్టులో చేర్చి, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు రెడ్ పాండాల సంరక్షణకు, వాటి జనాభా వృద్ధికి చర్యలు చేపడుతున్నారు.
అడవుల్లోకి 20 రెడ్ పాండాలు..
-అంతరించిపోతున్న రెడ్ పాండా జాతి అభివృద్ధి కోసం డార్జిలింగ్ హిల్స్‌లో రీ-వైల్డింగ్ రెడ్ పాండాస్ ప్రోగ్రామ్‌ను చేపట్టారు. సహజ ఆవాస ప్రాంతాలైన అడవుల్లో రెడ్ పాండా జాతిని వృద్ధి చేయడం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. భారత్‌లో అంతరించిపోతున్న ఒక రకం క్షీరద జాతి అభివృద్ధి కోసం చేపట్టిన మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇది.
– ప్రోగ్రామ్‌లో భాగంగా పశ్చిమబెంగాల్లోని సింగాలియా నేషనల్ పార్కులోకి రెడ్ పాండాలను విడిచిపెడుతారు. పద్మజానాయుడు హిమాలయన్ జూపార్కు నుంచి ఐదేండ్ల వ్యవధిలో మొత్తం 20 పాండాలను అడవుల్లోకి విడిచిపెట్టనున్నారు. రెడ్ పాండాలకు సింగాలియా నేషనల్ పార్క్ అత్యున్నత రక్షణ ప్రాంతం.
– బెంగాల్‌లోని సింగాలియా, నియోరా వ్యాలీ నేషనల్ పార్కుల్లో రెడ్ పాండాలను సంరక్షిస్తున్నారు. అయితే ఈ మధ్య వీటి సంఖ్య బాగా తగ్గిపోతున్నది. ప్రస్తుతం సింగాలియా నేషనల్ పార్కులో 38, నియోరా వ్యాలీ నేషనల్ పార్కులో 32 రెడ్ పాండాలు ఉన్నట్లు తాజా అధ్యయన అంచనాల్లో వెల్లడైంది.
సిక్కిం రాష్ట్రీయ జంతువు
– రెడ్ పాండాలు దేశంలో సిక్కిం రాష్ట్రం అంతటా, అరుణాచల్‌ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో, మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇది సిక్కిం రాష్ట్ర జంతువు.
– అంతరించిపోతున్న ఇతర జీవజాతులతో పోల్చితే దేశంలో రెడ్ పాండాలకే ఎక్కువగా లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఫండ్-ఇండియా (WWF-India) తూర్పు హిమాలయన్ ప్రాంతంలో రెడ్ పాండా జాతి అభివృద్ధి కోసం 2005 నుంచి కృషి చేస్తున్నది.
వరల్డ్ ఫైర్ ఫ్లైడే
-వరల్డ్ ఫైర్ ఫ్లె డే. అంటే ప్రపంచ మిణుగురు పురుగుల దినోత్సవం. ప్రతి ఏడాది జూలై 3, 4 తేదీల్లో ఈ డేను నిర్వహిస్తుంటారు.
– మిణుగురు పురుగులు చీకట్లో మిరిమిట్లు గొలుపుతూ చూసేవాళ్లకు ఆనందాన్ని కలుగజేస్తాయి. పెద్ద సంఖ్యలో మిణుగురు పురుగులు ఒకే ప్రదేశంలో ఉంటే.. అవి విరజిమ్మే లైటింగ్స్ అద్భుతంగా కనిపిస్తాయి.
-ఈ మిణుగురు పురుగులను ఇంగ్లిష్‌లో ఫైర్ ఫ్లెస్ లేదా లైటెనింగ్ బగ్స్ అని అంటారు. ఇవి కొలియాప్టెరా క్రమంలోని లాంపిరిడే కుటుంబానికి చెందిన జీవులు. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రదేశాల్లోని వేడి వాతావరణంలో కనిపిస్తాయి.
-వీటిలో లైటింగ్‌ను ఉత్పత్తి చేయడానికి ఉదరం ముందు భాగంలో ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ఈ మిణుగురు పురుగుల్లో చాలా జాతులు రాత్రిపూట సంచరించేవి ఉంటాయి. కొన్ని జాతులు మాత్రం పగటిపూట సంచరిస్తాయి. సాధారణంగా వీటి శరీరం పొడవు 5 నుంచి 25 మిల్లీమీటర్ల మధ్యలో ఉంటుంది.
-జాతులను బట్టి ఈ మిణుగురు పురుగుల్లో స్వల్పకాలం లైటింగ్ వెదజల్లేవి, లయబద్ధంగా లైటింగ్‌ను వెలువరించేవి ఉంటాయి. ఫొటోసైట్స్ అనే ప్రత్యేక కణాల సాయంతో నాడీవ్యవస్థను నియంత్రించుకుంటూ ఫైర్ ఫ్లెస్ లైటింగ్ విరజిమ్ముతాయి. ఇందుకు ట్రాకియే అనే ఎయిర్ ట్యూబ్స్ తోడ్పడుతాయి.
– ఈ మిణుగురు పురుగులు ఉత్పత్తి చేసే ఫ్లాష్ లైట్‌ను కోల్డ్ లైట్ అని కూడా అంటారు.
అంతరిస్తున్న మిణుగురు పురుగులు
– మిణుగురు పురుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంపై ఆవరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీటకాల జనాభాను రక్షించలేకపోతే పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
– పంటలపై అతిగా పురుగుల మందులు, రసాయన ఎరువుల వాడకం, ఎల్ఈడీ లైట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం మిణుగురు పురుగుల జాతుల క్షీణతకు ప్రధాన కారణమని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త అభిప్రాయం వ్యక్తం చేశారు. అడవుల్లో కార్చిచ్చు, అడవుల నరికివేత, పచ్చటి ప్రదేశాల్లో భారీఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు కూడా ఫైర్ఫ్లెస్ మనుగడకు ప్రమాదకరంగా మారాయన్నారు.
– దేశంలోని ఏ ఒక్క పెద్ద సంస్థ కూడా ఇప్పటివరకు మిణుగురు పురుగులపై సరైన పరిశోధనలు చేయలేదు. రాష్ట్రాల దగ్గర కూడా ఆయా రాష్ట్రాల్లో అంతరించిన మిణుగురు పురుగుల జాతుల వివరాలు లేవు.
ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా
-శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాను కనిపెట్టారు. ఫ్రాన్స్ దేశంలోని గ్వడెలోప్ ఐలాండ్స్లోగల కరేబియన్ మాంగ్రూవ్ బురద నేలల్లో ఈ బ్యాక్టీరియాను గుర్తించారు.
– సాధారణంగా బ్యాక్టీరియాలు కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ఉండే సూక్ష్మజీవులు. వీటిని మైక్రోస్కోప్‌తోనే తప్ప వట్టి కళ్లతో చూడలేం. కానీ, కొత్తగా గుర్తించిన బ్యాక్టీరియాను మాత్రం మైక్రోస్కోప్ అవసరం లేకుండా కళ్లతో నేరుగా చూడవచ్చు.
-సన్నగా, తెల్లగా ఉండే ఈ తీగలాంటి జీవి ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాగా గుర్తించబడిందని సముద్ర జీవశాస్త్రవేత్త జీన్-మేరీ
ఒల్లాండ్ వెల్లడించారు.
-థియోమార్గరిటా మాగ్నిఫికా లేదా మాగ్నిఫిషెంట్ సల్ఫర్ పెరల్ అనే బ్యాక్టీరియాను ఫ్రాన్స్ దేశం గ్వడెలోప్లోని అర్చిపెలాగోలో 2009లో గుర్తించారు. నీట మునిగిన మాంగ్రూవ్ మొక్కల పత్రాలపై దీన్ని కనిపెట్టారు.
కీలక అంశాలు
– ఈ జీవి తీగలా పొడవుగా ఉన్నప్పటికీ ఒకే కణాన్ని కలిగి ఉన్నది. అందుకే దీన్ని బ్యాక్టీరియాగా గుర్తించారు. దీని పరిమాణం 0.9 సెంటీమీటర్లు ఉన్నది.
-ఇవి బురద నేలల్లోని ఆల్చిప్పల కర్పరాలపైన, రాళ్లపైన, గాజు సీసాలపైన కూడా ఆవాసం చేస్తాయి.
– శాస్త్రవేత్తలు ఈ బ్యాక్టీరియాను ఇంతవరకు ల్యాబ్ పద్ధతుల్లో అభివృద్ధి చేయలేకపోయారు. కారణం ఇది ఇతర బ్యాక్టీరియాలతో పోల్చినప్పుడు భిన్నమైన నిర్మాణాన్ని కలిగి ఉండటమేనని పరిశోధకులు తెలిపారు.
– ఈ బ్యాక్టీరియా ఇంత ఎక్కువ పరిమాణంలో ఎందుకు ఉందో తెలుసుకోలేకపోయామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చిన్నచిన్న ప్రాణులకు ఆహారంగా మారడం నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఈ బ్యాక్టీరియా ఈ విధంగా రూపాంతరం చెంది ఉండవచ్చని ఒల్లాండ్ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?