Current Affairs | ‘నడకను హక్కు’గా గుర్తిస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది?
1. ఇటీవల ఏ వైరస్‌కు సంబంధించిన అత్యవసర పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉపసంహరించుకుంది? (2)
1) ఎం-పాక్స్ 2) కరోనా
3) ఎబోలా 4) హెచ్1ఎన్1
వివరణ: కరోనా నేపథ్యంలో 2020, జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సుమారుగా 1192 రోజుల తర్వాత 2023, మే 5న ఉపసంహరించుకుంది. వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో ఈ తరహా చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతుంది. నిధుల సమీకరణతో పాటు సంబంధిత వైరస్‌పై పరిశోధన పెరుగుతుంది. 2009లో తొలిసారిగా హెచ్1ఎన్1 విజృంభణ నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ తర్వాత 2014లో పోలియో, 2014-16 మధ్య ఎబోలా, 2015-16 మధ్య జికా, 2019లో మరోసారి ఎబోలా, అలాగే 2020లో కరోనా, 2022లో ఎం-పాక్స్ వైరస్ల విజృంభణతో మొత్తం ఏడు సార్లు అత్యవసర పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
2. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశం మే 4, 5 తేదీల్లో ఏ ప్రాంతంలో నిర్వహించారు? (4)
1) న్యూఢిల్లీ 2) బీజింగ్
3) మాస్కో 4) గోవా
వివరణ: ఎస్సీవో విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం గోవాలో నిర్వహించారు. ఎనిమిది దేశాల సంబంధిత మంత్రులు దీనికి హాజరయ్యారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్‌లో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి జైశంకర్ దీనికి నేతృత్వం వహించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఆర్థిక చేయూతను ఇవ్వడం ప్రపంచ శాంతికి పెనుముప్పుగా ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది ఎస్సీవో వ్యవస్థకు భారత్ నేతృత్వం వహిస్తుంది.
3. ‘పీటర్స్ బర్గ్ ప్రకటన’ దేనికి సంబంధించింది? (3)
1) ఉగ్రవాద నిర్మూలన
2) రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ
3) పర్యావరణ మార్పు
4) క్రీడల్లో సహకారం
వివరణ: పర్యావరణ మార్పునకు సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28వ సదస్సు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని బెర్లిన్‌లో జర్మనీ, యూఏఈలో సంయుక్తంగా నిర్వహించాయి. సమావేశం అనంతరం పీటర్స్ బర్గ్ డైలాగ్ వెలువడింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇందులో మాట్లాడారు. కర్బన ఉద్గారాలను తగ్గించాలని, ఆర్థిక వ్యవస్థల్లోని పరిశ్రమలను ఆ దిశగా సమాయత్తం చేయాలని ఆయన కోరారు. 2030 నాటికి బొగ్గు ఆధారిత పరిశ్రమలు లేకుండా చేయాలని సూచించారు.
4. బస్టైల్ డే పరేడ్ ఏ దేశంతో ముడిపడి ఉంది? (4)
1) జర్మనీ 2) స్వీడన్
3) స్విట్జర్లాండ్ 4) ఫ్రాన్స్
వివరణ: బస్టైల్ డే అనేది ఫ్రాన్స్‌లో ఏటా జూలై 14న నిర్వహించే మిలిటరీ కవాతు. ఈ ఏడాది జరిగే వేడుకలకు భారత ప్రధాని నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీనికి హాజరు కానున్న భారత రెండో ప్రధాని ఆయన. 2009లో మన్మోహన్ సింగ్ ఈ వేడుకలకు వెళ్లారు. 1880 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు.
5. ప్రపంచ మాతృ మరణాలు భారత్‌లో ఎంత శాతం ఉన్నాయని ఇటీవల ఐక్య రాజ్య సమితి నివేదిక తెలిపింది? (2)
1) 10% 2) 17%
3) 4% 4) పైవేవీ కాదు
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4.5 మిలియన్ల మంది గర్భిణులు, చిన్నారులు ఏటా మరణిస్తున్నారని ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో 2015 నుంచి పురోగతి లేదని కూడా నివేదిక స్పష్టం చేసింది. ఈ మరణాలకు కారణాలు నివారించదగ్గవే అయినా, సరైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని నివేదిక వెల్లడించింది. ఈ విధంగా మరణిస్తున్న తొలి 10 దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అలాగే మాతృ మరణాలు, ప్రసవానికి ముందే చిన్నారులు మరణించడం, నవజాత శిశువుల మరణాలు, భారత్‌లో సుమారు 17% ఉన్నాయని నివేదిక పేర్కొంది.
6. జేఐసీఏతో కలిసి భారత్ ‘స్మార్ట్’ ప్రాజెక్ట్‌ను అంగీకరించింది. ఇది దేనికి సంబంధించింది? (3)
1) ఆస్పత్రుల నిర్మాణం
2) రహదారి మౌలిక వసతులు
3) బుల్లెట్ రైలు
4) నీటి పారుదల ప్రాజెక్ట్‌లు
వివరణ: స్మార్ట్ ప్రాజెక్ట్‌కు జపాన్‌కు చెందిన జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో భారత్‌కు చెందిన గృహ పట్టణ మంత్రిత్వశాఖ, రైల్వే శాఖలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీన్ని ఎస్ఎంఈఆర్టీ (స్మార్ట్)గా వ్యవహరిస్తున్నారు. దీన్ని విస్తరిస్తే-స్టేషన్ ఏరియా డెవలప్మెంట్ అలాంగ్ ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు మార్గంలో సమీపంలోని స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించింది ఇది. ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాల పెంపుదలతో పాటు రైళ్లను అందుకోవడం, ప్రయాణికులకు మరింత సదుపాయాలను కల్పించేందుకు ఉద్దేశించింది.
7. ఐడ్రోన్ ఇనిషియేటివ్ ఇటీవల ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది? (1)
1) డ్రోన్ల ద్వారా రక్తం సరఫరా
2) డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల సరఫరా
3) డ్రోన్ల ద్వారా సమాచార మార్పిడి
సాధనాలు
4) పైవేవీ కాదు
వివరణ: ఐడ్రోన్ ఇనిషియేటివ్ అనేది డ్రోన్ల సహాయంతో రక్తాన్ని సరఫరా చేసేందుకు ఉద్దేశించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీన్ని ప్రారంభించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసింది. గ్రేటర్ నోయిడాలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. నోయిడాలోని జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇందుకు సాయం చేసింది.
8. ‘నడకను హక్కు’గా గుర్తిస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? (4)
1) కేరళ 2) మణిపూర్
3) గుజరాత్ 4) పంజాబ్
వివరణ: దేశంలోనే తొలిసారిగా నడకను ఒక హక్కుగా గుర్తిస్తూ పంజాబ్ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో రాష్ట్రంలో నిర్మించబోయే రహదార్లు, అలాగే పునర్నిర్మాణం చేపట్టినా లేదా విస్తరించినా, విధిగా పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు చేపట్టబోయే రహదారి ప్రాజెక్టులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
9. ఏ రోజున జాతీయ సాంకేతిక దినం నిర్వహిస్తారు? (3)
1) ఫిబ్రవరి 28 2) నవంబర్ 11
3) మే 11 4) మే 4
వివరణ: ఏటా మే 11న జాతీయ సాంకేతిక రోజుగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ రోజుకు సంబంధించిన ఇతివృత్తం ‘స్కూల్ టు స్టార్టప్స్-ఇగ్నైటింగ్ యూత్ మైండ్ టు ఇన్నోవేట్’. 1998లో భారత్ పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించింది. దీనికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. అణ్వాయుధాలు కలిగిన ఆరో దేశంగా నాడు భారత్ అవతరించింది. 1999 నుంచి జాతీయ సాంకేతిక రోజును నిర్వహిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ రోజుగా, నవంబర్ 11న అంతర్జాతీయ సైన్స్ రోజుగా నిర్వహిస్తారు.
10. సీపీఈసీ ని ఏ దేశం వరకు విస్తరించాలని ఇటీవల నిర్ణయించారు? (2)
1) తజికిస్థాన్ 2) అఫ్గానిస్థాన్
3) ఇరాన్ 4) నేపాల్
వివరణ: చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో అఫ్గానిస్థాన్ కూడా భాగస్వామ్యం కానుంది. తాలిబన్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. మూడు ఖండాలు, దాదాపు అరవై దేశాలను కలుపుతూ చైనా దీన్ని చేపట్టింది. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా ఇది వెళుతుంది. దీని పట్ల భారత్ అభ్యంతరం చెప్తుంది. ఇది భారత్ సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించడమే అని పేర్కొంది. పాకిస్థాన్, చైనా ఈ ప్రాంతంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ అని పేరు. దీన్ని తాజాగా అఫ్గానిస్థాన్ వరకు విస్తరించారు.
11. అరబ్ లీగ్‌లోకి ఇటీవల ఏ దేశాన్ని తిరిగి చేర్చుకున్నారు? (2)
1) ఇజ్రాయెల్ 2) సిరియా
3) ఇరాన్ 4) తుర్కియే
వివరణ: అరబ్ లీగ్ అనేది 22 దేశాల కూటమి. 1945, మార్చి 22న ఏర్పాటయ్యింది. ఈ కూటమి నుంచి 2011లో సిరియాను సస్పెండ్ చేశారు. ఇటీవల తిరిగి ఆ దేశానికి స్థానం కల్పించారు. కూటమి ప్రధాన కేంద్రం కైరోలో ఉంది. సభ్యదేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు సహకారం దిశగా నడిపించేందుకు ఈ కూటమిని ఏర్పాటు చేశారు.
12. కింది ఎవరిని మనీలాండరింగ్ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు? (3)
1) క్రీడాకారులు
2) ఎగుమతి వ్యాపారులు
3) చార్టెర్డ్ అకౌంటెంట్లు
4) ఎవరూ కాదు
వివరణ: చార్టెర్డ్ అకౌంటెంట్లతో పాటు కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్లను కూడా పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందటే క్రిప్టో కరెన్సీ లావాదేవీలను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పీఎంఎల్ఏ 2005, జూలై 1న అమల్లోకి వచ్చింది.
13. నీరజ్ చోప్రా ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? (4)
1) బాక్సింగ్ 2) క్రికెట్
3) టెన్నిస్ 4) జావెలిన్ త్రో
వివరణ: నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్రీడాకారుడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలిచాడు. భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాన్ని పొందిన రెండో క్రీడాకారుడు. ఇటీవల దోహాలో నిర్వహించిన డైమండ్ లీగ్‌లో బంగారు పతకాన్ని పొందాడు. 88.67 మీటర్లు విసరడం ద్వారా ఈ ఘనతను దక్కించుకున్నాడు.
14. భారత మొట్టమొదటి ఇంటర్నేషనల్ మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? (4)
1) నాగాలాండ్ 2) త్రిపుర
3) మిజోరం 4) అసోం
వివరణ: దేశ వ్యాప్తంగా 35 మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలి అంతర్జాతీయ పార్క్ మాత్రం అసోం రాష్ట్రంలోని జోగిగోఫాలో రానుంది. ఈ సంవత్సరం చివరి నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు. దీని నిర్మాణానికి రూ.693.97 కోట్లు వ్యయం చేయనున్నారు. రైలు, రోడ్, వాయు మార్గాలను ఈ పార్కుకు అనుసంధానం కూడా చేయనున్నారు.
15. భారత వైమానిక దళానికి చెందిన తొలి వారసత్వ కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? (3)
1) ఇండోర్ 2) పుణె
3) చండీగఢ్ 4) నాగ్‌పూర్
వివరణ: భారత వైమానిక దళానికి చెందిన వారసత్వ కేంద్రాన్ని పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో ఏర్పాటు చేశారు. ఇది 17,000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. 1965, 1971 యుద్ధాలతో పాటు కార్గిల్‌లో జరిగిన పోరాటం అలాగే బాలాకోట్ వైమానిక దాడుల్లో భారత వైమానిక దళానికి చెందిన పలు అంశాలు ఈ కేంద్రంలో ఉంటాయి. భారత సైన్యానికి చెందిన తొలి మ్యూజియంను ఇటీవల ఇండోర్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ కేంద్రం ఏర్పాటుకు భారత వైమానిక దళంతో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?