UPSC Special | ఉన్నత లక్ష్యం.. ఉత్తమ మార్గం!
సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్
దేశంలో ఉన్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్తో కలిపి 21 సర్వీసులకు సంబంధించిన 1105 పోస్టులకు ‘సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్’ను యూపీఎస్సీ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష మే 28న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ ప్లాన్ నిపుణ పాఠకుల కోసం..
అర్హతలు
- నిర్ణీత వయోపరిమితి కలిగి డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. జనరల్ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి వయో
పరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం - 3 అంచెల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల ద్వారా నిర్వహణ ప్రక్రియ ఉంటుంది.
ప్రిలిమినరీ - ప్రిలిమినరీ (ప్రాథమిక)ని అర్హత పరీక్షగానే పరిగణించాలి. ఈ మార్కులను మెయిన్స్‌కు చేరడానికి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ప్రిలిమినరీలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్‌కు సంబంధించింది. దీనిలో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష మార్కుల ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
సబ్జెక్టులు – ప్రిపరేషన్
జనరల్ స్టడీస్
- దీనిలో ప్రధానంగా భారతదేశ చరిత్ర- స్వాతంత్య్రోద్యమ చరిత్ర, భారతదేశ- ప్రపంచ భౌగోళిక శాస్ర్తాలకు సంబంధించిన అంశాలు, పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగం, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ వంటి అంశాలు, ఎకానమీకి సంబంధించి సుస్థిరాభివృద్ధి, పేదరికం, బడ్జెట్, ద్రవ్య విధానం – కోశ విధానం వంటి అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్ టెక్నాలజీ, ఐటీ, రోబోటిక్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్ తదితర అంశాల్లో వర్తమానంలో వస్తున్న డెవలప్మెంట్స్, పర్యావరణానికి సంబంధించిన అంశాలు, జనరల్ సైన్స్, వర్తమాన జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
చరిత్ర - గత సంవత్సర (2022) పరీక్ష పేపర్‌ను పరిశీలిస్తే చరిత్రకు సంబంధించి 16, జాగ్రఫీ- 12, పాలిటీ- 13, ఎకానమీ- 17, సైన్స్ అండ్ టెక్నాలజీ- 14, పర్యావరణం- 17 ప్రశ్నలు వచ్చాయి.
- చరిత్రకు సంబంధించి 2012 నుంచి 2022 వరకు ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే అత్యల్పంగా 2017లో 14 ప్రశ్నలు రాగా అత్యధికంగా 2014లో 22 ప్రశ్నలు వచ్చాయి. చరిత్రకు సంబంధించి ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక భారతదేశ చరిత్రతోపాటు కళలు, సంస్కృతి (ఆర్ట్ అండ్ కల్చర్)కి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. చరిత్ర ప్రాథమిక అంశాలు బాగా చదవాలి. 75 వసంతాల భారత్ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’పై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాచీన భారత చరిత్ర విషయానికొస్తే ముఖ్యంగా ఇటీవల సింధూ నాగరికతకు సంబంధించిన కట్టడాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. దీనికి సంబంధించి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత తవ్వకాల్లో బయల్పడిన కట్టడం గురించి లేదా సింధూ నాగరికత పట్టణాలకు సంబంధించి అడగవచ్చు. అందువల్ల ఈ అంశానికి సంబంధించి పూర్తిగా చదివితే సులభంగా సమాధానం గుర్తించవచ్చు. టిప్పు సుల్తాన్‌కు సంబంధించి ఇటీవల వార్తలు వచ్చాయి. టిప్పు సుల్తాన్ గురించి చదవడంతో పాటు అతని సమకాలీన రాజులు, రాజ్యాల గురించి వివరంగా చదవాలి. రామానుజాచార్య విగ్రహావిష్కరణ జరిగింది. ఆయన తత్వంతోపాటు ఇతర తత్వాలు కూడా చదవాలి.
పుస్తకాలు - చరిత్రకు సంబంధించి 6, 7, 8, 12వ తరగతి నూతన ఎన్సీఈఆర్టీ పుస్తకాలతోపాటు ప్రాచీన భారతదేశ చరిత్ర (ఆర్ఎస్ శర్మ), మధ్యయుగ భారతదేశ చరిత్ర (సతీష్ చంద్ర), ఆధునిక భారతదేశ చరిత్ర (బిపిన్ చంద్ర), స్వాతంత్య్రోద్యమ చరిత్ర (బిపిన్ చంద్ర) పుస్తకాలు చదివితే చరిత్రపట్ల సమగ్ర అవగాహన వస్తుంది. ఇవి చదివితే 60%-70% మార్కులు సాధించినట్లే. వీటితోపాటు టాటా మెగ్రాహెల్, స్పెక్ట్రమ్, సివిల్ సర్వీసెస్ క్రానికల్ వంటి సంస్థలకు సంబంధించి ఏదైనా ఒక స్టాండర్డ్ పుస్తకం చదివితే సరిపోతుంది.
జాగ్రఫీ - అత్యల్పంగా 2016లో 7 ప్రశ్నలు రాగా, అత్యధికంగా 2013లో 18 ప్రశ్నలు వచ్చాయి. జాగ్రఫీలో భారతదేశ భౌగోళిక పరిస్థితులేగాక ప్రపంచ భూగోళానికి సంబంధించిన అంశాలను చదవాలి. భౌతిక భౌగోళిక అంశాలపై ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు టోంగా అగ్నిపర్వతం గురించి ఇటీవల వార్తలు వచ్చాయి. టోంగా అగ్నిపర్వతం గురించి చదువుతూ అగ్నిపర్వతం (వోల్కనో) రకాలు, ఏర్పడటానికి కారణాలు, అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి అంశాలు చదవాలి. ఇటీవల బడ్జెట్లో నదుల అనుసంధానం గురించి ప్రస్తావన వచ్చింది. కెన్-బెట్వా అనుసంధానం గురించి చదవాలి. నదుల గురించి, వాటి ఉపనదుల గురించి మ్యాప్ ద్వారా నేర్చుకోవాలి. ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం అడవుల విస్తీర్ణం పెరిగింది. అడవుల రకాలు, విస్తీర్ణం ఏ రాష్ర్టాల్లో ఏ విధంగా ఉంది సమగ్రంగా చదవాలి. మడ అడవుల గురించి చదవాలి. భారత్‌కు సంబంధించి రామ్సర్ సైట్స్ 75కు చేరాయి. చిత్తడినేలలు అంటే ఏమిటి, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఏదైనా ఒక సముద్ర సరిహద్దుల గురించి పరీక్షలో అడుగుతున్నారు. దేశ సరిహద్దులు, సమగ్ర సరిహద్దులు మ్యాప్ పాయింటింగ్ ద్వారా చదవాలి. జాగ్రఫీకి సంబంధించి 6-12 ఎన్సీఈఆర్టీ బుక్స్ బాగా చదివితే సరిపోతుంది. వీటితోపాటు ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చదవాలి.
- పాలిటీ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి అత్యల్పంగా 2016లో 7 ప్రశ్నలు రాగా, అత్యధికంగా 2017లో 22 ప్రశ్నలు వచ్చాయి. పాలిటీకి సంబంధించి రాజ్యాంగంలోని అంశాలకు వర్తమాన అంశాలు జోడించి చదవాలి. ఉదాహరణకు దేశంలో గవర్నర్ వ్యవస్థ వివాదాస్పదం అవుతుంది కాబట్టి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక, కొలీజియం వ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం-కమిషనర్ల నియామకం- సుప్రీంకోర్ట్ తీర్పు, ఎన్నికల సంస్కరణలు, EWS రిజర్వేషన్స్- సుప్రీంకోర్ట్ తీర్పు, భారత రాజ్యాంగం, దానిలోని మౌలికాంశాలు, రాజ్యాంగంలోని అంశాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి అంశాలు చదవాలి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుల గురించి చదవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన వివిధ ముఖ్యమైన తీర్పులు తెలుసుకోవాలి. వివిధ కమిటీల రిపోర్టులు చదవాలి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మహిళా వివాహ వయస్సుకు సంబంధించిన అంశాలతో పాటు వారి హక్కులు వివరంగా తెలుసుకోవాలి. ఓబీసీ జాబితాకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ ఆర్టికల్స్, వారికి సంబంధించిన కమిషన్ల గురించి చదవాలి.
- పాలిటీకి సంబంధించిన ఎన్సీఈఆర్టీకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే 11వ తరగతి పుస్తకం చదవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుస్తకంతో పాటు లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ లాంటి స్టాండర్డ్ బుక్ ఏదైనా ఒకటి చదవాలి. పాలిటీ చదివేటప్పుడు ముఖ్యంగా వర్తమాన అంశాలను కలుపుకొని చదవాలి.
ఎకానమీ - 10, 2013లో 19 ప్రశ్నలు వచ్చాయి. ఎకానమీకి సంబంధించిన మౌలిక అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి. బడ్జెట్, ఎకనామిక్ సర్వే నుంచి కూడా అధికంగా ప్రశ్నలు వస్తాయి. ఇటీవల ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, క్రిప్టోకరెన్సీ, స్టార్టప్- యునికార్న్ స్టార్టప్ వంటి అంశాలు వినిపిస్తున్నాయి. ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) అంటే ఏమిటి? ఎవరు ఇస్తారు? ఏయే పంటలకు ఇస్తారు వంటివి చదవాలి.
- చక్కెరకు సంబంధించి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటీకరణకు సంబంధించి వివరంగా తెలుసుకోవాలి. బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, ఎకనామిక్ సర్వే కచ్చితంగా చదవాలి.
- ఎకానమీకి సంబంధించి ఎన్సీఈఆర్టీ 9-12వ తరగతి పుస్తకాలు చదవడం ద్వారా మౌలిక అంశాలపట్ల అవగాహన ఏర్పడుతుంది. బడ్జెట్ 2023-24, ఎకనామిక్ సర్వే 2022-23 బాగా చదవాలి. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చదవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ - 2019లో 7 (అత్యల్పంగా), 2014లో 16 (అత్యధికంగా) ప్రశ్నలు వచ్చాయి. జనరల్ సైన్స్‌కు సంబంధించి వ్యాధులు, విటమిన్లు, వృక్ష, జంతువులకు సంబంధించి సాధారణ అంశాలతోపాటు కమ్యూనికేషన్స్, స్పేస్, ఐటీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ, డిఫెన్స్ వంటి అంశాల్లో నూతన ఆవిష్కరణలు, సమకాలీన డెవలప్మెంట్స్ పై ప్రశ్నలు అధికంగా వస్తాయి. ఇటీవల దేశంతోపాటు ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగాల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
- అంగారకుడిపై ప్రయోగాలు, క్షిపణులు, ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహ వాహక నౌకలు, ఆ నౌకల ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహాల గురించి చదవాలి. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం, కరోనా గురించి ముఖ్యంగా వైరస్ అంటే ఏమిటి? వైరస్ సంక్రమణ, వైరస్‌కు సంబంధించిన వ్యాధుల గురించి, నివారణ చర్యల గురించి చదవాలి.
- సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి.
- ప్రాథమిక అంశాలు చదివి కరెంట్ అఫైర్స్, వివిధ మంత్రిత్వశాఖల ఇయర్ ఎండ్ రివ్యూతోపాటు అప్డేట్స్ చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రాథమిక అంశాలకు రవి అగ్రహారి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ చదివితే మంచిది.
పర్యావరణం - 2020లో 10, 2014, 2016లో 18 ప్రశ్నలు వచ్చాయి. పర్యావరణానికి సంబంధించి జీవవైవిధ్యం, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ చట్టాలు, పర్యావరణ సంస్థలు, కమిటీలు, సమావేశాల గురించి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు పర్యావరణ కాలుష్యానికి సంబంధించి భూ, జల, గాలి కాలుష్యం, రేడియోధార్మికత కాలుష్యం, కాలుష్య నివారణ చట్టాలు, నివారణ చర్యలు, ఓజోన్ పొర క్షీణత, గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రశ్నలు వస్తాయి. కాప్-27 సదస్సు గురించి చదువుతూ గతంలో జరిగిన సదస్సులు, వాటి తీర్మానాల గురించి చదవాలి.
- ఏ సదస్సు ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నదో గమనించాలి. గత సంవత్సర కాలంలో రెడ్ లిస్టుకి సంబంధించి అంతరించిపోతున్న జీవజాతులు, వృక్షజాతుల గురించి చదవాలి. ఆ జాతులకు సంబంధించిన జంతువు గురించి గాని, వృక్షం గురించి బాగా చదవాలి. దానికి సంబంధించి దేశంలో చట్టానికి అన్వయించుకోవాలి.
- పర్యావరణానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఎన్విరాన్మెంట్తోపాటు శంకర్ అకాడమీ ‘అవర్ ఎన్విరాన్మెంట్’ గాని లేదా రవి అగ్రహారి ఎన్విరాన్మెంట్’ గాని లేదా ‘పీఎంఎఫ్ఎస్ఐఎఎస్ ఎన్విరాన్మెంట్’ బుక్స్ చదవాలి. ఎస్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంతోపాటు బయాలజీ 11లోని 13-16 చాప్టర్స్ (ఎన్విరాన్‌మెట్ బయాలజీ) చదవాలి.
- వర్తమాన అంశాలకు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు చదవాలి. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు విడుదలచేసే నివేదికలు, సూచికలు కచ్చితంగా చదవాలి. ఇటీవల క్రీడల ప్రాధాన్యం పెరిగింది. వీటికి సంబంధించి పీబీఐ వెబ్సైట్, ది హిందూ పేపర్ చదువుతూ ఏదైనా ఒక ప్రముఖ సంస్థకు చెందిన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవాలి.
- వీటితోపాటు ముఖ్యంగా జనరల్ స్టడీస్‌కు సంబంధించిన ప్రాక్టీస్ పేపర్లు రాయాలి. సుమారు 50-60 ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేస్తే నమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి.
- 2021 ప్రిలిమ్స్ పేపర్ కట్ ఆఫ్ మార్కులు పరిశీలిస్తే 200 మార్కులకు జనరల్ అభ్యర్థులు 87.54, ఈడబ్ల్యూఎస్-80.14, ఓబీసీ-84.85, ఎస్సీ- 75.41, ఎస్టీ-70.71, దివ్యాంగుల కేటగిరీ 1- 68.02, కేటగిరీ 2- 67.33, కేటగిరీ 3- 43.09, కేటగిరీ 5- 45.80 వచ్చాయి. ఈ మార్కులకు అటు ఇటుగా 5 మార్కులు అంచనా వేసుకుని ముందస్తు ప్రణాళిక చేసుకుంటే మెయిన్స్‌కు మార్గం సుగమం అవుతుంది.
- ప్రిలిమ్స్‌కు సంబంధించి రెండో పేపర్ సీశాట్ 200 మార్కులకు 80 ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఈ పేపర్లో 33% మార్కులు సాధించాలి.
- ఈ పేపర్లో సాధారణ న్యూమరసీ, అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, గ్రాఫ్స్, టేబుల్స్‌కు సంబంధించి పదో తరగతి పరిజ్ఞానం సరిపోతుంది. ఇంగ్లిష్ ప్యాసేజ్‌లు, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
- రీజనింగ్, అర్థమెటిక్ సంబంధించి చాంద్ బుక్స్ గాని, అరిహంత్ బుక్స్ గాని చదవాలి. ఇంగ్లిష్ ప్యాసేజ్లకు సంబంధించి టాటా మెగ్రాహిల్ లేదా అరిహంత్ గాని, పియర్సన్ బుక్స్ గాని చదవాలి.
- ప్రిలిమినరీ పరీక్షకు చదువుతూ మెయిన్స్‌కు సంబంధించి కూడా చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఎకానమీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీలను అనుసంధానం చేసుకుని చదవాలి. తద్వారా మెయిన్స్‌కు ప్రిలిమ్స్ తర్వాత చదవడం కూడా సులభమవుతుంది.
Previous article
BIOLOGY | భారతదేశంలో విలుప్త వన్యజాతులుగా వేటిని గుర్తించారు?
Next article
UPSC Special | మెయిన్స్ పరీక్ష విధానం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం