TSLPRB SI Success Stories | ఇష్టం+కష్టం = ఖాకీ కొలువు
TSLPRB SI Success Stories | ఖాకీ కొలువంటే వారు ఎంతో ఇష్టపడ్డారు. అందుకు తగ్గట్లు కష్టపడ్డారు. తమ కల నెరవేర్చు కున్నారు. ఇటీవల విడుదలైన పోలీస్ ఎస్ఐ ఫలితాల్లో ఉద్యోగం సాధించిన వారి విశేషాలు..
ఇద్దరిదీ ఒకే ఊరు.. చదివే దగ్గర కూడా ఒకే రూము.. ఒకటే లక్ష్యం.. రెండేళ్ల కష్టం వారి జీవితాలనే మార్చేసింది. ఇద్దరికీ ఎస్ఐ కొలువు తలుపు తట్టింది. ఇలా వారి స్నేహం పోలీసులుగా నిలబెట్టింది. ఆర్థికంగా ఇబ్బందులున్నా అమ్మానాన్నల ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. పోటీ పరీక్షల్లో గెలిచి ఎంతో మందికి ఆదర్శమ య్యారు. వారే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన ఎస్ ఇంద్రారెడ్డి, ఆర్ఎన్ చంద్రశేఖర్. వారి విజయగాథను ‘నిపుణ’తో
పంచుకున్నారిలా..
ఒత్తిడిని దూరం చేస్తే విజయం: ఎస్. ఇంద్రారెడ్డి
- మాది గద్వాల జిల్లా రామాపురం గ్రామం. నాన్న సత్యనారాయణరెడ్డి వ్యవసాయం చేస్తాడు. అమ్మ మధులత గృహిణి. 10వ తరగతి వరకు స్థానికంగా చదివి హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివాను. సిద్దిపేట జిల్లాలో కొన్నాళ్లు ప్రైవేటు ఉద్యోగం చేశాను.
ఒక్క మార్కుతో… - 2019లో కానిస్టేబుల్ ఉద్యోగం 1 మార్కుతో మిస్సయ్యాను. తర్వాత కరోనా వల్ల ఇంటిదగ్గరే ఉన్నాను. 2021లో మళ్లీ హైదరాబాద్ వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. స్నేహితులతో కలిసి ఒకే రూంలో ఉంటూ ప్రిపేరయ్యాను. ఇది బాగా కలిసిసొచ్చింది. రోజుకు 10-12 గంటలు చదివాను. జనరల్ సైన్స్‌లో 122, మ్యాథ్స్‌లో 129 మార్కులు వచ్చాయి. 251 మార్కులు సాధించి టీఎస్ఎస్పీ ఎస్ఐగా ఎంపికయ్యాను. కష్టానికి ప్రతిఫలం దక్కింది. పోలీసు డిపార్ట్మెంట్ వైపు రావడం సొంత నిర్ణయం. ఇటీవల గ్రూప్-4 పరీక్ష రాశాను. అందులో కూడా మంచి మార్కులే వచ్చే అవకాశం ఉంది.
- తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చించి సందేహాలు నివృత్తి చేసుకోవడం వల్ల ఈ ఫలితం దక్కింది. మంచి స్నేహితులుంటే మంచి దారి దొరుకుతుంది. విధి నిర్వహణలో గుర్తింపు తెచ్చుకుని, ప్రజలకు సేవకుడిగా ఉంటాను.
- తరచూ క్రికెట్ ఆడటం వల్ల ఈవెంట్స్ సులువుగా అనిపించింది. లక్ష్యం పెట్టుకుని చదవాలి. ఫలితం గురించి ఆలోచించొద్దు. అప్పుడే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. ఒత్తిడికి దూరమవుతున్నామంటే విజయానికి
దగ్గరవుతున్నట్లే.
అమ్మా నాన్నల ప్రోత్సాహమే: ఆర్ఎన్ చంద్రశేఖర్
- మాది కూడా రామాపురమే. నాన్న జయరాముడు, అమ్మ పద్మావతి వ్యవసాయం చేసుకుంటూ హోటల్ నిర్వహిస్తారు. తమ్ముడు శ్రీధర్ డిగ్రీ చదువుతున్నాడు. జెడ్పీహెచ్ఎస్ రామాపురంలో పదో తరగతి చదివాను. ఇంటర్ తర్వాత ఖైరతాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఎంపీసీ పూర్తి చేశాను.
- గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలన్న కల నెరవేరింది. ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే ఉద్యోగం తప్పనిసరని భావించాను. 2019లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం ఒక్క మార్కుతో చేజారింది. 2021లో సంక్రాంతి తర్వాత కోచింగ్ వెళ్లాలని నేను, స్నేహితులం డిసైడ్ అయ్యాం.
- మా గ్రామం నుంచి ఐదుగురం కలిసి హైదరాబాద్ వచ్చాం. ఒకే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటూ ఒకే రూంలో ఉండేవాళ్లం. అందరం కలిసి చదవడం వల్ల చాలా హెల్ప్ అయింది.
- రోజూ 10 గంటలు చదివాను. ఇన్స్టిట్యూట్లో డౌట్స్ సెషన్ ఉండేది. ఆ సమయంలో సందేహాలన్నీ నివృత్తి చేసుకునేవాళ్లం. ఇంద్రారెడ్డి, నేను ఎస్సైగా ఎంపికయ్యాం. మిగతా ముగ్గురికి కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి.
- కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చాలా ఉపయోగపడ్డాయి. జీఎస్‌లో 133, మ్యాథ్స్‌లో 115 మార్కులు వచ్చాయి. ఏఆర్ ఎస్ఐగా సెలక్ట్ అయ్యాను. గ్రూప్-4లో కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది.
- ఈవెంట్స్‌లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఒత్తిడిని అధిగమించేందుకు గేమ్స్ ఆడాను. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యేవారు పట్టుదలతో చదవాలి. ఎటువంటి ఇబ్బందులున్నా ధైర్యంగా ముందుకెళ్లాలి. సలహాలు, సూచనలు తీసుకోవాలి. సమయం ఎంత విలువైందో దాన్ని వినియోగించుకుంటేనే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రోత్సాహమే నన్ను పోలీసుగా నిలబెట్టింది.
కష్టాల్ని దాటి.. ఖాకీ చొక్కాను గెలిచి
పేదరికంలో పుట్టిన భరత్ కుమార్‌కు ఆర్థిక కారణాలు అడ్డంకులుగా నిలిచాయి. ఓ సందర్భంలో ప్రిపరేషన్ ఆపాలనుకున్నాడు. ఒకవైపు తల్లిదండ్రుల ప్రోత్సాహం, మరోవైపు తనకు తెలిసినవాళ్ల గైడెన్స్ అతడిని ఖాకీ యూనిఫాం వేసుకునేలా చేశాయి.
ఎస్ఐ కొలువు సాధించిన భరత్ కుమార్ ప్రిపరేషన్ ప్రయాణం తన మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం
- నాన్న ఎ.బాలతిరు, అమ్మ సాలమ్మ రోజువారీ కూలీలు. నాకు అక్క, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అక్కకు పెళ్లి అయింది. ఇద్దరు చెల్లెళ్లు డిగ్రీ చదువుతున్నారు. నేను బండ్లగూడలోని శిశు మందిర్ శారదాధామం పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. ఫ్రీ అడ్మిషన్ ఇచ్చిన శిశుమందిర్ స్కూల్ యాజమాన్యం మేలు మరవలేను. వెంకటపురంలో ఇంటర్, దూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ పూర్తి చేశాను.
పుస్తకాల కోసం క్యాటరింగ్… - చిన్నప్పటి నుంచి ఖాకీ యూనిఫాం అంటే ఇష్టం. దాంతో పాటు నా స్నేహితుడు మధుకు పీటీవో ఎస్ఐ ఉద్యోగం రావడం చూసి స్ఫూర్తి పొందాను. అప్పటి నుంచి నేను కూడా ఎస్ఐ కావాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని అమ్మనాన్నలకు చెప్పాను. వెన్ను తట్టి ప్రోత్సహించారు.
- సొంతూరు నాగర్‌కర్నూల్ అయినా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోని అల్వాల్‌లోనే. మాది చిన్న రేకుల ఇల్లు. నాన్న రెక్కాడితేనే మా చదువులు ముందుకు సాగేవి. పుస్తకాలు కొనుక్కోవడానికి క్యాటరింగ్‌కు వెళ్లేవాడిని. ఫోన్ కూడా కొనుక్కునే స్థోమత లేదు. జాబ్ వచ్చిందని తెలిసి ఈఎంఐలో కొనుక్కున్నా. 2019లో కానిస్టేబుల్ పరీక్షకు మాత్రమే అర్హత ఉండటంతో అటెంప్ట్ చేశాను.
తొలి ప్రయత్నంలోనే.. - 2021 నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాను. ఉప్పల్‌లో వెంకటప్రసాద్ సార్ వద్ద ఉండి అర్థమెటిక్, రీజనింగ్‌లో తర్ఫీదు పొందాను. ఇవే నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఒక టైంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తిరిగి ఇంటికి వెళ్లాలనిపించింది. ఇంటి వద్ద ఉంటే ప్రయోజనం లేదని భావించి కొన్ని రోజులు ఓ ఇన్స్టిట్యూట్లో స్టడీ రూంలో ఉంటూ చదివాను. గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న నా సీనియర్ అశ్విన్ కుమార్ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి జనరల్ స్టడీస్‌లో పట్టు సాధించాను. ఇండియన్ హిస్టరీ కోసం కుర్ర సత్యనారాయణ, జాగ్రఫీకి రమణ రాజు, తెలంగాణ హిస్టరీకి పీఎన్ఆర్ పబ్లికేషన్స్ మెటీరియల్ చదివాను. ఈ మెటీరియల్ చాలా ఉపయోగపడ్డాయి. ఒత్తిడిగా అనిపించినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే స్నేహితుల వద్దకు వెళ్లి సందేహాలున్న టాపిక్లపై డిస్కస్ చేసేవాళ్లం. పరీక్ష సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజూ 15-18 గంటలు చదివాను. రోజూ నాలుగు గంటలే నిద్ర పోయేవాడిని. జీఎస్‌లో 114, మ్యాథ్స్‌లో 107 మార్కులు సాధించి సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాను. తొలి ప్రయత్నంలోనే ఖాకీ కొలువు సాధించాను. కానిస్టేబుల్ పరీక్షలో 113 మార్కులు వచ్చాయి. ఇటు ఎస్ఐకి, అటు కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేరవడం కలిసొచ్చింది. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజూ దినపత్రికలు చదివాను. రెండేళ్ల కష్టానికి తగిన ఫలితం దక్కిందని తెలిశాక నా తల్లిదండ్రులు, చెల్లెళ్ల సంతోషం మాటల్లో చెప్పలేను.
ఇన్స్పెక్టర్తో సత్కారం.. - అల్వాల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్‌రావు పిలిచి సత్కరించడం కొత్త అనుభూతినిచ్చింది. కష్టాలకు ఓర్చి ఇష్టపడి చదివినందుకు ఇన్స్పెక్టర్ అభినందించారు. శిక్షణలో, విధి నిర్వహణలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు.
సివిల్స్ లక్ష్యం.. - గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా రాశాను. భవిష్యత్తులో సివిల్స్ సాధించాలనుంది. దాంతో ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం దక్కుతుంది. విధులు నిర్వహిస్తూనే సివిల్స్ వైపు దృష్టి సారిస్తా. చదువుకు పేదరికం అడ్డు కాదని, పేదరికానికి పరిష్కారం చదువే అని మరోసారి నిరూపిస్త్తాను.
జూనియర్స్‌కు సూచనలు.. - కష్టాలను చూసి వెనుకడుగు వేయొద్దు. జీవితాన్ని మార్చేది చదువే. అందుకే కష్టాన్ని నమ్ముకుని ఇష్టపడి చదివితే అనుకున్న ఫలితం వస్తుంది. ప్రిపరేషన్ సమయంలో సెల్ఫ్ మోటివేషన్ కూడా ఉండాలి. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటే చదువుకు దగ్గరవచ్చు. ఒత్తిడిని అధిగమించడానికి మైదానమే సరైన మార్గం. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగమైనా అంత సులువు కాదు. సరైన ప్రణాళిక, కఠోర శ్రమ ఉంటేనే విజయం వరిస్తుంది.
సురేంద్ర బండారు
సాధించాలనే తపనే విజయానికి పునాది
ఏదైనా మొదలుపెడితే దాన్ని సాధించేంత వరకు పట్టు విడవకుండా ప్రయత్నించాలి. అందుకోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన సామర్థ్యాన్ని, మన సంకల్పాన్ని నమ్ముకుంటే ఏదైనా సాధ్యమే. అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి నిజాయతీగా కష్టపడితే గమ్యం చేరడం సులభమే అని నిరూపించారు ఖమ్మం జిల్లా పాపటపల్లికి చెందిన కొనకంచి అఖిల.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎస్సై ఫలితాల్లో మహిళా కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించి జయకేతనం ఎగురవేశారు.. మొదటి ర్యాంకు పొందడానికి ఆమె చదివిన తీరు.. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఆమె ఇచ్చే సలహాలు ఆమె మాటల్లోనే..
అమ్మానాన్న ప్రోత్సాహమే బలం
మా నాన్న కొనకంచి ప్రభాకర్‌రావు రైతు. అమ్మ గృహిణి. అమ్మానాన్నకు నేను ఏకైక కుమార్తెను. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో నాకు పూర్తి సహకారం అందించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవడానికి ప్రోత్సహించారు. అమ్మానాన్న సహకారమే ఎస్సై పరీక్షలో మొదటి ర్యాంకు సాధించడానికి దోహదం చేసింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి..
ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాను. బీటెక్ (ఈసీఈ) హైదరాబాద్‌లోని సీబీఐటీలో పూర్తి చేశాను. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో మంచి జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. ఒక సంవత్సరం ఆ ఉద్యోగం చేశాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది. దీంతో ఆ ఉద్యోగం వదిలేసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. ఇప్పటికే గ్రూప్-4 పరీక్ష రాశాను. మంచి మార్కులు వస్తాయి. ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. అదేవిధంగా గ్రూప్-2 పరీక్షకు కూడా ప్రిపేర్ అవుతున్నాను.
ఆటల్లో ప్రావీణ్యం సహకరించింది..
ఎస్ఐ ఉద్యోగం సాధించాలంటే చదువుతో పాటు శారీర దారుఢ్యం ఉండాలి. చిన్నప్పటి నుంచి క్రికెట్, త్రో బాల్, వాలీబాల్ ఆడేదాన్ని. చాలా టోర్నమెంట్లలో పాల్గొన్నాను. దాంతో ఎస్ఐ ఈవెంట్స్ సాధించడం సులభమైంది. చాలామంది రాత పరీక్ష కంటే ఈవెంట్స్‌లోనే విఫలమవుతుంటారు. కానీ కొంచెం కష్టపడితే ఈవెంట్స్ పూర్తిచేయడం సులభమే.
రోజూ 12 గంటలు చదివాను
పోటీ పరీక్షలకు ప్రిపేరవడానికి ప్రత్యేక ప్రణాళిక ఏం చేసుకోలేదు. బయట దొరికే పోటీ పరీక్షల పుస్తకాలు చదివాను. అన్ని సబ్జెక్టుల్లో ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాలను చదవడం వల్ల అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. రోజూ 12 గంటలకు పైగా చదివాను. ఈ సమయాన్ని సబ్జెక్టుల వారీగా విభజించుకుని చదవడం వల్ల రోజూ అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేవి. ప్రణాళిక ప్రకారం సబ్జెక్టును అర్థం చేసుకుంటూ చదివితే సులభంగా విజయం సాధించవచ్చు.
మనల్ని మనం నమ్ముకుంటే విజయమే..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ముందుగా తమను తాము నమ్ముకోవాలి. నేను చదవగలను అనే ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టాలి. పరీక్ష రాసేదాకా అదే కాన్ఫిడెన్స్‌తో చదవాలి. ఒకసారి విఫలమైతే మన వల్ల కాదు అనుకుంటే ఎప్పటికీ విజయం సాధించలేం. కష్టపడి ఇష్టంగా చదివితే ఎవరికైనా సాధ్యమే. సబ్జెక్టును బట్టి సమయం కేటాయించుకోవాలి. మనకు వచ్చిన సబ్జెక్టుకు తక్కువ, రాని సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.
దుబాయ్ నుంచొచ్చి.. ఎస్ఐ జాబ్ సాధించి
జీవితం బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగమైతే చాలా బెటర్ అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఆర్థిక కష్టాలు ఎదురొచ్చినా ఎదుర్కొని పోలీసు కొలువు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన పీ ప్రణయ్. అతడు తన విజయ ప్రస్థానాన్ని ‘నిపుణ’తో పంచుకున్నాడు.
కుటుంబ నేపథ్యం
- మాది నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం మాచిన్పల్లి. నాణ్న సత్యనారాయణ ఆటోమొబైల్స్ నిర్వహిస్తారు. అమ్మ గృహిణి. అన్న ప్రమోద్ ఇటీవల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. 10వ తరగతి వరకు మాచిన్పల్లిలోనే చదివాను.
కానిస్టేబుల్ జాబ్ చేజారింది.. - ఆర్థిక ఇబ్బందులు రావడంతో 2016-18 వరకు దుబాయ్‌లో ఉన్నాను. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందని తెలుసుకొని నిజామాబాద్‌కు తిరిగొచ్చాను. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఖర్చులకు సరిపడా డబ్బులు దుబాయ్‌లో సంపాదించాను. హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాంలో జాయినయ్యాక దుబాయ్ వెళ్లాను. వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పరీక్షలు రాశాను. అలా బీకాం పూర్తి చేశాను.
- 2019లో రెండు మార్కులతో కానిస్టేబుల్ ఉద్యోగం చేజారింది. ఆ ఫెయిల్యూరే నా పట్టుదలను మరింత పెంచింది. అప్పటి నుంచి బాగా చదివి జాబ్ కొట్టాలని నిర్ణయించుకున్నాను. పట్టుదలతో చదివితే ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నమ్మాను. దానికి కోచింగ్ అవసరమని భావించాను. హైదరాబాద్‌లోని ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను.
- రోజూ 10-12 గంటలు పుస్తకాలతో స్నేహం చేసే కొద్ది ఆ రుచేంటో తెలిసింది. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను తరచూ స్నేహితులతో చర్చించి సరైన సమాధానాలను గుర్తుంచుకునేవాడిని. కోచింగ్ చాలా ఉపయోగపడింది. జీఎస్‌లో 133, మ్యాథ్స్‌లో 103 మార్కులు వచ్చాయి. సివిల్ ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాను. కన్నవారికి ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఇంకేం కావాలి. కానిస్టేబుల్ పరీక్షలో కూడా 133 మార్కులు వచ్చాయి. కారణాలు వెతికి నన్ను హేళన చేసినవారికి నా విజయమే సమాధానమైంది.
- పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఉద్యోగం రావాలంటే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సిలబస్‌ను ప్రశాంత వాతావరణంలో చదవాలి. అప్పుడే మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. పరీక్షలో ఎటువంటి తొందరపాటు, అయోమయం లేకుండా సమాధానాలు గుర్తించాలి. అప్పుడే గెలుపు మనల్ని పలకరిస్తుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. సమాజ సేవకై కదిలి
సాఫ్ట్వేర్ ఉద్యోగంతో సంతృప్తి చెందలేదు. ఎవరో ఒకరి కోసమో.. ఒక సంస్థ కోసమో పనిచేయడం నచ్చలేదు. సమాజానికి సేవ చేసే ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. అది సాధ్యం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మార్గం అనుకుని మంచి జీతం, సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించింది సూర్యాపేట పట్టణానికి చెందిన అమ్రీన్ నసీహ. పోటీ పరీక్షలకు ప్రిపేరైన విధానం, ఆమె నేపథ్యం, ఉద్యోగార్థులకిచ్చే సలహాలు, సూచనలు ఆమె మాటల్లోనే..
సమాజ సేవే లక్ష్యం..
బీటెక్(ఈసీఈ) పూర్తయిన వెంటనే ప్రముఖ కంపెనీలో మంచి వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగంలో సంతృప్తిగా అనిపించలేదు. చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే ఉద్యోగం మానేసి అశోక్‌నగర్‌లో స్టడీహాల్ తీసుకుని హాస్టల్లో ఉంటూ చదవడం ప్రారంభించాను. రోజూ 8-10 గంటలు చదివాను. గ్రూప్-4, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా రాశాను. ఇప్పటికే ఎస్ఐ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చింది. గ్రూప్-1 ద్వారా ఉద్యోగం వస్తే అటువైపు వెళతాను. లేకుంటే పోలీస్‌గానే స్థిరపడతాను. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సమాజం, మహిళలకు సేవ చేయడమే అంతిమ లక్ష్యం.
ఎన్ని మాక్ టెస్ట్‌లు రాస్తే అంత ఉపయోగం
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి. ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే మాక్‌టెస్టులు, ఆన్లైన్ మాక్‌టెస్టులు ఎక్కువ రాశాను. ఇంటర్నెట్లో దొరికే సమాచారాన్ని సేకరించుకుని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేశాను. స్టడీ హాల్లో స్నేహితులతో డిస్కషన్స్ ఎక్కువగా చేసే వాళ్లం. ఒక టాపిక్ తీసుకుని దానిపై చర్చించేవాళ్లం. అది బాగా ఉపయోగపడింది. మ్యాథ్స్ స్టూడెంట్ను అయినప్పటికీ జనరల్ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఫిజికల్ ఈవెంట్స్ కంటే రాత పరీక్షకే ఎక్కువ సమయం కేటాయించాలి.
అమ్మే నా రోల్ మోడల్..
అమ్మ జీనత్ జహాన్ మాడ్గులపల్లి మండలం పాములపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ తానై ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఏం చదువతానన్నా కాదనలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతానంటే ముందుండి ప్రోత్సహించారు. నేను ఏ స్థాయికి చేరుకున్నా అమ్మే నా రోల్ మోడల్.
అర్థం చేసుకుని చదివితే విజయం..
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్లు కచ్చితంగా ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో చదవాలి. మనసులోంచి నెగెటివ్ ఆలోచనలు తీసేసి ఫోకస్డ్గా చదవాలి. ముఖ్యంగా మ్యాథ్స్‌ను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ స్టడీస్‌కు సంబంధించిన సబ్జెక్టులను ప్రణాళిక ప్రకారం అర్థం చేసుకుని చదివితే సులభం అవుతుంది. బట్టీ విధానంలో చదివితే ఉపయోగం ఉండదు. మనకంటూ ఒక గోల్ పెట్టుకుని చదివితే విజయం సాధించవచ్చు.
పట్టుదలతో చదివితేనే గెలుపు
పట్టుదల,
కృషి ఉంటే పేదరికం విజయానికి అడ్డురాదు. ఒకసారి ప్రయత్నించి విఫలమవగానే వదిలేస్తే కల ఎప్పటికీ నెరవేరదు. పట్టు వదలకుండా శ్రమిస్తే ఏదైనా సాధించొచ్చని నిరూపించారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన పుట్ట సతీష్. ఆయన సాధించిన సక్సెస్ తీరు ఆయన మాటల్లోనే..
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా..
నేను పెద్దపల్లిలో బీటెక్ (ఈఈఈ) 2017లో పూర్తి చేశాను. అప్పటి నుంచి కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. ఇప్పటికే ఆర్ఆర్బీ (ఎన్టీపీసీ) ఉద్యోగం వచ్చింది. ఇంకా ట్రెయినింగ్ కాలేదు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో కూడా మంచి ర్యాంకు వస్తుంది. పోటీ పరీక్షల సన్నద్ధత కోసం 2021 వరకు హైదరాబాద్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. వారు అందించిన మెటీరియల్ చదువుతూ మాక్ టెస్టులు రాశాను.
నాన్న, తమ్ముడి ప్రోత్సాహంతోనే..
నాన్న పుట్ట రాజయ్య ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ ట్రాక్టర్ నడుపుతారు. అమ్మ గృహిణి. తమ్ముడు ఆంజనేయులు సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగి. పోటీ పరీక్షలకు ప్రిపేరవడానికి నాన్న, తమ్ముడి ప్రోత్సాహమే కారణం. వారు పనిచేస్తూ నన్ను చదివించారు. వారు అందించిన ప్రోత్సాహానికి ఫలితం అందించాలని కష్టపడి చదివాను. ఎస్ఐ సివిల్ విభాగంలో మంచి ర్యాంకు సాధించాను.
నిరంతర శ్రమతోనే..
బీటెక్ చదవడం వల్ల మ్యాథ్స్‌తో ఇబ్బంది ఏమీ కలగలేదు. కానీ జనరల్ స్టడీస్‌కు సంబంధించిన టాపిక్స్‌పై పట్టు సాధించడానికి చాలా కష్టపడ్డాను. జీఎస్‌పై పూర్తి పట్టు రావడానికి మూడేళ్లు పట్టింది. ప్రిపరేషన్లో ఎక్కువ సమయం దానికే కేటాయించాను. కేవలం జీఎస్ కోసమే రోజూ 8-10 గంటల సమయం తీసుకున్నాను. ఒక్కో టాపిక్‌ను గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ, అర్థం చేసుకుని చదివాను. అలా చేయడం వల్లనే ఎస్ఐ పరీక్షలో మంచి మార్కులు సాధించగలిగాను. గ్రామీణ ప్రాంతం నుంచి రావడం వల్ల ఈవెంట్స్‌కు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.
గమ్యం చేరేదాకా కష్టపడాలి
పోటీ పరీక్షలు రాయాలనుకునేవారు నోటిఫికేషన్ విడుదలైనప్పుడే చదివితే ఫలితం ఉండదు. ప్రిపరేషన్ అనేది నిరంతర ప్రక్రియలాగా ఉండాలి. ఏదో మొక్కుబడిగా రెండు, మూడు నెలలు చదివితే ఉద్యోగం వస్తుందనుకుంటే అది భ్రమే. లక్ష్యాన్ని చేరడానికి ఎన్ని సంవత్సరాలైనా వేచి చూసే ఓపిక ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతాం. ప్రిపరేషన్లో ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నామో గుర్తించి దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. దానిపై పూర్తి పట్టు వచ్చేదాకా చదవాలి. అప్పుడే విజయం సాధిస్తాం.
– కుమార స్వామి కాసాని
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?