అమరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు..
మన కళ్లముందున్న అనేక నూతన ఆవిష్కరణలు, అద్భుతాలు అన్నీ కొంతమంది మహానుభావుల కలల నుంచి ఉద్భవించినవే. ఎవరో ఒకరి ఊహలనుంచి పుట్టినవే. ఒక కల, అలై, ఆలోచనై ఉవ్వెత్తున ఎగసినపుడే అది కార్యరూపం దాలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కన్న కల అలాంటిదే. ఒక రాష్ట్రం తరపున, నాలుగున్నర కోట్ల మంది జనం తరపున ఆయన ఒక కల కన్నారు.
తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో సాధికారతను సాధించగల ధీరులై ముందుకు సాగాలని. తెలంగాణ తల్లి మురిసి పోయేలా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు పురివిప్పిన నెమళ్లయి విహరించాలని. తెలంగాణ ఆట పాట, పాడి పంట, పండుగలు, జాతరలు ఈ గడ్డపై ఘనంగా జరుపుకోవాలని. తెలంగాణ సుఖశాంతులకు శాశ్వత చిరునామా కావాలని…..
బతుకమ్మలో పేర్చిన పూలలా ఈ ఆశలు, ఆశయాలు అన్నీ కలగలసిన ఒక సుందర స్వప్నాన్ని ప్రజలందరి తరపున కేసిఆర్ కన్నారు. తాను కన్న కలలు సాకారం చేసుకునే దిశగా సొంత రాష్ర్టాన్ని సాధించారు. ఒక ఘనమైన పునాదిని వేశారు. ఆ పునాదిపై సుందర నిర్మాణాలు చేయాల్సిన బాధ్యత నేటితరానిది, రానున్న తరాలది. కేసిఆర్ కన్న కలలను పూర్తి స్థాయిలో వాస్తవ రూపంలోకి ఆవిష్కరించాల్సిన బాధ్యతకూడా వారిదే. అందులో, రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం ప్రకటిస్తున్న నోటిఫికేషన్లలో ఉద్యోగాలు సాధించేవారూ ఉన్నారు. నిజానికి నూతన రాష్ట్ర అభివృద్ధికి తొలిబాటలు వేస్తున్న ఈ తరుణంలో బాధ్యతలు చేపడుతున్న తొలి సైన్యం వీరు…. అంటే మీరే..
తెలంగాణపై అవగాహనే మొదటి అడుగు..
మన నేల, మన పంట, మన ఉద్యోగాలు, మన సంస్కృతీ సంప్రదాయాలు మనకే చెందాలి… అనే నినాదానికి ఊపిరి పోస్తూ తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల జాతర మొదలైంది. పలు ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లను విడుదల చేశారు…ఇంకా చేయనున్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, గెజిటెడ్, నాన్ గెజిటెడ్తో పాటు వివిధ పోటీపరీక్షల సిలబస్‌ను ఇటీవల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ తెలంగాణ చరిత్ర, ఉద్యమం, రాష్ట్రసాధనకు సంబంధించిన అంశాలు ఉండేలా సిలబస్‌ను రూపొందించారు. వీటితో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం, కళలు, భౌగోళిక ఆర్థికాంశాలకు సైతం పరీక్షల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ప్రకటించిన సిలబస్‌ను బట్టి తెలుస్తోంది.
ఆ అంకిత భావమే… తొలి అర్హత
తెలంగాణ గురించి సిలబస్‌లో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిసినప్పటి నుంచే అభ్యర్థుల్లో ఒక ఆందోళన మొదలైంది. కొత్త సిలబస్ ఏమిటి, ఎలా ఉంటుంది, దాని తాలూకూ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అనే సందేహాలు ఎన్నో ఇప్పటికే అభ్యర్థుల్లో ఉన్నాయి. పోటీ పరీక్షలు అంటేనే ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. అది మనల్ని సరైన ప్రిపరేషన్ వైపు నడిపించే టెన్షన్ కనుక ఆ మాత్రం ఉండడం మంచిదే. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఒక ప్రత్యేకత ఉంది.
సాధారణంగానే ప్రతీ పోటీ పరీక్ష వెనుక రెండు లక్ష్యాలు ఉంటాయి. రాష్ర్టానికి సమర్థులైన ఉద్యోగుల ఎంపిక ఒక అవసరం అయితే, నిరుద్యోగులకు ఒక చక్కని స్థిరమైన ఉద్యోగం, సమాజంలో హోదా గుర్తింపు, గౌరవం వంటివి దక్కడం మరొకటి. కానీ ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు మరిం త ప్రతిష్టాత్మకమైనవి. పై రెండు ఆశయాలకు మించినది ఈ పరీక్షల వెనుక ఉంది. తెలంగాణ అభివృద్ధిలో తొలి అడుగులు వేయాల్సిన సుశిక్షితుల్లాంటి ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వానికి కావాలి. ఉద్యోగం, తద్వారా వచ్చే ఫలితాలు వీటికంటే ఎక్కువగా, చేస్తున్న పనిని ప్రేమించే వారు ఇప్పుడు తెలంగాణకు అత్యవసరం. ఇది నా రాష్ట్రం, ఇక్కడ నా అవసరం ఉంది, నా తెలంగాణ కోసం నేను పనిచేస్తున్నాను… అనే అంకితభావమే నేడు ఉద్యోగాలు సాధించబోతున్నవారికి ఉండాల్సిన తొలి అర్హత.
లక్ష్యం సాధించాలంటే.. కష్టనష్టాలు తెలవాల్సిందే!
ఇక్కడ ఎలాంటి మహానుభావులు పుట్టారు, ఎలా బతికారు, ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కొన్నారు, ఈ నేలని ఎంతగా ప్రేమించారు, ఈ నేల విముక్తికి ఎంతగా తపించారు.. ఇవన్నీ తెలుసుకుంటే కానీ ఆ ఆశయాల సాధనకు, నేడు ఉద్యోగాల్లోకి వస్తున్న వారు వారసులు కాలేరు. ఇక్కడి కరువు కాటకాలు, చదువు ఉపాధి కోసం శ్రమించిన సామాన్యులు, జీవన కష్టాలు ముసురుకుంటున్న జానపద కళలను చంటిబిడ్డల్లా సాకిన తెలంగాణ పల్లె ప్రజానీకం కళానురక్తి, పుట్టిన గడ్డమీద వారికున్న అనురక్తి ఇవన్నీ తెలుసుకున్న వారు కావాలి. కొన్ని దశాబ్దాల ఉద్యమ చరిత్రతో, ఉద్వేగభరితమైన పోరాటాలతో మమేకమై, నాటి ఆశలను, ఆశయాలను కలలను ఇప్పుడు కళ్లముందు సాక్షాత్కరింపచేసు కోగలవారు కావాలి. అంటే అక్షరాలా అచ్చమైన తెలంగాణ బిడ్డలు ఇప్పుడు ఈ రాష్ర్టానికి ఉద్యోగులుగా కావాలి. పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన వెనుక ఉన్న నిజాలు ఇవే.
సమగ్ర అవగాహనే… నూతన సిలబస్
తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలతో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలు రానున్నాయి. తెలంగాణ పరిచయం, పూర్వచరిత్ర, ప్రాచీన చరిత్రలతో మొదలుకొని శాతవాహనుల పాలన, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకర్ల వ్యవస్థ, ముసునూరి నాయకులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, నిజాంల పాలన, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అవతరణ, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారుల పాత్ర తదితర అంశాలపై పుస్తకాలు రానున్నాయి.
ఇవన్నీ కొత్త అంశాలే. ఇప్పటివరకు ఏ పాఠ్య పుస్తకాల్లోనూ లేనివి, ఏ పోటీ పరీక్షలకూ రానివి. కాబట్టి ఈసారి ప్రిపరేషన్లో వీటి సాధన అభ్యర్థులకు కష్టసాధ్యంగా అనిపించవచ్చు. అయినా సిలబస్ ఉన్న అన్ని అంశాలను ప్రిపరేషన్లో కవర్ చేయాల్సిందే.
దృక్పథాన్ని మార్చుకుంటే సాధన సులభం
సిలబస్, పుస్తకాలు సంపాదించడం అనేవి ప్రాక్టికల్‌గా కాస్త శ్రమ పడితే సాధ్యమవుతాయి. కానీ నూతన సిలబస్ సులువుగా చదివేందుకు మనసుని సిద్ధపరచుకోవడమే ముఖ్యమైన విషయం. ఈ సిలబస్ చదువుతున్నప్పుడు పోటీ పరీక్షలనే కాదు…. ఉద్యోగం వచ్చాక, ఏ గడ్డమీద పనిచేయబోతున్నారో, ఏ జనం కోసం కష్టపడబోతున్నారో, ఏ జనాల కష్టాలు తీర్చబోతున్నారో వారందరినీ ఆ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోండి. ఈ నేలపై పుట్టి గిట్టిన మా తాతముత్తాతలు ఎలా జీవించారో తెలుసుకుంటున్నాను.. అనే భావనతో చదవండి. అప్పుడు మీకు ఆయా పాఠ్యాంశాలు అత్యంత ఆసక్తి కరంగా మారతాయి.
అమరవీరుల స్ఫూర్తితో. .. ప్రిపరేషన్
ఒక లక్ష్యాన్ని సాధించడానికి పాజిటివ్ కొటేషన్లు, జీవితంలో విజయాలు సాధించినవారి చిత్రాలు, మాటలు ఇవన్నీ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. కానీ మీ గదిలో, మదిలో ఉండాల్సిన చిత్రాలు తెలంగాణకోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులవి. రాష్ట్రసాధనకోసం నిట్టనిలువుగా కాలిబూడిదయినవారి గుండెధైర్యాన్ని, పుట్టినగడ్డపై వారికున్న మమకారాన్ని గుర్తు తెచ్చుకోండి. వారికంటే మీ కష్టం పెద్దది కాదని గుర్తుంచుకోండి. మీరు సాధించబోతున్న ఉద్యోగం వారి ఆశయసాధనకోసం మీకు లభించిన గొప్ప అవకాశంగా భావించండి.
– డా. హిప్నో కమలాకర్
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, హెచ్ఆర్డీ ట్రైనర్, 9390044031
drhypnokamalakar@gmail.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం