Indian History | రాజ్యాంగ నిర్మాణ సమితి సమావేశం ఎప్పుడు జరిగింది?
క్యాబినెట్ మిషన్ ప్లాన్
- రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడమే తన ప్రధాన ఎజెండా అని బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ప్రకటించాడు. దీనిలో భాగంగా భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తే అధికార మార్పిడి ఎలా జరగాలి, ప్రత్యేక పాకిస్థాన్ అంశాన్ని చర్చించడానికి లార్డ్ పెథిక్ లారెన్స్ (భారత రాజ్య కార్యదర్శి) అధ్యక్షతన సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవీ అలెగ్జాండర్ సభ్యులుగా గల క్యాబినెట్ మిషన్‌ను 1946, మార్చి 15న ఏర్పాటు చేశారు. దీనిలో అధ్యక్షుడు, సభ్యులు అందరూ బ్రిటన్‌లో క్యాబినెట్ మంత్రులు కావడం వల్ల దీన్ని క్యాబినెట్ మిషన్ అని పిలిచారు. ఈ మిషన్ సభ్యులు 1946, మార్చి 24 నాటికి ఢిల్లీ చేరారు. 1946, మే 16న క్యాబినెట్ మిషన్ తన ప్రణాళికను సిమ్లాలో ప్రకటించింది. ముస్లిం లీగ్ వారు క్యాబినెట్ మిషన్ రాయబారాన్ని తిరస్కరించగా, సర్దార్ పటేల్ క్యాబినెట్ మిషన్‌కు తన పూర్తి మద్దతు తెలిపారు.
క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలు
- బ్రిటిష్ ఇండియా రాష్ర్టాలు కలిసిన యూనియన్ ప్రభుత్వం దేశ రక్షణ, విదేశాంగ విధానం, వార్తా ప్రసార సాధనాల వ్యవస్థను నిర్వహిస్తుంది. అందుకు అవసరమైన విత్త వనరులను ఏర్పరచుకుంటుంది.
- యూనియన్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతో ఏర్పడిన పార్లమెంట్ ఉంటాయి.
- ఏదైనా మతపరమైన సమస్య తలెత్తితే పార్లమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులు సంయుక్తం గాను, విడివిడిగా సమావేశమై ఆ రెండు సందర్భాల్లోను మెజార్టీ ప్రాతిపదికపై సమస్యకు పరిష్కారాన్ని నిర్ణయించాలి.
- యూనియన్ నిర్వహించే పాలనాంశాలు కాకుండా ఇతర పాలనాంశాలు రాష్ర్టాల నిర్వహణలో ఉంటాయి.
- ఏమైనా అవశిష్ట విషయాలుంటే అవి రాష్ర్టాల నిర్వహణలో ఉంటాయి.
- రాష్ర్టాలు ఉప సమాఖ్యగా ఏర్పడే హక్కును కలిగి ఉండాలి.
- ఉప సమాఖ్యకూ కార్యనిర్వాహక వర్గం, శాసనసభలు ఉండాలి. రాష్ట్ర విషయాలను ఉపసమాఖ్య చేపట్టవచ్చు.
- మద్రాస్, బొంబాయి, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్య పరగణాలు, ఒడిశాలతో కలిసి ఒకటి- వాయవ్య రాష్ట్రం, పంజాబ్, సింధ్‌లు కలిసి మరొకటి, బెంగాల్, అస్సాంల కలయికతో ఇంకొకటి మొత్తం మూడు ఉప సమాఖ్యలుగా రాష్ర్టాలు ఏర్పడవచ్చు.
- రాజ్యాంగంలోని ఏదైనా అంశాన్ని మార్చడం పదేండ్ల తరువాతే జరుగుతుంది. మార్పును రాష్ర్టాలు కోరితే ఆ రాష్ర్టాల శాసనసభల్లో ఆ మార్పును మెజార్టీ అంగీకరించాలి.
- క్యాబినెట్ మిషన్ బ్రిటిష్ ఇండియా రాష్ర్టాల నుంచి 292 మంది ప్రతినిధులను, సంస్థానాల నుంచి 93 మంది ప్రతినిధులను, చీఫ్ కమిషనర్ పాలనలో ఉన్న రాష్ర్టాల నుంచి నలుగురు ప్రతినిధులను మొత్తం 383 మంది సభ్యులతో రాజ్యాంగ నిర్మాణ సభను ప్రతిపాదించారు.
- రాష్ర్టాలకు కేటాయించిన ప్రతినిధుల సమాఖ్యను ఆయా రాష్ర్టాల్లోని మతవర్గ ప్రజల జనాభా దామాషా (నిష్పత్తి)ను అనుసరించి నిర్ణయించాలి. పది లక్షల జనాభాకు ఒక ప్రతినిధి చొప్పున రాష్ర్టాలు ప్రతినిధులను పంపాలి. ఏ మతవర్గానికి చెందిన ప్రతినిధులను ఆ మత వర్గాల వారే ఎన్నుకోవాలి.
- మూడు రకాల నియోజకవర్గాలను మాత్రమే క్యాబినెట్ మిషన్ ప్రతిపాదించింది.
ఎ) సాధారణ నియోజకవర్గాలు
బి) ముస్లిం నియోజకవర్గాలు
సి) సిక్కు నియోజకవర్గాలు - ఎన్నికల తరువాత రాజ్యాంగ సభ ఏక సంస్థగా రూపొంది ఢిల్లీలో సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.
- నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత కూడా రాష్ర్టాలు ఒక ఉప సమాఖ్య నుంచి ఇంకో ఉప సమాఖ్యలోకి మారవచ్చు.
- రాజ్యాంగ సభ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలను మార్చాలంటే హిందూ, ముస్లిం వర్గాల ప్రతినిధులతో మెజార్టీ ఆమోదం ఉండాలి, దేశ విభజన జరగరాదు.
- కేంద్రంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీలు కలిసి తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
- రాజ్యాంగ రచనను రాజ్యాంగ సభ నిర్వహిస్తుంది. దీనిలో 398 మంది సభ్యులు ఉంటారు.
- భారత్‌లోని ప్రాంతాలను ఎ, బి, సి అని గ్రూపులుగా విభజించబడును.
ప్రత్యక్ష చర్య
- క్యాబినెట్ మిషన్ నిర్ణయాన్ని ఖండిస్తూ ముస్లిం లీగ్ అధినేత జిన్నా 1946, ఆగస్ట్ 16న ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో జిన్నా ఇచ్చిన నినాదం..‘లడ్కే లేంగే పాకిస్థాన్, లేకర్ రహేంగే పాకిస్థాన్’.
- ప్రత్యక్ష చర్యలో భాగంగా ముస్లిం లీగ్ నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలు పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించాయి. కానీ ఈ సమయంలో కలకత్తాలో పెద్ద ఎత్తున మారణకాండ జరిగింది. దీన్నే ‘అతిగొప్ప కలకత్తా మారణ హోమం’ అంటారు. దీనిలో దాదాపు 4000 మంది ప్రజలు మరణించారు.
తాత్కాలిక ప్రభుత్వం
- క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచనల ఆధారంగా కేంద్రంలో 1946, సెప్టెంబర్ 2న 14 మంది (9+5 అమరిక) మంత్రులతో తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనికి వేవెల్ అధ్యక్షుడు.
లార్డ్ అట్లీ ప్రకటన
- బ్రిటన్ ప్రధాని లార్డ్ క్లెమెంట్ అట్లీ (లేబర్ పార్టీ) 1947, ఫిబ్రవరి 20న కామన్స్ సభలో 1948, జూన్ 30 లోగా భారతదేశం నుంచి వైదొలుగుతామని ప్రకటించాడు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు. విన్స్టన్ చర్చిల్, టెంపుల్వుడ్, సైమన్ ఈ ప్రకటనను వ్యతిరేకించగా హాలోఫాక్స్, క్రిప్స్ సమర్థించారు.
- ఈ ప్రకటనతో ముస్లిం లీగ్ తన ప్రత్యక్ష చర్యను పంజాబ్‌లో అమలు చేసి సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన యూనియనిస్టు పక్ష నాయకుడైన ఖిజిర్ హయత్ఖాన్ను భయాందోళనలకు గురిచేసింది. దీనిపై ఇక్కడ చెలరేగిన హింసాకాండను గవర్నర్ ఇవాన్ జిన్కిన్స్ ఆపలేకపోయాడు. ఇదేవిధమైన హింసాకాండను వాయవ్య రాష్ట్రంలో గవర్నర్ ఒలాఫ్కేరో అదుపు చేయలేకపోయాడు.
- లార్డ్ మౌంట్ బాటన్ 1947, మార్చి 24న భారత్‌కు వైస్రాయ్గా వచ్చాడు. ఇతనికి వీలైతే భారత్‌ను విడదీయకుండా ఉండేలా చూడాలనే సూచనలిచ్చి పంపారు.
బాల్కన్ ప్లాన్
- 1947, మార్చి నుంచి మే నెల మధ్యలో మౌంట్ బాటన్, సర్ హేస్టింగ్స్ ఇస్మే, సర్ జార్జి అబెల్‌తో సంయుక్తంగా ఒక ప్రణాళికను రూపొందించారు. దానికే బాల్కన్ ప్రణాళిక లేదా ఇస్మే ప్రణాళిక అని పేరు. దీని ప్రకారం అన్ని ప్రావిన్సులకు అధికారం బదిలీ జరుగుతుంది. పంజాబ్, బెంగాల్ ప్రావిన్స్‌లు విడిపోవాలో లేదా కలిసి ఉండాలో అనే అవకాశం వాటికే ఇచ్చారు.
- ఆ తర్వాత ఏర్పడిన అన్ని యూనిట్లు ప్రావిన్స్, స్వదేశీ సంస్థానాలు తమ తమ అభిప్రాయాలను పాకిస్థాన్‌తో కలవాలా లేక భారత్‌తో కలవాలా లేక స్వాతంత్య్రంగా ఉండాలా అనే అభిప్రాయాలను తెలపాలి. నెహ్రూ దీన్ని తీవ్రంగా విమర్శించడంతో బాల్కన్ ప్రణాళిక రద్దయ్యింది.
మౌంట్ బాటన్ ప్రణాళిక
- ఇతను భారత్‌లోని అన్ని వర్గాల నాయకులతో చర్చించారు. దేశ విభజనను గాంధీ, ఆజాద్ తిరస్కరించగా నెహ్రూ, పటేల్‌లు అయిష్టంగా ఒప్పుకొన్నారు. విభజనకు ప్రత్యామ్నాయంగా గాంధీ జిన్నాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరాలని మౌంట్ బాటన్‌కు సూచించినప్పటికీ మౌంట్ బాటన్ దేశ విభజనకు కాంగ్రెస్‌ను ఒప్పించి 1947, జూన్ 3న తన ప్రణాళికను ప్రకటించాడు. దీన్నే మౌంట్ బాటన్ ప్రణాళిక అని అంటారు. దీనికే డిక్కీ బర్డ్ ప్రణాళిక లేదా జూన్-3 ప్రణాళిక (ఏప్రిల్ ప్రణాళిక జూన్ 3న ఆమోదం పొందింది కాబట్టి) అని పేరు. ఈ ప్రణాళికను మౌంట్ బాటన్ నేతృత్వంలో వీపీ మీనన్ రూపొందించారు.
ప్రణాళిక ముఖ్యాంశాలు
1) బ్రిటిష్ ఇండియా రెండు భాగాలుగా (ఇండియా, పాకిస్థాన్) ఏర్పడుతుంది.
2) బెంగాల్, పంజాబ్, అస్సాం మత ప్రాతిపదిక మీద విభజిస్తారు.
3) స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇస్తారు.
4) రాజ్యాంగ సమితి ఏర్పరిచే రాజ్యాంగాన్ని ఇండియాలోని ఏ భాగాలైనా అంగీకరించకపోతే అక్కడ రాజ్యాంగం వర్తించదు.
5) రాజ్యాంగానికి ప్రతికూలించేవారు ప్రత్యేక రాజ్యాంగ సమితుల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చు.
6) పంజాబ్, బెంగాల్ రాష్ర్టాల శాసనసభలు ముస్లిం మెజార్టీ సభ్యులతో ఒక తరగతిగాను, ఇతర ప్రతినిధులతో రెండో తరగతిగాను ఏర్పడి, ఆయా తరగతుల్లో మెజార్టీ నిర్ణయానుసారం ఏ రాజ్యాంగ సమితిలో చేరాలో నిర్ణయించుకోవచ్చు.
7) వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో అస్సాంలోని సిల్హెట్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఏ రాజ్యాంగ సమితిలో చేరడానికి ఇష్టపడుతున్నారో నిర్ణయిస్తారు.
8) బెలూచిస్థాన్ విషయంలో ఏ విధంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలో గవర్నర్ నిర్ణయిస్తాడు.
9) పంజాబ్, బెంగాల్, సిల్హెట్ జిల్లాల్లో రాజ్యాంగ సమితి ప్రతినిధుల ఎన్నికలు జరుగుతాయి.
10) దేశ విభజన పర్యవసానంగా ఏర్పడబోయే రెండు ప్రభుత్వాలు అధికార బదలాయింపు తర్వాతి పరిణామాల గురించి నిర్ణయించుకుంటాయి.
- ఈ ప్రణాళికను యథాతథంగా ఆమోదించి భారత స్వాతంత్య్ర బిల్లు పేరుతో బ్రిటిష్ పార్లమెంటులో 1947, జూలై 4న ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 1947, జూలై 18న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం పొంది, ఆ తరువాత అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్-6 ఆమోద ముద్రతో చట్టం అయ్యింది.
- ఈ చట్టంతో రెండు ఆధునిక దేశాలు అవతరించాయి.
1) 1947, ఆగస్ట్ 14న పాకిస్థాన్ ఏర్పాటయ్యింది.
2) 1947, ఆగస్ట్ 15న ఇండియా ఏర్పాటయ్యింది.
3) సరిహద్దు విభజనకు సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేశారు.
సరిహద్దు కమిషన్ (బోర్డర్ కమిషన్-1947) - భారత స్వాతంత్య్ర చట్టం 1947 ప్రకారం సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ నేతృత్వంలో రెండు సరిహద్దు కమిషన్లను ఏర్పరిచింది.
1) బెంగాల్ సరిహద్దు కమిషన్ - దీనిలో ఐదుగురు సభ్యులు ఉంటారు. వారు 1) రాడ్‌క్లిఫ్ (చైర్మన్) 2) బిశ్వాస్ (ఐఎన్‌సీ) 3) ముఖర్జీ (ఐఎన్‌సీ) 4) మహ్మద్ అక్రం (ముస్లింలీగ్) 5) ఎస్ఏ రహ్మాన్ (ముస్లింలీగ్)
2) పంజాబ్ సరిహద్దు కమిషన్ - దీనిలో గల ఐదుగురు సభ్యులు: 1) రాడ్‌క్లిఫ్ (చైర్మన్) 2) తేజసింగ్ (ఐఎన్‌సీ) 3) మెహర్ చాంద్ మహాజన్ (ఐఎన్‌సీ) 4) దిన్ మహ్మద్ (ముస్లింలీగ్) 5) మహ్మద్ మునీర్ (ముస్లింలీగ్)
- పెద్ద ఎత్తున జరిగే మతపరమైన అల్లర్లను నివారించాలనే ఉద్దేశంతో 1947లో ఐఎన్‌సీ దేశ విభజనకు అంగీకారం తెలిపింది.
గాంధీజీ హత్య
- 1948, జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే గాంధీజీని హత్య చేశాడు.
- బిర్లా హౌస్ ప్రస్తుత పేరు- గాంధీ స్మృతి
- గాంధీ మరణిస్తున్నప్పుడు ఉచ్ఛరించిన పదం- హే రామ్
- గాంధీ సమాధి గల ప్రాంతం- రాజ్‌ఘాట్ (న్యూఢిల్లీ)
- నిందితులు: 1) నారాయణ్ ఆప్టే 2) గంగాధర్ దండావతే
- ఈ హత్య విచారణ నిమిత్తం వేసిన కమిషన్ కపూర్ కమిషన్.
- జనవరి 30ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకొంటారు. గాంధీ మరణంపై వ్యాఖ్యలు
- 20వ శతాబ్దంలో రక్త మాంసాలచే ఇలాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడంటే భవిష్యత్ తరంవారు నమ్మలేనటువంటి గొప్ప వ్యక్తి- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
- భారతీయుల్లో బుద్ధుని తరువాత గొప్ప మహాపురుషుడు, క్రీస్తు తరువాత ప్రపంచ కనీవినీ ఎరుగని మహా మనిషి- డా. హోమ్స్
- విశ్వమానవ చరిత్రపై గాంధీ ప్రభావం హిట్లర్, స్టాలిన్ల కంటే ఎక్కువ, శాశ్వతం- ఆర్నాల్డ్
పేరు మంత్రిత్వ శాఖ కాంగ్రెస్
కాంగ్రెస్: 1) జవహర్లాల్ నెహ్రూ ఉపాధ్యక్షులు, విదేశీ, కామన్వెల్త్
2) వల్లభాయ్ పటేల్ హోం, సమాచార శాఖ
3) బల్దేవ్ సింగ్ రక్షణ
4) డా. జాన్ మథాయ్ పరిశ్రమలు, సరఫరా
5) రాజగోపాల చారి విద్య
6) రాజేంద్రప్రసాద్ వ్యవసాయం, ఆహారం
7) అరుణా అసఫ్ అలీ రైల్వేలు
8) బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ
9) సీహెచ్ బాబా గనులు, విద్యుత్
- 1946, అక్టోబర్ 26న తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్ కూడా చేరింది.
- ముస్లింలీగ్: 10) లియాఖత్ అలీఖాన్ ఆర్థిక శాఖ
11) ఐఐ చండ్రిగర్ వాణిజ్యం
12) అబ్దుర్ రబ్ నిష్తర్ సమాచారం
13) గజ్నఫర్ అలీఖాన్ ఆరోగ్యం, వైద్యం
14) జోగేంద్రనాథ్ మండల్ న్యాయం - రాజ్యాంగ నిర్మాణ సమితి సమావేశం 1946, డిసెంబర్ 9న జరిగింది.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు