జాతీయ సంక్షేమం ఎలా సాధ్యం?
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై)
-2014, ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనను ప్రారంభించారు.
-మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన లేదు
-రూ. లక్ష ప్రమాద బీమాతోపాటు లబ్ధిదారుడు మరణిస్తే పథకం కింద రూ. 30 వేలు అందజేస్తారు.
-ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జన్‌ధన్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ అవుతుంది.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
-2015, మే 9న కోల్‌కతాలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
-18 నుంచి 70 ఏండ్ల మధ్య వయస్సు గల పేదలు, అణగారిన వర్గాల ప్రజలు అర్హులు. బ్యాంకు ఖాతా ఉండి, ఏడాదికి రూ. 12 ప్రీమియం చెల్లించాలి.
-ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే రూ. 2 లక్షలు, పాక్షిక అంగ వైకల్యానికి రూ. లక్ష అందిస్తారు.
ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన
-18 నుంచి 50 ఏండ్ల వయస్సు గల అణగారిన, పేదవర్గాల ప్రజలు అర్హులు
-రూ. 330 నామమాత్రపు ప్రీమియంతో రూ. 2 లక్షల జీవిత బీమా లభిస్తుంది.
ప్రధానమంత్రి ముద్రా యోజన
-ఈ పథకాన్ని 2015, ఏప్రిల్ 8న ప్రారంభించారు.
-ఔత్సాహికులు పరిశ్రమలు ఏర్పాటు చేసేదిశగా ప్రోత్సాహంతోపాటు సూక్ష్మరంగ సంస్థల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించేందుకు ముద్రా యోజనను ప్రారంభించారు.
-శిశు (రూ.50 వేలు), కిశోర్ (రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు), తరుణ్ (రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు) కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు ఇస్తాయి.
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)
-ఈ పథకాన్ని 2015, మే 9న కోల్‌కతాలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
-అయిదేండ్లపాటు లబ్ధిదారుడి ప్రీమియం (రూ.1000 వరకు)లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది.
-లబ్ధిదారుడు చెల్లించిన మొత్తాన్ని బట్టి 60 ఏండ్ల నుంచి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ అందజేస్తారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన
-ఈ పథకాన్ని 2015, జూలై 25న ప్రారంభించారు.
-100 శాతం గ్రామీణ విద్యుదీకరణ లక్ష్యంగా పథకాన్ని ప్రారంభించారు.
స్టార్టప్ ఇండియా
-ఈ పథకాన్ని 2016, జనవరి 16న ప్రారంభించారు.
-యువతలో ఎంట్రపెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియాను ప్రారంభించారు.
-స్టార్టప్‌లకు ఏడేండ్ల బ్లాక్ పీరియడ్‌లో మూడేండ్లపాటు పన్ను మినహాయింపు ఉంటుంది.
స్టాండప్ ఇండియా
-ఈ పథకాన్ని 2016, ఏప్రిల్ 5న ప్రారంభించారు.
-ఎస్సీ, ఎస్టీ మహిళల్లో ఎంట్రపెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు స్టాండప్ ఇండియాను ప్రారంభించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్
-ఈ పథకాన్ని 2015, జూన్‌లో ప్రారంభించారు.
-దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌ను ప్రారంభించారు.
-ఒక యూనిట్‌కు అందించే సహాయాన్ని మైదాన ప్రాంతాల్లో రూ.1,20,000, పర్వత/ సంక్లిష్ట ప్రాంతాలు/ ఐఏపీ జిల్లాల్లో రూ.1,30,000కు పెంచారు.
-మైదాన ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40, ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ర్టాల్లో 90:10 నిష్పత్తిలో భరిస్తున్నాయి.
-మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.12,000 సాయం అందజేస్తారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన
-ఈ పథకాన్ని 2014, సెప్టెంబర్ 25న ప్రారంభించారు.
-గ్రామీణ పేద యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించి, శ్రామిక మార్కెట్లో భాగస్వాములను చేయడం లక్ష్యం.
-వ్యవసాయం, ఆహారశుద్ధి, తయారీ రంగాలకు సంబంధించిన 56 విభాగాల్లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు యువతకు శిక్షణ ఇస్తున్నాయి.
శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్
-ఈ పథకాన్ని 2015, సెప్టెంబర్ 16న ప్రారంభించారు.
-ఈ పథకం అమలుకు 29 రాష్ర్టాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 300 క్లస్టర్లను గుర్తించారు.
-మూడేండ్లలో ప్రాథమిక, సాంఘిక, డిజిటల్ వసతులు కల్పించి, క్లస్టర్లను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
-ఈ క్లస్టర్లు బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మార్చి నైపుణ్య శ్రామికశక్తి అందుబాటులోకి తీసుకువస్తారు.
మిషన్ ఇంద్రధనుష్
-ఈ కార్యక్రమాన్ని 2014, డిసెంబర్ 5న ప్రారంభించారు.
-కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, తట్టు, హెపటైటిస్-బి తదితర ఏడు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు రెండేండ్ల లోపు పిల్లలు, గర్భిణులకు టీకాలు వేస్తారు.
-తొలి దశలో 201 జిల్లాల్లో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అమలు చేశారు.
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్
-ఈ కార్యక్రమాన్ని 2017, సెప్టెంబర్ 8న ప్రారంభించారు.
-టీకాలు వేయించుకోని గర్భిణులకు టీకాలు, రెండేండ్ల వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి టీకాలు వేయించాలి.
-2018, డిసెంబర్‌లోగా 90 శాతానికి పైగా టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేయాలి.
అమ్రిత్
-ఈ పథకాన్ని 2015, నవంబర్ 15న ప్రారంభించారు.
-కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో హల్ దేశవ్యాప్తంగా అమ్రిత్ ఫార్మసీ అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుంది. ఈ అవుట్లెట్ల ద్వారా 202 రకాల క్యాన్సర్ సంబంధిత, 186 రకాల హృద్రోగ సంబంధిత మందులను తక్కువ ధరకు అందిస్తున్నది. గుండె సంబంధిత స్టంట్లను 60 నుంచి 90 శాతం తక్కువ ధరకు పొందవచ్చు.
బేటీ బచావో బేటీ పడావో (బీబీబీపీ)
-ఈ కార్యక్రమాన్ని 2015, జనవరి 22న హర్యానాలోని పానిపట్ జిల్లాలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.
-తొలుత 0-6 ఏండ్ల లోపు లింగ నిష్పత్తి అత్యంత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు చేశారు.
-ప్రస్తుతం దీన్ని దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు.
-2016 ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ బీబీబీపీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు.
సుకన్య సమృద్ధి యోజన
-బేటీ బచావో బేటీ పడావో ప్రచార కార్యక్రమంలో భాగంగా 2015, జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించారు.
-అమ్మాయిల విద్యకు, వివాహానికి సంబంధించి ఆర్థిక ఒత్తిడి ఎదురుకాకుండా ఉండేలా చూడటం ఈ పథకం ఉద్దేశం.
-చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేసుకుని, వాటికి అధిక వడ్డీ పొందవచ్చు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన
-ఈ పథకాన్ని 2016, మే 1న ప్రారంభించారు.
-దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
సఖి కేంద్రాలు
-ఈ కేంద్రాలను 2015, మార్చిలో ప్రారంభించారు. హింసకు గురైన బాధిత మహిళలకు వైద్యం, పోలీసు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ తదితర అన్ని సేవలూ ఒకేచోట సఖి కేంద్రాల్లో లభిస్తాయి.
-ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 161 సఖి కేంద్రాలను స్థాపించారు.
-2019, మార్చి నాటికి జిల్లాకు కనీసం ఒకటైనా సఖి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
ఉడాన్
-ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016, అక్టోబర్‌లో ప్రారంభించింది.
-చిన్న నగరాలకు విమానాల రాకపోకలు నిర్వహించేందుకు అమలుచేస్తున్న ప్రాంతీయ విమానయాన పథకం ఉడాన్. ఈ పథకం కింద 56 విమానాశ్రయాలు, 31 హెలీప్యాడ్లను వినియోగంలోకి తీసుకురానున్నారు.
-సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యం.
-తొలి ఉడాన్ విమానాన్ని 2017, ఏప్రిల్ 27న సిమ్లా-ఢిల్లీ మధ్య ప్రారంభించారు.
స్వచ్ఛ విద్యాలయ
-స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్ (ఎస్‌వీఐ)ను 2014, ఆగస్టు 15న ప్రధాని పిలుపు మేరకు పాఠశాల విద్య, సాక్షరత విభాగం ప్రారంభించింది.
-ఈ పథకం కింద 2014, ఆగస్టు 15 నుంచి 2015, ఆగస్టు 15 వరకు.. 2,61,400 ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో 4,17,796 మరుగుదొడ్లను నిర్మించారు.
తెలంగాణ పథకాలు
టీఎస్-ఐపాస్
-తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్-ఐపాస్) చట్టం 2014 నుంచి అమల్లోకి వచ్చింది.
-పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసేందుకు దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది.
-23 శాఖలకు సంబంధించి 30 క్లియరెన్సులను టీఎస్-ఐపాస్‌లో చేర్చారు.
-అప్రూవల్ సంక్లిష్టతపై ఆధారపడి క్లియరెన్సులను ఒకరోజు నుంచి గరిష్ఠంగా 30 రోజులలోపు ఇచ్చే విధంగా వ్యవధిని నిర్ధారించారు. ఈ వ్యవధిలో క్లియరెన్స్ ఇవ్వకపోతే ఇచ్చినట్లుగానే భావిస్తారు.
-రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడి ఉండే మెగా ప్రాజెక్టులకు దరఖాస్తుదారుడు ఇచ్చే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా తాత్కాలిక క్లియరెన్సులను 15 రోజుల్లోపే జారీ చేస్తారు. లాంఛనప్రాయ క్లియరెన్సులను యూనిట్ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందే జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని టీ-స్విప్ట్ బోర్డు దీన్ని పర్యవేక్షిస్తుంది.
-గడువులోపు క్లియరెన్సులు ఇవ్వని అధికారులకు జరిమానాలు విధించే నిబంధనను ఈ చట్టం కల్పించింది. ప్రస్తుతం రోజుకు రూ.1000 పెనాల్టీగా నిర్ణయించారు.
టీ-ప్రైడ్
-తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రపెన్యూర్స్ను 2014లో ప్రారంభించారు.
-ఎస్సీ, ఎస్టీల్లో పారిశ్రామికతత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
-సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు గరిష్ఠంగా రూ. 75 లక్షల పరిమితికి లోబడి స్థిర మూలధన పెట్టుబడిపై 35 శాతం ఇన్వెస్ట్మెంట్ రాయితీ.
-షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.75 లక్షల పరిమితికి లోబడి అదనంగా 5 శాతం ఇన్వెస్ట్మెంట్ రాయితీ.
-పారిశ్రామిక వినియోగం కోసం పరిశ్రమ కొనుగోలు చేసిన భూమి లేదా షెడ్డు లేదా భవనాలపై చెల్లించిన స్టాంపు డ్యూటీ, బదలాయింపు సుంకం మీదం 100 శాతం రీయింబర్స్మెంట్. మార్టిగేజ్, హైపోథికేషన్ల మీద కూడా 100 శాతం రీయింబర్స్మెంట్.
తెలంగాణ పల్లె ప్రగతి
-తెలంగాణ పల్లెప్రగతి పథకాన్ని 2015, ఆగస్టు 22న మెదక్ జిల్లా కౌడిపల్లిలో అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు.
-రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో ప్రగతికి బాటలు వేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-గ్రామస్థాయిలో 2.5 లక్షల పేద ఉత్పత్తిదారుల సంఘాల ఆదాయం కృషిమార్టు ఏర్పాటు ద్వారా పెంచడం.
-వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెలకువల్లో శిక్షణ, పాడిపరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకంతోపాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో వారికి చేయూతనందించడం
-150 మండలాల్లో అందరూ మరుగుదొడ్లు వినియోగించుకుని వారి గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ఎంపిక చేయడానికి తోడ్పాటు
-1000 గ్రామ పంచాయతీల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు
-తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతు కుటుంబాల కోసం సెర్ప్ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
102 సేవలు
-గర్భిణులు, బాలింతలు, శిశువులను ఇంటి నుంచి దవాఖానకు, దవాఖాన నుంచి ఇంటికి ఉచిత రవాణా కార్యక్రమమే అమ్మఒడి. ఈ కార్యక్రమాన్ని 2016, డిసెంబర్ 28న ప్రారంభించారు. తొలుత 41 వాహనాలతో 102 రిఫరల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్‌ను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించారు. 2018 నుంచి మరో 200 వాహనాల సేవలు అందిస్తున్నాయి.
టీ – వ్యాలెట్
-రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం 2017, జూలై 1న టీ-వ్యాలెట్ అనే తెలంగాణ రాష్ట్ర అధికారిక డిజిటల్ వ్యాలెట్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు సేవలను నగదు రహిత చెల్లింపుల ద్వారా జరుపుకోవచ్చు.
గ్రామజ్యోతి
-గ్రామజ్యోతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ 2015, ఆగస్టు 17న వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో ప్రారంభించారు.
-గ్రామపంచాయతీ స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న సేవలన్నింటిని ఒకచోటకు చేర్చి, బలోపేతం చేయడంద్వారా ముఖ్యమైన రంగాల్లో ప్రజలకు అందించే సేవలను మెరుగుపర్చడమే గ్రామజ్యోతి ప్రధాన ఉద్దేశం.
-ఇది మన ఊరు- మన ప్రణాళికకు కొనసాగింపు.
పంచాయతీలు సాధికారత సాధించాలంటే ఏడు కీలక రంగాలు అభివృద్ధి చెందాలని భావించి, అందుకోసం ఏడు కమిటీలను రూపొందించారు.
1. పారిశుద్ధ్యం, మంచినీటి కమిటీ
2. ఆరోగ్యం, పోషకాహారంపై కార్యాచరణ కమిటీ
3. విద్యా కమిటీ
4. సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన కమిటీ
5. సహజవనరుల నిర్వహణ కమిటీ
6. వ్యవసాయ కమిటీ
7. మౌలిక సదుపాయాల కల్పన కమిటీ
ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, అమలు నిమిత్తం ప్రతి రంగానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు.
-రాష్ట్రవ్యాప్తంగా 2015, ఆగస్టు 17 నుంచి 24 వరకు గ్రామజ్యోతి వారోత్సవాలు నిర్వహించారు.
-వార్డు సభ్యులు, స్వయంసహాయక సంఘాల లీడర్, కులసంఘం లేదా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉండే ఈ కమిటీల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేసే అధికారి కన్వీనర్‌గా ఉంటారు.
-గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతినెల మొదటి సోమవారం సమావేశం కావాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు