కరెంట్ అఫైర్స్
జాతీయం
అగ్ని-3
మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్డీవో నవంబర్ 23న వెల్లడించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. 16 మీటర్ల పొడవు, 48 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఈ మిసైల్ 1.5 టన్నులకు పైగా పేలోడ్లను మోసుకెళ్లగలదు. ఇది 3,500 నుంచి 5,000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
పుస్తకావిష్కరణ
‘ఇండియా: ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’ పుస్తకాన్ని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నవంబర్ 24న ఆవిష్కరించారు. దీన్ని ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ (ఐసీహెచ్ఆర్) ప్రచురించింది. నాగరికత ఆవిర్భవించినప్పటి నుంచి పాతుకుపోయిన ప్రజాస్వామ్య తత్వాన్ని ఈ పుస్తకం తెలుపుతుందని ఐసీహెచ్ఆర్ చైర్పర్సన్ ప్రొ. రఘువేంద్ర తన్వర్, మెంబర్ సెక్రటరీ అశోక్ కదం వెల్లడించారు. 76వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం)లో ‘భారతదేశం పురాతన ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా అని’ ప్రధాని చెప్పిన మాటలను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
12705 నౌక
మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన విధ్వంసక నౌక నౌకాదళంలో నవంబర్ 24న చేరింది. ప్రాజెక్ట్ 15బిలో భాగంగా రూపొందించిన రెండో నౌక ఇది. దీనికి వై 12705 (మొర్ముగావ్) అని పేరుపెట్టారు. దీనిలో బ్రహ్మోస్ క్షిపణులు, దేశీయ టార్పెడో ట్యూబ్ లాంఛర్లు, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంఛర్లు మోహరిస్తారు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా రహస్యంగా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ నౌక 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 7,400 టన్నుల బరువు ఉంది. దీని కనీస వేగం 30 నాట్స్. 2011లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో మజ్గావ్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నాలుగు నౌకలను తయారు చేస్తుంది.
పీఎస్ఎల్వీ సీ54
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నవంబర్ 26న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈ రాకెట్ ద్వారా ఓషన్ శాట్ లేదా ఈవోఎస్ (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్)-6తో పాటు 8 చిన్న ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపించారు. చిన్న ఉపగ్రహాల్లో ఐఎన్ఎస్ 2బి, ఆనంద్, రెండు థాయ్ బోల్ట్, 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ శాటిలైట్స్ ఉన్నాయి. ఓషన్ శాట్ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణ పరిశీలన, తుఫానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. మీథేన్ లీకులు, భూగర్భ చమురు, పంటకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ ఉపయోగపడుతుంది.
అంతర్జాతీయం
కాప్27
యూఎన్ వాతావరణ మార్పుల కాన్ఫరెన్స్ ‘కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్)’ 27వ సదస్సు నవంబర్ 20న ముగిసింది. ఈ సదస్సు ఈజిప్టులోని షార్మ్ ఎల్ షీక్లో నవంబర్ 6న ప్రారంభమయ్యింది. వాతావరణ మార్పుల వల్ల విధ్వంసానికి గురైన, నష్టపోయిన దేశాలకు పరిహారం చెల్లించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దేశాలు తొలిసారిగా అంగీకరించాయి. ఈ పరిహార నిధి కోసం భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. బొగ్గు వాడకాన్ని నిలిపివేస్తూ స్వల్ప ఉద్గారాల ఇంధన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలని ‘షార్మ్-ఎల్-షీక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్’ పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్
నాలుగు రోజులు నిర్వహించిన 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ (డబ్ల్యూసీవోఏ) సదస్సు నవంబర్ 21న ముగిసింది. ముంబైలో జరిగిన ఈసదస్సును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్ఏసీ) నిర్వహించింది. ఈ సదస్సు థీమ్ ‘బిల్డింగ్ ట్రస్ట్ ఎనేబిలింగ్ సస్టెయినబిలిటీ’. ఈ సదస్సుకు వంద దేశాల నుంచి 1,800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఐఎఫ్ఏసీని 1977లో స్థాపించారు. ఈ డబ్ల్యూసీవోఏని నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)ను 1949లో స్థాపించారు. ఐసీఏఐ ప్రెసిడెంట్ దేబాశిష్ మిత్ర.
గ్లోబల్ ఫోరం
9వ గ్లోబల్ ఫోరం ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అలయన్స్ ఆఫ్ సివిలైజేషన్ నవంబర్ 23న మొరాకో (ఆఫ్రికా)లోని ఫెజ్ నగరంలో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, లింగ వివక్ష గురించి చర్చించారు. టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుట్ కవుసోగ్లు, లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బైహబిబ్, పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ మల్కీ, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యువల్, లిబియా విదేశాంగ మంత్రి నజ్లా మంగూష్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న యూఎన్వో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత్‌కు చెందిన రెడ్ డాట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎల్సా మేరీ డిసిల్వా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న తీరును ప్రశంసించారు. దీని మొదటి సమావేశం 2008లో మాడ్రిడ్‌లో జరిగింది.
అత్యంత ఖరీదైన ఔషధం
‘హిమోఫీలియా బి’ చికిత్సకు సంబంధించిన హెమ్జెనిక్స్ ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నవంబర్ 23న ఆమోదించింది. ఈ మెడిసిన్ ఒక్కో డోసు ధర 3.5 మిలియన్ డాలర్లు (రూ.28.58 కోట్లు) అని పెన్సిల్వేనియాకు చెందిన ఔషధ తయారీ సంస్థ ‘సీఎస్ఎల్ బెహ్రింగ్స్’ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా ఇది రికార్డులకెక్కింది. రక్తం గడ్డకట్టడంలో సమస్యలతో కూడిన అరుదైన లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇది. ప్రతి 40 వేల మందిలో ఒకరు హిమోఫీలియా బితో బాధపడుతున్నట్లు ఎఫ్‌డీఏ పేర్కొన్నది. లివర్‌లో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 అనే ప్రొటీన్ లోపం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ కొత్త చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్ ఒక ప్రత్యేకమైన జన్యుపదార్థాన్ని లివర్‌లోకి ప్రవేశపెడుతంది. అప్పుడు లివర్ నుంచి ఫ్యాక్టర్-9 విడుదలవుతుంది.
నసీమ్ అల్ బహర్
భారత నౌకాదళం (ఐఎన్), రాయల్ నేవీ ఒమన్ (ఆర్ఎన్వో)ల 13వ ద్వైపాక్షిక నేవీ ఎక్సర్సైజ్ ‘నసీమ్ అల్ బహర్-2022’ నవంబర్ 24న ముగిసింది. ఒమన్ తీరంలో నవంబర్ 19న ఈ ఎక్సర్సైజ్ ప్రారంభమైంది. దీన్ని హార్బర్ ఫేజ్, సీ ఫేజ్, డెబ్రీఫ్ అనే మూడు దశల్లో నిర్వహించారు. దీనిలో భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ త్రికండ్, ఐఎన్ఎస్ సుమిత్ర, ఒమన్‌కు చెందిన అల్ షినాస్, అల్ సీబ్ నౌకలు పాల్గొన్నాయి. ఇరుదేశాల మధ్య మొదటి ఎక్సర్సైజ్ 1993లో నిర్వహించారు. ఈ ఏడాదితో ద్వైపాక్షిక ఎక్సర్సైజ్కు 30 ఏండ్లు పూర్తయ్యాయి.
వార్తల్లో వ్యక్తులు
ప్రీతి మాస్కే
పుణెకు చెందిన ప్రీతి మాస్కే గుజరాత్ నుంచి సుమారు 4000 కి.మీ. దూరంలో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌కు సైకిల్‌పై నవంబర్ 21న చేరుకున్నది. ఇందుకు 13 రోజులు, 19 గంటలు, 12 నిమిషాలు పట్టింది. దీంతో తక్కువ సమయంలో పశ్చిమం నుంచి తూర్పు వరకు ప్రయాణించిన తొలి మహిళా సైక్లిస్టుగా ఆమె రికార్డులకెక్కారు. ఆమె నవంబర్ 1న పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దు కోటేశ్వరాలయం నుంచి ప్రారంభించి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ర్టాల మీదుగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులోని కిబితుకు చేరుకొంది.
మీనాకుమారి
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ (సీసీఆర్ఎస్)కు డైరెక్టర్ జనరల్‌గా నవంబర్ 21న నియమితులయ్యారు. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధ (ఎన్ఐఎస్) డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈమెకు సీసీఆర్ఎస్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె రెండు హోదాల్లోనూ పనిచేస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
అరుణ్ గోయల్
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్ గోయల్ నవంబర్ 21న బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేలతో కూడిన కమిషన్‌లో మూడో స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 31తో అరుణ్ పదవీకాలం ముగుస్తుంది. ఈయన 1985 బ్యాచ్ పంజాబ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.
సుధారెడ్డి
పారిస్‌లో నవంబర్ 22న జరిగిన ‘ది గ్లోబల్ గిఫ్ట్ గాలా’లో మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి భారత్ తరఫున పాల్గొన్నారు. దీంతో గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. ఆమె గతేడాది న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా 2021’లో పాల్గొన్నారు. దీనిలో కూడా భారత్ నుంచి ఆమె ఒక్కరే పాల్గొనడం గమనార్హం.
పూర్ణిమాదేవి
అసోంకు చెందిన డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు-2022’కు నవంబర్ 22న ఎంపికయ్యారు. అటవీ జీవశాస్త్రవేత్త అయిన ఈమె రెండు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) వెల్లడించింది. అంతరించిపోతున్న హర్గిలా అనే కొంగల జాతిని కాపాడేందుకు ఈమె ‘హర్గిలా ఆర్మీ’ పేరుతో మహిళా గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ అవార్డును గ్రీన్ ఆస్కార్గా పిలుస్తారు.
అన్వర్ ఇబ్రహీం
మలేషియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం (75) నవంబర్ 24న ఎన్నికయ్యారు. కౌలాలంపూర్‌లోని రాజభవనంలో రాజు సుల్తాన్ అబ్దుల్లా, అన్వర్‌తో ప్రమాణం చేయించారు. 222 సీట్లు గల పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు గెలవాలి. అన్వర్ లేదా మాజీ ప్రధాని ముహిద్దీన్ యాసిన్ ఎవరూ మెజారిటీ సీట్లు సాధించలేదు. అన్వర్ నేతృత్వంలోని అలయన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలుచుకుంది. దీంతో రాజు జోక్యంతో అన్వర్ సారథ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
క్రీడలు
ఫిఫా-2022
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ (ఫిఫా)-2022 ఖతార్‌లోని దోహాలో నూతనంగా నిర్మించిన అల్బైత్ స్టేడియంలో నవంబర్ 20న ప్రారంభమైంది. ఈ క్రీడల మస్కట్ ‘లూయిబ్’. 1940ల్లో కామిక్ పుస్తకాల్లో స్నేహపూర్వక భూతం కాస్పర్ పాత్ర స్ఫూర్తితో ఈ మస్కట్ లూయిబ్ను రూపొందించారు. హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ కొద్దిసేపు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. దక్షిణ కొరియా పాప్ సింగర్ జంగ్ కూక్ స్థానిక గాయని ఫాహద్ అల్ కుబైసితో కలిసి పాట పాడాడు. 92 సంవత్సరాల ఫుట్‌బాల్ చరిత్రలో ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. విజయం సాధించడమో లేదా డ్రా అన్నా జరిగేది. కానీ నవంబర్ 20న జరిగిన ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్ ఈక్వెడార్ చేతిలో ఓడిపోయింది. గతంలో ఏనాడూ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఖతార్ జట్టు, ఆతిథ్య జట్టు హోదా కారణంగా తొలిసారిగా బరిలోకి దిగింది.
వెర్స్టాపెన్
ఫార్ములా వన్ (ఎఫ్1) వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్ డ్రైవర్) అబుధాబి గ్రాండ్ ప్రిని గెలుచుకున్నాడు. నవంబర్ 20న జరిగిన 58 ల్యాప్‌ల ఈ రేసును అందరికంటే వేగంగా గంటా 27 నిమిషాల 45.914 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ రెండో స్థానంలో, పెరెజ్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ మొత్తం 15 రేసుల్లో విజేతగా నిలిచాడు. దీంతో ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన రేసర్‌గా వెర్స్టాపెన్ రికార్డు సాధించాడు.
జొకోవిచ్
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ‘ఏటీపీ ఫైనల్స్’లో జొకోవిచ్ (సెర్బియా) ఆరోసారి విజేతగా నిలిచాడు. నవంబర్ 20న ఇటలీలోని ట్యూరిన్ నగరంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కాస్పర్ రూడ్ (నార్వే)పై గెలిచాడు. ఆరు టైటిళ్ల విజయంతో స్విట్జర్లాండ్ ఆటగాడు ఫెదరర్ పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. జొకోవిచ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ 47 లక్షల డాలర్లు (రూ.38.35 కోట్లు) గెలుచుకున్నాడు.
అర్చన కే
ఉపాధ్యాయురాలు, విషయ నిపుణులు, నల్లగొండ
- Tags
- Current Affairs
- UN
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?