జాతీయం-అంతర్జాతీయం
ట్యాంక్ విధ్వంసక క్షిపణి
దేశీయంగా అభివృద్ధి చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణిని అర్జున్ యుద్ధ ట్యాంకు నుంచి డీఆర్డీవో జూన్ 28న విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్లో డీఆర్డీవో సైంటిస్టులు, సైనికాధికారులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ
దేశవ్యాప్తంగా ఉన్న 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్-పీఏసీఎస్)ను కంప్యూటరీకరించడానికి జూన్ 29న ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీనివల్ల పీఏసీఎస్ తమ వ్యాపార కార్యకలాపాలను విభిన్న రంగాలకు విస్తరించడంతోపాటు బహుళ సేవలు అందించడానికి వీలవుతుంది. ఇందుకు రూ.2,516 కోట్లు కేటాయించనున్నారు.
పీఎస్ఎల్వీ సీ 53
పీఎస్ఎల్వీ సీ 53 రాకెట్ ప్రయోగం విజయవంతమయ్యింది. ఏపీలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జూన్ 29న ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు వాణిజ్య ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
అభ్యాస్
దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హెచ్‌ఈఏటీ) విమానం ‘అభ్యాస్’ గగనతల పరీక్షను డీఆర్డీవో జూన్ 29న విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో దీనిని పరీక్షించారు. క్షిపణుల గగనతల పరీక్షల్లో లక్ష్యంగా వినియోగించడానికి వీలుగా అభ్యాస్‌ను రూపొందించారు.
గోల్ 2.0
గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ (గోల్) రెండో దశను న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా జూన్ 29న ప్రారంభించారు. గోల్ మొదటి దశ డిజిటల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా గిరిజన యువత జీవితాల్లో చాలా మార్పువచ్చింది. దీంతో రెండో దశను ప్రారంభించారు. దేశంలోని గిరిజన యువతను డిజిటల్‌వైపు మళ్లించడమే గోల్ లక్ష్యం.
గణాంకాల దినోత్సవం
జాతీయ గణాంకాల దినోత్సవాన్ని (నేషనల్ స్టాటిస్టిక్స్ డే) జూన్ 29న నిర్వహించారు. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర (పీసీ) మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని 2007 నుంచి నిర్వహిస్తుంది. ఈ ఏడాది దీని థీమ్ ‘డేటా ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’.
జీ-7 సదస్సు
జర్మనీలోని స్క్లాస్ ఎలమావు, క్రూన్, బవేరియన్ ఆల్ప్స్లో 48వ జీ-7 శిఖరాగ్ర సదస్సు జూన్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించారు. ఈ సదస్సులో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని, ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని, ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు సాయం చేయాలని చర్చించారు. ‘పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (పీజీఐఐ)’ అనే పథకానికి సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించారు. దీని కింద 600 బిలియన్ డాలర్లు సమకూర్చనున్నారు. ఈ సదస్సుకు భారత్, సెనెగల్, అర్జెంటీనా, ఇండోనేషియా, దక్షిణాసియా నేతలను జర్మన్ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్
అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్)ను జూన్ 29న నిర్వహించారు. ఉష్ణమండల ప్రాముఖ్యతను, ఈ ప్రాంతాల్లో పర్యావరణ, సామాజిక-ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. ఈ దినోత్సవాన్ని జూన్ 29న నిర్వహించాలనే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2016, జూన్ 14న ఆమోదించింది.
భారత్-యూఏఈ
ప్రధాని మోదీ యూఏఈ కొత్త అధ్యక్షుడు, అబుధాబి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జూన్ 28న భేటీ అయ్యారు. భారత్-యూఏఈ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, దీనిని మరిన్ని రంగాలకు విస్తరించాలని ఇరుదేశాలు తీర్మానించాయి.
నాటో కూటమి సదస్సు
30 దేశాల నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి సదస్సు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జూన్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించారు. రష్యాతో ఉన్న ముప్పుపైనే ఈ సదస్సులో చర్చించారు. ఫిన్లాండ్, స్వీడన్లకు నాటో కూటమిలో చేరడానికి ఇప్పటివరకు అభ్యంతరం చెబుతూ వచ్చిన టుర్కియే (టర్కీ) తన అంగీకారాన్ని తెలిపింది.
ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డే
ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డే (ప్రపంచ గ్రహశకల దినోత్సవం)ని జూన్ 30న నిర్వహించారు. రష్యాలోని సైబీరియాలో 1908, జూన్ 30న పడిన గ్రహశకల ఘటన సందర్భంగా ఈ దినోత్సవాన్ని 2016 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు తుంగుస్కా పేలుడు అని పేరుపెట్టారు. ఈ ఏడాది దీని థీమ్ ‘స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్’.
విజయ్ అమృత్‌రాజ్
భారత టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత్‌రాజ్ 2021 గోల్డెన్ అచీవ్మెంట్ అవార్డు జూన్ 26న అందుకున్నారు. ఇంటర్నేషన్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఈ అవార్డును లండన్‌లో జరిగిన కార్య క్రమంలో అందజేశాయి. టెన్నిస్‌కు విశేష కృషి చేసినవారికి ఈ అవార్డును ఇస్తారు.
మహమ్మద్ జలూద్
ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడిగా ఇరాక్ అధికారి మహమ్మద్ జలూద్ను జూన్ 25న ఎన్నుకున్నారు. అల్బేనియాలోని టిరానాలో జరిగిన కార్యక్రమంలో 11 మంది పోటీ పడగా జలూద్ ఎన్నికయ్యాడు. ఐడబ్ల్యూఎఫ్ను 1905లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని లాసానేలో ఉంది.
వరీందర్ సింగ్
భారత హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్ సింగ్ జూన్ 28న మరణించాడు. 1975 కౌలాలంపూర్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో ఈయన సభ్యుడు. 1973 అమ్‌స్టర్‌డామ్ ప్రపంచకప్‌లో రజతం, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన జట్టులో కూడా ఈయన ఆడాడు. 2007లో ఈయనకు ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.
గగన్ నారంగ్
భారత స్టార్ షూటర్, ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్ మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యుడిగా జూన్ 28న ఎంపికయ్యాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగమయ్యే క్రీడాకారులను గుర్తించి ఎంపిక చేయడం ఈ సెల్ విధి. 2024, 2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రీడాకారులను గుర్తించడానికి, ఎంపిక చేయడానికి, వారి ప్రదర్శనలను ఎప్పటికప్పుడు గమనించడానికి ఈ సెల్ పనిచేస్తుంది.
ఇయాన్ మోర్గాన్
ఇంగ్లండ్ క్రికెటర్, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు జూన్ 28న రిటైర్మెంట్ ప్రకటించాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 16 టెస్టుల్లో 700 పరుగులు, 248 వన్డేల్లో 7701 పరుగులు, 115 టీ20ల్లో 2458 చేశాడు.
టీ హబ్-2.0
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ హబ్ రెండో దశను సీఎం కేసీఆర్ జూన్ 28న ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా ఈ టీ హబ్-2.0ను మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో నిర్మించారు. రూ.400 కోట్లతో దీనిని ఏర్పాటు చేశారు. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో టీ హబ్‌ను 2015లో ఏర్పాటు చేయగా దీనిని విస్తరిస్తూ అత్యంత పెద్దదైన రెండో దశను ప్రారంభించారు.
ఏఎస్ రాజన్
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ) డైరెక్టర్‌గా ఏఎస్ రాజన్ జూన్ 29న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1987 బ్యాచ్ ఐపీఎస్ బీహార్ క్యాడర్ అధికారి. అంతకుముందు ఈయన కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేశారు.
మంత్రి శ్రీదేవి
తెలంగాణ అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవిని ప్రభుత్వం జూన్ 30న నియమించింది. అలాగే తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మేడే రాజీవ్‌సాగర్, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నాస్కామ్ సదస్సు
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో మూడురోజుల పాటు నిర్వహించిన నాస్కామ్ 12వ జీసీసీ కాంక్లేవ్ జూన్ 30న ముగిసింది. ఈ సదస్సులో వివిధ నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
నితిన్ గుప్తా
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్‌గా నితిన్ గుప్తా జూన్ 27న నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచ్ ఇన్‌కం ట్యాక్స్ క్యాడర్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ఈయన 2023, సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ జూన్ 28న ప్రమాణం చేశారు. ఆయనతో ఢిల్లీ లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ కుమార్ ప్రమాణం చేయించారు. అంతకుముందు ఆయన తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేశారు.
పల్లోంజీ మిస్త్రీ
వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ జూన్ 28న మరణించారు. 1929లో జన్మించిన ఈయన 1865లో స్థాపించిన షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వారసుడు. 18 ఏండ్ల వయసులోనే వ్యాపార బాధ్యతల్ని తీసుకున్నారు. 2016లో ఈయనకు పద్మభూషణ్ లభించింది. మస్కట్‌లోని ఒమన్స్ రాయల్టీ ప్యాలెస్‌ను, దేశంలో ఆర్బీఐ, తాజ్, ఒబెరాయ్ వంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను ఈ ఎస్పీ సంస్థ నిర్మించింది.
సందీప్ కుమార్ గుప్తా
ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) తదుపరి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సందీప్ కుమార్ గుప్తాను జూన్ 29న ఎంపిక చేశారు. ఈయన ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లో ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత సీఎండీ మనోజ్ జైన్ ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?