Current Affairs | ‘మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్’ దేనికి సంబంధించింది?
1.సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ చేసిన దేశంలోని తొలి నగరం ఏది? (3)
1) వరంగల్ 2) విశాఖపట్నం
3) భోపాల్ 4) తిరువనంతపురం
వివరణ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో స్థానికీకరణ చేసిన తొలి నగరం భోపాల్. ప్రపంచ తొలి నగరం న్యూయార్క్. మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. 2030 నాటికి వీటిని ప్రపంచ దేశాలు చేరుకోవాలి. ఇందుకు అన్ని నగరాలు సమీక్ష నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ చర్యను తొలుత భోపాల్‌లో చేపట్టారు. ఇందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ‘కార్యాచరణకు ఎజెండా: భోపాల్‌లో సుస్థిర పట్టణ పరివర్తన’ అనే పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
2. కుడుంబశ్రీ అనేది ఏ రాష్ట్రంతో ముడి పడి ఉంది? (4)
1) తమిళనాడు 2) కర్ణాటక
3) మహారాష్ట్ర 4) కేరళ
వివరణ: కుడుంబశ్రీ అనేది ఒక స్వయం సహాయక సంఘం. దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన వ్యవస్థ. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంది. కేరళ రాష్ట్రంలో ఇది కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు చెందిన సిల్వర్ జూబ్లీ వేడుకలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. మలయాళ భాషలో కుడుంబశ్రీ అంటే ‘కుటుంబ సౌభాగ్యం’ అని అర్థం. ఈ సంస్థను 1997లో నెలకొల్పారు. నాటి కేరళ ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ దీన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో భాగంగా 2011లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కుడుంబశ్రీని గుర్తించింది.
3. నీరజ్ చోప్రా ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? (3)
1) చెస్ 2) షటిల్
3) జావెలిన్ త్రో 4) రెజ్లింగ్
వివరణ: నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్రీడాకారుడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. జావెలిన్ త్రోకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతడు 2455 పాయింట్లు సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలిచాడు. 2022, ఆగస్ట్ 30 నాటికి ప్రపంచంలో రెండో స్థానాన్ని పొందాడు. ఆ తర్వాత మెరుగైన ఆటతీరుతో ఒకటో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అండర్సన్ పీటర్స్‌ను అధిగమించాడు. అతనికంటే 22 పాయింట్లు ఎక్కువగా దక్కించుకున్నాడు.
4. ఈ ఏడాది నిర్వహించిన హెల్త్ అసెంబ్లీ ఎన్నోది? (2)
1) 75 2) 76 3) 77 4) 78
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది 76వ సమావేశాన్ని సంస్థ ప్రధాన కార్యాలయం అయిన జెనీవాలో నిర్వహించింది. ఏటా మే నెలలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ వీడియో సందేశాన్ని పంపారు. మహమ్మారులు భవిష్యత్తులో వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే కొవిడ్-19 కట్టడికి భారత్ చేసిన కృషిని వివరించారు. ప్రపంచంలోని దేశాలకు వ్యాక్సిన్‌ను అందించిన ఘనత భారత్‌దే అని పేర్కొన్నారు.
5. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఏ దేశానికి భారత్ నుంచి రూ.422 కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసింది? (1)
1) మయన్మార్ 2) బంగ్లాదేశ్
3) నేపాల్ 4) భూటాన్
వివరణ: మయన్మార్‌లోని జుంట ప్రభుత్వానికి దాదాపు రూ.422 కోట్ల విలువైన ఆయుధాలను భారత్ ఎగుమతి చేసిందని, ఇలా అమ్మిన సంస్థల్లో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగానికి చెందినవి కూడా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక పేరు ‘ది బిలియన్ డాలర్స్ డెత్ ట్రేడ్: ఇంటర్నేషనల్ ఆర్మ్స్ నెట్వర్క్స్ దట్ ఎనేబుల్ హ్యూమన్ రైట్ వయలేషన్స్ ఇన్ మయన్మార్’. దీన్ని తెలుగులో ‘బిలియన్ డాలర్ల మృత్యు వాణిజ్యం: మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేలా ప్రేరేపించే అంతర్జాతీయ ఆయుధాల నెట్వర్క్’గా చెప్పుకోవచ్చు.
6. 2023 జీ-7 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? (3)
1) మాంట్రియల్ 2) న్యూయార్క్
3) హిరోషిమా 4) బెర్లిన్
వివరణ: జీ-7 దేశాల 49వ వార్షిక సమావేశం జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగింది. ఈ కూటమిలో యూఎస్ఏ, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, జపాన్ దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ అతిథి హోదాలో ఈ సమావేశానికి హాజరయ్యారు. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా హిరోషిమా నగర వాసి. ప్రపంచంలోనే అణ్వాయుధ వ్యాప్తికి తల్లడిల్లిన తొలి నగరం ఇదే. ప్రస్తుత సమావేశంలో భాగంగా అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందాలపై కూడా చర్చ జరిగింది. అలాగే రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, పర్యావరణాన్ని మరింత మెరుగుపరచడం తదితర అంశాలపై కూడా కూటమి దేశాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
7. ఇటీవల వార్తల్లో నిలిచిన రయాన బర్నవి ఏ దేశ మహిళ? (2)
1) యూఏఈ 2) సౌదీ అరేబియా
3) అఫ్గానిస్థాన్ 4) ఇరాన్
వివరణ: రయాన బర్నవి అరబ్ మహిళ. అంతరిక్షంలోకి అడుగు పెట్టింది. ఈ ఘనతను దక్కించుకున్న తొలి అరబ్ మహిళ ఆమె. ఈ అంతరిక్ష మిషన్‌ను మే 21న ప్రయోగించారు. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వాళ్లు అంతరిక్షంలో అడుగుపెట్టారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి అలీ అల్-కురాని కూడా ఈ రాకెట్లో ప్రయాణించారు.
8. జీబీయూ-57 అనే పదం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (1)
1) అమెరికా తయారు చేసిన ఒక బాంబు
2) కొత్తగా కనుగొన్న నక్షత్రం
3) కొత్తగా కనుగొన్న పాలపుంత
4) సైబర్ దాడికి ఉద్దేశించిన వైరస్
వివరణ: జీబీయూ-57 అనేది అమెరికా దేశానికి చెందిన ఒక శక్తిమంతమైన బాంబు. భూమిలోకి చొచ్చుకుపోయి, అంతర్గతంగా ఉన్న ఆయుధ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయగలదు. దీన్ని ‘మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్’ అని కూడా అంటారు. ఇది జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అర్థం. దీన్ని అమెరికా వైమానిక దళం అలాగే బోయింగ్‌లు కలిసి సంయుక్తంగా తయారు చేశాయి. ఇటీవల దీన్ని అమెరికా ప్రదర్శించడంతో వార్తల్లో నిలిచింది.
9. ఎస్ఏ ఏ ఆర్ టీ హెచ్ ఐ (సారథి) అనే కొత్త విధానాన్ని ప్రారంభించిన వ్యవస్థ ఏది? (3)
1) ఢిల్లీ యూనివర్సిటీ
2) అంకుర సంస్థల మంత్రిత్వ శాఖ
3) యూజీసీ 4) ఎన్సీఈఆర్టీ
వివరణ: ఎస్ఏఆర్ఏటీహెచ్ఐ అనే ఒక కొత్త విధానాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రారంభించింది. దీని పూర్తి రూపం- స్టూడెంట్ అంబాసిడర్ ఫర్ అకడమిక్ రీఫార్మ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఉన్నత విద్యలో పరివర్తనను తీసుకు రావడానికి ఉద్దేశించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. విద్య పరివర్తన కోసం కొంత మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు ప్రతి విశ్వ విద్యాలయం నుంచి ముగ్గురిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. వీళ్లను సారథులుగా తీర్చిదిద్ది, అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు.
10. భక్తులకు ఉచితంగా వాయు రవాణాను తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? (4)
1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్ 4) మధ్యప్రదేశ్
వివరణ: భక్తులకు ఉచిత రవాణాను అందిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తీర్థ్-దర్శన్ యోజన అనే పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతలో 32 మంది సీనియర్ పౌరులను ఉచిత వాయు రవాణ ద్వారా తీర్థయాత్రలకు పంపారు. వీళ్లు మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్ రాజ్‌కు వెళ్లారు.
11. ఏ సంస్థ సాయంతో భారత్ ఎస్టీఏఆర్ఎస్ (స్టార్స్)ను ప్రారంభించింది? (1)
1) ప్రపంచ బ్యాంక్ 2) ఐఎంఎఫ్
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
3) నాసా
వివరణ: ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్టార్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టార్స్ అంటే- స్ట్రెంథనింగ్ టీచింగ్-లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. అంటే బోధనను, నేర్చుకోవడాన్ని బలోపేతం చేయడం, అలాగే తగిన ఫలితాలు పొందడం అని భావం వస్తుంది. నిజానికి దీన్ని కేంద్ర క్యాబినెట్ 2020లోనే ఆమోదించింది. ఇది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమంగా ప్రస్తుతం అమలు చేయనున్నారు. దీని అమలు కాలం 2024-25 వరకు ఉంటుంది.
12. ఏ దేశంలో భారత్ ‘ఆపరేషన్ కరుణ’ ప్రారంభించింది? (3)
1) ఉక్రెయిన్ 2) సూడాన్
3) మయన్మార్ 4) శ్రీలంక
వివరణ: మోచ తుఫానుతో మయన్మార్ తీవ్ర ప్రభావానికి గురయ్యింది. దీంతో ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ చేపట్టిన చర్యకు ‘ఆపరేషన్ కరుణ’ అని పేరు పెట్టారు. ఆ దేశ ప్రజలకు సాయం చేశారు. భారతకు చెందిన శివాలిక్, కమ్రోటా, సావిత్రి అనే నౌకలు మే 18న మయన్మార్‌కు చేరాయి. బాధితులకు అవసరమైన వివిధ వస్తువులు, ఆహార పదార్థాలు అందులో ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా ఈ తుఫాన్ ప్రభావానికి గురయ్యింది. ఇటీవల సూడాన్‌లో అంతర్యుద్ధం రావడంతో, అక్కడ ఉన్న భారత ప్రజలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత్ ‘ఆపరేషన్ కావేరి’ చేపట్టింది.
13. రాధాకృష్ణన్ కమిటీ దేనికి సంబంధించింది? (2)
1) బ్యాంకుల సంస్కరణలు
2) ఐఐటీల సమీక్ష
3) ప్రాథమిక విద్య బలోపేతం
4) ప్రాథమిక వైద్యం బలోపేతం
వివరణ: దేశంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఐటీలను మరింత బలోపేతం చేసేందుకు, వాటి పరిపాలన, పనితీరును సమీక్షించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందే రాధాకృష్ణన్ కమిటీ. ఇది తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దేశంలో సాంకేతిక విద్య పర్యవేక్షణకు ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి, ఐఐటీలను దాని పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. అలాగే అన్ని ఐఐటీల్లో ఉమ్మడిగా ఒకే సిలబస్ ఉండేలా చూడటం, ఫ్యాకల్టీ భర్తీ విధానంలోనూ ఒకే రకంగా ఉండాలని ఈ కమిటీ సూచించింది.
14. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ఎగ్జిబిషన్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? (4)
1) బెంగళూరు 2) పుణె
3) అహ్మదాబాద్ 4) హైదరాబాద్
వివరణ: ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి ‘వింగ్స్ ఇండియా 2024’ అని పేరు పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 21 వరకు ఇది కొనసాగుతుంది. దీని ఇతి వృత్తం- కనెక్టింగ్ ది వరల్డ్: సెట్టింగ్ ది స్టేజ్ ఫర్ ఇండియా బై 2047. అంటే ప్రపంచాన్ని అనుసంధానం చేయడం: అందుకు 2047 నాటికి వేదికను ఏర్పాటు చేయడం.
15. దక్షిణాసియా యువ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఏ నగరంలో నిర్వహించారు? (3)
1) భోపాల్ 2) భువనేశ్వర్ 3) ఈటానగర్ 4) ఇంఫాల్
వివరణ: దక్షిణాసియా యువ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ 2023 క్రీడలను మే 15, 16, 17 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో నిర్వహించారు. భారత్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ తదితర దేశాల నుంచి దాదాపు 100 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అన్ని బంగారు పతకాలు భారత్ గెలుచుకుంది. మొత్తం 16 బంగారు పతకాలను భారత్ కైవసం చేసుకుంది.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
అమిగోస్ 21వ సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?