‘ఇండియా ఔట్’ ఉద్యమం ఏ దేశంలో జరిగింది? ( కరెంట్ అఫైర్స్)
1. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (3)
ఎ. ఈ కూటమిలో ఇరాన్, బెలారస్‌లు చేరేందుకు అవకాశం ఉంది
బి. ఈ కూటమి తొలి సాంస్కృతిక-పర్యాటక రాజధానిగా వారణాసి ఎంపికయ్యింది
సి. ఈ కూటమి తొలి సాంస్కృతిక-పర్యాటక రాజధానిగా షాంఘై ఎంపికయ్యింది
1) ఎ, సి 2) ఎ 3) ఎ, బి 4) బి
వివరణ: ఇరాన్, బెలారస్‌లు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో చేరే అవకాశాలున్నాయి. ఈ కూటమిలో భారత్, పాకిస్థాన్, చైనా, రష్యాలతో పాటు కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఉన్నాయి. దీని ప్రధాన కేంద్రం చైనాలోని బీజింగ్‌లో ఉంది. అలాగే ఈ కూటమికి సంబంధించి మొట్టమొదటి పర్యాటక, సాంస్కృతిక రాజధానిగా భారత్‌లోని వారణాసి ఎంపికయ్యింది. 2023లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం భారత్‌లో జరుగనుంది.
2. అంతర్జాతీయ సంస్థగా కింద పేర్కొన్న ఏ సంస్థకు ప్రకటించేందుకు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది? (2)
1) అంతర్జాతీయ సౌర కూటమి
2) సీడీఆర్ఐ
3) ఇక్రిశాట్ 4) ఎంఎంఆర్ఎస్
వివరణ: కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అంతర్జాతీయ సంస్థ హోదాను కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంస్థకు భారత్‌లో ప్రధాన కేంద్రం హోదాను ఇవ్వనున్నారు. యునైటెడ్ నేషన్స్ (ప్రివిలేజెస్-ఇమ్యూనిటీస్) యాక్ట్-1947 ప్రకారం అన్ని రకాల రక్షణలు కల్పించనున్నారు. దీంతో భారత్‌లో ప్రధాన కేంద్రం ఉన్న సంస్థల సంఖ్య రెండుకు చేరనుంది. ఇప్పటికే భారత్‌లో అంతర్జాతీయ సౌర కూటమి భారత్ కేంద్రంగా పనిచేస్తుంది.
3. ఏ కూటమికి ‘పశ్చిమ క్వాడ్’ అని పేరు ఉంది? (3)
1) జీ7 2) ఎస్సీవో
3) ఐ2యూ2 4) జీ4
వివరణ: ఐ2యూ2 అనే కూటమికి పశ్చిమ క్వాడ్ అని పేరు ఉంది. భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్ దేశాల కూటమితో ఏర్పడిందే ఇది. ఇటీవల ఈ కూటమి సమావేశం జరిగింది. భారత్‌లో సమీకృత ఆహార పార్క్‌ల అభివృద్ధికి యూఏఈ 2 బిలియన్ అమెరికన్ డాలర్లు వ్యయం చేయనుంది. హరిత శక్తి వనరుల పెంపునకు కూడా కూటమిలోని దేశాలు కృషి చేస్తాయి. భారత్‌లోని గుజరాత్లో హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీని అందుబాటులోకి తేనున్నారు. వాయు, సౌర శక్తుల ద్వారా 300 మెగావాట్లు ఉత్పత్తి చేయనున్నారు.
4. ఈ ఏడాది ఏ దేశంతో భారత్ 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకుంది? (1)
1) జపాన్ 2) ఇజ్రాయెల్
3) యూఏఈ 4) స్పెయిన్
వివరణ: భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 2022తో 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇరుదేశాల మధ్య 1952లో సంబంధాలు ప్రారంభమయ్యాయి. రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలు. ఈ ఏడాది మార్చి 19, 20 తేదీల్లో జపాన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడా భారత్‌లో పర్యటించారు. ఇరుదేశాల ప్రధాన మంత్రుల మధ్య 14వ వార్షిక సమావేశం జరిగింది. రానున్న అయిదేళ్లలో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ అంగీకరించింది. అనుసంధానం, నీటి సరఫరా, వైద్య రంగం, జీవ వైవిధ్య సంరక్షణ తదితర ప్రాజెక్టులకు జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ ద్వారా సాయం చేసేందుకు జపాన్ ప్రధాని అంగీకరించారు. వృథా నీటి శుద్ధికి సంబంధించి జపాన్‌కు చెందిన జోక్సౌ సాంకేతికతను కూడా బదిలీ చేయనున్నారు.
5. టీఏపీఐ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (2)
1) నీటిని సరఫరా చేసే పైప్‌లైన్
2) గ్యాస్‌ను సరఫరా చేసే పైప్‌లైన్
3) నిర్మాణ రంగంలోనివారికి శిక్షణ
4) అంతరిక్ష పరిశోధన
వివరణ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తుర్క్మెనిస్థాన్ దేశంలో పర్యటించారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని పర్యటించడం ఇదే తొలిసారి. ఆ దేశ ప్రభుత్వాధినేతలతో జరిగిన చర్చల సందర్భంగా టీఏపీఐ గ్యాస్ పైప్‌లైన్ చర్చకు వచ్చింది. టీఏపీఐ పూర్తి రూపం- తుర్క్మెనిస్థాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్. 1814 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తుర్క్మెనిస్థాన్ నుంచి భారత్ వరకు గ్యాస్‌ను సరఫరా చేస్తుంది. భారత్, పాకిస్థాన్‌లకు చేరో 14 బిలియన్ క్యూబిక్ మీటర్లు, అఫ్గానిస్థాన్‌కు 5 బిలియన్ క్యూబిక్ మీటర్లను అందిస్తారు. దీనికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సాయం చేస్తుంది.
6. ఏ దేశాలు భారత్‌కు చెందిన రూపే కార్డ్ ను అనుమతిస్తున్నాయి? (3)
ఎ. భూటాన్ బి. యూఏఈ
సి. సింగపూర్ డి. నేపాల్
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
వివరణ: రూపే కార్డ్ భూటాన్, యూఏఈ, సింగపూర్, నేపాల్ దేశాల్లో అనుమతిస్తారు. ఫ్రాన్స్‌లోనూ చెల్లే విధంగా త్వరలో ఒప్పందం కుదరనుంది. ఈ కార్డ్‌ను అంగీకరించిన తొలి దేశం భూటాన్. నేపాల్ ప్రధాని షేర్ బదూర్ దేబే ఏప్రిల్ 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా కుదిరిన ఒప్పందాల్లో రూపే కార్డ్‌కు సంబంధించిన అంశం ఒకటి. ఇతర ఒప్పందాలు పరిశీలిస్తే-సరిహద్దు రైల్వేలైన్‌ను ప్రారంభించారు. ఇది 35 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బీహార్‌లోని జయనగర్, నేపాల్‌లోని కుర్తాలను కలుపుతుంది. తర్వాత దీనిని ఆ దేశంలోని బర్దిబాస్ వరకు పొడిగిస్తారు.
7. ఏయే దేశాలతో భారత్ 2+2 చర్చలను జరుపుతుంది? (4)
ఎ. అమెరికా బి. జపాన్
సి. ఆస్ట్రేలియా డి. రష్యా
1) ఎ 2) ఎ, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
వివరణ: భారత రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు ఇతర దేశాల రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులతో జరిపే చర్చలనే 2+2 చర్చలుగా పేర్కొంటారు. ఈ తరహా చర్చలను తొలిసారిగా అమెరికాతో భారత్ ప్రారంభించింది. ప్రస్తుతం జపాన్, ఆస్ట్రేలియా, రష్యా దేశాలతో కూడా ఈ తరహా చర్చలు భారత్ నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాతో 2+2 సంభాషణలు కొనసాగాయి. రక్షణ రంగంలో కృత్రిమ మేధపై చర్చలను ప్రారంభించడంతో పాటు సైబర్ శిక్షణ విన్యాసాలను నిర్వహించాలని, అంతరిక్ష రంగంలో మరింత పరస్పరంగా సహకరించుకోవాలని నిర్ణయించారు.
8. ‘ఈసీటీఏ’ ఒప్పందం ఏ దేశంతో భారత్ కుదుర్చుకుంది? (4)
1) రష్యా 2) ఇజ్రాయెల్
3) చైనా 4) ఆస్ట్రేలియా
వివరణ: ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియాతో భారత్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్నే ఇంగ్లిష్‌లో ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. రానున్న అయిదేళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకే చేర్చాలన్నది ఈ ఒప్పందం లక్ష్యం. వస్తు, సేవలు, వ్యక్తులను స్వేచ్ఛగా అనుమతించాలని నిర్ణయించారు.
9. ఏ దేశంలో ‘ఇండియా ఔట్’ ఉద్యమం జరిగింది? (3)
1) పాకిస్థాన్ 2) చైనా
3) మాల్దీవులు 4) బంగ్లాదేశ్
వివరణ: భారత్‌కు సముద్ర మార్గం గుండా అతి సమీపంలో ఉన్న మాల్దీవుల దేశంలో ‘ఇండియా ఔట్’ ఉద్యమం జరిగింది. ఆ దేశంలో భారత్ వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లు చేపట్టిన నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అబ్దుల్దా యెమీన్ నేతృత్వంలో నిర్వహించారు. ఆ దేశానికి ఆయన 2013 నుంచి 2018 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. మాల్దీవుల్లో అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయిన గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కు కూడా భారత్ ఆర్థిక సాయం చేస్తుంది.
10. ఐపీఈఎఫ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. దీనిని ప్రతిపాదించిన దేశం? (1)
1) యూఎస్ఏ 2) యూకే
3) భారత్ 4) జపాన్
వివరణ: ఐపీఈఎఫ్ అంటే ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్. దీనిని యూఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంటిది కాదు. కేవలం ఆర్థిక అంశాల్లో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఉద్దేశించింది. మే నెలలో మూడో వారంలో క్వాడ్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లోనే ఐపీఈఎఫ్ ప్రస్తావనను అమెరికా చేసింది. ఇది కార్యరూపం దాలిస్తే దీనిలో చేరేందుకు భారత్ అంగీకరించింది.
11. వెస్ట్ సేథి ప్రాజెక్ట్ ఏ దేశానికి సంబంధించింది? (2)
1) భూటాన్ 2) నేపాల్
3) శ్రీలంక 4) మయన్మార్
వివరణ: వెస్ట్ సేథి ప్రాజెక్ట్ నేపాల్ దేశానికి సంబంధించింది. 750 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించింది. సెథి అనే నదిపై దీన్ని నిర్మిస్తున్నారు. 1200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఒప్పంద నిర్మాణాన్ని చైనా దేశానికి నేపాల్ అప్పగించింది. 2012లో ప్రారంభంమై 2018 వరకు కొనసాగి, నిలిచింది. దాదాపు ఆరేళ్ల తర్వాత చైనా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్‌ను భారత్ చేపట్టనుంది. భారత్, నేపాల్ దేశాల మధ్య ఉన్న ఇతర జల విద్యుత్ ప్రాజెక్ట్‌లు-మహాకాళి ఒప్పందం. ఇది 1995లో కుదిరింది. అలాగే ఎగువ కర్నాలి ప్రాజెక్ట్. మూడోది తూర్పు నేపాల్‌లోని సంకువసభలో చేపట్టిన 900 మెగావాట్ల అరుణ్ ప్రాజెక్ట్.
12. భారత్‌కు చెందిన 75 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ను ప్రకటించిన యూరప్ దేశం? (3)
1) స్పెయిన్ 2) ఫ్రాన్స్
3) యూకే 4) జర్మనీ
వివరణ: ఈ ఏడాది భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా యూకే కూడా భారత్‌కు చెందిన 75 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇది అమలవుతుంది. అదనంగా 18 మంది మహిళలకు బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్లను కూడా ప్రకటించింది. శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఇంజినీరింగ్, గణితం తదితర కోర్సులను చదివే అవకాశాన్ని కల్పించనున్నారు. యూకేలోని 150 విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు వీలుంది.
13. 2023లో జీ-20 సమావేశం ఏ దేశంలో జరుగనుంది? (4)
1) ఇండోనేషియా 2) జపాన్
3) ఇటలీ 4) భారత్
వివరణ: జీ-20 కూటమి దేశాల సమావేశం 2023లో భారత్‌లోని జమ్ము కశ్మీర్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1న ఈ కూటమికి భారత్ సారథ్యం వహించనుంది. 30 నవంబర్ 2023 భారత్ ఈ పాత్రలో ఉండనుంది. 2022లో మాత్రం జీ-20 సమావేశం ఇండోనేషియాలో జరుగనుంది. ఈ కూటమికి శాశ్వత సచివాలయం లేదు. సమావేశాలు జరిగే దేశంలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. భారత్‌లో ఏర్పాటు చేసిన జీ-20 సెక్రటేరియట్‌కు చెందిన ఉన్నత స్థాయి కమిటీకి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహించనున్నారు. ఇందులో సభ్యులుగా నిర్మలా సీతారామన్, అమిత్ షా, జై శంకర్ ఉన్నారు. షెర్పాగా అమితాబ్ కాంత్ ఉంటారు. గతంలో అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ సీఈవోగా పనిచేశారు.
14. జనవరి 29, 2022 నాటికి ఏ దేశంతో భారత్ 30 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకుంది? (2)
1) ఉజ్బెకిస్థాన్ 2) ఇజ్రాయెల్
3) పాలస్తీనా 4) యూఏఈ
వివరణ: ఇజ్రాయెల్‌తో భారత్ 30 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకుంది. 1992, జనవరి 29న ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. నాడు భారత ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. భారత రాష్ట్రపతి ఆ దేశానికి వెళ్లడం అదే మొదటి, చివరిసారి.
15. ఏ దేశానికి ‘బ్రహ్మోస్ క్షిపణి’ని భారత్ విక్రయించనుంది? (3)
1) రష్యా 2) భూటాన్
3) ఫిలిప్పీన్స్ 4) ఇండోనేషియా
వివరణ: భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ఫిలిప్పీన్స్ దేశానికి విక్రయించనుంది. ఈ క్షిపణిని మనదేశం నుంచి కొనే తొలి దేశం అదే. ఆ దేశ ప్రభుత్వంతో, బ్రహ్మోస్ ఏరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?