వివాహ వ్యవస్థతోనే సామాజిక దృఢత్వం
వివాహం
సీడీపీవో పరీక్షల ప్రత్యేకం
మానవుడు తను నిర్వహించే పాత్రల్లో, సంబంధాల్లో ప్రత్యేకమైనది, ఉద్వేగాలు, ప్రేమ, అనురాగాలతో కూడిన వ్యక్తిగత అంశాలతో పాటుగా సామాజికమైన బాధ్యతలను కూడా నిర్వర్తించేలా చేసే ప్రాథమిక సామాజిక వ్యవస్థ వివాహం. వివాహమనే సామాజిక వ్యవస్థ వల్లనే మనుషులు జంతువుల వలె కాకుండా క్రమబద్ధమైన లైంగిక జీవనాన్ని, కుటుంబ జీవనాన్ని, బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. నాగరికత ప్రారంభం నుంచి ఇప్పటివరకు వివాహ వ్యవస్థ సజీవంగా కొనసాగుతుంది. కానీ మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వాలు, సంస్కర్తల కృషివల్ల వివాహ వ్యవస్థలో ఉన్న పురుషాధిక్య ధోరణులు తగ్గుతున్నాయి. అయినా అన్ని రంగాల్లో ఉన్నవిధంగానే స్త్రీల పట్ల వివాహానికి సంబంధించి కూడా వివక్షలు ఉన్నాయి.
వివాహం భావన, నిర్వచనాలు
- వివాహం అనేది హిందీ పదమైన వి+వాహ నుంచి తీసుకున్నారు. దీని అర్థం సామాజిక పరమైన, మతపరమైన క్రతువును నిర్వహించి వధువును తీసుకొని వెళ్లడం
- వివాహం అనేది విశ్వవ్యాప్తంగా ఆచరించే ప్రాథమిక సామాజిక సంస్థ
- వివాహం ద్వారానే కుటుంబం ఏర్పడుతుంది అంటే కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం, వివాహం ద్వారా పొందిన సంతానానికి ఆమోదం లభిస్తుంది.
- వివాహానికి సంబంధించి వెస్టర్ మార్క్, ముర్దోక్ల నిర్వచనాలను సంప్రదాయ నిర్వచనాలని, గఫ్, స్టీఫెన్స్, లోవి, మజుందార్, మదన్ల నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలని భావిస్తారు.
- మతాచారాలు, సంప్రదాయాలు, చట్టం గుర్తించిన రీతిలో స్త్రీ, పురుషులు ఒకరిపై మరొకరు లైంగిక హక్కులను కలిగి ఉండే వ్యవస్థే వివాహం – వెస్టర్ మార్క్
- ఒకేచోట నివసిస్తూ పరస్పర ఆర్థిక సహకారం కలిగియున్న వ్యక్తులు వ్యష్టి కుటుంబంగా ఏర్పడటానికి దోహదపడే విశ్వవ్యాప్త సంస్థే వివాహం – ముర్దోక్
- స్త్రీ, పురుషుల సంయోగంతో కలిగిన సంతానాన్ని చట్టబద్ధ సంతానంగా చేసేదే వివాహ వ్యవస్థ – సెల్లింగ్ మన్
- వివాహం ఒక స్త్రీకి సమాజం గుర్తించిన భర్తను, ఆమె పిల్లలకు సమాజం గుర్తించిన తండ్రిని ఇస్తుంది – మలినోవ్స్కి
- స్త్రీ, పురుషుల లైంగిక సంబంధాలు, వాటి పర్యవసానంగా ఏర్పడే సామాజిక, ఆర్థిక సంబంధాల్లో పాల్గొనడానికి మత క్రతువు ద్వారా లేదా పౌరచట్టం రూపొందించిన ఇతర పద్ధతుల్లో ఒక్కటై సమాజం ఆమోదం పొందితే దాన్ని వివాహమనే చెప్పవచ్చు
– మజుందార్ & మదన్ - మానవుని లైంగిక జీవనాన్ని క్రమబద్ధం, నియమితం చేసుకునేందుకు మానవ సమాజం ఏర్పరుచుకున్న ప్రాథమిక సంస్థ వివాహం. అందుకనే గిల్లిన్ & గిల్లిన్ అభిప్రాయం ప్రకారం కుటుంబం, సంతానాన్ని ఏర్పరిచేందుకు సమాజం ఆమోదించిన మార్గం.
- మానవశాస్త్రవేత్త ఎడ్మండ్ లీచ్ వివాహానికి విశ్వజనీయంగా గుర్తించిన నిర్వచనం సాధ్యంకాదని, వివాహానికి కింది లక్షణాలుంటాయని తెలిపాడు.
1. చట్టబద్ధమైన తల్లిని, తండ్రిని పిల్లలకు ఇస్తుంది
2. దంపతుల మధ్య లైంగిక హక్కులను కల్పిస్తుంది
3. దంపతుల మధ్య శ్రమవిభజనను కల్పిస్తుంది
4. ఆస్తులపై ఉమ్మడి బాధ్యతలు, హక్కులను కల్పిస్తుంది
5. పిల్లల సంరక్షణ, పిల్లల కోసం నిధిని ఏర్పాటు చేయడం అనే విధిని ఏర్పాటు చేస్తుంది
6. సామాజిక బంధుత్వాలను విస్తరిస్తుంది
వివాహం ఆవిర్భవించడానికి ప్రధానంగా 3 అంశాలు దోహదపడతాయి-
1. స్త్రీ, పురుషులు శ్రమ ఫలితాలను పంచుకోవల్సి రావడం
2. సంతానం దీర్ఘకాలంపాటు తల్లిదండ్రులపై ఆధారపడవలసి ఉండటం
3. సమాజంలో లైంగిక పోటీని క్రమబద్ధీకరించుకోవల్సి రావడం
- ఫిబ్రవరి 2వ ఆదివారాన్ని అంతర్జాతీయ వివాహ దినోత్సవంగా జరుపుకొంటారు.
- పిల్లలు దీర్ఘకాలంపాటు తల్లిదండ్రులపై ఆధారపడటం, స్త్రీ, పురుషులు తమ శ్రమ ఫలితాలను పంచుకోవలసి రావడంతో మానవ సమాజంలో వివాహం అనే సామాజిక సంస్థ ఏర్పాటుకు దారితీసింది.
- వివాహంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న 3 సూత్రాలను తెలిపాడు ముల్లర్
1. ప్రేమించుకోవడం
2. సంతానం పొందడం
3. ఆర్థిక సంపదలు - మోర్గాన్ ప్రకారం, మానవ సమాజంలో వివాహం స్వైరితం, సామూహిక వివాహం, బహువివాహం అనే దశలను దాటి ఏక వివాహం అనే రూపాన్ని సంతరించుకుంది
వివాహం లక్షణాలు
వివాహం తీరుతెన్నులు, సంప్రదాయాలు వివిధ సమాజాల్లో వివిధ రకాలుగా ఉన్నప్పటికీ వివాహం అనే సామాజిక సంస్థకు విశ్వవ్యాప్తంగా కింది లక్షణాలు ఉంటాయి.
1. వివాహం విశ్వవ్యాప్తమైనది అంటే ప్రతి సమాజంలో వివాహ వ్యవస్థ ఉంటుందని అర్థం
2. స్త్రీ, పురుషుల మధ్య సంబంధం వివాహం అనేది భిన్న లింగాలకు చెందిన స్త్రీ, పురుషుల మధ్య జరగడం సర్వసాధారణం కానీ, ఈ మధ్యకాలంలో సమలింగ వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాహాలను కూడా మనం గమనించవచ్చు వీటిని సమలింగ వివాహాలు అంటారు
3. వివాహ బంధం శాశ్వతమైనది
ప్రస్తుత ఆధునిక యుగంలో చాలావరకు వివాహ బంధాలు శాశ్వతమైనవిగా ఉన్నప్పటికీ వైయక్తికత పెరగడం, పెడధోరణులు పెరగడం, విడాకులు తీసుకోవడానికి అవకాశం రావడం వంటి కారణాల వల్ల వివాహబంధం కొన్ని సందర్భాల్లో శాశ్వతమైనదని చెప్పలేం
4. సామాజిక అంగీకారం ఉంటేనే వివాహం అంటారు
ప్రతి వివాహానికి కుటుంబసభ్యుల జోక్యం, అంతర్వివాహ నియమాలు పాటించడం వంటివి సామాజిక అంగీకారానికి దోహదపడుతున్నాయి. అయినా చట్టబద్ధమైన వివాహ వయస్సు లేనప్పుడు ఆ వివాహం నేరంగా పరిగణించబడుతుంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు కుటుంబం, సమాజం అంగీకారం లేకపోయినా ఆయా చట్టాల ప్రకారం అవి వివాహాలుగానే గుర్తించబడుతున్నాయి.
5. వివాహం పౌర, మతపరమైన సంస్కారాలతో కూడి ఉంటుంది
వివాహ సందర్భంగా ఆయా మతాలను అనుసరించి చేసేవే మతపరమైన సంస్కారాలు
6. పరస్పర హక్కులను, బాధ్యతలను తెలుపుతుంది
వివాహ జీవితంలోకి అడుగిడిన తర్వాత స్త్రీ, పురుషులిద్దరికి పరస్పరం నిర్వహించుకోవలసిన బాధ్యతలు సమాజపరంగా సంప్రదాయంలో భాగంగా తెలిసివస్తాయి. వివాహ చట్టాల ప్రకారం కూడా పరస్పరం నిర్వహించవలసిన బాధ్యతలను మనం గమనించవచ్చు.
7. ప్రతి వివాహం సామాజిక నియమావళిని, చట్టపర నియమావళిని కలిగి ఉంటుంది
భార్య పట్ల భర్తకు, భర్తపట్ల భార్యకు గల బాధ్యతలను, సంతానం పట్ల దంపతులకు గల బాధ్యతలను ఒక కుటుంబంగా సమాజం పట్ల బాధ్యతలను వివాహం తెలియజేస్తుంది. మానవుల లైంగిక, ఆర్థిక, మానసిక అవసరాలను సరైన పద్ధతిలో సమకూర్చుకునే విధంగా ఈ బాధ్యతలుంటాయి.
వివాహం ప్రకార్యాలు
(Functions of Marriage)
వివాహం అనే ప్రాథమిక సామాజిక సంస్థ మానవుల జైవిక, ఆర్థిక, సామాజిక, మతపరమైన ఉద్యోగ పరమైన, వాత్సల్యపరమైన అవసరాలను ఒక క్రమపద్ధతిలో తీర్చుకునేందుకు ఏర్పడినటువంటిది. అందుకోసం వివాహం కింది ప్రకార్యాలను నిర్వర్తిస్తుంది
1. మానవుల లైంగిక జీవనాన్ని క్రమబద్ధం, నియంత్రణ చేస్తుంది
2. కుటుంబం ఏర్పాటుకు దారితీస్తుంది
3. కుటుంబ సభ్యులమధ్య ఆర్థికపరమైన సహకారం, శ్రమవిభజనకు తోడ్పడుతుంది
4. వివాహం ఉద్వేగపరమైన, మానసికపరమైన, శారీరకపరమైన, సామాజిక పరమైన అవసరాలను తీర్చే కేంద్రంగా ఉంటుంది
5. వివాహ సంబంధాలు క్రమబద్ధీకరించడం వల్ల సామాజిక దృఢత్వం ఏర్పడుతుంది
6. వివాహం ద్వారా ప్రాథమిక అవసరాలైన పోషణ, లైంగిక అవసరాలు, ఆహారం, నివాసం, అనురాగం, ఆప్యాయత వంటివి లభిస్తాయి.
7. ‘కూన్స్’ ప్రకారం మనిషి జీవితాన్ని రెండు ప్రధాన దశలుగా విభజించవచ్చు
ఎ. వివాహానికి ముందు జీవితం
బి. వివాహం తర్వాత జీవితం
8. వివాహం సామాజిక వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది
వివాహం లక్ష్యాలు
l బౌమన్ ప్రకారం వివాహం ప్రాథమిక లక్ష్యాలు
1. లైంగిక అవసరాలను సంతృప్తిపరుచుకోవడం
2. పిల్లలను, సహచరత్వాన్ని సంపాదించుకోవడం
3. రక్షణ, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం
4. సామాజిక బాధ్యతలు నెరవేర్చుకోవడం
‘పోపిన్’ తెలిపిన వివాహంలో 5 మూలకాలు
1. లైంగిక సమానత్వం
2. శ్రమ విభజన
3. కుటుంబం, సంతానాన్ని కలిగి ఉండాలనే కోరిక
4. సామాజిక, ఉద్వేగపర, మానసిక
అంశాలతో ముడిపడి ఉండటం
5. ఆర్థికపరమైన రక్షణలు
‘మజుందార్’ తెలిపిన వివాహ లక్ష్యాలు
1. లైంగిక తృప్తి
2. సంతానం సంరక్షణ
3. సంస్కృతి ప్రసరణం
4. ఆర్థిక అవసరాలు
5. వారసత్వ కొనసాగింపులు
వివాహ పరిణామం
వివాహ వ్యవస్థ వివిధ దశలను దాటి ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని మోర్గాన్ అనే పరిణామవాది తెలిపారు. వీరి ప్రకారం వివాహ పరిణామం కింది విధంగా జరిగింది.
మొదటి దశ->స్వైరితం-> ఈ దశలో సామాజిక నిబంధనలు లేవు, విశృంఖల లైంగిక సంబంధాలుండేవి. ఫలితంగా కుటుంబ వ్యవస్థగాని, బంధుత్వ వ్యవస్థగాని లేదు.
రెండవ దశ-> సామూహిక వివాహాలు-> ఈ దశలో లైంగిక సంబంధాలు కొద్దివరకు సరిదిద్దబడినవి. వివాహాలు వ్యక్తుల మధ్య కాకుండా సమూహాల మధ్య జరిగేవి అనగా ఉమ్మడి భర్తలు, ఉమ్మడి భార్యలు, ఉమ్మడి సంతానం అనే వ్యవస్థ గోచరించింది
మూడవ దశ-> బహువివాహం-> ఒకటి కంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములను కలిగి ఉండే వివాహం
ప్రస్తుత దశ-ఏకవివాహం-> ఒకే ఒక జీవిత భాగస్వామిని కలిగి ఉండే వివాహ పద్ధతి
వివాహ రూపాలు
వివాహం అనేది ప్రతి సమాజంలో ఉన్నప్పటికీ ఆయా సమాజాల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను బట్టి వివాహ రూపాలు, నియమాలు, వివాహ వయస్సు వంటి అంశాల్లో వైవిధ్యం కనిపిస్తుంది
ప్రపంచవ్యాప్తంగా వివాహాలు కింది మూడు రూపాల్లో ఉంటాయని ‘మలినోవ్స్కి’ తొలిసారిగా తెలిపాడు.
1. ఏక వివాహం
ఎ. ఏకకాల ఏక వివాహం
బి. జీవితకాల ఏక వివాహం
2. బహు వివాహం
ఎ. బహు భార్యత్వం
1) భగిణీ బహుభార్యత్వం
2) అఢగిణీ బహుభార్యత్వం
బి. బహుభర్తృత్వ వివాహం
1) సోదర బహుభర్తృత్వం
2) అసోదర బహుభర్తృత్వం
సి. బృంద వివాహం
వివాహాలు ప్రధానంగా –
1. ఏక వివాహం (మోనో గమి)
2. బహు వివాహం (పాలిగమి) గా చెప్పవచ్చు
1. ఏక వివాహం (మొనోగమి)-
ఒకే జీవిత భాగస్వామి కలిగి ఉండే వివాహాలనే ‘ఏక వివాహాలు’ అంటారు. ఇవి ప్రధానంగా రెండు రూపాల్లో ఉంటాయి.
1) ఏకకాల ఏక వివాహం – ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత గాని లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత వివాహం చేసుకుంటే దాన్ని ఏకకాల ఏక వివాహం అంటారు.
ఏక వివాహాన్నే దంపతి వివాహమని అంటారు
‘వెస్టర్మార్క్’ ప్రకారం, ఏక వివాహం అన్ని వివాహాలకంటే పురాతనమైనది
2) జీవితకాలం ఏక వివాహం- ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత గాని లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత కూడా వివాహం చేసుకోనైట్లెతే దాన్ని జీవితకాల ఏక వివాహం అంటారు.
ఏక వివాహం వల్ల ఉపయోగాలు
1. స్త్రీకి పురుషుడితో సమాన హోదా లభిస్తుంది
2. విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందింది
3. సంతానం మూర్తిమత్వం సరైన దిశలో అభివృద్ధి చెందుతుంది
4. కుటుంబం సుస్థిరంగా ఉంటుంది
5. జనాభావృద్ధి సరైన దిశలో కొనసాగుతుంది
6. సమాజంలో అందరికీ వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది
– నిర్వాణ పబ్లిషింగ్ హౌజ్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు