Online Entrances | ఆన్లైన్లో ఎంట్రెన్స్‌లు.. అంతా మంచికే!
కాలం మారుతున్నది. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. విద్యారంగంలో సాంకేతికత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పట్టణ ప్రాంతాల్లో నర్సరీ డిజిటల్ బోధన కొనసాగుతున్నది. ఉద్యోగ భర్తీ, కళాశాలల్లో సీట్ల భర్తీకి కూడా పేపర్ పెన్సిల్ పరీక్షల స్థానంలో ఆన్లైన్ పరీక్షల పద్ధతి ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. లక్షల మంది విద్యార్థులు రాసే ఎంట్రెన్స్‌లు సైతం ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ టెస్ట్‌లు మంచిచెడుల గురించి సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు ప్రాథమికంగా కావల్సింది తగినంత మౌలిక సదుపాయాలు ఉండాలి. ముఖ్యంగా ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ ప్రధానం. దీనికోసం ప్రధాన పట్టణాల్లోని కంప్యూటర్ సర్వీస్ సెంటర్లు, ఇంజినీరింగ్ కాలేజీలను ఉపయోగించుకుంటారు. రోజుకు రెండు నుంచి నాలుగు స్లాట్స్ ద్వారా దీన్ని నిర్వహిస్తారు.
-ఈ విధానంలో ప్రశ్నపత్రాన్ని రూపొందిచేవారికి మంచి అవకాశం. ఈ పరీక్షల్లో వివిధ రకాలైన ప్రశ్నలను రూపొందించి అభ్యర్థులను పలు రకాలుగా పరీక్షించవచ్చు.
-ప్రశ్నపత్రం లీక్ కావడం, ఆన్సర్ షీట్స్ మారడం వంటి అనుమానాలకు ఈ విధానంలో తావులేదు.
-అభ్యర్థి మాత్రమే లాగిన్ అయి, పరీక్షరాసి, ఫైనల్‌గా జవాబులను సబ్మిట్ చేయడం ఈ విధానంలో కీలకం. మాస్‌కాపీయింగ్, ఇన్విజిలేటర్ల పొరపాట్లు, బబ్లింగ్‌లో పొరపాట్లు తదితరాలు ఉండవు.
ఆన్లైన్ విధానంలో లాభాలు
-త్వరగా ఫలితాలు: సాధారణ పద్ధతి అంటే పెన్, పేపర్ విధానంలో పరీక్షల మూల్యాంకనం, డాటాఎంట్రీ, ర్యాంకుల గణన ఇలా పలు అంశాల కోసం ఎక్కువ సమయం కావాలి. కానీ ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తే చాలా సులభంగా పై పనులన్నింటిని చేయవచ్చు. పరీక్ష రాసినవారు కూడా ఎక్కువ కాలం ఫలితాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు.
-ముద్రణ దోషాలు తక్కువ: చాలా ఎంట్రెన్స్లలో ప్రశ్నల ముద్రణలో పొరపాట్లు సాధారణంగా మారాయి. దీనికి కారణం ఆయా సింబల్స్ లేకపోవడం, భాషాపరమైన తర్జుమా (ట్రాన్స్లేషన్) సమస్యలతో తప్పులు ఉంటాయి. కానీ ఆన్లైన్ విధానంలో ముద్రణ దోషాలకు అవకాశం చాలా తక్కువ. ఉదాహరణకు జేఈఈ అడ్వాన్స్డ్ 2017లో సైతం ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. అదే ఆన్లైన్ విధానంలో అయితే ఈ దోషాలు రావడానికి అవకాశాలు చాలా తక్కువ.
-సమయం ఆదా: కేవలం మౌజ్ క్లిక్, కీబోర్డుతో టెస్ట్ నిర్వహణ ప్రారంభం చేయవచ్చు. అదే ఓఎంఆర్ విధానంలో అయితే ఎగ్జామినర్ జాగ్రత్తగా అందరికీ ఓఎంఆర్లు ఇవ్వాలి. వాటిలో అభ్యర్థులు పెన్సిల్/పెన్‌తో బబ్లింగ్ చేయాలి. దీనికోసం చాలా సమయం వృథా అవుతుంది. ఆన్లైన్ విధానంలో అయితే ప్రతి అభ్యర్థికి ఒక కంప్యూటర్ ఇస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసి పరీక్షను సులభంగా పూర్తిచేయవచ్చు.
-కచ్చితమైన మూల్యాంకనం: ఓఎంఆర్ షీట్స్ విధానంలో జవాబులను మెషిన్స్ మూల్యాంకనం చేస్తాయి. ఈ పద్ధతిలో ఓఎంఆర్ షీట్లో ఏ చిన్న పొరపాటు చేసినా మెషిన్ మూల్యాంకనం చేయదు. దీంతో అభ్యర్థులు చాలా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఆన్లైన్లో కేవలం మౌజ్ క్లిక్‌తో సరైన పద్ధతిలో జవాబులను గుర్తించవచ్చు. ఏదైనా తప్పుచేస్తే వెంటనే తెలిసిపోతుంది. అభ్యర్థి సరిదిద్దుకొని మిగిలిన ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు.
-జవాబులను ఎడిట్ చేసుకోవచ్చు: ఓఎంఆర్ విధానంలో ఒక్కసారి జవాబు గుర్తిస్తే మార్చడం చాలా కష్టం. కానీ ఆన్లైన్ విధానంలో జవాబులను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. మొదట తప్పు జవాబు గుర్తిస్తే, కొంతసేపటి తర్వాత సరైన జవాబు గుర్తువస్తే వెంటనే సంబంధిత ప్రశ్న వద్దకు వెళ్లి జవాబును మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఇది పీహెచ్సీ అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీరు ఓఎంఆర్‌లో బబ్లింగ్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. దగ్గరి దగ్గరిగా ఉన్న సర్కిల్స్‌లో బబ్లింగ్ వీరికి కష్టమైన ప్రక్రియ. కానీ ఆన్లైన్లో వీరు కేవలం ఒక్క క్లిక్‌తో జవాబులు గుర్తించవచ్చు.
-రంగుల్లో ప్రశ్నలు: ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు ప్రశ్నలకు జవాబులు ఓఎంఆర్‌లో బబ్లింగ్ చేసుకొంటూ వెళ్లిపోవాలి. కానీ ఆన్లైన్ విధానంలో జవాబులు రాసిన ప్రశ్నలకు ఒక రంగు, జవాబులు గుర్తించని వాటికి ఒక రంగు, రివ్యూ చేసుకోవాలనుకొనే వాటికి ఒక రంగు (కలర్), జవాబు ఫైనల్ సబ్మిట్ చేయనివి ఒక కలర్లో ఉంటాయి.
-దీనివల్ల అభ్యర్థులు సులభంగా ఆయా ప్రశ్నలకు జవాబులు గుర్తించడం, ఫైనల్ సబ్మిషన్ చేయడం సులువుగా పూర్తిచేయవచ్చు.
ఆన్లైన్ విధానంలో సమస్యలు
-Technical snags: ఈ విధానంలో ప్రధాన సమస్యలు పరిశీలిస్తే.. పవర్ ఫెయిల్యూర్, మెషిన్, కంప్యూటర్లు మొరాయించడం ఎక్కువగా జరుగుతుంటాయి. పరీక్షరాసే సమయంలో ఇటువంటి ఘటనలు జరిగితే అభ్యర్థుల మానసిక స్థితిలో ఆటంకం ఏర్పడి తర్వాత పరీక్షను సరిగ్గా రాయలేకపోవచ్చు.
-సూచనలు తప్పక పాటించకపోవడం: ఆన్లైన్ విధానం చాలా సులువుగా కనిపిస్తున్నప్పటికీ పరీక్ష సమయంలో కంప్యూటర్లో వచ్చే సూచనలను తప్పక పాటించాల్సి ఉంటుంది. అనేక సందర్భాల్లో అభ్యర్థులు వారి స్పందనలను, రివ్యూస్‌ను సేవ్ చేయకపోవచ్చు. దీంతో వారు ఆయా ప్రశ్నలకు మార్కులను కోల్పోతారు.
-ఆన్లైన్ అంటే భయం: ఇప్పటికి ముఖ్యంగా గ్రామీణప్రాంత అభ్యర్థులు సాంకేతిక విషయాల్లో కొంత వెనకబడటం అందరికీ తెలిసిందే. పెన్ పేపర్‌తో పరీక్ష రాసిన అలవాటుతో వారు ఒక్కసారిగా ఆన్లైన్ విధానంలో రావడంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా వారు సిద్ధం కావాలి. ఆన్లైన్ విధానంలో ప్రాక్టీస్ టెస్ట్‌లను ఎక్కువగా చేయాలి.
-ప్రశ్నపత్రం ఇవ్వరు: ఆఫ్‌లైన్ విధానంలో ప్రశ్నపత్రాన్ని పరీక్ష ముగియగానే అభ్యర్థి వెంట తీసుకుపోవచ్చు. కానీ ఆన్లైన్ విధానంలో ప్రశ్నపత్రం ఇవ్వరు. వెంటనే ప్రశ్నపత్రం ఇవ్వడం వల్ల అభ్యర్థులు ఇంటికి వెళ్లి ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబులు రాశాం, ఏ తప్పులు చేశారో వెంటనే తెలుసుకొంటారు. అదేవిధంగా ప్రశ్నపత్రంలో ఏవైనా పొరపాట్లు వచ్చాయా? వాటికి సరైన సమాధానాలు ఏవి అనే విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. ఎంట్రెన్స్‌లో ఎన్ని మార్కులు రావచ్చు? ఎంత ర్యాంక్ రావచ్చు అనే అంశాలను సుమారుగా అంచనా వేసుకోవచ్చు.
విజయం సాధించాలంటే…?
-ఆన్లైన్ విధానంలో ఎంట్రెన్స్‌లు నిర్వహిస్తున్నారు అనే భయాన్ని మొదట వీడాలి.
-ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆన్లైన్ ఫోబియాను వీడాలి. స్మార్ట్ఫోన్లు వాడుతున్న నేటి విద్యార్థులకు ఆన్లైన్ మరింత ఈజీ అనే భావన పెంపొందించుకోవాలి.
-ఆఫ్‌లైన్‌లో లేని అవకాశాలు ఆన్లైన్లో ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకొంటే చాలా ధైర్యం వస్తుంది.
-బబ్లింగ్ కంటే ఆన్లైన్లో మౌజ్ క్లిక్ సులభం అన్నది గ్రహించాలి
-ఇప్పటివరకు ఆన్లైన్ టెస్ట్‌లు రాయనివారు చేయాల్సింది ఒక్కటే ఇంట్లో/నెట్ సెంటర్స్‌లోకి వెళ్లి వీలైనన్ని మాక్‌టెస్ట్‌లను రాయాలి.
-పరీక్షలో ఇచ్చే సూచనలను పాటించాలి. పరీక్ష హాల్లో ఆందోళన/కంగారు పడకుంటే ఆన్లైన్లో మీరు ముందుంటారు.
-ఎంట్రెన్స్‌ల్లో పరీక్షించేది మీరు చదువుకొన్న సిలబస్/తరగతుల సబ్జెక్టు అనే విషయాన్ని మరువకండి. పరీక్ష ఎక్కడ రాస్తే ఏమిటి? నేను రాయగలను.. సాధించగలను అనే విశ్వాసాన్ని పెంపొందించుకొంటే విజయం మీ సొంతం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?