సాంస్కృతిక చైతన్య ఉద్యమం
భూదాన్ ఉద్యమం – గ్రామదాన్ ఉద్యమం
# 1950 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో ఒకవైపు దౌర్జన్యాలు భూస్వాముల అరాచకాలు, నిజాం పోలీసుల అకృత్యాలు మరోవైపు కమ్యూనిస్టుల పోరాటాలు, యూనియన్ బలగాల మోహరింపుతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పరిస్థితి తెలంగాణ సమాజంలో ఏదో తెలియని అభద్రతా భావం, అనైక్యత, అసహనం నెలకొని ఉన్న సమయం. ఈ సందర్భంలో ఆచార్య వినోబాభావే ప్రజల్లో గాంధేయ భావాలైన శాంతి, అహింస, సత్యాగ్రహం గురించి ప్రచారాన్ని ప్రారంభించారు.
# నల్లగొండలోని శివరాంపల్లిలో పాదయాత్ర ప్రారంభించి హయత్‌నగర్ బాట సింగారం గ్రామాల గుండా పోచంపల్లి 18-04-1951న చేరుకున్నారు. పాదయాత్రలో భాగంగా దళిత నివాస ప్రాంతాలు సందర్శించి వారి యోగక్షేమా లు తెలుసుకున్నాడు. జీవనం కోసం భూమి కావాలని కొందరు పేదవారు కోరారు. ఆ సమయంలో వినోబాభావే దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఆ సమయంలో పోచంపల్లి గ్రామపెద్ద, ఆచార్య వినోబాభావే ప్రధాన అనుచరు డైన శ్రీ వెదిరె రాంచంద్రారెడ్డి భూ పంపిణి కోసం 100 ఎకరాల భూమిని దానం చేశాడు. తెలంగాణలో 51 గ్రామాలు తిరిగి 12 వేల ఎకరాల భూమిని సమకూర్చాడు. భూ పంపిణీ కోసం గ్రామ శూన్య కమిటీలు ఏర్పాటు చేశారు.
# భూస్వాముల నుంచి స్వచ్ఛందగా భూమిని సేకరించి భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయడం ఈ భూదానోద్యమం ప్రధాన లక్ష్యం.
సమస్యలు
# దాదాపు 42 లక్షల ఎకరాల భూమి సేకరించి 2 లక్షల కుటుంబాలకు మాత్రమే అందజేశారు.
#కొంతమంది భూస్వాములు భూదానం చేసిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకున్నారు.
# సేకరించిన భూమిని పేదవారి పేరుమీదకి కేటాయించడానికి గ్రామ పెద్దలు అధికారులు లంచాలు డిమాండ్ చేసేవారు. వారికి లంచాలు చెల్లించకపోవడం వల్ల గ్రామపెద్దలు, అధికారులే ఆ భూమిని తమ పేరుమీద రాసుకునేవారు.
#ఉచితంగా భూమి పొందిన వ్యక్తులు అత్యాశకు పోయి ఎక్కువ భూమిని పొందేందుకు తమ భార్య, పిల్లల పేరుమీద రాసేవారు.
# కొందరు భూస్వాములు వివాదంలో ఉన్న భూములను, కోర్టు కేసులున్న భూములను దానం చేశారు. దీంతో సమస్యలు తలెత్తాయి.
#భూదాన ఉద్యమకారులు కొంతమంది రాజకీయ పార్టీలో చేరడం జరిగింది. వారి లబ్ధికోసం ఎన్నికల్లో ప్రచారానికి భూదానోద్యమాన్ని వాడుకోవడం వల్ల ఈ ఉద్యమం పట్ల ప్రజల్లో విముఖత కలిగింది.
# భూదాన ఉద్యమంలో భూమిని పొందిన కొందరు నిరుపేదలకు దాన్ని సాగుచేసేం దుకు సరిపడా ఆర్థిక వనరులు లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.
#భూ పంపిణీ చేసిన కొన్ని సంవత్సరాలు తర్వాత కూడా అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల భూమి పొందిన వ్యక్తి పేరు మీదకు బదిలీ కాలేదు. భూదానం చేసిన వ్యక్తి పేరుమీద ఉండటం, దానికి సంబంధించిన పన్నులు కూడా భూస్వామి చెల్లించడం వల్ల భూమి పొందిన వ్యక్తులు సదరు భూమిపై చట్టపరమైన హక్కులు పొందలేకపోయారు.
# భూ పంపిణీ సగటున అర ఎకరం నుంచి మూడు ఎకరాల మధ్యనే ఉండటం వల్ల గుర్తించదగిన ఉత్పత్తిని, ఉత్పాదకతను పొందలేక పోవడంతో ప్రచ్ఛన్న నిరుద్యోగితకు కారణం అయింది.
#భూస్వాములు చాలా వరకు నిరుపయోగ భూములు, బంజరు భూములు, కొండలు గుట్టలతో ఉన్న భూములు, బీడు భూములు దానం చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరకుండా పోయింది.
సాధించిన విజయాలు
# తెలంగాణలో ప్రారంభమైన భూదానోద్యమం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో 15 సంవత్సరాల్లో 42,27,476(46 లక్షల) ఎకరాల భూమిని పంపిణీ కోసం సేకరించారు.
# ఈ ఉద్యమం సామాజిక న్యాయానికి ఒక నైతిక శక్తి అని శ్రీమతి ఇందిరాగాంధీ అభివర్ణించారు.
# భూదానోద్యమం స్ఫూర్తితో (1952) ఉత్తరప్రదేశ్‌లోని మంగ్రోత్ (Mongroth) గ్రామంలో గ్రామ్‌దాన్ ఉద్యమం చేపట్టారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల్లో 1955లో గ్రామ్‌దాన్ కార్యక్రమాలు అమలు చేశారు.
#భూ సంస్కరణల చట్టం -1951 ఏర్పాటుకు భూదానోద్యమం దోహదపడింది.
# సాగులో లేని చాలా భూమి సాగులోకి రావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి.
# భూదాన ఉద్యమం దేశ సామాజిక చరిత్రలో ‘రక్త రహిత విప్లవం’గా నూతన ఆలోచన ధోరణితో సామాజిక ఉద్యమంగా చరిత్రలో నిలిచిందని చెప్పవచ్చు.
గ్రంథాలయ ఉద్యమం- అక్షరాస్యత ఉద్యమం
# సామాజికంగా, రాజకీయంగా విద్యాపరమైన చైతన్యంలో వెనుకబడిన హైదరాబాద్ సంస్థానంలో గ్రంథాలయోద్యమం తెలంగాణ ప్రజల్లో గొప్ప రాజకీయ, సాంస్కృతిక చైతన్యం సాధించిందని చెప్పవచ్చు. గ్రంథాలయోద్యమం ప్రధాన లక్ష్యం గ్రంథాలయాల స్థాపన. సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, భావ వికాసానికి తోడ్పడటం, సాంస్కృతిక రాజకీయ వికాసానికి కృషి చేయడం, దిన పత్రికలు ప్రచురించి విద్యావ్యాప్తికి కృషి చేయడం, అభ్యుదయ భావాల్ని పెంపొందించడం.
#హైదరాబాద్ సంస్థానంలో (1886) అబ్దుల్ ఖయ్యూం, చిర్గ్రామ్ గ్రంథాలయం స్థాపించారు. అసఫియా స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయమే ప్రస్తుతం అఫ్జల్ గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
#1895లో అభ్యుదయ భావాలు కలిగిన కొంతమంది యువకులు లాల్ ధర్వాజ్లో ‘గుణవర్థక గ్రంథాలయాన్ని’ ప్రారంభించారు.
# 1990, సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని రావిచెట్టు రంగారావు నివాసంలో ‘శ్రీకృష్ణ దేవరాయా ఆంధ్రభాషా నిలయాన్ని కొమరాజు వెంకట లక్ష్మణరావు, నాయిని వెంకట రంగారావు, ఆదిపూడి సోమనాథ్రావు మరికొంత మంది ప్రముఖులు కలిసి మునగాల రాజు ఆర్థిక సహాయంతో గ్రంథాలయం ప్రారంభించారు.
# 1906లో కొమరాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి’ స్థాపించి ఎన్నో సాంఘిక వైజ్ఞానిక భాషా గ్రంథాలను ప్రచురించి తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ గ్రంథాలయం తెలంగాణలో సాంస్కృతిక పునర్జీవనానికి దోహద పడింది. దీని కార్యకలపాలపై ఆనాటి నిజాం రాజుకు అనుమానం ఉండటంతో ఈ గ్రంథాలయాన్ని 1908లో మద్రాస్‌కు తరలించారు.
# 1904లో హన్మకొండ పట్టణంలో ‘శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయం కార్యదర్శిగా మాడపాటి హన్మంతరావు వ్యవహరించారు.
#1905లో ఆంధ్ర సంవర్థిని గ్రంథాలయం స్థాపన జరిగింది.
# 1917లో ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం (సూర్యాపేట)
# 1918లో ఆంధ్రసరస్వతి గ్రంథాలయం (నల్లగొండ)
# 1939లో వెల్దుర్తి మాణిక్యరావు, గుండవరపు హన్మంతరావు సహకారంతో కె.సి. గుప్తా అణా గ్రంథాలయం స్థాపించారు.
#వరంగల్‌లో శబ్దాను శాసనం గ్రంథాలయం, ఖమ్మంలో జ్ఞాన విద్యత్ ప్రజావాహిని భాషా నిలయం
#రెమిడిచర్లలో సిద్దిమల్లేశ్వర గ్రంథాలయం
# హైదరాబాద్ గౌలిగూడలో బాల సరస్వతి ఆంధ్ర గ్రంథాలయం, నాంపల్లిలో వేమన ఆంధ్రభాషానిలయం
# ఖమ్మంలో విజ్ఞాన నికేతన్ గ్రంథాలయం, కోదాటి నారాయణరావు కృషి మూలంగా ఆవిర్భవించాయి.
#టి.కె. బాలయ్య తెలంగాణలో మొట్టమొదటి సంచార గ్రంథాలయాన్ని (నిర్మల్) ఎండ్లబండిపై నిర్వహించారు.
#కె.సి. గుప్తా అణాకొక గ్రంథంగా వంద పుస్తకాల్ని కేవల 5 రూపాయలకే అమ్మేవారు. గుప్తాగారి ఇల్లే గ్రంథాలయ కేంద్రంగా ఉండేది. అణా గ్రంథాలయం తొలి ప్రచురణ హైదరాబాద్ రాజ్యాంగ సంస్కరణలు అనే పుస్తకం వెలువరించింది. ప్రభుత్వం ఈ ప్రచురణలపై నిఘాపెట్టింది.
#1941లో వట్టికోట ఆళ్వారు స్వామి దేశోద్ధారక గ్రంథాలయాన్ని స్థాపించారు.
# 30 పుస్తకాలను ప్రచురించి వట్టికోట ఆళ్వారుస్వామి భుజానికి చేతి సంచిని వేసుకొని పుస్తకాలు అమ్మేవారు. ఈ గ్రంథాల్లో తెలంగాణ చరిత సంస్కృతి వివరించే వ్యాసాలు రాయడం, పరిశోధనలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగేది.
#1925 ఫిబ్రవరి 22న ఖమ్మం జిల్లా మధిరలో మొదటి గ్రంథాలయ మహాసభను పింగళి వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
# 1926లో రెండవ సభను నిర్వహించాలని చూడగా నిజాం ప్రభుత్వం కార్యకర్తలకు నోటీసులు అందించి అడ్డుకుంది.
# 1929లో వామన్ నాయక్ అధ్యక్షతన జరిగింది. తర్వాత జరిగే సభలకు నిజాం రాజు అనుమతి ఇవ్వలేదు.
#నిర్బంధం అమలులో ఉన్నప్పటికీ గ్రంథాలయ కార్యకర్తలు నిరుత్సాహ పడలేదు. ఈ క్రమంలో హైకోర్టు సభలు ఆపే అవసరం లేదని తీర్పునివ్వగా గ్రంథాలయోద్యమం మరింత ఊపందుకుంది.
#దావాలంలా వ్యాపిస్తున్న గ్రంథాలయోద్యమాన్ని నిజాం ప్రభుత్వం అణిచి వేయడానికి ప్రయత్నించింది. కానీ గ్రంథాలయాల పట్ల ఆసక్తి, ఉద్యమం ముందు వారి ప్రయత్నాలు నిలవలేకపోయాయి.
గ్రంథాలయోద్యమం వల్ల కలిగిన ప్రయోజనాలు
1) తెలంగాణలో ఉద్యమ చైతన్యం రావడానికి గ్రంథాలయోద్యమం కీలకపాత్ర పోషించింది.
2) తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమం తీవ్రతరం కావడానికి, తెలంగాణ అంతా వ్యాపించడానికి గ్రంథాలయోద్యమం ప్రధాన భూమిక పోషించింది.
# తెలంగాణ సాయుధపోరాటం, నిజాం ఆంధ్ర మహాసభలు, జాయిన్ ఇండియా ఉద్యమం, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగడానికి గ్రంథాలయోద్యమం ముఖ్యపాత్రను పోషించింది.
#మరుగున పడిపోయిన తెలంగాణ చరిత్ర సంస్కృతి వైశిష్ట్యాన్ని ప్రజలకు ఈ గ్రంథాలయోద్యమం ద్వారా గుర్తు చేశారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆచార్య వినోబాభావే ప్రారంభించిన భూదాన ఉద్యమానికి మొట్టమొదటి సారిగా 100 ఎకరాల భూమిని దానం చేసింది ఎవరు? (బి)
ఎ) తుమ్మ మధుకర్ రెడ్డి
బి) వెదిరె రామచంద్రారెడ్డి
సి) విసునూరి రామచంద్రారెడ్డి
డి) టి. కోదండ రామిరెడ్డి
2. భూదానోద్యమం గురించి కింది వాటిలో సరైనది ఏది? (ఎ)
1) భూదాన ఉద్యమం 18-04-1951న ప్రారంభించారు
2) భూదాన ఉద్యమం నల్లగొండ జిల్లా పొచంపల్లిలో ప్రారంభించారు
3) భూదాన ఉద్యమానికి మొదటిసారిగా విసునూరి రాంచంద్రారెడ్డి 100 ఎకరాలు దానం చేశారు
ఎ) 1, 2, బి) 1, 2, 3
సి) 2, 3 డి) 1, 3
3. భూదానోద్యమం ‘సామాజిక న్యాయానికి ఒక నైతిక శక్తి’అని అభివర్ణించింది ఎవరు? (సి)
ఎ) జవహర్ లాల్ నె్ర
బి) బి.ఆర్. అంబేద్కర్
సి) శ్రీమతి ఇందిరాగాంధీ
డి) జయప్రకాశ్ నారాయణ్
4. భారతదేశంలో గ్రామ్‌దాన్ ఉద్యమం మొట్ట మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు? (డి)
ఎ) మౌ గ్రామం (మహారాష్ట్ర)
బి) పోచంపల్లి (తెలంగాణ)
సి) నాగూర్ (రాజస్థాన్)
డి) మంగ్రోత్ (ఉత్తర ప్రదేశ్)
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు