Current Affairs August | జాతీయం
భగత్ బ్రిడ్జి
జమ్మూకశ్మీర్‌లోని దన్నా గ్రామం వద్ద నిర్మించిన బ్రిడ్జిని భారత సైన్యం ఆగస్టు 15న ప్రారంభించింది. దీనికి 1965లో జరిగిన యుద్ధంలో మరణించిన మేజర్ భగత్ సింగ్ పేరు కలిసి వచ్చేటట్లు భగత్ అని పెట్టారు. జమ్మూకశ్మీర్‌లోని మచ్ఛల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఉన్న మచ్ఛల్ కాలువపై దీన్ని నిర్మించారు. దేశ సరిహద్దుకు చివరి గ్రామమైన దన్నా గ్రామ ప్రజలు వర్షాల వేళ ఈ కాలువను దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందిని గుర్తించిన భారత ఆర్మీ రెండు నెలలు శ్రమించి ఈ వంతెనను నిర్మించింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఏడు గ్రామాలకు రాకపోకలు సుగమమం అవుతాయని ఆర్మీ పేర్కొంది.
టెస్టింగ్ సెంటర్
దేశంలోనే మొదటిసారి డ్రోన్ల కోసం కామన్ టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 16న వెల్లడించింది. డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ (డీటీఐఎస్) కింద దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీపెరంబుదూర్‌లోని వల్లంలో ఉన్న సిప్కాట్ (స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు) ఇండస్ట్రియల్ పార్క్ వద్ద రూ.45 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు.
ఫ్లడ్‌వాచ్
సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) రూపొందించిన ‘ఫ్లడ్‌వాచ్’ మొబైల్ యాప్‌ను సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్విందర్ వోహ్రా ఆగస్టు 17న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా వరద సమాచారాన్ని ముందుగానే తెలుసుకొని అప్రమత్తం కావచ్చు. దేశంలో ఎక్కడ వరదలు వచ్చినా, వచ్చే అవకాశం ఉన్నా ఈ యాప్‌లో రియల్ టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుంది. 338 స్టేషన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ యాప్ క్రోడీకరించి సమాచారాన్ని అందజేస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం చేరవేసి ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ యాప్ లక్ష్యం.
ఐఎన్ఎస్ వింధ్యగిరి
స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ ‘వింధ్యగిరి’ని కోల్‌కతాలోని హుగ్లీ నదీ తీరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 17న నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌సీఈ) ఈ నౌకను నిర్మించింది. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా స్వదేశీ పరిజ్ఞానంతో ఏడు యుద్ధ నౌకలను తయారు చేయాలని నౌకాదళం ‘ప్రాజెక్ట్17ఎ’ను ప్రారంభించింది. దీనిలో వింధ్యగిరి ఆరోది. కర్ణాటకలోని పర్వత శ్రేణి పేరు ఈ నౌకకు పెట్టారు. 149 మీ. పొడవు, 6670 టన్నుల బరువు గల ఈ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. భూమి, ఆకాశం, నీటి లోపల ఎదురయ్యే ముప్పులను ఇది తిప్పికొట్టగలదు.
ట్రెడిషనల్ మెడిసిన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ఆయుష్ శాఖ సంయుక్తంగా సంప్రదాయ ఔషధాలపై మొదటి గ్లోబల్ సదస్సును గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆగస్టు 17, 18 తేదీల్లో నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్, కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సంప్రదాయ ఔషధ వ్యవస్థలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ సమావేశాన్ని జీ20 ఆరోగ్య మంత్రివర్గ సమావేశంతో పాటు చేపట్టారు.
త్రీడీ పోస్టాఫీస్
దేశంలోనే తొలి త్రీడీ ప్రింట్ టెక్నాలజీతో నిర్మించిన పోస్టాఫీసును కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు 18న ప్రారంభించారు. ఈ పోస్టాఫీసును బెంగళూరులోని హలసూరులో 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కర్ణాటక తపాలా శాఖ మద్రాస్ ఐఐటీ నిపుణుల సహకారంతో దీన్ని పూర్తి చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?