current affairs కరెంట్ అఫైర్స్
తెలంగాణ
జస్టిస్ గోపాల్‌రెడ్డి
తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నూతన చైర్మన్‌గా జస్టిస్ ఏ గోపాల్‌రెడ్డిని ప్రభుత్వం ఫిబ్రవరి 6న నియమించింది. ఈయన హైకోర్టులో జడ్జిగా పని చేసి రిటైర్ అయ్యారు. కమిటీ సభ్యులుగా మంజూర్ హుస్సేన్ (జేఎన్టీయూ రిజిస్ట్రార్), విమలా థామస్ (సిద్దిపేట మెడికల్ కాలేజీ డైరెక్టర్), జీవీ లక్ష్మణ్ రావు (చార్టెర్డ్ అకౌంటెంట్), పీ సుధీర్‌రెడ్డి (అడ్వకేట్), ఓయూ వీసి (ఇంజినీరింగ్ కోర్సులు), కాళోజీ వర్సిటీ వీసీ (మెడికల్ కోర్సులు), మహాత్మాగాంధీ వీసి (బీఈడీ కోర్సులు) నియమితులయ్యారు.
మొబిలిటీ చాలెంజ్
ఈ-మొబిలిటీ వీక్‌లో భాగంగా టీ హబ్‌లో మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్‌ను ఫిబ్రవరి 7న నిర్వహించారు. దీనిలో ఐ-ఎలక్ట్రిక్‌కు ప్రథమ స్థానం దక్కింది. నియోమోషన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ స్టార్టప్‌లకు సంయుక్తంగా రూ.15 లక్షల గ్రాంట్‌ను అందించారు. మొత్తం 7 స్టార్టప్‌లను ఎంపిక చేయగా, అందులో తెలంగాణ, కర్ణాటక రాష్ర్టానికి చెందినవి రెండు చొప్పున, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
ఎస్టీలోకి 11 కులాలు
ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేరుస్తూ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఫిబ్రవరి 10 ఆమోదించింది. వాల్మీకి బోయ, బేడర్, కిరాతక, నిషాద్, పెద్ద బోయలు, తలయారి, చుండువాళ్లు, కాయితి లంబాడాలు, భాట్ మధురాలు, చమర్ మధుర లను ఎస్టీలుగా గుర్తించారు. ఈ కులాలను ఎస్టీలుగా గుర్తించాలన్ని ఎస్టీ విచారణ సంఘం 2016లో సిఫారసులు చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నివసిస్తున్న మాలి సామాజిక వర్గం తమను ఎస్టీలుగా గుర్తించాలని అనేక ఏండ్లుగా కోరుతుంది. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని ఎస్టీలో చేర్చారు. దీంతో మొత్తం 11 కులాలు ఎస్టీ జాబితాలో చేరాయి.
జాతీయం
డ్రోన్ ట్రాఫిక్ సిస్టమ్
దేశంలో మొదటిసారిగా డ్రోన్ల కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి 7న ఆవిష్కరించారు. దీన్ని గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై ఎయిర్ డ్రోన్ స్టార్టప్ సంస్థ ‘స్కై యూటీఎం’ అనే పేరుతో రూపొందించింది. ఇది మానవరహిత ట్రాఫిక్ నిర్వహణ. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్ఓఎస్) డ్రోన్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని ద్వారా ఏ డ్రోన్‌ను అయినా చూడకుండానే సుదూర ప్రాంతాలకు సురక్షితంగా ఆపరేట్ చేయవచ్చు.
సుప్రీంకోర్టు జడ్జీలు
అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే అరవింద్ కుమార్‌లకు సుప్రీంకోర్టు జడ్జీలుగా కేంద్రం ఫిబ్రవరి 10న పదోన్నతి కల్పించింది. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ఫిబ్రవరి 6న ప్రమాణం చేశారు. ఆయనతో పాటు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసాసుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు.
ఎస్ఎస్ఎల్వీ డీ-2
చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్ఎస్ఎల్వీ) డీ-2 రాకెట్‌ను ఫిబ్రవరి 10న విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా ఈఓఎస్-07, జానుస్-1, ఆజాదీ శాట్-2 అనే మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గతేడాది చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ-1 విఫలమైంది. ఆజాదీ శాట్‌ను దేశవ్యాప్తంగా 750 మంది పాఠశాల విద్యార్థినులు తయారు చేశారు. దీనిలో తెలంగాణ విద్యార్థినులు కూడా ఉన్నారు.
అంతర్జాతీయం
భూకంపం
తుర్కియే (టర్కీ), సిరియా దేశాల్లో ఫిబ్రవరి 6న భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భూకంపం వల్ల సుమారు 34 వేలకు పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చు. దీంతో ఆగ్నేయ తుర్కియేలోని భూకంప ప్రభావిత 10 ప్రావిన్సుల్లో మూడు నెలల పాటు అత్యవసర స్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ)ని ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ విధించారు.
తుర్కియేను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సహాయక చర్యలు చేపట్టింది. ఆస్పత్రులను నెలకొల్పేందుకు కావాల్సిన పరికరాలు, ఔషధాలు, ఇతర పరికరాలతో భారత వైమానిక దళానికి చెందిన సీ17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ తుర్కియేకు ఫిబ్రవరి 8న వెళ్లింది. కొవిడ్ సమయం 2021లో తుర్కియే భారత్‌కు రెండు విమానాల నిండా కొవిడ్ మందులను పంపింది.
హైపర్‌సానిక్ జనరేటర్
హైపర్‌సానిక్ స్పీడ్‌తో ప్రయాణించే వేడి వాయువును విద్యుచ్ఛక్తిగా మార్చే జనరేటర్‌ను అభివృద్ధి చేసినట్లు చైనా సైంటిస్టులు ఫిబ్రవరి 7న ప్రకటించారు. దీని ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును మిలిటరీ లేజర్లు, రైల్ గన్లు, మైక్రోవేవ్ ఆయుధాలకు వినియోగించవచ్చు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన సైంటిస్టులు ఈ జనరేటర్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాలు థియరిటికల్ అండ్ అప్లయ్డ్ మెకానిక్స్ జర్నల్లలో ప్రచురితమయ్యాయి.
గూగుల్ బార్డ్
చాట్‌జీపీటీకి పోటీగా ‘బార్డ్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్‌ను సిద్ధం చేసినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఫిబ్రవరి 7న ప్రకటించారు. ముందుగా దీన్ని నమ్మకమైన టెస్టర్లకు అందుబాటులోకి తెచ్చిన తర్వాత కొద్ది వారాల్లో అందరికీ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. దీన్ని మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్ (LaMDA) ఆధారంగా రూపొందించారు. సంభాషణల ద్వారా ఇది పని చేస్తుంది. చిన్న చిన్న సందేహాల నుంచి సంక్లిష్ట ప్రశ్నల వరకు అన్నింటికీ జవాబు ఇస్తుంది. అంతర్గత టెస్టింగ్‌తో పాటు ఫీడ్‌బ్యాక్ తీసుకొని అత్యున్నతంగా ‘బార్డ్’ను రూపొందిస్తున్నట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ మద్దతుతో ఓపెన్ఏఐ అనే సంస్థ చాట్‌జీపీటీ పేరుతో ఏఐ చాట్‌బోట్‌ను తెచ్చింది.
వరల్డ్ పల్సెస్ డే
ఐక్యరాజ్యసమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం (వరల్డ్ పల్సెస్ డే)ను ఫిబ్రవరి 10న నిర్వహించారు. స్థిరమైన ఆహార ఉత్పత్తిలో భాగంగా పప్పు దినుసుల పోషక, పర్యావరణ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2016ను అంతర్జాతీయ పప్పుదినుసుల సంవత్సరంగా ప్రకటిస్తూ 2013, డిసెంబర్ 20న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 10ని వరల్డ్ పల్సెస్ డేగా నిర్వహించాలని 2019లో ఆమోదించి, నిర్వహించింది.
వార్తల్లో వ్యక్తులు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఫిబ్రవరి 5న మరణించారు. ఆయన దేశ విభజనకు ముందు 1943, ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. 1964లో పాకిస్థాన్ ఆర్మీలో చేరిన ముషారఫ్ 1965 ఇండో-పాక్ యుద్ధంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా పనిచేశారు. 1999, అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటు చేసి నవాజ్ షరీఫ్‌ను గద్దె దించి అధికారం చేపట్టారు. 2008లో ఏర్పాటైన ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసేందుకు సిద్ధం కావడంతో అదే సంవత్సరం నవంబర్‌లో లండన్‌కు పారిపోయారు. 2013లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకోగా అనర్హత వేటువేశారు. 2016లో దుబాయ్ పారిపోయారు.
శివతేజ
ఫిబ్రవరి 6న విడుదల చేసిన ఫోర్బ్స్ టాప్-30 యువ సాధకుల జాబితాలో శివతేజకు చోటు లభించింది. ఈయన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన వ్యక్తి. ఆయన బెంగళూరులో నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు. 25కు పైగా అంతర్జాతీయ ప్రచురణలతో పాటు రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఆయన పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక ఈ జాబితాలో స్థానం కల్పించింది.
నటాషా
ప్రపంచంలో అసాధారణ తెలివితేటలు కలిగిన విద్యార్థినిగా భారత అమెరికన్ నటాషా పెరియనాయగం (13) ఫిబ్రవరి 7న నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో వరుసగా రెండో ఏడాది చోటు దక్కించుకుంది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించిన పోటీ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 76 దేశాల నుంచి 15,300 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. వారిలో నటాషా అందరి కంటే ఎక్కువ స్కోర్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 2021లో జరిగిన పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది.
సత్యనారాయణ రాజు
ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవోగా కే సత్యనారాయణ రాజును కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7న నియమించింది. ఈ పదవిలో ఉన్న ఎల్వీ ప్రభాకర్ 2022, డిసెంబర్ 31న పదవీ విరమణ పొందారు. సత్యనారాయణ రాజు 2021 నుంచి కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా హర్దీప్ సింగ్ అహ్లువాలియా నియమితులయ్యారు.
క్రీడలు
లెబ్రాన్
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్‌గా లెబ్రాన్ జేమ్స్ (అమెరికా) ఫిబ్రవరి 8న నిలిచాడు. ఓక్లహామా థండర్స్‌తో జరిగిన పోరులో లాస్ ఏంజెల్స్ 130-133తో ఓడినప్పటికీ మూడో క్వార్టర్లో లెబ్రాన్ 36 పాయింట్లు సాధించి ఎన్బీఏలో 38,390 పాయింట్లకు చేరి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో 1984 నుంచి కరీం అబ్దుల్ జబ్బార్ పేరిట ఉన్న రికార్డు (38,388)ను అధిగమించాడు. అబ్దుల్ జబ్బార్ తన రికార్డు పాయింట్లు చేయడానికి 1,560 గేమ్‌లు ఆడాడు. లెబ్రాన్ జేమ్స్ కేవలం 1,400+ గేమ్‌లు ఆడి రికార్డు పాయింట్లు సాధించాడు.
ఐసీసీ రెండేండ్లకో సారి నిర్వహించే మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి 10న ప్రారంభమైంది. మొత్తం 10 జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఐర్లాండ్, బంగ్లాదేశ్) ఈ కప్‌లో తలపడుతున్నాయి. ఫిబ్రవరి 26న ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ ప్రపంచ కప్ 2009లో ప్రారంభమైంది. దీనిలో రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఐదు సార్లు విజేతగా నిలిచింది. 2009లో ఇంగ్లండ్, 2010లో ఆస్ట్రేలియా, 2012లో ఆస్ట్రేలియా, 2014లో ఆస్ట్రేలియా, 2016లో వెస్టిండీస్, 2018లో ఆస్ట్రేలియా, 2020లో ఆస్ట్రేలియా ఈ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?