General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ

మెగా ఎకనామిక్ కారిడార్ India Middle East Europe Economic Corrider (IMEC)
- జీ-20 విజయాలుగా కొనియాడబడుతున్న అంశాల్లో ఒక ముఖ్య చొరవగా “భారత్-మధ్య ప్రాశ్చ్య-యూరప్ ఆర్థిక నడవా (IMEC)”ను చెప్పుకోవచ్చు. ఇది ఒక నౌకా మార్గ, రైలు మార్గ అనుసంధాన ప్రాజెక్ట్. రెండు ఖండాలను కలిపే ఈ మార్గం ఆసియా, అరేబియన్ గల్ఫ్, యూరప్‌ల మధ్య ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ప్రధానంగా ఉద్దేశించినప్పటికీ అనుషంగికంగా అనేక ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక, పర్యావరణ పరమైన ప్రయోజనాలు తోడవనున్నాయి.ఈ నడవాలో
రెండు కారిడార్లు ప్రధానంగా ఉన్నాయి. - అవి.. 1. ఈస్ట్రన్ కారిడార్: ఇది భారత్-
అరేబియా గల్ఫ్‌లను అనుసంధానిస్తుంది . - 2. నార్త్ కారిడార్: ఇది అరేబియా గల్ఫ్‌ను యూరప్‌తో అనుసంధానిస్తుంది
- ఈస్ట్రన్ కారిడార్ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌తో మొదలై యూఏఈలో ఘజైరాపోర్ట్ వద్ద ఆగుతుంది. అక్కడి నుంచి సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ మీదుగా రైలుమార్గం ఇజ్రాయెల్‌లోని హైపా పోర్టు వరకు సాగుతుంది. అక్కడి నుంచి మరొక నౌకామార్గం యూరప్‌లోని గ్రీస్‌ను అనుసంధానిస్తుంది.
ఈ నౌకామార్గాన్ని నార్త్ కారిడార్ అంటారు . - ఈ నడవాలో నౌక, రైలు మార్గాలతో పాటు ‘ హైడ్రోజన్ పైప్ లైన్’ ‘హైడెన్సిటీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్’లను కూడా ఏర్పాటు చేయనున్నారు .
- న్యూఢిల్లీలో జరిగిన 18వ జీ-20 సమావేశం వేదికగా ఈ IMEC నడవాకు సంబంధించి అవగాహన ఒప్పందం (Memorandum Of Under Standing -MOU ) కుదిరింది . 20 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ నడవాను రూపొందించడానికి సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూఏఈ, అమెరికా ఈ ఒప్పందంలో భాగస్వాములుగా సంతకాలు చేశాయి (ప్రస్తుతానికి ఇజ్రాయెల్, జోర్డాన్ లేనప్పటికీ భవిష్యత్‌లో అవి కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.)
- నిజానికి ఈ ఐఎంఈసీ (IMEC)ని ఒక బృహత్తర ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. 2021లో జీ.7 దేశాల సదస్సు సందర్భంగా PGII (Partnership for Rail and Shipping Carri ders for Global Infrastructure Initiative) ను ప్రతిపాదించారు. మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలను అనుసంధానించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయదలిచిన బృహత్తర ప్రాజెక్ట్ ఇది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌కు పోటీగా దీన్ని తలపెట్టారు. దీనిలో యూరప్, ఆసియా మధ్య ప్రాశ్చ్య దేశాలను
అనుసంధానిస్తాయి. - అంతేగాక ప్రస్తుతం తలపెట్టిన ఐఎంఈసీ (IMEC) నడవాకు భవిష్యత్తులో ఆగ్నేయాసియా దేశాలను కూడా అనుసంధానించే అవకాశం ఉంది. భారత్ నుంచి ఇండోనేషియా, మలేషియా వైపుగా ట్రాన్స్ ఏషియన్ రైల్వే నెట్వర్క్ ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పుడు దక్షిణకొరియా నుంచి భారత్ వరకు మొత్తం ఆసియా దేశాలను కలుపుతూ ఈ నౌకా, రైలు మార్గ వ్యవస్థ రూపొందించి ఐఎంఈసీ కి అనుసంధానత లభిస్తుంది. చైనాకు గట్టి ఎదురు దెబ్బ అవుతుంది.
ఐఎంఈసీ ప్రయోజనాలు:
1. ‘డిజిటల్ అండ్ సింగిల్ ట్రేడ్ డాక్యుమెంట్ ’ తో ఈ మార్గంలో నిరంతరాయంగా సరుకు రవాణా చేయవచ్చు. సూయజ్ కెనాల్ మార్గం కన్నా ఈ మార్గం చాలా చవకైనది. వేగవంతమైనది . ఈ మార్గంలో భారత సరుకులు యూరప్‌నకు, యూరప్ నుంచి భారత్‌కు చేరవేయడానికి 40 శాతం తక్కువ ఖర్చు, 30 శాతం తక్కువ సమయం పడుతుంది .
2. ప్రయాణించే దూరం తగ్గడం వల్ల ఇంధనం ఆదాతో పాటు పర్యావరణపరంగానూ మేలు చేకూరుతుంది. సూయజ్ కాలువపై ఒత్తిడి తగ్గి వేచి ఉండే సమయం కూడా అక్కడ తగ్గి ఆ మార్గం కూడా లబ్ధిపొందుతుంది .
3. కీలక రవాణా మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం దక్కించుకోవాలనుకుంటున్న చైనా వ్యూహాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌కు ఇది ఒక ప్రత్యామ్నాయం అవుతుంది. తద్వారా భారత్‌తో పాటు ఇతర సభ్య దేశాలకు వ్యూహత్మకంగా ఇది కలిసి వస్తుంది .
4. మధ్య ప్రాశ్చ్య, యూరోపియన్ దేశాలకు ఇది ఒక కొత్త మార్గం అవుతుంది. భారత్‌కు ఉత్తర ఆఫ్రికా, ఉత్తర అమెరికాలతో మరింత అనుసంధానత లభిస్తుంది .
5. ఈ మార్గంలో తక్కువ సమయంలో రవాణా చేయగలగడం వల్ల నశ్వర వస్తువుల (Perishable Goods ) వాణిజ్యం మరింత పెరుగుతుంది .
6. కొత్తగా ఉపాధి అవకాశాలతో పాటు ఈ మార్గంలో కొత్త వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి.
7. రైల్వే, నౌకాయాన అవస్థాపనులు ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతంలో సమాచార, సాంకేతిక, రవాణా, విద్యుత్ గ్రిడ్, సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ, కమర్షియల్ హబ్స్, తదితర మౌలిక సదుపాయాలు కూడా ఎంతో వృద్ధి చెందుతాయి. సుస్థిర ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి.
8. ఆసియా- మధ్య ప్రాశ్చ్య- యూరప్‌ల మధ్య ఆర్థిక బంధాల వల్ల సుస్థిర రాజకీయ ఐక్యత కూడాప్రోది చేయబడుతుంది. ముఖ్యంగా మధ్య ప్రాశ్చ్యంలోని దేశాల మధ్య ఘర్షణలు తగ్గడానికి తోడ్పడుతుంది.
9. వాణిజ్యం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి దేశాల్లో ద్రవ్యోల్బణాల స్థాయిలు కూడా తగ్గుతాయి.
10. భారత్‌కు ఉన్న స్థానిక కరెన్సీల్లో చెల్లింపు ఒప్పందాల కారణంగా మారక నిల్వలపై ఒత్తిడి, చమురు ధరలలో ఒడుదొడుకులు తగ్గడమేకాక మన కరెన్సీని అందుకున్న దేశాలు మన వస్తు సేవలను దిగుమతి చేసుకోవడంతో భారత్ ఎగుమతులు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా భారీస్థాయిలో భారత్ చెల్లించే చమురు బిల్లులు తిరిగి భారత్‌కు ఎగుమతి అవకాశాలను ప్రోదిచేస్తాయి.
11. భారత్‌కు చమురు రవాణా అత్యధికంగా జరిగే ప్రాంతా లకు ఈ మార్గం రానుండటంతో చమురు సరఫరాలో లోపాలు, ఆలస్యాలు తగ్గి సప్లయ్ చైన్ అవరోధాలు తగ్గుతాయి. అంతేగాక హైడ్రోజన్ పైప్‌లైన్ కూడా ఈ నడవాలో అనుసంధానమై ఉండటం వల్ల సుస్థిర ఇంధన భద్రత, పర్యావరణహితం చేకూరతాయి.
12. మెడిటేరియన్ సముద్రం నుంచి ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిరంతరాయంగా అనుసంధానించే ప్రప్రథమ మార్గం ఇది.
13. సౌదీ అరేబియా, ఇటలీ వంటి దేశాలు ఇటీవల తటస్థ వైఖరి అవలంబిస్తూ అమెరికా, చైనాల ప్రభావం నుంచి దూరంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సరికొత్త రవాణా మార్గం కూడా కొంత వరకు దోహదపడుతుంది.
14. ఈ మార్గం ఆహార భద్రతను పెంచడానికి అత్యవసర/ విపత్కర పరిస్థితుల్లో ఉపశమన చర్యల కోసం రవాణా వేగంగా జరపడానికి ఉపయోగపడుతుంది.
15. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కేబుల్ నెట్వర్క్ అవసరాల కోసం ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఎనర్జీ గ్రిడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఐటీ, డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో భారత్‌కు ఉన్న నైపుణ్యాలపరంగా కొత్త వాణిజ్య అవకాశాలు లభించేందుకు ఆస్కారం ఉంది. - ఇన్ని సౌలభ్యతల కారణంగా ఈ కారిడార్ నిర్మాణం భారత్‌తో పాటు మొత్తం ఈ భౌగోళిక ప్రాంతాలన్నింటికీ భవిష్యత్‌లో ఒక పెద్ద వరంగా మారనుంది.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు