Career Guidance for Engineering | కోర్సులు అనేకం.. కావద్దు ఆగమాగం!
Engineer Career Options –
ఇంజినీరింగ్ బ్రాంచీలు
Engineer Career Options | ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్ చేయాలనుకునే వారు సాధారణంగా బి.ఇ /బి.టెక్ కోర్సుల్లో చేరుతారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైన తరువాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. కౌన్సెలింగ్ సమయంలో ఇష్టమైన ఇంజినీరింగ్ కోర్సుల గురించి తెలియజేయాలి.
విభాగాలు
- ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇంజినీరింగ్ పరీక్షలు రాస్తున్నారు. సాఫ్ట్వేర్ బూమ్ తర్వాత దేశంలో ఎన్నో ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్ కోర్సుల్లో అనేక విభాగాలు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యం కలిగినది కంప్యూటర్ సైన్స్. ఆ తరువాత మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్ వంటి వివిధ బ్రాంచీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఎనర్జీ, మైనింగ్, ఓషన్ ఇంజినీరింగ్, ఫుడ్, ప్రొడక్షన్, పెట్రోల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ వంటి అనేక కోర్సులున్నాయి.
- ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత సరైన అవకాశాలు ఉండే దిశలో హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ ప్రయత్నాలు చేస్తుంది. 2020, ఫిబ్రవరిలో విడుదల చేసిన ఒక ప్రెస్ రిపోర్ట్ ఆధారంగా నూతన టెక్నాలజీల్లో ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభించాలని ఒక సూచన చేశారు. ఇందులో కొన్ని కోర్సులు ఎలక్టివ్ గాను లేదా ఇతర బ్రాంచీలతో కలిపి కూడా కొన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్న కోర్సుల్లో సీట్లను నియంత్రిస్తూ, కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నారు. ఇష్టాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి కోర్సును ఎంచుకోవాలి.
ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ - కమర్షియల్, ఇండస్ట్రియల్, మిలిటరీ అప్లికేషన్స్‌తో ఈ విభాగానికి ఎంతో డిమాండ్ ఉంటుంది. ఏరోస్పేస్లో ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ రెండు విభాగాలున్నాయి. ఈ కోర్సు చేసినవారు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌లను తయారు చేసి, అభివృద్ధి చేయగలరు. ఏరోనాటికల్ ఇంజినీరింగ్.. విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్‌కు సంబంధించిన కోర్సు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో అంతరిక్ష నౌకలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా నేర్చుకుంటారు. పెరుగుతున్న రీసెర్చ్, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఎయిర్‌క్రాఫ్ట్, ఏవియేషన్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఏవియానిక్స్ ఇంజినీరింగ్ అంటే ఏరోస్పేస్‌కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ గురించి ఉంటుంది.
- ఏరోస్పేస్ ఇంజినీరింగ్ 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. ఐఐటీ బొంబాయి (71+8 సీట్లు), ఐఐటీ ఖరగ్‌పూర్ (41+3 సీట్లు), ఐఐటీ కాన్పూర్ (55 +3సీట్లు), ఐఐటీ మద్రాస్ (62 +1 సీట్లు)లో ఉన్నాయి. ఐఐఎస్టీ బెంగళూరులో 60 సీట్లు ఏరోస్పేస్లో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఏవియానిక్స్)లో 60 సీట్లు ఉన్నాయి. ఇవి దేశంలోని టాప్ కాలేజీలు. ఖరగ్‌పూర్, మద్రాస్‌లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం ఉంది.
బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ - బయోటెక్నాలజీకి భారతదేశం ప్రపంచంలోని టాప్ 12 డెస్టినేషన్స్లలో ఒకటిగా ఉంది. గత దశాబ్ద కాలంలో, కొవిడ్ సమయంలో ఈ విభాగం ఎంతో అభివృద్ధి చెందింది. బయోటెక్నాలజీ సెక్టార్‌ను బయో ఫార్మాస్యూటికల్స్, బయో అగ్రికల్చర్, బయో ఐటీ, బయో సర్వీసెస్‌గా విభజించారు. 2025కు ఇండియన్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ 100 బిలియన్ డాలర్ మార్కెట్‌గా ఎదిగే దిశలో ఉంది. బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌లో బయాలజీ, కెమికల్ ఇంజినీరింగ్ సూత్రాలపై ఆధారపడి ఉంది. దీని ఆధారంగా పంటలు, పశుసంరక్షణ ఉత్పత్తి పెంచవచ్చు. ఇంకా ఫార్మాస్యూటికల్, మెడిసిన్, పర్యావరణం, టెక్స్టైల్, జంతు శాస్త్రంలో ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్ వంటి అనేక భాగాలు ఉన్నాయి.
- బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయోకెమికల్ ఇంజినీరింగ్ వంటి అనేక కోర్సులున్నాయి. ఐఐటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్లు, ఇతర కాలేజీల్లో కోర్సులున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ డేటా సైన్స్ - మెషిన్ మనిషిలాగా పనులు చేయగలదా? లాజికల్‌గా, స్మార్ట్‌గా ఆలోచించగలదా? ఈ ఆలోచనల నుంచి ఆవిర్భవించిందే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్‌లో ఒక విభాగం. సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులు చేయగల స్మార్ట్ యంత్రాలను నిర్మించటానికి సంబంధించింది. ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ సైన్స్. స్పీచ్ రికగ్నిషన్, కస్టమర్ సర్వీస్, కంప్యూటర్ విజన్, ఆటోమేటెడ్ స్టాక్ ట్రేడింగ్ వంటి అప్లికేషన్స్‌లో ఉపయోగపడవచ్చు. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ దీనికి సంబంధించిన కొన్ని భాగాలు. టెక్నాలజీ సంబంధిత ప్రతి రంగంలో దీనివల్ల ఎంతో పురోగతి సాధ్యపడుతుంది. మొబైల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వంటి అన్నింటిలో వీటి ఉపయోగం ఉంటుంది.
- డేటా సైన్స్: ఇది ఒక బిగ్ డేటా యుగం. వ్యాపార సంస్థల వద్ద, ప్రతి చోటా డేటా చాలా ఎక్కువగా ఉంది. అందుకే 21వ శతాబ్దంలో డేటా సైంటిస్టులకు ఎంతో డిమాండ్ ఉంది. డేటా అంటే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగించుకునేవిధంగా ఉండాలి. స్టాటిస్టిక్స్, సైంటిఫిక్ కంప్యూటింగ్, సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించి స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్ డేటా నుంచి కావాల్సిన సమాచారాన్ని వెలికితీయడం డేటా సైన్స్‌తో సాధ్యం. ఒక సంస్థ తమ దగ్గర ఉన్న సమాచారం నుంచి, సరైన సమాచారాన్ని వేరుచేసి, దానిలో ఉన్న సారాన్ని సేకరించడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ను బట్టి తగిన వ్యాపార నిర్ణయం తీసుకోగలరు.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ వంటి కోర్సులు ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ జోధ్‌పూర్, ఐఐటీ భిలాయ్, ఐఐఐటీ ఆంధ్రప్రదేశ్, ఐఐఐటీ నయా రాయ్‌పూర్, ఐఐఐటీ ధార్వాడ్లలో ఉన్నాయి.
సైబర్ సెక్యూరిటీ - కిరాణా కొట్టు నుంచి అంతరిక్షం వరకు కంప్యూటర్, అంతర్జాలంతో అనుసంధానమైన ఈ యుగంలో కంప్యూటర్‌కు దూరంగా ఉండలేం. అందుకే సైబర్ క్రైమ్‌ని అరికట్టడానికి సైబర్ లా, సైబర్ సెక్యూరిటీ వంటివి ఎక్కువ ప్రాధాన్యంలోకి వచ్చాయి. సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా ఫైనాన్సియల్ అండ్ మెడికల్ సెక్టార్లతో పాటు పబ్లిక్ విభాగాలపై దాడి చేస్తున్నారు. ఇతర వ్యాపారాల్లో కూడా కస్టమర్ డేటా చోరీ చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొన్ని వందల బిలియన్ డాలర్లు ఖర్చుపెడుతున్నారు. ఒక ప్రమాదాన్ని గుర్తించడం, దాని నుంచి కాపాడటం, నష్టం జరిగితే రికవర్ చేయడం వంటి ఫ్రేమ్‌వర్క్ సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్ పరికరాలు, నెట్వర్క్, డేటాను అనధికారికంగా ఎవరూ ఉపయోగించకుండా, వారికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకుంటూ, సైబర్ దాడిని నిరోధిం చడం. ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్‌తో కలిపి కొన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టారు.
రోబోటిక్స్ - మనిషికి సహాయపడే పరికరాలను తయారు చేసే యంత్రాన్ని తయారు చేయడం, మనిషి వలే పనిచేసే పరికరాన్ని తయారు చేయడం రోబోటిక్స్ ఉద్దేశం. మనిషి వెళ్లలేని ప్రదేశానికి కూడా పంపవచ్చు. మనిషి వెళ్లడానికి ఇష్ట పడని ప్రదేశానికి కూడా పంపవచ్చు. రోబోటిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇంటర్‌డిసిప్లినరీ ఫీల్డ్. రోబోటిక్స్ అంటే రోబోట్ రూపకల్పన, నిర్మాణం, ఉపయోగించడం. కంప్యూటర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లోని ఆవిష్కరణలు కూడా రోబోటిక్స్ ఫీల్డ్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ రోబోటిక్స్ ఇంజినీర్‌గా మారితే కోడింగ్ బాగా చేయగలడు. మెకానికల్ ఇంజినీర్ రోబోటిక్స్ చేస్తే డిజైన్ బాగా చేయగలడు. కొన్ని చోట్ల రోబోటిక్స్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. కానీ ఇవి ఇతర విభాగాలకు ఎలక్టివ్‌గా ఎక్కువగా ఉన్నాయి. రోబోలు మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ, ప్యాకింగ్, రవాణా, భూమి, అంతరిక్ష అన్వేషణ, శస్త్రచికిత్స, ఆయుధాలు, ప్రయోగశాల పరిశోధన, వినియోగదారులు, పారిశ్రామిక వస్తువుల భారీ ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ఐవోటీ (IOT-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) - ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే వివిధ పరికరాలను అంతర్జాలంతో అనుసంధానం చేయడం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ భౌతిక ప్రపంచాన్ని మార్చివేస్తుంది. దీన్ని వివిధ పరికరాలకు కనెక్ట్ చేస్తూ ఒక డైనమిక్ సిస్టమ్‌గా మారుస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీలతో ఐవోటీ డిమాండ్ మరింత పెరుగుతుంది. కెమెరాలు, సెన్సర్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు ప్రతి చోట దీని ఉపయోగం ఉంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్, ఆపిల్ వాచ్, బేబీ మానిటర్స్, వీడియో డోర్‌బెల్స్ ఇవన్నీ ఉదాహరణలే. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రక్ ఫ్లీట్ మేనేజ్మెంట్ వంటి ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ కోర్సును కంప్యూటర్సైన్స్తో కలిపి కొన్ని కళాశాలలు అందిస్తున్నాయి. సర్క్యూట్స్, సెన్సర్లు, ఎంబెడెడ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్, అప్లికేషన్స్ వంటివి ఈ కోర్సుల్లో నేర్చుకోవచ్చు. డిప్లొమా ప్రోగ్రాం, సర్టిఫికెట్ ప్రోగ్రాం లేదా బ్యాచిలర్ కోర్సుల రూపంలో iot కోర్సులున్నాయి.
ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) / వర్చ్యువల్ రియాలిటీ (VR) - ఏఆర్ అనేది డిజిటల్ ప్రపంచం, భౌతిక అంశాల సంపూర్ణ సమ్మేళనం ద్వారా ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం. మొబైల్ లేదా డెస్క్‌టాప్ కోసం AR సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసిన యాప్స్ ద్వారా డిజిటల్ విభాగాలను వాస్తవ ప్రపంచంతో కలుపుతారు. ఉదాహరణకు స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ చేసే స్కోర్ బోర్డు, 3డీ ఫొటోలు, సందేశాలు, ఇ-మెయిళ్లను పాప్ అవుట్ చేయడానికి ఏఆర్ సాంకేతికత సహాయపడుతుంది. వర్చువల్ రియాలిటీ అనేది కంప్యూటర్ సృష్టించిన వాస్తవికత అనుకరణ, ఒక ప్రత్యామ్నాయ ప్రపంచం. దీన్ని 3డీ సినిమాలు, వీడియో గేమ్‌లలో ఉపయోగిస్తారు. కంప్యూటర్లు, హెడ్సెట్లు, చేతి తొడుగులు వంటి ఇంద్రియ పరికరాలను ఉపయోగించి వీక్షకుడిని ఒక కృత్రిమ ప్రపంచంలో ముంచెత్తడానికి ఉపయోగపడుతుంది. ఏఆర్ తో తయారు చేసిన వేకప్ యాప్ డ్రైవర్లు నిద్రపోతుంటే అలర్ట్ చేస్తుంది. ఏఆర్‌కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ షాపింగ్‌లో, రిమోట్‌గా రిపేర్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. మెడికల్ ఫీల్డ్‌లో దీనివల్ల కొన్ని రోగాలను ఆరంభ దశలోనే గుర్తించడానికి, పేషెంట్లను రిమోట్‌గా ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉంది.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ - బిట్‌కాయిన్, డిజిటల్ కరెన్సీ గురించి వినుంటారు. బిట్‌కాయిన్ ఉపయోగించే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వల్ల దీన్ని హ్యాక్ చేయడం సులువు కాదు. బ్లాక్‌చెయిన్ సమాచారాన్ని రికార్డ్ చేసే ఒక విధానం. అది ఆ సమాచారాన్ని మార్చడం లేదా హ్యాక్ చేయడం అసాధ్యం చేసే విధంగా సమాచారాన్ని భద్రపరుస్తుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అనేది లావాదేవీల డిజిటల్ లెడ్జర్, ఆ ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ సిస్టమ్స్ మొత్తం నెట్‌వర్క్‌లో పొందుపరుస్తుంది. బ్లాక్‌చెయిన్‌లో ప్రతిసారీ కొత్త లావాదేవీ జరిగినప్పుడు, ప్రతి లావాదేవీ రికార్డ్ పాల్గొనే లెడ్జర్‌కు జోడించబడుతుంది. దీనివల్ల హ్యాకింగ్ చేయడం కష్టం. ఈ కోర్స్ కంప్యూటర్ సైన్స్‌తో కలిపి కొన్ని కళాశాలలు అందిస్తున్నాయి.
3డీ ప్రింటింగ్ - ఐఐటీ మద్రాస్ స్టార్టప్ క్యాంపస్‌లో కాంక్రీట్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఒక ఇంటిని నిర్మించారు. దీనివల్ల నిర్మాణ సమయం, ఖర్చు తగ్గుతుంది. 3డీ ప్రింటింగ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ మోడలింగ్ ద్వారా 3 డైమెన్షనల్ వస్తువులు తయారు చేయడం. 3డీ ప్రింటింగ్ నిపుణులు డిజైన్ హౌస్‌లలో 3డీ డిజైన్, 3డీ కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్ (CAD) మోడలింగ్, బయోలాజికల్, సైంటిఫిక్ మోడలింగ్, ఆర్కిటెక్చర్ లేదా కన్స్ట్రక్షన్ మోడలింగ్‌లో వారి సేవలను అందిస్తున్నారు. ఇది ప్రొటోటైప్‌లను చేయడంతో పాటు ఫైనల్ ఆబ్జెక్ట్‌ను తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తున్నారు.
- మారుతున్న ప్రపంచంతో ఇంజినీరింగ్ విద్య మారుతుంది. చదవాలనుకున్న కోర్స్ డిటెయిల్స్ జాగ్రత్తగా తెలుసుకుని, సరిపడే కోర్సును ఎంచుకోండి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9849733780
+91 9949757235
www.lawprep.in
Previous article
NEIGRIHMS Recruitment | నైగ్రిమ్స్‌లో 42 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం