Online study | విద్యార్థి చూపు.. ఆన్లైన్ వైపు
అంతర్జాల వినియోగం పెరుగుతున్న కొద్దీ ప్రపంచం కుగ్రామం అవుతుంది. ప్రపంచంలోని ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ విద్య, కోర్సులకు స్వస్తి పలికి నయా పంథా వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కల్లోలం అంతర్జాలం వినియోగాన్ని అమాంతం పెంచేసింది. ఇంట్లో ఉండే అన్ని పనులు చేసుకునేలా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆన్లైన్ విద్య, దూరవిద్య, సార్వత్రిక విద్యకు డిమాండ్ పెరిగింది.
ఇంట్లో నుంచే అన్ని కోర్సులు
- కళాశాలకు క్రమం తప్పకుండా వెళ్లి విద్యనభ్యసించడంపై ఆసక్తి తగ్గుతుంది. విద్యార్థులు సమయం, వ్యయం తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిళ్లకు వెళ్లకుండానే కావాల్సినంత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఏ కోర్సునైనా నెట్టింట్లోనే ఇట్టే చదివేస్తున్నారు. అందుకు అనుగుణంగానే విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు రూపాంతరం చెందుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2021-22 విద్యా సంవత్సరంలో ఆన్లైన్, దూరవిద్యకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.
పెరుగుతున్న డిమాండ్..
- 2021-22 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ విద్యలో ప్రవేశాలు 170 శాతం, దూర విద్యలో 41.7శాతం ప్రవేశాలు పెరిగాయని వివిధ గణాంకాలు చెబుతున్నాయి. 2020-21లో దేశవ్యాప్తంగా 14.6 లక్షల మంది ఓపెన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చేరగా 2021-22 విద్యా సంవత్సరంలో వీరి సంఖ్య 20.3 లక్షలకు పెరిగింది. అదేవిధంగా ఆన్లైన్ విద్య చదివిన వారు 2020-21 విద్యా సంవత్సరంలో 25,905 మంది ఉండగా 2021-22లో వీరి సంఖ్య 70,023 మందికి పెరిగింది.
- దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో ఎక్కువ మంది ఆన్లైన్ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఓపెన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్లో ఎక్కువ ప్రవేశాలు నమోదవుతున్నాయి. ఎక్కువ మంది యువతీయువకులు ఉన్నత విద్యను ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారానే అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఇంట్లోనే ఉండి సమయం, డబ్బును ఆదా చేస్తూ చదవాలనుకున్న కోర్సులు నేర్చుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అందుబాటులో 371 ఆన్లైన్ ప్రోగ్రామ్స్..
- 2022 అక్టోబర్ 17న యూజీసీ ఉన్నత విద్యా సంస్థల్లో (యూనివర్సిటీలు) 371 ఆన్లైన్ ప్రోగ్రామ్స్‌ను నూతనంగా ప్రవేశపెట్టింది. ఇందులో 235 పోస్ట్ గ్రాడ్యుయేట్, 136 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. వీటిలో డిగ్రీ విభాగంలోని బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో అత్యధికంగా 13,764 మంది ప్రవేశాలు పొందారు. పీజీకి చెందిన ఎంబీఏలో 28,956 మంది చేరారు. దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు 38 శాతం ఆన్లైన్ ప్రోగ్రామ్స్‌ను పెంచాయి. వీటి సంఖ్య 2020-21 విద్యా సంవత్సరంలో 42 ఉండగా 2021-22లో 58కి పెంచాయి. ఇప్పటికే గయానా, యూఏఈ, సౌదీ అరేబియా, యూఎసే వంటి దేశాలు ఆన్లైన్ కోర్సులకు అన్ని అర్హతలను కల్పించాయి.
- ఆన్లైన్ విద్య కళాశాల, యూనివర్సిటీలకు వెళ్లలేని విద్యార్థులకు వరంగా మారనుంది. త్వరలోనే నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని, అదే జరిగితే ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలు మరింత పెరగనున్నాయని యూజీసీ చైర్పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ వెల్లడించారు.
ఆన్లైన్ విద్యకు ఎదురయ్యే సవాళ్లు
- ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్నా నాణ్యమైన విద్య అందుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో ఆన్లైన్ కోర్సులు బోధించడానికి కావలసిన పరికరాలు అందుబాటులో లేవు. వీటిని సమకూర్చాల్సిన అవసరం ఉంది.
- ఆన్లైన్ కోర్సులను అందిస్తున్న అన్ని విద్యా సంస్థల్లో అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకునేలా యూజీసీ నిబంధనలు విధించాలి.
- సైన్స్‌కు సంబంధించిన కోర్సులు ఆన్లైన్లో అందించాలంటే అన్ని రకాల ల్యాబ్‌లు, పరీక్ష పరికరాలు ఉండాలి. దీనికి ముఖ్యంగా వర్చువల్ ల్యాబ్‌లు ఉండాలి. వాటిని ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
- ఆన్లైన్లో బోధించే సామర్థ్యం కలిగిన ఫ్యాకల్టీని నియమించాల్సి ఉంటుంది. ఫ్యాకల్టీకి కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి. వీరికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
- సుశిక్షితులైన ఫ్యాకల్టీ, వర్చువల్ ల్యాబ్‌లు, పరికరాలు అందుబాటులో ఉంటే భవిష్యత్తులో ఆన్లైన్ విద్యకు మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి.
✍️కాసాని కూమరస్వామి
Previous article
Indian geography | ప్రపంచీకరణ – పట్టణీకరణ
Next article
current affairs కరెంట్ అఫైర్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం