Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1. ఏ రోజున ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు? (3)
1. సెప్టెంబర్ 21 2. సెప్టెంబర్ 22
3. సెప్టెంబర్ 24 4. సెప్టెంబర్ 25
వివరణ: భారత్‌లో ఏటా సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ రోజుగా నిర్వహిస్తారు. జాతి సేవలో యువత పాత్ర పోషించేందుకు ఉద్దేశించింది ఇది. మొట్టమొదట ఈ పద్ధతిని జగన్నాథరావ్ భోన్స్లే సూచించగా, తర్వాత యూజీసీ చైర్మన్ ఎస్ రాధకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ కూడా సమర్థించింది. 1969 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ రోజును నిర్వహిస్తారు. ఎన్ఎస్ఎస్ గుర్తుగా కోణార్క్ సూర్య దేవాలయం ఉంటుంది. 1969లో దీన్ని ప్రారంభించినప్పుడు నాటి విద్యా శాఖ మంత్రి వీకేఆర్‌వీ రావు. అలాగే నందిని సతపతి అనే మహిళ ఈ పథకం అమలులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆమె ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
2. ‘ది ఫ్యూచర్ వుయ్ వాంట్ (మేం కోరుకుంటున్న భవిష్యత్)’ అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సంస్థ ఏది? (2)
1. సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధన
2. సుస్థిరాభివృద్ధి అత్యున్నత రాజకీయ
ఫోరం
3. సుస్థిర వ్యవస్థ 4. పైవేవీ కాదు
వివరణ: సుస్థిరాభివృద్ధి అత్యున్నత రాజకీయ ఫోరాన్నే ఇంగ్లిష్‌లో హై-లెవెల్ పొలిటికల్ ఫోరం ఆన్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ సమావేశాన్ని సెప్టెంబర్ 2023లో నిర్వహించారు. నిజానికి ఇది ‘మేం కోరుకుంటున్న భవిష్యత్’ అనే ఒక నిర్ణయం ఆధారంగా ఆవిర్భవించింది. 2012లో రియోలో నిర్వహించిన సదస్సులో ఈ చర్చ జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను ఇది సమీక్షిస్తుంది. చేసిన ప్రగతి, చేయాల్సిన పురోగతిని సూచిస్తుంది.
3. శాస్త్ర-సాంకేతిక రంగంలో ఎన్ని రకాల అవార్డులను ఇటీవల భారత్‌లో ప్రవేశపెట్టారు? (3)
1. 2 2. 3 3. 4 4. 5
వివరణ: శాస్త్ర-సాంకేతిక రంగంలో నాలుగు కొత్త అవార్డులను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ అవార్డులకు పెట్టిన పేరు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. ఇందులో ఉన్న నాలుగు అవార్డులు 1. విజ్ఞాన్ రత్న 2. విజ్ఞాన్ శ్రీ 3. విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్ 4. విజ్ఞాన్ బృందం. శాస్త్ర-సాంకేతిక రంగంలో జీవన కాలంలో పోషించిన పాత్ర ఆధారంగా విజ్ఞాన్ రత్న అవార్డు ఇస్తారు. అలాగే ఈ రంగంలో కృషి చేసిన వాళ్లకు విజ్ఞాన్ శ్రీ అవార్డు దక్కుతుంది. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిందే విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. 45 సంవత్సరాలలోపు వాళ్లకు ఇది ఇస్తారు. అలాగే ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ శాస్త్రవేత్తల బృందానికి ఇచ్చేదే విజ్ఞాన్ బృందపు అవార్డు.
4. అంతర్జాతీయ న్యాయ సదస్సును సెప్టెంబర్ నెలలో ఎక్కడ నిర్వహించారు? (4)
1. వారణాసి 2. భువనేశ్వర్
3. భోపాల్ 4. న్యూఢిల్లీ
వివరణ: న్యాయ వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను చర్చించేందుకు ఒక సదస్సును సెప్టెంబర్ 23వ తేదీన భారత రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఇది కొనసాగింది. పర్యావరణ న్యాయ అంశాలతో పాటు, న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం, సరిహద్దు వివాదాలు-సవాళ్లు, తదితర అంశాలను చర్చించారు.
5. రాష్ట్రంలో కొత్తగా ఎన్ని ఎలిఫెంట్ కారిడార్లను ఏర్పాటు చేశారు? (1)
1. 62 3. 26 3. 15 4. 21
వివరణ: కొత్తగా 62 ఎలిఫెంట్ కారిడార్ల ఏర్పాటును కేంద్రం ప్రకటించింది. దీంతో భారత్‌లో వీటి సంఖ్య 150కి చేరింది. 2010లో కేవలం 88 మాత్రమే ఉండేవి. తమ ఆవాసాలకు స్వేచ్ఛగా ఏనుగులు విహరించేందుకు ఉద్దేశించినవే ఎలిఫెంట్ కారిడార్స్. ప్రస్తుతం దేశంలో అతి ఎక్కువగా వీటిని కలిగి ఉన్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. ఈ రాష్ట్రంలో 26 ఉన్నాయి. మొత్తం మధ్య తూర్పు భాగంలో 52 కారిడార్లు ఉండగా, ఈశాన్యంలో 48 ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో 21% మేర, ఉత్తర భారతదేశంలో 12% మేర ఏనుగు కారిడార్లు భారత్‌లో ఉన్నాయి. దాదాపు 15 రాష్ర్టాల్లో ఈ కారిడార్ల సంఖ్య 40% మేర పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది.
7. కింద పేర్కొన్న ఏ రెండు గ్రామాలు ఉత్తమ పర్యాటక గ్రామాలు ఎంపిక అయ్యాయి? (1)
1. పెంబర్తి, చంద్లాపూర్
2. పెంబర్తి, గంభీరావుపేట
3. చంద్లాపూర్, గంభీరావుపేట
4. పెంబర్తి, కొలనుపాక
వివరణ: పెంబర్తి, చంద్లాపూర్లు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఇవి వరుసగా జనగామ, సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. కాకతీయుల కాలం నుంచి ఇత్తడి, కంచు లోహాలతో కళాకృతులు చేయడంలో పెంబర్తి గ్రామం గుర్తింపును దక్కించుకుంది. అలాగే రంగనాయకస్వామి దేవాలయం, రంగనాయక కొండలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ ప్రాంతంలోని గొల్లభామ చీరలు కూడా గతేడాది యునెస్కో గుర్తింపు పొందిన వాటిలో ఉన్నాయి.
8. సింటెక్స్ పరిశ్రమ తెలంగాణలో ఎక్కడ పెట్టుబడి పెట్టనుంది? (2)
1. దివిటిపల్లి 2. చందన్వెల్లి
3. గౌరారం 4. సుల్తాన్పూర్
వివరణ: వెల్స్పన్ అనుబంధ సంస్థ అయిన సింటెక్స్, తెలంగాణ రాష్ట్రంలో రూ.350 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. నీటి ట్యాంక్‌లు, ప్లాస్టిక్ పైపుల తయారీ ఇక్కడ ప్రారంభించనుంది. వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించనుంది. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఈ పరిశ్రమ రానుంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి గ్రామం తెలంగాణ ప్రకటించిన మొబిలిటీ వ్యాలీలో భాగం. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్క్ ఉంది
9. ఏ రోజున ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు? (3)
1. సెప్టెంబర్ 8 2. సెప్టెంబర్ 21
3. సెప్టెంబర్ 27 4. ఏదీ కాదు
వివరణ: ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తారు. భారత్‌లో జాతీయ పర్యాటక దినోత్సవం మాత్రం జనవరి 25న ఉంటుంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్ కేంద్రంగా ప్రపంచ పర్యాటక సంస్థ ఉంటుంది. ఈ సంస్థ నియమావళి రూపొందించిన రోజు సెప్టెంబర్ 27 కాబట్టి, ఈ రోజును ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుతారు. ఈ ఏడాది దీని ఇతివృత్తం ‘పర్యాటకం-హరిత పెట్టుబడులు’. పర్యాటక దినోత్సవాన్ని 1979లో ప్రకటించారు, 1980 నుంచి నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత రోజుగా జరుపుతారు. సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి రోజుగా జరుపుతారు.
10. ఈ ఏడాది భారత్‌కు ఏ దేశంతో 50 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయ్యాయి? (4)
1. జపాన్ 2. ఇజ్రాయెల్
3. ఈజిప్ట్ 4. దక్షిణ కొరియా
వివరణ: దక్షిణ కొరియాతో ఈ ఏడాది 50 సంవత్సరాల దౌత్య సంబంధాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దక్షిణ కొరియాలోని రాయబార కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే. ఈ సందర్భంగా ‘గయా బుద్ధిజం అన్లాచింగ్ ది గేట్’ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఆ దేశంలోని సియోల్‌లో భారత్‌కు రాయబార కార్యాలయం ఉంది. గతేడాది జపాన్‌తో భారత్ 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోగా అదే ఏడాది ఇజ్రాయెల్‌తో 30 సంవత్సరాల సంబంధాలు పూర్తయ్యాయి.
11. ఏ రాష్ట్రంలో ‘గాంధీ వాటిక’ అనే మ్యూజియంను ప్రారంభించారు? (4)
1. మధ్యప్రదేశ్ 2. గుజరాత్
3. ఛత్తీస్‌గఢ్ 4. రాజస్థాన్
వివరణ: గాంధీ వాటిక పేరుతో రాజస్థాన్‌లోని జైపూర్ సెంట్రల్ పార్క్‌లో ఒక మ్యూజియంను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకుగాను రూ. 87 కోట్ల మేర వెచ్చించారు. ఇది మూడు అంతస్థుల్లో ఉంది. మహాత్మాగాంధీ జీవితం, బోధనల ప్రత్యేకతను చాటిచెప్పేలా ప్రతి అంతస్థును తీర్చిదిద్దారు. అలాగే గాంధీకి ముందు జరిగిన 1857 విప్లవ అంశాలు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో చేసిన పోరాటాలను కూడా ఈ మ్యూజియంలో ప్రస్తావించారు.
12. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి దక్కింది? (3)
1. స్వాతి నాయక్ 2. ఆశాపరేఖ
3. వహిదా రెహ్మాన్ 4. అమిత్ ఖారే
వివరణ: 2023 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వహిదా రెహ్మాన్‌కు దక్కింది. 2022 సంవత్సరానికి ఆశాపరేఖకు, 2021 సంవత్సరానికి గాను రజనీకాంత్‌కు ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల కాలంలో అమిత్ ఖారే వార్తల్లో నిలిచారు. ఆయన భారత ప్రధాని నరేంద్రమోదీకి సలహాదారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే స్వాతి నాయక్ కూడా వార్తల్లో ఉన్నారు. ప్రతిష్ఠాత్మకమైన నార్మన్ బొర్లాడ్ ఫీల్డ్ అవార్డును ఆమే ఈ ఏడాది గెలుచుకున్నారు. భారతదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది. సినీ రంగానికి సంబంధించి ఇది అత్యున్నత పురస్కారం. దీన్ని 1969లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి
దేవికారాణి.
13. ఏ కూటమికి సంబంధించి ఉమ్మడిగా అంతరిక్ష పరిశోధన ప్రారంభం కానుంది? (1)
1. ఐ2యూ2 2. ఏషియన్
3. బ్రిక్స్ 4. బిమ్స్టెక్
వివరణ: ఐ2యూ2లో నాలుగు దేశాలు ఉంటాయి. అవి భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీన్ని వెస్ట్రన్ క్వాడ్ అని కూడా అంటారు. ఈ నాలుగు దేశాలు కలిసి ఉమ్మడిగా ఒక అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. గతంలో భారత్ సార్క్ దేశాలకు ఉపయోగపడే ఒక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించింది. తాజాగా ప్రారంభం కానున్న అంతరిక్ష కార్యక్రమంలో విధాన నిర్ణేతలు, వ్యవస్థలు, పెట్టుబడిదారులకు కూడా ఉపయోగపడేలా తీర్చి దిద్దుతారు. ఏషియన్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఈ కూటమి కోసమే భారత్ లుక్ ఈస్ట్ విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా చేయనుంది
15. ప్రపంచంలో రెండో అతిపెద్ద హిందూ దేవాలయం ఏ దేశంలో నిర్మించనున్నారు? (3)
1. కాంబోడియా 2. నేపాల్
3. అమెరికా 4. శ్రీలంక
వివరణ: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్దది కాంబోడియాలోని అంగర్ వాట్ దేవాలయం. అయితే భారత్‌లోని పశ్చిమబెంగాల్లోనూ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం 2024 నాటికి పూర్తవుతుంది.
6. ఈ ఏడాది సెప్టెంబర్ 25కు సంబంధించినవి ఏవి? (3)
ఎ. అంత్యోదయ దివస్ బి. ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం
సి. ప్రపంచ నదుల దినోత్సవం
1. ఎ, సి 2. బి, సి 3. ఎ, బి 4. ఎ, బి, సి
వివరణ: ఏటా సెప్టెంబర్ 25 తేదీన అంత్యోదయ దివాస్, ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబర్ నెల నాలుగో ఆదివారం రోజున ప్రపంచ నదుల రోజుగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచ నదుల రోజు నిర్వహించారు. పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా అంత్యోదయ అన్న యోజన రోజును ప్రకటించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న జన్మించారు. అణగారిన వర్గాలకు అన్ని ప్రయోజనాలు తీసుకెళ్లాలన్నదే లక్ష్యం. మానవాళికి ఫార్మసీ రంగం చేస్తున్న సేవలను గుర్తించేందుకు సెప్టెంబర్ 25ను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఏడాది దీని ఇతివృత్తం
‘ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్న ఫార్మసీ’.
14. భారతదేశంలో తొలి హరిత శక్తి పురావస్తు దేవాలయం ఏది? (2)
1. కోణార్క్ సూర్య దేవాలయం 2. మమ్మలపురం తీర దేవాలయం
3. పూరి జగన్నాథ్ ఆలయం 4. ద్వారక ఆలయం
వివరణ: తమిళనాడులోని మమ్మలపురంలో ఉండే తీర దేవాలయం భారతదేశంలోనే తొలి హరిత శక్తి పురావస్తు ప్రదేశంగా ఘనతను దక్కించుకుంది. ఈ దేవాలయం యునెస్కో జాబితాలో కూడా ఉంది. దీన్ని ఏడు, ఎనిమిది శతాబ్దాల్లో నిర్మించారు. పల్లవ వంశానికి చెందిన రాజులు దీని నిర్మాతలు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?