Agronomist Careers | ఆగ్రోనమిస్ట్ అవకాశాలు మస్త్
వ్యవసాయం సమస్త మానవాళికి జీవనాధారం. రైతు పండించే పంట సరైన దిగుబడి వస్తేనే మనకు కావలసిన ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. పంట దిగుబడి ఆశించినంత రావాలంటే సరైన యాజమాన్య
పద్ధతులు అవలంబించాలి. రైతుల్లో చాలావరకు నిరక్షరాస్యులే ఉంటారు కాబట్టి యాజమాన్య పద్ధతులపై అవగాహన లేకపోవడంతో వ్యవసాయంలో నష్టాలు మిగులుతున్నాయి. రైతులకు తగిన సమయంలో సాగుబడికి మెళకువలు, కీటకనాశనులు, మందులు అందిస్తే వ్యవసాయం విరాజిల్లుతుంది. అందుకోసం వ్యవసాయ శాఖ పనిచేస్తుంది. వ్యవసాయ శాఖలో ముఖ్యమైన ఉద్యోగి ఆగ్రోనమిస్ట్. ఆగ్రోనమిస్ట్ ఉద్యోగం సాధించాలంటే ఏం చదవాలి, ఎలా చదవాలి.. ఆగ్రోనమిస్ట్ రోల్ ఎలా ఉంటుంది… అందుబాటులో ఉన్న కోర్సులు, యూనివర్సిటీలు, అర్హతల గురించి నిపుణ పాఠకుల కోసం..
- ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు వ్యవసాయ విద్యను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. పెరుగుతున్న శాస్త్ర సాంకేతికతకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.
- అందులో భాగంగానే ఎన్ని రకాల పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వాటిని వినియోగించి మంచి దిగుబడులు సాధించలేకపోతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ విద్య అభ్యసించిన వారు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాన్ని సంపాదించడమే కాకుండా అన్నదాతకు చేయూత అందించవచ్చు.
- అందుకోసం ఈ రంగానికి సంబంధించి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రత్యేకమైనది ఆగ్రోనమి. ఈ కోర్సు అన్ని వ్యవసాయ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంటుంది.
ఆగ్రోనమిస్ట్ అంటే..?
ఆగ్రోనమి అనేది గ్రీకు భాషా పదం. ఆగ్రోస్ అంటే ఫీల్డ్ (పొలం), నోమోస్ అంటే మేనేజ్మెంట్ (యాజమాన్యం). ఆగ్రోనమీ అంటే సైన్స్, టెక్నాలజీని వినియోగించి నాణ్యమైన పంటలను సాగు చేయడం అని అర్థం. ఇది పంటకు కావలసిన నీరు-నీటి లభ్యత, పంట వ్యాధులు, నేల నాణ్యత, పంటకు కావలసిన పోషక పదార్థాలను అందించి నాణ్యమైన దిగుబడి సాధించడం ఆగ్రోనమి ప్రధాన లక్ష్యం. పంటకు కావలసిన పోషకాలు ఏవి? పంట పెరుగుదల, అభివృద్ధి విధానాలు, పంటలను ఎక్కువగా ఆశించే కీటకాలు, సూక్ష్మజీవులపై అవగాహన, పంట పెరుగుదలకు సమకూర్చవలసిన ఆర్థిక వనరులు, రైతు అవలంబించే విధానాల గురించి సమగ్ర అవగాహన ఉన్నవారే ఆగ్రోనమిస్ట్. నాణ్యమైన పంట దిగుబడి రావడానికి రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవలంబించాలో ఆగ్రోనమిస్ట్ అవగాహన కల్పిస్తారు.
విధులు
- ఆగ్రోనమిస్ట్ విధులు నిత్యం పంటలు, నేలకు సంబంధించే ఉంటాయి.
- వివిధ రకాలైన పంటల దిగుబడిని పెంచే పద్ధతులపై రీసెర్చ్ చేసి రైతులకు అవగాహన కల్పించడం.
- స్థానిక రైతులతో మమేకమై నూతన యాజమాన్య పద్ధతులు, పంట ఉత్పత్తి పెంపుపై చర్చించడం.
- మొక్కల పెరుగుదల, ఆరోగాన్ని మానిటరైజ్ చేయడం.
- నేల పరీక్షలు, పంటలకు కావలసిన పోషకాల కల్పన.
- వ్యాధుల నుంచి మొక్కలను రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం.
- వ్యవసాయంలో పర్యావరణ హిత యాజమాన్య పద్ధతులు పాటించేలా చూడటం.
- విత్తనాల ఎంపిక, నాణ్యమైన విత్తనాలు సేకరించడం.
- పంటలకు వచ్చే వ్యాధులపై రీసెర్చ్ చేసి తగిన ఔషధాలను రైతులకు కల్పించడం.
- తర్వాతి తరాలకు అందించే పంట ఉత్పత్తుల రికార్డులను తయారు చేసి పర్యవేక్షించడం.
- ఆగ్రోనమిస్ట్ రీసెర్చ్ ఫలితంగా తెలిసిన విషయాలను, గతంలో అవలంబించిన పద్ధతులతో సరిపోల్చడం.
- ఆగ్రోనమిస్ట్గా స్థిరపడాలంటే కింది ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. అవి..
- అగ్రికల్చరల్ ఎకనామిక్స్పై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
- పంట నష్టం, దిగుబడి, లాభాల అంచనా, నష్టాల అంచనాపై అవగాహన.
- అగ్రికల్చరల్ టెక్నికల్ స్కిల్స్.
కెరీర్
- రైతులతో మమేకమయ్యే విధానం.
- సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం
- టీం వర్క్, నాయకత్వ లక్షణాలు.
- కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల్లో ఆగ్రోనమిస్ట్ ఉద్యోగాలుంటాయి. వీటితో పాటు నీటిపారుదల శాఖలో కూడా పనిచేయవచ్చు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల్లో ఆగ్రోనమిస్ట్గా పనిచేయవచ్చు. సాయిల్ ఫెర్టిలిటీ, ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ ఫిజియాలజీ, క్రాప్ మేనేజ్మెంట్, పెస్ట్ కంట్రోల్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అగ్రికల్చరల్ ల్యాబొరేటరీస్, అగ్రికల్చరల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ (ప్రభుత్వ, ప్రైవేట్)లో పనిచేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, వ్యవసాయ ఔషధ తయారీ కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. విత్తన కంపెనీలు, ఆగ్రో కెమికల్ కంపెనీల్లో పనిచేసే అవకాశాలుంటాయి. వీరికి వేతనాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
అర్హతలు
- ఇంటర్ నుంచి పీజీ పూర్తి చేసినవారందరూ ఆగ్రోనమి చేయవచ్చు. వారి అర్హతను బట్టి పొజిషన్ ఉంటుంది.
- సైన్స్ లేదా మ్యాథ్స్తో ఇంటర్.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్ డిగ్రీ.
- మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్స్ (వీరు ఆగ్రోనమి రీసెర్చ్ విభాగానికి అర్హులు)
- వివిధ ప్రభుత్వ రంగ, ప్రభుత్వేతర కంపెనీల్లో ఆగ్రోనమి ఇంటర్న్షిప్ చేసినవారు.
- సీసీఏ (సర్టిఫైడ్ క్రాప్ అడ్వైజర్) ప్రోగ్రామ్ చేసినవారు (అగ్రికల్చర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేయలేని వారు కూడా సీసీఏ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ పొందవచ్చు)
పాపులర్ కోర్సులు
- బీఎస్సీ (అగ్రికల్చర్) ఆగ్రోనమి. దీన్నే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆగ్రోనమి అంటారు. ఇది నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారు ఈ కోర్సు చేయవచ్చు.
- ఎమ్మెస్సీ ఆగ్రోనమీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆగ్రోనమి). ఇది రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. బీఎస్సీ (సైన్స్, మ్యాథ్స్) చేసినవారు ఈ కోర్సు చేయవచ్చు.
- పీహెచ్డీ ఆగ్రోనమి (డాక్టర్ ఇన్ ఫిలాసఫీ ఇన్ ఆగ్రోనమి). ఇది మూడేళ్ల కోర్సు.
-కుమారస్వామి కాసాని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం