దేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం?
1. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 77వ సమావేశానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? (సి)
ఎ) అబ్దుల్లా షాహిద్
బి) ఆంటోనియో గుటెరస్
సి) సబ కొరోసీ
డి) రబాబ్ ఫాతిమా
వివరణ: ఐక్యరాజ్య సమితి 77వ సర్వ ప్రతినిధి సభ ఇటీవల ప్రారంభం అయింది. భారత్ తరఫున ఈ సమావేశాలకు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. దీనికి హంగేరి దేశానికి చెందిన సబ కొరోసీ నేతృత్వం వహిస్తున్నారు. సమావేశాలు సంస్థ ప్రధాన కార్యాలయం అయిన న్యూయార్క్‌లో నిర్వహిస్తున్నారు. 76వ సమావేశాలకు అబ్దుల్లా షాహిద్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మాల్దీవుల దేశ విదేశాంగ శాఖ మంత్రి. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగీస్‌కు చెందిన ఆంటోనియో గుటెరస్ ఉన్నారు. అలాగే అండర్ సెక్రటరీ జనరల్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన రబాబ్ ఫాతిమా కొనసాగుతున్నారు.
2. అంతర్జాతీయ సౌర కూటమి, ఐసీఏవోలు ఇటీవల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇది దేనికి సంబంధించింది? (బి)
ఎ) ప్రపంచ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో పౌర ప్రాజెక్ట్‌ల ఏర్పాటు
బి) కర్బన ఉద్గారాల తగ్గింపు
సి) సౌర శక్తితో నడిచే విమానాలపై తయారీ
డి) ఏదీకాదు
వివరణ: విమానయాన రంగంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో), అంతర్జాతీయ సౌర కూటములు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఐసీఏవో 42వ సమావేశం సెప్టెంబర్ 27న జరిగింది. ఈ సంస్థ ప్రధాన కేంద్రం కెనడాలోని మాంట్రియల్లో ఉంది. సమావేశంలో భాగంగా రెండు సంస్థలు అవగాహనకు వచ్చాయి. అంతర్జాతీయ సౌర కూటమిని ఇంగ్లిష్‌లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) అంటారు. భారత్‌లోని హర్యానాలో ఉన్న గురుగ్రామ్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం రెండు సంస్థలకు సంబంధించిన ప్రధాన కేంద్రాలు మన దేశంలో ఉన్నాయి. అందులో ఒకటి ఐఎస్ఏ కాగా మరొకటి కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్రాన్స్ సహాయంతో ఐఎస్ఏను ఏర్పాటు చేశారు.
3. ఖలిస్థాన్ అనే అంశంపై ఇటీవల ఏ దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు? (బి)
ఎ) యూకే బి) కెనడా
సి) యూఎస్ఏ డి) ఫ్రాన్స్
వివరణ: ఖలిస్థాన్ ఏర్పాటుకు సంబంధించి కెనడాలో ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దీని పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య సంబంధాలపై ఇది ప్రభావం చూపవచ్చు. ఖలిస్థాన్ అంటే పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడం. సిక్కు సామాజిక వర్గం ఈ డిమాండ్‌ను లేవనెత్తింది. 2021లో ఈ తరహా రెఫరెండం యూకేలో నిర్వహించారు. తాజాగా కెనడాలో కూడా ఈ ప్రక్రియ చేపట్టారు. గతంలో పెద్ద ఎత్తున ఈ డిమాండ్ ఉంది. అకాళీదళ్ అనే రాజకీయ పార్టీ ఈ డిమాండ్‌ను లేవనెత్తింది. అలాగే తర్వాతి కాలంలో బింద్రావాలే నేతృత్వంలో ఇది 1980 దశకం వరకు కొనసాగింది.
4. గిరిజన సామాజిక వర్గంపై ఎన్సైక్లోపీడియా విడుదల చేసిన రాష్ట్రం? (డి)
ఎ) జార్ఖండ్ బి) మధ్యప్రదేశ్
సి) ఛత్తీస్‌గఢ్ డి) ఒడిశా
వివరణ: గిరిజన సామాజిక వర్గాలపై దేశంలో తొలిసారిగా ఎన్సైక్లోపీడియాను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో 22.85% గిరిజన జనాభా ఉంది. 62 గిరిజన సమూహాలు ఒడిశాలో ఉన్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని సంతాలి అనే తెగకు చెందినవారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్సైక్లోపీడియాను సెప్టెంబర్ 26న విడుదల చేశారు. ఇందులో అయిదు వాల్యూమ్స్ ఉంటాయి. గిరిజనులపై 418 పరిశోధన ఆర్టికల్స్ ఉన్నాయి. 3800 పేజీలు ఇందులో ఉన్నాయి. వందల సంవత్సరాల గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొనేందుకు వీలుంది.
5. ఇటీవల జల్దూత్ యాప్‌ను విడుదల చేశారు. ఇది దేనికి సంబంధించింది? (ఎ)
ఎ) భూగర్భ జలస్థాయిని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది
బి) నీటి సరఫరాకు సంబంధించింది
సి) వివిధ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత
డి) ఇళ్లలో నీటి నాణ్యతను పరిశీలించే యాప్
వివరణ: జల్దూత్ యాప్‌ను గ్రామీణ మంత్రిత్వ శాఖ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. భూగర్భ జలాల స్థాయిని తెలుసుకొనేందుకు ఉద్దేశించింది ఈ యాప్. ఎంపిక చేసిన గ్రామాల్లో, కొన్ని బావుల్లో ఉన్న నీటి స్థాయిని నమోదు చేస్తారు. గ్రామ్ రోజ్‌గార్ సహాయక్‌లు ఇందుకు సాయం చేస్తారు. రుతుపవన కాలం ప్రారంభం కాకముందు ఒకసారి, ప్రారంభమైన తర్వాత మరోసారి దీనిని పరిశీలిస్తారు. భూగర్భ జల స్థాయి నిర్వహణకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
6. ఏజీఎస్ సంస్థ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? (సి)
ఎ) బ్యాంకింగ్ రంగం
బి) వృద్ధులకు సంబంధించిన వస్తు పరిశోధన
సి) బీమా
డి) షేర్ మార్కెట్
వివరణ: ఏజీఎస్ అనేది బీమా సంస్థ. బెల్జియం దేశానికి సంబంధించింది. భారత్‌లోని ఐడీబీఐకు చెందిన బీమా సంస్థలో భాగస్వామ్యాన్ని పొందింది. 74% వాటాను చేజిక్కించుకుంది. భారత దేశంలో బీమా రంగంలో 74% పెట్టుబడి పెట్టిన తొలి విదేశీ సంస్థ ఇదే. గతంలో ఇదే సంస్థలో ఏజీఎస్కు 49 శాతా వాటా ఉంది. రూ.580 కోట్లను వ్యయం చేసి అదనంగా మరో 25% వాటాను సొంతం చేసుకుంది. అంటే మొత్తం ఏజీఎస్ 74% ఇందులో పెట్టుబడిగా పెట్టిందని చెప్పొచ్చు.
7. ఏ సంస్థకు సంబంధించి ‘వన్ వీక్ వన్ ల్యాబ్’ అనే కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు? (ఎ)
ఎ) సీఎస్ఐఆర్ బి) ఇస్రో
సి) ఐసీఎంఆర్ డి) ఐసీఏఆర్
వివరణ: సీఎస్ఐఆర్ను 1942లో ఏర్పాటు చేశారు. దీని పూర్తి రూపం- కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్. ఈ సంస్థకు అనుబంధంగా దేశ వ్యాప్తంగా 37 ప్రయోగశాలలు ఉన్నాయి. భారత దేశంలో అతిపెద్ద ప్రయోగశాలల నెట్వర్క్ ఇదే. ఇటీవల ఈ సంస్థకు సంబంధించి వన్ వీక్ వన్ ల్యాబ్‌ను కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించారు. సంస్థ సాధించిన విజయాలు, చేసిన పరిశోధనలను తెలియచేసేందుకు ఉద్దేశించింది ఇది. ఈ సంస్థ ఏర్పాటులో శాంతి స్వరూప్ భట్నాగర్, అలాగే అర్కాట్ రామస్వామి మొదలియార్ కీలక పాత్ర పోషించారు.
8. భారత దేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం? (డి)
ఎ) రాజస్థాన్ బి) హర్యానా
సి) జార్ఖండ్ డి) ఉత్తరాఖండ్
వివరణ: భారత దేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఆ రాష్ట్రంలో ఇది కేవలం 844గా నమోదైంది. లింగ నిష్పత్తి అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారన్న గణాంకం. దేశంలో అత్యుత్తమ నిష్పత్తి కేరళలో నమోదైంది. ఆ రాష్ట్రంలో లింగ నిష్పత్తి 974గా ఉంది అని ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకం తెలుపుతుంది.
9. సీఏఆర్ఐసీవోఎం (క్యారికామ్) ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏంటి? (సి)
ఎ) క్యారీయింగ్ కంపెనీస్
బి) కరేబియన్ కంపెనీస్
సి) కరేబియన్ కమ్యూనిటీ
డి) ఏదీకాదు
వివరణ: సీఐఆర్ఐసీవోఎం అనే దానికి పూర్తి రూపం- కరేబియన్ కమ్యూనిటీ. దీనిని 1973లో ఏర్పాటు చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల ఈ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఆహార, ఇంధన భద్రత, పర్యావరణ మార్పు తదితర అంశాలపై కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇందులో కరేబియన్ ప్రాంతానికి చెందిన 20 దేశాలు ఉంటాయి. 1973లో కుదిరిన చగురమస్ ఒప్పందం ఆధారంగా ఇవి ఏర్పాటయ్యాయి. 2002లో ఈ సంస్థలో మార్పులు వచ్చాయి. ఏకీకృత మార్కెట్, ఏకీకృత ఆర్థిక వ్యవస్థగా ఇది అవతరించింది.
10. సింఫోన్ (ఎస్ఐఎంపీహెచ్వోఎన్ఈ) ఇటీవల వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది? (ఎ)
ఎ) ఈశాన్య రాష్ర్టాల్లో పర్యాటక రంగ అభివృద్ధి
బి) ఈశాన్య సంస్కృతి సంప్రదాయాల ఉత్సవాలు
సి) ఈశాన్య రాష్ర్టాల్లో మౌలిక సదుపాయాలు
డి) ఏదీకాదు
వివరణ: ఈశాన్య రాష్ర్టాల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం నిర్వహించిన సదస్సే సింఫోన్. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దీనిని వర్చువల్‌గా ప్రారంభించారు. విధాన నిర్ణేతలు, ఈశాన్య రాష్ర్టాలకు చెందిన వాళ్లందరూ సదస్సులో పాల్గొన్నారు. దీనిని సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు నిర్వహించారు. ఈశాన్య రాష్ర్టాలకు పర్యాటకానికి వచ్చే వారి అన్ని సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా సింఫోన్ను మలచనున్నారు.
11. ఇటీవల ఏపీవోఏ అనే ఒక కూటమి ఏర్పడింది. ఇది దేనికి సంబంధించింది? (బి)
ఎ) సైనిక సహాయం బి) పామాయిల్
సి) విపత్తు సహాయం డి) బ్యాంకింగ్ వ్యవస్థలో సాయం
వివరణ: దక్షిణాసియాలోని ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన వంటనూనెల సంఘాలతో ఏషియన్ పామాయిల్ అలయన్స్ (ఏపీవోఏ) ఏర్పాటయ్యింది. ఈ అయిదు దేశాలు ప్రపంచంలో అతి ఎక్కువగా పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటాయి. మొత్తం దిగుమతుల్లో వీటి వాటా 40% ఉంది. పామాయిల్ ధరను స్థిరీకరించడంలో ఒకటి కావాలని నిర్ణయించి ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దేశాల పరంగా చూస్తే ఎక్కువగా దిగుమతి చేసుకొనేది భారత్. అలాగే ఈ కూటమికి భారత్‌కు చెందిన అతుల్ చతుర్వేది నేతృత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ కూటమి ఇండోనేషియాలో సమావేశం కావాలని నిర్ణయించింది.
12. హిమపాత పర్యవేక్షణ రాడార్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? (సి)
ఎ) ఉత్తరాఖండ్
బి) హిమాచల్ ప్రదేశ్
సి) సిక్కిం
డి) అస్సాం
వివరణ: భారత దేశంలో తొలిసారిగా హిమపాత పర్యవేక్షణ రాడార్ (అవలాంచి మానిటరింగ్ రాడార్)ను సిక్కిం రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భారత సైన్యం, డిఫెన్స్ జియోఇన్ఫర్మాటిక్స్ అండ్ రిసెర్చ్ ల్యాబొరేటరీలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. హిమపాతంతో పాటు కొండచరియలు విరిగిపడటాన్ని కూడా దీని ద్వారా గుర్తించేందుకు వీలుంటుంది. హిమపాతం పెరిగినప్పుడు సమాచారం ఇచ్చేందుకు అలారం వ్యవస్థ కూడా ఇందులో భాగంగా ఉంది. అధికంగా హిమపాతం వచ్చే ప్రమాదం ఉన్న ప్రదేశాల్లో రక్షణకు ఇది ఉపయోగపడుతుంది.
13. ఎన్సీసీ, యూఎన్ఈపీ ఏ అంశానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? (ఎ)
ఎ) ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం
బి) సరిహద్దు రక్షణ
సి) ట్రాఫిక్ కూడళ్లలో సేవలు
డి) ఏదీకాదు
వివరణ: ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు పరిశుభ్ర నీటి వ్యవస్థల దిశగా సాధనకుగాను ఎన్సీసీ, యూఎన్ఈపీలు అవగాహన కుదుర్చుకున్నాయి. యూఎన్ఈపీ అంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. కెన్యాలోని నైరోబి కేంద్రంగా ఇది పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్ 1న ఎన్సీసీ పునిత్ సాగర్ అభియాన్‌ను ప్రారంభించింది. సముద్ర తీరాలను పరిశుభ్రం చేసేందుకు ఉద్దేశించింది ఇది. ఇందుకు తాజాగా యూఎన్ఈపీ సహకరించనుంది.
14. భారత దేశంలో తొలి సముద్రపు ఆవు(డుగోంగ్) పరిరక్షణ రిజర్వ్ ఏ రాష్ట్రంలో రానుంది? (డి)
ఎ) మహారాష్ట్ర బి) పశ్చిమబెంగాల్
సి) ఒడిశా డి) తమిళనాడు
వివరణ: భారత దేశంలో సముద్రపు ఆవు సంరక్షణ రిజర్వ్‌ను తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారు. తంజావుర్, పుదుకొట్టాయ్ జిల్లాలో 448 చదరపు కిలోమీటర్లకు ఇది విస్తరించనుంది. దేశంలో సముద్రపు ఆవుల జనాభా 240 ఉంది. అయితే వాటి సహజ ఆవాసాల నష్టంతో సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది. వీటిని పరిరక్షించాలన్న ధ్యేయంతో తమిళనాడులో రిజర్వ్ ప్రారంభించనున్నారు.
15. డీఏఆర్టీ వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? (సి)
ఎ) కాలుష్యానికి సంబంధించింది
బి) సముద్రపు నౌక
సి) స్పేస్‌క్రాఫ్ట్
డి) ఏదీకాదు
వివరణ: డీఏఆర్టీ అనేది ఒక స్పేస్‌క్రాఫ్ట్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనిని ప్రయోగించింది. భూమి వైపునకు వచ్చే ఆస్టరాయిడ్లను దారి మల్లించేందుకు గత ఏడాది చేపట్టిన స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఇటీవలే చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం అయింది.
వి. రాజేంద్ర శర్మ: ఫ్యాకల్టీ ఎడ్యు రిపబ్లిక్9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు