కరెంట్ అఫైర్స్
తెలంగాణ
మూడో ఉత్తమ రాష్ట్రం
దేశంలో మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సెప్టెంబర్ 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ర్టాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, విభాగాలకు 2018-19కు సంబంధించి ఈ అవార్డులు అందజేశారు. దీనిలో ఉత్తరాఖండ్ ప్రథమ, మహారాష్ట్ర ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా ఉత్తమ పర్యాటక మిత్ర రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంపికయ్యింది. అలాగే ఉత్తమ పర్యాటక మిత్ర గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు, ఉత్తమ వైద్య పర్యాటక వసతుల కేంద్రంగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్కుఅవార్డు లభించాయి.
మిషన్ భగీరథకు పురస్కారం
రాష్ట్రప్రభుత్వం ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న ‘మిషన్ భగీరథ’ పథకానికి కేంద్ర ప్రభుత్వ జల్‌జీవన్ మిషన్ పురస్కారం లభించింది. అక్టోబర్ 2న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఈ పథకం అమలుపై కేంద్రం ఇటీవల అధ్యయనం చేసింది. 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరించింది. ఈ పథకం ద్వారా రోజూ ఇంటింటికి నాణ్యమైన తాగునీరు అందుతున్నట్లు గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది.
స్వచ్ఛ పురస్కారాలు
తెలంగాణలోని 16 మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్-22 (జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) అవార్డులు లభించాయి. దీంతో అత్యధిక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చిన రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. అక్టోబర్ 1న ఢిల్లీలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ అవార్డులను అందజేశారు.
- బెస్ట్ సస్టెయినబుల్ సిటీ విభాగంలో.. సిరిసిల్ల, ఆదిబట్ల, భూత్పూర్
- ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో.. చండూర్, తురయాంజాల్, కొంపల్లి, కోరుట్ల
- ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ సిటీ విభాగంలో.. చిట్యాల
- క్లీనెస్ట్ సిటీ విభాగంలో.. గజ్వేల్, ఘట్కేసర్, కొత్తపల్లి, బడంగ్‌పేట
బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విభాగంలో.. నేరేడుచర్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్, వేములవాడ, హుస్నాబాద్ మున్సిపాలిటీలకు అవార్డులు లభించాయి.
జాతీయం
ఈగల్ ఐ
యాంటీ డ్రోన్ వెహికిల్‌ను సమకూర్చుకుని దేశంలోనే తొలిసారిగా ఈ సదుపాయాన్ని పొందినవారుగా కేరళ పోలీసులు రికార్డు సృష్టించారని అధికారులు సెప్టెంబర్ 25న ప్రకటించారు. ‘ఈగల్ ఐ’గా వ్యవహరిస్తున్న ఈ వెహికిల్‌ను కేరళ పోలీసు శాఖకు చెందిన డ్రోన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ రూ.80 లక్షలతో అభివృద్ధి చేసింది. అనుమతి లేకుండా ఎగిరే, దాడికి పాల్పడే డ్రోన్లను ఈగల్ ఐ సహాయంతో కూల్చివేస్తారు. దీనిలోని యాంటీ డ్రోన్ వ్యవస్థ 5 కి.మీ. పరిధిలో అనుమతుల్లేకుండా వినియోగించే డ్రోన్లను గుర్తించి, వాటిని కూల్చివేస్తుంది. దీన్ని విమానాశ్రయాలు, ప్రముఖులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.
సుప్రీంకోర్టు లైవ్
దేశ చరిత్రలో తొలిసారిగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను యూట్యూబ్ ద్వారా సెప్టెంబర్ 27న ప్రత్యక్ష ప్రసారం చేశారు. కోర్టు నంబర్-1లో సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈడబ్ల్యూఎస్ కోటాపై, జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ధర్మాసనం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, జాతీయ రాజధాని ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం అందించే సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న శాసన-కార్యనిర్వాహక అధికారాల గురించి విచారణ నిర్వహించింది. ఈ ప్రసారాన్ని దాదాపు 7.74 లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతమున్న మూడు రాజ్యాంగ ధర్మాసనాలకు తోడు జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలో నాలుగో రాజ్యాంగ ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ఏర్పాటు చేశారు.
క్షిపణి ప్రయోగం
సెప్టెంబర్ 27న చేపట్టిన వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్) క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గాలిలో తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. వీటిని డీఆర్డీవోకు చెందిన హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ), ఇతర డీఆర్డీవో ల్యాబ్‌లు కలిసి రూపొందించాయి.
వరల్డ్ హార్ట్ డే
వరల్డ్ హార్ట్ డే (ప్రపంచ హృదయ దినోత్సవం)ను సెప్టెంబర్ 29న నిర్వహించారు. హృదయ సంబంధ సమస్యలు, అనారోగ్యాల గురించి అవగాహన కల్పించడానికి ఈ డేని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (డబ్ల్యూహెచ్ఎఫ్) సహకారంతో ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్’.
అంతర్జాతీయం
డార్ట్ ప్రయోగం
భూమికి సుదూరంగా ఉన్న ఓ గ్రహశకలాన్ని ఉపగ్రహంతో ఢీకొట్టించే లక్ష్యంతో అమెరికా నాసా చేపట్టిన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్టీ-డార్ట్) ప్రయోగం విజయవంతమైంది. సెప్టెంబర్ 27 తెల్లవారుజామున భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డిమార్ఫస్ అనే చిన్న గ్రహశకలాన్ని నిర్దేశించుకొని గంటకు 22,530 కి.మీ. వేగంతో ఢీకొట్టింది. దీంతో భూమిని ఢీకొట్టే ఆస్కారమున్న గ్రహశకలాలను దారి మళ్లించి మానవాళికి ముప్పును తప్పించవచ్చు. డిమార్ఫస్ను 2003 నవంబర్ 20న భూమికి దగ్గరగా నాసా గుర్తించింది.
వరల్డ్ టూరిజం డే
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న నిర్వహించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1979లో యూఎన్‌డబ్ల్యూటీఓ పిలుపునిచ్చింది. 1980లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. యూఎన్‌డబ్ల్యూటీఓ చట్టాలు ఆమోదం పొందినందుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక దేశం ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని యూఎన్‌డబ్ల్యూటీఓ 1997లో నిర్ణయించింది. ఈ ఏడాది దీనిని ఇండోనేషియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఏడాది దీని థీమ్ ‘రీథింకింగ్ టూరిజమ్’. 2019లో భారత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అప్పటి థీమ్ ‘టూరిజం అండ్ జాబ్స్: ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్’.
ఏడీబీ సాయం
ఆసియా-పసిఫిక్ ఆహార భద్రత కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 14 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 27న ఏడీబీ 55వ వార్షిక సమావేశం నిర్వహించారు. ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు ఆహార వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఏడీబీని 1966, డిసెంబర్ 19న స్థాపించారు. దీని అధ్యక్షుడు మసత్సుగు అసకవా.
ఇన్ఫర్మేషన్ యాక్సెస్ డే
ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ (ఐడీయూఏఐ-సమాచార సార్వత్రిక ప్రాప్యత అంతర్జాతీయ దినోత్సవం)ను సెప్టెంబర్ 28న నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో 2015, నవంబర్ 17న ప్రకటించింది. ఈ దినోత్సవ లక్ష్యం సమాచారాన్ని వెతకడానికి, స్వీకరించడానికి, పంపిణీ చేయడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుంది. ఈ ఏడాది దీని థీమ్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ-గవర్నెన్స్ అండ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్’.
రేబిస్ దినోత్సవం
రేబిస్‌పై పోరాటాన్ని ప్రోత్సహించడానికి, దాని నివారణపై అవగాహన పెంచడానికి సెప్టెంబర్ 28న వరల్డ్ రేబిస్ డేని నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్ (జీఏఆర్‌సీ)కు ఆలోచన వచ్చింది. దీంతో రేబీస్ నివారణ వ్యాక్సిన్‌ను కనిపెట్టిన లూయీస్ పాశ్చర్ మరణించిన రోజు సందర్భంగా దీన్ని పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 2007 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘వన్ హెల్త్, జీరో డెత్స్’.
క్రీడలు
అర్జున్
జులియస్ బేర్ జనరేషన్ కప్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి రన్నరప్‌గా నిలిచాడు. సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) గెలిచాడు.
ఎలీడ్ కిప్‌చోగె
కెన్యా అథ్లెట్ ఎలీడ్ కిప్‌చోగె మారథాన్‌లో మరోసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సెప్టెంబర్ 25న బెర్లిన్‌లో నిర్వహించిన 42.195 కి.మీ. మారథాన్‌ను 2 గంటల ఒక నిమిషం 9 సెకన్లలో పూర్తిచేసి ఈ ఘనత సాధించాడు. 2018 బెర్లిన్ మారథాన్‌లో 2 గంటల ఒక నిమిషం 39 సెకన్లలో తాను సాధించిన రికార్డును తానే అధిగమించాడు.
శుభి, చార్వీ
జార్జియాలోని బాతూమిలో నిర్వహించిన ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్ సెప్టెంబర్ 27న ముగిసింది. ఈ టోర్నీలో అండర్-12 బాలికల విభాగంలో శుభి గుప్తా (ఘజియాబాద్), అండర్-8 బాలికల విభాగంలో చార్వీ (బెంగళూరు) స్వర్ణ పతకాలు సాధించారు. అండర్-8 ఓపెన్ విభాగంలో సఫిన్ సఫరుల్లాఖాన్ (కేరళ) కాంస్య పతకం సాధించాడు.
వార్తల్లో వ్యక్తులు
జార్జియా మెలోని
ఇటలీ నూతన ప్రధానిగా బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన జార్జియా మెలోని సెప్టెంబర్ 26న ఎన్నికయ్యారు. ఇటలీ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా నేత ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్నికల్లో ఈమె నేతృత్వంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లు సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడే పూర్తి అతివాద ప్రభుత్వం కూడా ఇదే.
రాజేశ్‌కుమార్
కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పనిచేసే ఇండియన్ సైబర్‌క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సీఈవోగా రాజేశ్‌కుమార్ సెప్టెంబర్ 27న నియమితులయ్యారు. ఈయన 2002 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి.
అనిల్ చౌహాన్
దేశంలో రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను నియమించినట్లు రక్షణ శాఖ సెప్టెంబర్ 28న ప్రకటించింది. ఈయన లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యాక జనరల్‌గా పదోన్నతిపై తిరిగి విధుల్లో చేరనున్న తొలి సైనికాధికారి. జనరల్ బిపిన్ రావత్ మరణించిన నేపథ్యంలో 9 నెలలకు పైగా సీడీఎస్ పదవి ఖాళీగా ఉంది. అనిల్ చౌహాన్ 1961లో జన్మించారు.
వెంకటరమణి
భారత అటార్నీ జనరల్ (ఏఐజీ)గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్ అఫైర్స్ విభాగం సెప్టెంబర్ 28న ప్రకటించింది. ఈ పదవిలో ఆయన మూడేండ్లు ఉంటారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30న ముగిసింది.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?