UPSC Special Economy | భారతదేశ డిజిటల్ పరివర్తన
భారతదేశ డిజిటలైజేషన్ కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజానికి బహుళ ప్రయోజనాలను అందించడమే కాకుండా ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా అందించింది. ప్రపంచ స్థాయి డిజిటల్ వ్యవస్థలను భారత్ నిర్మించుకుందని, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ శైలిని మార్చిన ఈ వ్యవస్థల నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని మార్చి 31న Stacking up the Benefits: Lessons from India’s Digital Journey పేరుతో విడుదల చేసిన చర్చాపత్రంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రశంసించడమే కాకుండా భారత్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను సంయుక్తంగా ‘ఇండియా స్టాక్’ అని పరిగణించింది. వీటిలో ప్రత్యేక గుర్తింపు (ఆధార్), చెల్లింపుల వ్యవస్థలు (యూపీఐ, ఆధార్ చెల్లింపుల బ్రిడ్జ్, ఆధార్ చెల్లింపు సేవలు), డేటా ఎక్సేంజీ (డిజిటల్ లాకర్, అకౌంట్ అగ్రిగేటర్). వీటితో ఆన్లైన్, కాగిత నగదు రహిత, గోప్యతతో కూడిన సేవలు లభిస్తున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో ఈ వ్యవస్థలు చాలా లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించింది. ఆధార్ సాయంతో ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు వెళ్తున్నాయని, అవినీతి తగ్గడంతో పాటు ప్రజలకు పథకాల విస్తృతి పెరిగినట్లు ఐఎంఎఫ్ వివరించింది.
డిజిటల్ అవస్థాపన, డిజిటల్ వ్యాప్తిని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు
- భారత్ నెట్ ప్రాజెక్ట్ స్కీమ్, టెలికాం డెవలప్మెంట్ ప్లాన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ స్కీమ్, కాంప్రహెన్సివ్ టెలికాం డెవలప్మెంట్ ప్లాన్ (CTDP) ద్వారా
ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు. - ఆధార్: 12 అంకెల బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ఆధారిత గుర్తింపు ప్రస్తుతం ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని పథకాలకు ఆధారంగా మారింది.
- సాధారణ సేవల కేంద్రాలు (Common Services Centres): CSCలు ప్రభుత్వ, వ్యాపార సేవలను గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (VLEs) ద్వారా డిజిటల్ రూపంలో అందిస్తాయి. దాదాపు ఈ CSCల ద్వారా 400 పైగా డిజిటల్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 5.21 లక్షల CSCలు పనిచేస్తున్నాయి (పట్టణ & గ్రామీణ ప్రాంతాలతో సహా).
- డిజిలాకర్: ముఖ్యమైన పత్రాలను భద్రపరుచుకోవడానికి డిజిటల్ లాకర్ డిజిటల్ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం డిజిటల్ లాకర్‌కు 13.7 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులున్నారు. 562 కోట్లకు పైగా పత్రాలు డిజిలాకర్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
- ఇ-సైన్: ఇ-సైన్ సేవ చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన రూపంలో పౌరులు ఆన్లైన్లో ఫాంలు/పత్రాలపై తక్షణ సంతకం చేయడానికి వీలు కల్పిస్తుంది.
- MeriPehchaan: పౌరులకు ప్రభుత్వ పోర్టళ్లను సులభంగా యాక్సెస్ చేయడానికి/ అందించడానికి MeriPehchaan అనే నేషనల్ సింగిల్ సైన్-ఆన్ (NSSO) ప్లాట్‌ఫామ్‌ను 2022, జూలైలో ప్రారంభించారు.
- డిజిటల్ విలేజ్: డిజిటల్ హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్కిల్ డెవలప్మెంట్, సోలార్ ప్యానెల్ పవర్డ్ స్ట్రీట్ లైట్స్ వంటి డిజిటల్ సర్వీస్‌లు, ఇందులో గవర్నమెంట్ టు సిటిజన్స్ సర్వీసెస్ (G2C), బిజినెస్ టు సిటిజన్ (B2C) సర్వీస్‌లు ఉంటాయి.
- ప్రభుత్వ డేటా ప్లాట్‌ఫామ్: డేటా షేరింగ్‌ను సులభతరం చేయడానికి, వ్యక్తిగతేతర డేటాపై ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.
- ఇ-హాస్పిటల్/ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ORS): ఇ-హాస్పిటల్ అప్లికేషన్ అనేది ఆస్పత్రుల అంతర్గత చికిత్స కేంద్రాలు, ప్రక్రియల కోసం అందించే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.
- CO-WIN: ఇది కొవిడ్-19 కోసం రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ & టీకా సర్టిఫికెట్ల నిర్వహణ కోసం ఒక బహిరంగ వేదిక.
- జీవన్ ప్రమాణ్: ఇది పెన్షనర్ కోసం జీవిత ధ్రువీకరణ పత్రాన్ని భద్రపరిచే మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేయాలని భావిస్తుంది.
- NCOG-GIS అప్లికేషన్స్: నేషనల్ సెంటర్ ఆఫ్ జియో-ఇన్ఫర్మాటిక్స్ (NCoG) ప్రాజెక్ట్, డిపార్ట్మెంట్ల కోసం భాగస్వామ్యం, సహకారం, స్థాన ఆధారిత విశ్లేషణలు, నిర్ణయ మద్దతు వ్యవస్థ కోసం అభివృద్ధి చేసిన GIS ప్లాట్‌ఫామ్.
- నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్: హై స్పీడ్ డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్నత అభ్యాసం, పరిశోధనల సంస్థను ఇంటర్‌కనెక్ట్ చేయడానికి స్థాపించారు.
- ప్రధాన్‌మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ (PMGDISHA): 6 కోట్ల గ్రామీణ కుటుంబాలను (ఇంటికి ఒక వ్యక్తి) కవర్ చేయడం ద్వారా గ్రామీణ భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతను ప్రారంభించడం.
- యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI): ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక. ఇది 376 బ్యాంకులను ఆన్‌బోర్డ్ చేసింది. రూ.11.9 లక్షల కోట్ల విలువైన 730 కోట్ల లావాదేవీలను (వాల్యూమ్ వారీగా) సులభతరం చేసింది.
- ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్: మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీస్ NASSCOM సహకారంతో (FutureSkills PRIME పేరుతో ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం 10 కొత్త/అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో IT నిపుణులను తిరిగి నైపుణ్యం/అప్-స్కిల్లింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
- సైబర్ సెక్యూరిటీ: డేటా గోప్యత, డేటా భద్రతకు అవసరమైన నిబంధనలను కలిగి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000ని నిర్వహించడం ద్వారా డేటా గోప్యత, డేటా భద్రతకు సంబంధించి సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. 2021, జూన్ 29న ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) ప్రారంభించిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (GCI) 2020లో భారతదేశం టాప్ 10లో చేరింది. కీలకమైన సైబర్ భద్రతపై ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా 37 స్థానాలు ఎగబాకింది.
- వీటన్నింటి ఫలితమే ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ విప్లవం సాధించిన విజయంగా చెప్పవచ్చు. ఈ డిజిటల్ వ్యవస్థ ఫలితాలను ఐఎంఎఫ్ గణాంకాలతో వివరించింది అవి..
- వ్యవస్థలు, ఇతర ప్రభుత్వ రంగ డిజిటల్ సంస్కరణలతో 2021 మార్చికి జీడీపీలో 1.1 శాతం వ్యయాలు ఆదా అయినట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది.
- 2022 ఆగస్టుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 46.25 కోట్ల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ప్రారంభమయ్యాయి.
- కేవైసీ ప్రక్రియలు కూడా సరళమయ్యాయి. ఇ-కేవైసీతో బ్యాంకుల ఖర్చు తగ్గింది.
- మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీల వాటా 68 శాతంగా ఉంది. డిజిటల్ లావాదేవీల వల్ల, చిన్న వర్తకుల వద్దకు వెళ్లే ఖాతాదారుల సంఖ్య పెరిగింది.
- 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్య దాదాపు 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదార్లు జీఎస్టీ విధానంలోకి వచ్చారు.
- వినూత్నత, పోటీతత్వం పెరిగి ఆర్థిక సేవలకు దూరంగా ఉన్నవారి సంఖ్య తగ్గింది. ప్రభుత్వ పన్ను వసూళ్లు పెరగడంతో పాటు ప్రజా వ్యయాల వినియోగం మెరుగుపడింది.
- 2021 ఆగస్టులో అకౌంట్ అగ్రిగేటర్ వచ్చిన తర్వాత 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు సులభతర ఆర్థిక సేవలతో లబ్ధి పొందారు.
- ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కరోనాకు అడ్డుకట్ట వేయడంలో కూడా డిజిటల్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అందులో భాగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడంలో కొవిన్ పోర్టల్ కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకా కూడా ఈ పోర్టల్‌ను వినియోగించుకున్నాయి. అలా కరోనా సంక్షోభం తొలి నెలల్లో దాదాపు 87 శాతం పేదలు కనీసం ఒక్క ప్రభుత్వ ప్రయోజనమైనా పొందారు.
- భారతదేశం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI)ని అభివృద్ధి చేస్తున్నప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.
- గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉంది.
- సైబర్ భద్రత ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. సైబర్ మోసాలు పెరుగుతున్నాయి.
- పట్టణ గృహాల్లో 42 శాతంతో పోలిస్తే కేవలం 14.9 శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. కాబట్టి ఈ డిజిటల్ ఫలాలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గుతున్నాయి.
- తక్కువ ఆదాయ వర్గాల్లో మహిళలు డిజిటల్ నిరక్షరాస్యులయ్యే అవకాశం ఉంది.
- పౌరుల గోప్యతను రక్షించడానికి, కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటాను సేకరించకుండా నిరోధించడానికి, డేటా ఉల్లంఘనలకు కంపెనీలు, ప్రభుత్వాలను జవాబుదారీగా ఉంచడానికి తగిన డేటా నిర్వహణ, సైబర్ భద్రతలో తగిన పెట్టుబడులను ప్రోత్సహించడానికి రక్షణ ఫ్రేమ్‌వర్క్ అవసరం.
- సవాళ్లను అధిగమించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విస్తృతం చేయడం ద్వారా దేశ సాధారణ ప్రభుత్వ ఆర్థిక నివేదికల సమయపాలన, నాణ్యత, కవరేజీ గణనీయంగా మెరుగవుతుంది. అదే సమయంలో పౌరులకు ఆర్థిక పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు