Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
గురుపూరబ్ లేదా గురుపర్బ
- సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్, ఖల్సా వ్యవస్థాపకుడు సిక్కుల పదో గురువూ అయిన గురు గోబింద్‌సింగ్ తోపాటు మిగిలిన ఎనిమిది మంది గురువుల జయంతి ఉత్సవాలనే గురుపూరబ్ అంటారు. గురునానక్ వైశాఖ మాసంలో జన్మించినప్పటికీ, ఆయన జయంతిని మాత్రం కార్తికంలో జరుపుకొంటారు. గురు గోబింద్‌సింగ్ జయంతిని పుష్య మాసంలో నిర్వహిస్తారు. గురుపూరబ్ సందర్భంగా సిక్కుల ప్రార్థనా మందిరాలు గురుద్వారాల్లో వారి పవిత్ర గ్రంథం ‘గురుగ్రంథ్ సాహిబ్’ అఖండ పారాయణం చేస్తారు.
2. హొలా మొహల్లా
- హొలా మొహల్లా ఫాల్గుణ మాసంలో హోలి తర్వాత రోజున వస్తుంది. దీనిని పంజాబ్‌లోని ఆనంద్‌పుర్ సాహిబ్‌లో ఘనంగా జరుపుకొంటారు. సిక్కుల పదో గురువు గురు గోబింద్‌సింగ్ క్రీ.శ. 1700లో సిక్కులు తమ యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం హొలా మొహల్లాను ప్రారంభించాడు. ఇప్పటికీ ఈ రోజున తమ సైనిక వారసత్వాన్ని చాటుతూ, ఖల్సా పంథ్‌కు తాము విధేయులమని సూచిస్తూ సిక్కులు తమ సంప్రదాయ యుద్ధకళ ‘గట్కా’ ప్రదర్శిస్తారు.
3. మహావీర్ జయంతి - ఇది జైనమత వ్యవస్థాపకుడు, 24వ తీర్థంకరుడూ అయిన వర్ధమాన మహావీరుడి జయంతి. జైన మతస్థులు ప్రతి ఏడాది చైత్ర శుద్ధ త్రయోదశినాడు మహావీర్ జయంతి జరుపుకొంటారు. దేశంలోని వివిధ జైన క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహావీరుడి జన్మస్థలం కుండగ్రామంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఊరు బిహార్‌లో ఉంది. మహావీరుడు దీపావళి నాడు కైవల్యం పొందాడని అంటారు.
4. మహా మస్తకాభిషేకం - కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెళగొళలోని గోమఠేశ్వరుడు లేదా బాహుబలి ఏకశిలా బృహద్విగ్రహానికి ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి జైనులు నిర్వహించే వేడుక మహా మస్తకాభిషేకం. మహా అంటే గొప్ప, మస్తకం అంటే తల, అభిషేకం అంటే స్నానం చేయించడం అని అర్థం. ఈ వేడుక ఇటీవలి కాలంలో 2018 ఫిబ్రవరిలో జరిగింది. ఇది 88వ మహా మస్తకాభిషేకం. భారతదేశంలోని ఏకశిలా విగ్రహాలు అన్నిటిలోకి పెద్దది గోమఠేశ్వరుడి విగ్రహమే.
- సుమారు 55 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాన్ని పశ్చిమ గాంగరాజు రాచమల్ల 4 దగ్గర ప్రధానమంత్రి, దండనాథుడిగా పనిచేసిన చాముండరాయలు (చౌండరాయలు) చెక్కించాడు. ఇది శ్రావణబెళగొళలోని ఇంద్రగిరి గుట్టమీద కొలువుదీరింది. విగ్రహాన్ని మహాపురుష లక్షణాలతో రూపొందించారు. ముఖం ప్రశాంతంగా, కండ్లు అర్ధ నిమీలితంగా (సగం మూసి ఉంటాయి), పొడవాటి చెవులతో, ఆజానుబాహువుగా మలచిన గోమఠేశ్వరుడి విగ్రహం కాయోత్సర్గ భంగిమలో ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం దీనిని ఖడ్గాసనం అంటారు.
- మొదటిసారిగా మహా మస్తకాభిషేకాన్ని విగ్రహం చెక్కడం పూర్తయిన వెంటనే క్రీ.శ. 981 మార్చి 13న నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఇది చాముండరాయల ఆధ్వర్యంలోనే జరిగింది. మహా మస్తకాభిషేకం కోసం 1008 కలశాలలో నీళ్లను తీసుకువస్తారు. మొదటగా మంచినీళ్లు, ఆ తర్వాత పాలు, చెరకురసం, ఓషధులు కలిపిన నీరు, పెరుగు, నెయ్యి, చందనం, ఇతర ద్రవాలతో అభిషేకిస్తారు.
బాహుబలి ఎవరు? - జైనుల మొదటి తీర్థంకరుడు రుషభనాథుడు. ఈయనకే ఆదినాథుడు అని మరో పేరు కూడా ఉంది. భారత ఉపఖండానికి ప్రభువైన రుషభనాథుడు రాజ్యాన్ని తన ఇద్దరు కొడుకులైన భరతుడు, బాహుబలికి పంచి ఇచ్చాడు. భరతుడి రాజధాని అయోధ్య. బాహుబలి రాజధాని పౌదనపురి(నిజామాబాద్ జిల్లా బోధన్). అయితే రాజ్యమంతా తనకే దక్కాలనే కోరికతో భరతుడు తమ్ముడి మీదికి దండెత్తాడు.
- సాధారణ యుద్ధాలకు భిన్నంగా వీరిద్దరి మధ్య జల(నీళ్లతో ఒకరినొకరు కొట్టుకోవడం), దృష్టి (ఒకరివైపు మరొకరు కన్నార్పకుండా చూడటం), చివరగా మల్ల యుద్ధం రూపంలో యుద్ధం జరిగింది. అలా సైనికుల రక్తం చిందకుండా యుద్ధం జరిగిందన్నమాట. ఈ మూడు రకాల యుద్ధాలలోనూ బాహుబలి విజేతగా నిలిచాడు.
- ఇది భరించలేని భరతుడు అంతటితో ఆగకుండా తన దగ్గరున్న చక్రాయుధాన్ని తమ్ముడి మీదికి విసిరాడు. అది బాహుబలిని గాయపరచకపోగా, తల వెనక అలంకరణగా మారిపోయింది. భరతుడికి ఏం చేయాలో తోచలేదు. బాహుబలి మాత్రం ఈ రాజ్యం, సుఖాలు అన్నీ అశాశ్వతంగా భావించాడు. అంతే నిల్చున్న భంగిమలోనే తపస్సులోకి వెళ్లిపోయాడు. కొంతకాలానికి అతని చుట్టూ పుట్ట పెరిగింది. శరీరం మీదున్న వస్ర్తాలు చివికిపోయాయి. శరీరం మీద తీగలు పెనవేసుకుపోయాయి. చివరికి జ్ఞానోదయం కలిగింది. ఈ ఘట్టానికి ప్రతీకగా మలిచినవే బాహుబలి లేదా గోమఠేశ్వరుడి విగ్రహాలు. శ్రావణబెళగొళతోపాటు కర్కాల, ధర్మస్థల, వేనూరులో కూడా గోమఠేశ్వరుడి విగ్రహాలు ఉన్నాయి.
- శ్రావణబెళగొళ అనే పదంలో శ్రమణ అంటే భిక్షువు, బెళగొళ అంటే తెల్లటి చెరువు అని అర్థం. ఇక్కడి ఇంద్రగిరి, చంద్రగిరి గుట్టల మీద జైన ఆలయాలు ఉన్నాయి.
5. బుద్ధ జయంతి - దీనికే బుద్ధ పూర్ణిమ అని కూడా పేరు. ఇది వైశాఖ పూర్ణిమ (ఏప్రిల్/ మే నెలలు) నాడు వస్తుంది. ఈ రోజున బుద్ధుడి జీవితంలో అతి ప్రధానమైన మూడు ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అవి… క్రీ.పూ. 566లో బుద్ధుడి జననం. ఆయన ముప్పై అయిదో ఏట బుద్ధగయలో జరిగిన జ్ఞానోదయం. మూడోది క్రీ.పూ. 486లో కపిలవస్తులో మహాపరినిర్వాణం(మరణం). అందుకే ఈ రోజును ఒక్క భారతదేశంలోనే కాకుండా బౌద్ధులు ఎక్కువగా ఉన్న శ్రీలంక, మయన్మార్, టిబెట్, జపాన్, థాయ్‌లాండ్, మలేసియా తదితర దేశాల్లోనూ ప్రార్థనలు జరపడం, భిక్షువులకు కానుకలు ఇవ్వడం లాంటివి చేస్తారు. శ్రీలంకలో దీనిని వేసాక్ అని పిలుస్తారు.
ఏరువాక పున్నమి - భారతదేశం వ్యవసాయ ప్రధానమైంది. రైతే దేశానికి వెన్నెముక. ప్రతి ఏడాది జూన్ నెలలో తొలి జల్లులు మొదలవగానే రైతులు సాగుపనులకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆ సంవత్సరం సాగుకు సన్నాహక కార్యక్రమంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రైతులు ఏరువాక పున్నమి జరుపుకొంటారు.
l ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే పొలాన్ని దున్నడం అర్థం. ఏరువాక పున్నమి రోజు రైతులు కొత్త వస్ర్తాలు ధరించి, తమ ఎడ్లను, వ్యవసాయ పనిముట్లను అలంకరించి ఆ ఏడాది తమకు మంచి దిగుబడి రావాలని వాటిని పూజిస్తారు. కర్ణాటకలో దీనిని ‘కర హున్నిమె’ అనే పేరుతో జరుపుకొంటారు.
వార్కరీలు
- మరాఠీలో వారి అంటే తీర్థయాత్ర. కరి అంటే చేసేవాడు. వార్కరి అంటే తీర్థయాత్రలు చేసేవాళ్లు అని అర్థం. వార్కరీలు ప్రతీ ఏడాది రెండుసార్లు ఆషాఢ, కార్తిక మాసాల్లో శుద్ధ ఏకాదశి నాటికి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పండరీపురానికి ఒక యాత్రగా చేరుకుంటారు. పండరీపురంలో ప్రధానదైవం పాండురంగ విఠ్ఠలుడు. దీనిని క్రీ.శ. 13వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్ర భక్తి ఉద్యమకారుడు జ్ఞానేశ్వర్ ప్రారంభించాడని అంటారు. పండరీపురం మహారాష్ట్ర భక్తి ఉద్యమ కేంద్రం.
- వార్కరీ యాత్రకు ఒక నెల ముందునుంచే పాండురంగ విఠ్ఠలుడి ప్రసిద్ధ భక్తులైన జ్ఞానేశ్వర్ (ఆలంది నుంచి), తుకారాం (దేహు నుంచి), నివృత్తినాథుడు (త్రయంబకం నుంచి), ఏక్నాథ్ (పైఠణ్ నుంచి) తదితరుల పాదుకలు ఉంచిన పల్లకీలను పండరీపురానికి తీసుకువస్తారు. ఈ పల్లకీలను డిండీలని పిలుస్తారు. ఇలా వచ్చేటప్పుడు ఆయా భక్తులు రాసిన అభంగాలు, భజనకీర్తనలను ఆలపిస్తూ పండరీపురానికి పాదయాత్ర చేస్తారు. వార్కరీ యాత్ర జరిగినన్ని రోజులూ భక్తులు ప్రత్యేక వస్ర్తాలను ధరించి, అత్యంత నియమనిష్ఠలతో గడుపుతారు.
6. కుంభమేళా
- త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ అలహాబాద్ (గంగ, యమున, సరస్వతి నదుల సంగమం), హరిద్వార్ (గంగా నది), ఉజ్జయిని (క్షిప్రా నది), నాసిక్ (గోదావరి) లో నిర్ణీత కాల వ్యవధుల్లో జరిగే వేడుక కుంభమేళా. ఈ నాలుగు ప్రాంతాల్లో కుంభమేళా ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి వస్తుంది. దీనిని పూర్ణ కుంభమేళా అంటారు. హరిద్వార్, అలహాబాద్‌లో మాత్రం ఆరేండ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు.
- కాగా నాసిక్‌లో గోదావరి, ఉజ్జయినిలో క్షిప్రా నదికి బృహస్పతి సింహ రాశిలో ప్రవేశించే సందర్భంలో ‘సింహస్థ కుంభమేళా’ నిర్వహిస్తారు.
- మొదట హరిద్వార్‌లో, ఆ తర్వాత మూడేండ్లకు ప్రయాగ (అలహాబాద్)లో, తర్వాత మూడేండ్లకు నాసిక్, ఇంకో ఏడాదికి ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది. ఒక్క ప్రయాగలో మాత్రం 144 ఏండ్లకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. ఇది 2013లో జరిగింది. ప్రపంచంలో అత్యధిక ప్రజలు హాజరయ్యే ధార్మిక కార్యక్రమంగా కుంభమేళాకు 2017 డిసెంబర్లో యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ హోదా లభించింది.
- కుంభమేళా నిర్వహణ వెనుక ఓ పురాణ కథ ఉంది. దేవతలు, దానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తారు. ఇందులో చివరగా జీవులకు మరణాన్ని దూరంచేసి, అమరత్వాన్ని కల్పించే అమృతం ఆవిర్భవించింది. దీనికోసం దేవతలు, దానవుల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ సమయంలో అమృత కలశంలోంచి నాలుగు బిందువులు భూమ్మీద నాలుగు ప్రదేశాలలో పడ్డాయని అంటారు. అవి హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయినిగా పేర్కొంటారు. అందుకే ఈ క్షేత్రాల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారట.
- మరో కథ ప్రకారం దేశంలోని సాధువులు అందరూ క్రమం తప్పకుండా ఒక దగ్గర కలుసుకోవడానికి గాను ఆది శంకరాచార్యులు చేసిన ఏర్పాటే కుంభమేళా అని కూడా పేర్కొంటారు. పన్నెండు రోజులపాటు జరిగే కుంభమేళాలో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి సంబంధిత నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
Previous article
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?