Civil Services Success Stories | సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు
సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో చదివా
శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్ ఆల్ఇండియా 40వ ర్యాంక్
‘సివిల్స్ సాధించాలనుకున్నాడు. రిజల్ట్ గురించి ఆలోచించలేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ప్రణాళికాబద్ధంగా లక్ష్యసాధన కోసం చదివాడు. అతడే సివిల్స్‌లో ఆల్ ఇండియా 40వ ర్యాంకర్ శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్. సాధించిన విశేషాలు ఆయన మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం
నా తల్లిదండ్రులు హనుమకొండ అడ్వకేట్స్కాలనీకి చెందిన శాఖమూరి అమర్లింగేశ్వర్రావు, పద్మజ. పది వరకు వరంగల్‌లో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేశాను. అమ్మానాన్న చేపట్టే సేవా కార్యక్రమాలతో చిన్నప్పటి నుంచే నిరుపేదలకు సేవచేయాలనే సంకల్పం కలిగింది. ఇది సాధ్యం కావాలంటే ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నా. స్నేహితురాలు ప్రసన్న సహకారంతో ఇంత మంచి ర్యాంకు సాధించాను. మొదటి ప్రయత్నంలోనే 40వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు.
ఆన్లైన్ కోచింగ్ ఉపయోగపడింది
ప్రిలిమ్స్ ఇంటి వద్దే ఉండి చదివాను. మెయిన్స్‌కు ఢిల్లీలో కోచింగ్ తీసుకోవాలనుకున్నాను. కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. హైదరాబాద్‌లో స్నేహితుల వద్ద ఉంటూ వాజీరాం ఐఏఎస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు స్నేహితులతో మాట్లాడే వాడిని. వారు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. మాక్ టెస్ట్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకునేవాడిని.
ఇంటర్వ్యూ
యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని టీం ఇంటర్వ్యూ చేసింది. అరగంటకు పైగా సాగింది. జనరల్ ప్రశ్నలు, పొల్యూషన్, నీటి నిర్వహణ, సుమోటో కేసులు, 2026లో జరుగనున్న పునర్విభజన, రజాకార్లు ఎవరు? ఏం చేశారు? తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నలు అడిగారు. తెలంగాణ అంశాలతో పాటు తెలిసిన వాటికి సమాధానం చెప్పాను. రజాకార్ల గురించి తెలియదు, సారీ సర్ అని అన్నాను.
నా సలహా..
సివిల్స్‌కు సన్నద్ధమయ్యేటప్పుడు సెల్ఫ్ కాన్పిడెన్స్ చాలా ముఖ్యం. ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. ప్రణాళికాబద్ధంగా చదవాలి. నిలకడగా చదివేతే సివిల్స్ సాధించడం సులభం. కష్టపడుతూ ఇష్టంతో ప్రయత్నం చేయాలి. సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ఆలోచించాలి. ఏదో పరీక్షల ముందు నుంచి చుదువుదాంలే అంటే సరిపోదు. నిత్యం చదవాల్సిందే. చదివింది తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
– పిన్నింటి గోపాల్
(నమస్తే తెలంగాణ ప్రతినిధి, వరంగల్)
ఓటమే విజయానికి నాంది
మహేశ్‌కుమార్ ఆల్ఇండియా 200వ ర్యాంక్
సివిల్స్ సాధించే ప్రయత్నంలో అన్నీ అపజయాలే ఎదురయ్యాయి. అయినా నిరాశ చెందలేదు. నాలుగు సార్లు ఫెయిలైనా మనోధైర్యం కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో ఐదోసారి సివిల్స్‌లో 200వ ర్యాంక్ సాధించాడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన కమటం మహేశ్. విజయ ప్రస్థానం అతడి మాటల్లో..
కుటుంబ నేపథ్యం..
మాది మధ్యతరగతి కుటుంబమే. అమ్మానాన్నలు ప్రభుత్వ ఉద్యోగులు. ఏ లోటు లేకుండా ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రోత్సహించారు. వారి కృషితోనే మా సోదరుడు, సోదరి, నేను ఎవరికివారు ప్రత్యేకతతో నిలబడ్డాం. నాన్న రాములు ఎన్పీడీసీఎల్లో సీనియర్ లైన్మెన్గా పని చేస్తున్నారు. అమ్మ యాదమ్మ. హెల్త్ సూపర్వైజర్గా, భార్య సౌమ్య ప్రస్తుతం ఫెర్నాండెజ్ ఫౌండేషన్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నారు. సోదరుడు కిరణ్‌కుమార్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా, సోదరి కావ్యశ్రీ డేటా సైన్స్ అనలిటికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.
నాన్నే స్ఫూర్తి..
నాన్న పై ఆఫీసర్లకు దక్కిన గౌరవం చూసి, అలాంటి ఘనత సాధించాలనే తపనతోనే సివిల్స్ వైపు వచ్చాను. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. సిలబస్ ఆధారంగా అందుబాటులో ఉన్న పుస్తకాలను సమకూర్చుకున్నాను. ఇంటర్నెట్లో లభించిన మెటీరియల్‌పైనే ఆధారపడి ప్రిపేర్ అయ్యాను. మొదటిసారి 2017లో, 2018 రాసినప్పటికీ ఫలితం దక్కలేదు. 2019లో మెయిన్స్, 2021లో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. ఎట్టకేలకు 2022లో అనుకున్నది సాధించాను.
ఐదో ప్రయత్నంలో..
జేఎన్‌యూ (ఢిల్లీ)లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నప్పుడే ప్రిపరేషన్‌కు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాను. ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధన సఫలమైంది. నిజాంసాగర్ నవోదయలో పదో తరగతి, నిజామాబాద్‌లో ఇంటర్, నిజాం కళాశాలలో బీఎస్సీ చదివాను. ‘చైనీస్ రాజకీయాలు’ అనే అంశాలపై పీహెచ్డీ చేస్తున్నాను. ప్రస్తుతం విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పని చేస్తున్నాను.
షీ టీమ్స్‌పై ప్రశ్న..
ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి స్మితా నాగరాజు బోర్డు ఇంటర్వ్యూ చేసింది. 30 నిమిషాల పాటు ఐదారు ప్రశ్నలు అడిగారు. సివిల్స్‌లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆప్షన్ పెట్టినందుకు చాలా ప్రశ్నలు విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశ ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి ప్రశ్నలను అడిగారు. వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, వర్క్ ప్రొఫైల్పైనా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి షీ టీమ్స్‌పై అడిగారు. షీ టీమ్స్ వల్ల హైదరాబాద్ మెట్రో నగరంలో మహిళలు అర్ధరాత్రి ధైర్యంగా పనులు చేసుకొని ఇంటికి వచ్చేంత స్వేచ్ఛ లభించింది. తెలంగాణ అంతటా షీ టీమ్స్ ప్రభావం ఉందని వివరించాను. మార్పులు చేర్పులపైనా అనుబంధంగా ప్రశ్నలు అడిగినప్పుడు సాంకేతికత వినియోగాన్ని మార్పులు చేసుకోవాలని చెప్పాను. ఎస్‌వోఎస్ ఆప్షన్ కల్పిస్తే బాగుంటుంది. షీ టీమ్ ఇప్పుడున్న స్థితిలోనే కాకుండా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ద్వారా మరింత మెరుగైన సేవలందించే వీలు కలుగుతుంది. స్త్రీల పట్ల అరాచకాలను నిరోధిస్తే వాటి అవసరం కూడా ఉండదు. ఈ సామాజిక మార్పును సాధించడం కూడా ముఖ్యమేనని వివరించాను.
రాయబారి అవుతా..
ఢిల్లీలోని జేఎన్‌యూలో పీజీ చేస్తున్నప్పుడే ఫారెన్ సర్వీస్‌పై ఇష్టం పెరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ గొప్పవే అయినప్పటికీ రాయబారిగానే దేశ, విదేశాల్లో పని చేయడం ఇష్టం. నాకొచ్చిన 200 ర్యాంకుతో ఐఏఎస్ వచ్చేది. ఆప్షనల్ మాత్రం ఇండియన్ ఫారెన్ సర్వీసు పెట్టుకున్నందున సులువుగా ఐఎఫ్ఎస్ వస్తుంది. విదేశాల్లో రాయబారిగా పనిచేస్తూ మన దేశ పౌరులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే కోరికతోనే సివిల్స్ వైపు వచ్చాను. నిత్యం ఏదో ఒకటి నేర్చుకునే సౌలభ్యం కూడా ఫారెన్ సర్వీసులో ఉంటుందని నా అభిప్రాయం.
– జూపల్లి రమేష్ రావు, నిజామాబాద్
(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మూడేళ్లుగా రోజూ పది గంటలు చదివా..
గ్రందే సాయికృష్ణ ఆల్ఇండియా 293వ ర్యాంక్
సాధించాలనే పట్టుదల ఉంటే కొంచెం ఆలస్యమైనా విజయం మన దరికి తనంతట తానే చేరుతుందని నిరూపించిచారు గ్రందే సాయికృష్ణ. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. సివిల్స్ సాధించాలనే తపనతో చదివి మూడో ప్రయత్నంలో 293వ ర్యాంకు సాధించారు. వివరాలు ఆయన మాటల్లో..
కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం
మాది మధ్యతరగతి కుటుంబం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీనగర్‌కాలనీ. నాన్న గ్రందే శ్రీనివాస్ కొత్తగూడెంలోని ఓ లాడ్జిలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. తల్లి నాగలక్ష్మి గృహిణి. ప్రాథమిక విద్య కొత్తగూడెంలో పూర్తి చేశాను. ఇంటర్ విజయవాడలో, బీటెక్ కేరళలోని కాలికట్లో ఎన్ఐటీలో పూర్తి చేశాను. ఎల్అండ్టీ కంపెనీలో ఏడాదికి రూ.6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ అది సంతృప్తినివ్వలేదు. రెండేళ్లు ఉద్యోగం చేశాను. సివిల్స్ చదువుతానని అమ్మానాన్నలకు చెప్పగానే ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా రోజూ పది గంటలు మూడేళ్లు చదివాను. యూపీఎస్సీ వెబ్‌సైట్‌లోని ఎగ్జామ్ పేపర్ చూసి ఆన్లైన్లో పుస్తకాలు తెప్పించుకొని చదివాను. ఆన్లైన్లో మాక్ టెస్టులు రాశాను. రెండు సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్‌కి సెలెక్ట్ అయినా ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. మూడో ప్రయత్నంలో 293వ ర్యాంకు సాధించాను. మధ్య తరగతి కుటుంబానికి చెందినా సివిల్స్ రాణించడం కష్టమేమీ కాదు. ఓపిక, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే లక్ష్యం సులభం అవుతుంది. నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ నిరుత్సాహపర్చలేదు.
ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు
అరగంటసేపు ఇంటర్వ్యూ చేశారు. అలవాట్లు, గతంలో నేను చేసిన ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. క్రీడలపై ఆసక్తి వంటి అంశాలు అడిగారు.
– కే శివశంకర్
కొత్తగూడెం (ఎడ్యుకేషన్)
సరైన ప్రణాళికే విజయానికి సోపానం
నంద్యాల చేతనరెడ్డి ఆల్ఇండియా 346వ ర్యాంక్
సామాజిక విషయాలపై ఆసక్తి. విద్యార్థి దశ నుంచే బృంద చర్చలపై అభిరుచి. దీంతో సివిల్స్ ర్యాంకు సాధించాలనే పట్టుదల పెరిగింది. ప్రయత్నమే విజయానికి నాంది అని నమ్మి మూడో ప్రయత్నంలో సివిల్స్ 346 ర్యాంకు సాధించింది నంద్యాల చేతన రెడ్డి. విజయ ప్రస్థానం ఆమె మాటల్లో..
కుటుంబ నేపథ్యం?
అమ్మనాన్నలిద్దరూ వైద్యులు. నాన్న ఎన్వీ నర్సింహారెడ్డి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సర్జన్‌గా, అమ్మ కవితారెడ్డి ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పని చేస్తున్నారు. సివిల్స్ సాధించాలని చిన్నప్పటి లక్ష్యంగా పెట్టుకున్నాను. డిబేట్లో పాల్గొనాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. పోటీ పరీక్షలు రాయడం. సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడం చిన్నప్పటి నుంచే అలవడింది. సివిల్స్ సాధించి ప్రజలకు సేవలందించాలనుకున్నాను. హైదరాబాద్ బిట్స్‌లో ఈసీఈ పూర్తి చేసి బెంగుళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సెమీ కండక్టర్ విభాగంలో ప్రత్యేక ప్రతినిధిగా పని చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. రెండుసార్లు ప్రిలిమ్స్ దాకా వెళ్లాను. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించాను.
ప్రిపరేషన్
సివిల్స్ సాధించే క్రమంలో ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. వాటికి భయపడొద్దు. బ్యాక్ ప్లాన్ ఉంటే చాలా మంచిది. ప్రిలిమ్స్ కోసం 10 నుంచి 15 మాక్ టెస్టులు రాసేదాన్ని. రాసిన ప్రతి పేపరును తిరగేసి తప్పులను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకున్నాను. ఇలా చేయడం ద్వారా తప్పులు పునరావృతం కాలేదు. నిబద్ధత, క్రమశిక్షణతో చదివాను.
కోచింగ్, గైడెన్స్
హైదరాబాద్‌లోని వీకే ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. వికాస్ సార్ మంచి గైడెన్స్ ఇచ్చారు. చాలా మాక్ టెస్టులు రాయించారు.
ఇంటర్యూలో అడిగిన ప్రశ్నలు
ఈసీఈ స్టూడెంట్ కావడంతో సెమీ కండక్టర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. హాబీలు, సాధారణ ప్రశ్నలు అడిగారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి, లీడర్షిప్ క్వాలిటీ ఏవిధంగా ఉండాలని ప్రశ్నించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఇంకా చేయాల్సిన అంశాలపై అడిగారు. అర్బన్ ప్లానింగ్ గురించి చెప్పాను.
సూచనలు
చాలామంది సివిల్స్ రాసేందుకు ఇష్టమున్నా.. కష్టమని వెనక్కి తగ్గుతుంటారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న గోల్ సాధించవచ్చు. ప్రధానంగా మానసికంగా ఫిట్‌గా ఉండాలి. ఫెయిల్యూర్స్ ఎదురైనా కుంగిపోకూడదు. సమయపాలన చాలా ముఖ్యం. నిత్యం న్యూస్ పేపర్లు చదవాలి.
ఆప్షనల్
నా ఆప్షనల్ సోషయాలజీ. సమాజంపై పూర్తి అవగాహన ఉంది. పేదలు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తా. ఏ సర్వీసు వచ్చినా సాంకేతికతను పాలనలో ఇనుమడింపజేసేలా కృషి చేస్తా.
– దుద్దాల రాజు
(నమస్తే తెలంగాణ ప్రతినిధి, మణికొండ)
నాలుగోసారి సాధించా
దామెర హిమవంశీ ఆల్ఇండియా 548వ ర్యాంక్
కృషి పట్టుదలతో పాటు ప్రణాళికతో చదివితే సివిల్స్‌లో విజయం సాధించవచ్చని నిరూపించాడు దామెర హిమవంశీ. సివిల్స్‌లో 548వ ర్యాంక్ సాధించిన తీరుతెన్నుల గురించి ఆయన మాటల్లో..
కుటుంబ నేపథ్యం..
మాది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలోని సిర్దేపల్లి. నాన్న ప్రభుత్వ డాక్టర్ దామెర యాదయ్య, అమ్మ నిర్మల బీటెక్ పూర్తిచేసి గృహిణిగా ఉంటుంది. నల్లగొండలో 10 వరకు, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో చదివాను. ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ (జియోఫిజికల్ టెక్నాలజీ) పూర్తి చేశాను. నాన్నకు నన్ను కలెక్టర్‌గా చూడాలని కోరిక. నాన్న కోరిక మేరకు సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. సివిల్స్‌కు ప్రిపేరవుతున్న రూర్కీలో చాలా మంది సీనియర్ల సలహాలు తీసుకున్నాను.
ఇబ్బందులను గెలుపుగా మార్చుకున్నా..
సివిల్స్ ప్రిపరేషన్లో ఎదురైన ప్రతి ఓటమిని, ఇబ్బందులను గెలుపుగా మార్చుకుంటూ చదివి నాలుగో సారి 548వ ర్యాంక్ సాధించా. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే 2019లో మొదటిసారి సివిల్స్ రాశా ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాలేదు. యూట్యూబ్‌లో సివిల్స్ టాపర్స్ ఇంటర్యూలు, వారు చదివిన పుస్తకాలు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ లభిస్తాయో తెలుసుకున్నాను. తెలంగాణకు చెందిన రుషికేష్‌రెడ్డి సివిల్స్‌లో ఆలిండియా 95వ ర్యాంకర్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన మెటీరియల్ ప్రింట్ తీసుకున్నాను. ఇతరుల మెటీరియల్ వద్దని, దీంతో టైం వేస్ట్ అవుతుందని, కోచింగ్ సెంటర్లోగాని, సొంతంగా గాని మెటీరియల్ తయారు చేసుకోవాలని చాలామంది అన్నారు. అయినా రుషికేష్‌రెడ్డి మెటీరియల్‌ను చదువుతూ నూతన అంశాలను అప్డేట్ చేసుకుంటూ చదివాను. అదేవిధంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్‌లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారో గమనించి ప్రాక్టీస్ చేస్తూ 2020లో రాసినా ఓటమినే ఎదుర్కొన్నాను. అమ్మానాన్న, స్నేహితుల ప్రోత్సాహంతో వెనుకడుగువేయకుండా నల్లగొండలోనే ఉంటూ చదివి 2021లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినప్పటికీ ర్యాంక్ రాలేదు. ఇంటర్యూకు వెళ్లిన సందర్భంలో వివిధ రాష్ర్టాలకు చెందిన అభ్యర్థులు పరిచయం కావడంతో అంతా గ్రూప్‌గా ఏర్పడ్డాం. ఇలా ఒకరికి తెలిసిన అంశం మరొకరితో చర్చించుకుంటూ చదివి 2022లో నాలుగోసారి విజయం సాధించాను.
ప్రిపరేషన్
ప్రిలిమ్స్‌కు పాలిటీకి లక్ష్మీకాంత్ రాసిన పుస్తకం, హిస్టరీకి స్పెక్ట్రమ్ సిరీస్ చదివాను. అలాగే మిగిలిన సబ్జెక్టు విషయంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ చదివాను. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి, కరెంట్ ఆఫైర్స్ కోసం పలు రకాల న్యూస్ పేపర్స్ చదివి నోట్స్ రాసుకునేవాన్ని వీటితో పాటు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేశాను. అదే విధంగా యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న మెటీరియల్స్ గైడ్‌గా ఉపయోగపడ్డాయి. పలు రకాల మెటీరియల్ కాకుండా ఏదైనా ఒకే మెటీరియల్‌ను ప్రతి బిట్ మిస్‌కాకుండా చదివి పట్టు సాధించాలి. మెయిన్స్‌కు రుషికేష్‌రెడ్డి ఆన్లైన్లో ఉంచిన మెటీరియల్‌తో పాటు పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేస్తూ రోజూ 8 నుంచి 9 గంటలు చదివాను. విజన్ ఐఏఎస్-365 పుస్తకాలు కరెంట్ ఆఫైర్స్ కోసం చదివాను. దీంతోపాటు సొంతంగా రాసుకున్న నోట్స్ రివిజన్ చేశాను. సోషియాలజీ కోసం నితిన్ శాండ్వాన్, యూట్యూబ్‌లో స్లీపి క్లాసిస్లో ప్రసారమయ్యే అంశాలను చదివాను. ఒత్తిడిని అధిగమించడానికి ఇష్టమైన బాస్కెట్‌బాల్ ఆడేవాడిని. అమ్మమ్మ, తాతయ్య, అమ్మనాన్నలతో మాట్లాడేవాడిని. టీవీలో సినిమాలు చూసేవాడిని. ఇంటర్వ్యూ కోసం సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ సార్‌తో ఆన్లైన్లో చాలా ఇంటర్యూలు, మాక్ టెస్ట్‌లు చేశాను. ఇంటర్వ్యూలో విజయం సాధించే అంశాలను తెలిపి ప్రాక్టీస్ చేయించారు. ఇదే కాకుండా యూట్యూబ్‌లో మాక్ ఇంటర్వ్యూలు, ఢిల్లీలో పలు సంస్థలు నిర్వహించే మాక్ టెస్ట్‌లకు హాజరయ్యాను.
ఇంటర్వ్యూ
సత్యవతి మేడం బోర్డు ఇంటర్వ్యూ చేసింది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం, పీఎం కిసాన్ అమలు చేసే తీరు, వాటిలో వ్యత్యాసాలను అడిగారు. అదేవిధంగా తెలంగాణ నేలలు ఆయిల్ పామ్‌కు అనుకూలంగా ఉన్నాయా? ఉంటే అధికంగా ఎక్కడ సాగు చేస్తున్నారు? రాష్ట్ర విభజన వల్ల కలిగిన లాభాలపై అడిగారు.
నా సలహా..
సివిల్స్‌కు సిద్ధమయ్యేవారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ‘కష్టపడిన ప్రతివాడు.. సక్సెస్ అవుతాడనే గ్యారంటీ లేదు. కానీ సక్సెస్ అయిన ప్రతివాడూ కష్టపడిన వారే’. ముందుగా సిలబస్‌లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వాటికి సంబంధించిన ప్రామాణిక మెటీరియల్ సేకరించుకుని చదవాలి. కోచింగ్ సెంటర్‌కు వెళ్తేనే ఉద్యోగం వస్తుందనే ఆలోచన నుంచి బయటకు రావాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదువుతూ సొంత నోట్స్ తయారు చేసుకోవాలి.
-బొడ్డుపల్లి రామకృష్ణ,
విద్యావిభాగం, నల్లగొండ
మూడుసార్లు ఫెయిలైనా పట్టు వీడలేదు
పత్తిపాక సాయికిరణ్ ఆల్ఇండియా 460వ ర్యాంక్
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో చదివాడు. మొదటి ప్రయత్నంలో ఫెయిలయ్యాడు. అయినా కుంగిపోలేదు. రెండో ప్రయత్నంలో ర్యాంక్ రాలేదు. అయినా బాధపడలేదు. మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా కల సాకారం కాలేదు. అయినా ప్రయత్నాన్ని విరమించుకోలేదు. అలా సివిల్స్ లక్ష్యంగా చదువుతూ నాలుగో ప్రయత్నంలో సాధించాడు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన సాయికిరణ్. ఆయన అనుభవాలు ఆయన మాటల్లో..
కుటుంబం
మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు పత్తిపాక కొమురెల్లి, లక్ష్మి. అమ్మానాన్న ఇద్దరు సర్పంచ్‌లుగా పని చేశారు. అక చైతన్య వివాహమైంది. చెల్లెలు చండీప్రియ మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్‌లో ఎండీ చదువుతుంది.
కలాం మాటల స్ఫూర్తితో
హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివాను. కేరళలోని కాలికట్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసి మూడేండ్లు ఉద్యోగం చేశాను. ఏడాదికి రూ.18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నా సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఉద్యోగం చేసిన సమయంలో ప్రతి నెలా జీతంలో కొంత డబ్బు పొదుపు చేశాను. ఆ డబ్బులతోనే కోచింగ్ తీసుకున్నాను. కలను సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చాయి. అందుకే ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఏం ప్రిపేర్ కాకుండా మొదటిసారి సివిల్స్ రాసి ఫెయిల్ అయ్యాను. అనుకున్న లక్ష్యం సాధించాలంటే సరైన ప్రణాళిక, సాధన అవసరమని తెలిసింది. రెండోసారి ప్రిలిమ్స్ పాసయ్యాను. మెయిన్స్ క్వాలిఫై కాలేదు. మూడోసారి ప్రిలిమ్స్, మెయిన్స్ పాసై ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఫైనల్లో రెండు మారులతో సివిల్స్ చేజారింది. నాలుగో ప్రయత్నంలో 460వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుతో ఐపీఎస్ వస్తుంది. ఐఏఎస్ సాధించడమే నా కల. ఐపీఎస్‌లో జాయిన్ అయినప్పటికీ మరోసారి సివిల్స్ రాస్తాను. సివిల్ సర్వీసు అధికారి అయ్యాక అంగన్వాడీ, పాఠశాలలు, ఆస్పత్రి, గ్రామపంచాయతీలు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తా.
ప్రిపరేషన్
సరైన గైడెన్స్ లేకపోవడం, మెటీరియల్ ఒక దగ్గర సమీకరించుకోకపోవడం, చదివిన అంశాలను రివైజ్ చేయలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఢిల్లీలోని శంకర్ ఐఏఎస్ అకాడమీలో మెయిన్స్ మాక్ టెస్ట్ కోసం కోచింగ్ వెళ్లాను. హైదరాబాద్‌లోని బాలలత మేడమ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ కోసం కోచింగ్ తీసుకున్నాను. అకడ ఐదుగురితో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి నిత్యం ఇష్టాగోష్టి చర్చలు, తెలియని వాటిని తెలుసుకోవడం, ముఖ్యమైనవి టిక్ చేసి, గుర్తుంచుకోవడం చేసేవాళ్లం. ఈ ప్రక్రియ ఇంటర్వ్యూలో ఎంతగానో ఉపయోగపడింది.
ఇంటర్వ్యూ
తెలంగాణ రాష్ట్రంలో ఎకువ జిల్లాలు కావడం వల్ల ఇబ్బందులు ఏమిటి? ఉపయోగం ఏమిటి? అని ఇంటర్వ్యూలో అడిగారు. రాష్ట్రంలో ఎకువ జిల్లాలు కావడం వల్ల పరిపాలన సౌలభ్యం సులువుగా ఉంటుంది. ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుంది. కాకపోతే కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల కొత్త భవనాల నిర్మాణం, మోయలేని అదనపు వ్యయం, కొత్త ఉద్యోగాల భారం ఉంటుందని చెప్పాను. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలకు మరింత అధికారం ఇవ్వడం మంచిదా అని అడిగారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలకు అధికారాలు ఎకువ ఇవ్వడం మంచిదని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని, అక్కడ సమస్య పరిషారం కాకపోతే జిల్లా అధికారి వద్దకు వెళ్లవచ్చని చెప్పాను. సింగరేణి బొగ్గు వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. దాన్ని ఎలా అధిగమించాలని అడిగారు. సింగరేణి బొగ్గు తీయడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందన్న మాట వాస్తవమే కానీ వెంటనే ఆ పనులు నిలిపివేయవద్దని, సింగరేణి బొగ్గు వల్ల చాలామంది కార్మికులకు జీవనోపాధితో పాటు కరెంటు సౌకర్యం లభిస్తుందని చెప్పాను. విడతలవారీగా సోలార్ వైపు ప్రజలంతా అడుగులు వేసేలా చూడాలి.
నా సలహా..
అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన, సంకల్ప బలం ఉండాలి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తప్పకుండా గైడెన్స్ తీసుకోవాలి. నోట్స్ సేకరించి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు నోట్స్‌ను రివైజ్ చేసుకోవాలి. మాక్ పరీక్షలు పదేపదే రాయాలి. అందులో చేసిన తప్పులను సరి చేసుకోవాలి. ఫిజికల్ హెల్త్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. నిత్యం ప్రణాళికాబద్ధంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు చదవాలి.
– పిన్నింటి గోపాల్
(నమస్తే తెలంగాణ ప్రతినిధి, వరంగల్)
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవాలి
తుమ్మల సాయికృష్ణారెడ్డి (ఆల్ఇండియా 640వ ర్యాంక్)
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని పోరాడాలి. యూపీఎస్సీ పరీక్షలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. మొదటి ప్రయత్నంలో రాకపోయినా బాధపడకుండా ప్రయత్నిస్తే కచ్చితంగా విజయం సాధించవచ్చు. వరంగల్ నిట్‌లో చదువుతున్నప్పుడు ఎన్ఎస్ఎస్లో పని చేసిన అనుభవాలే సివిల్స్ రాసేందుకు ప్రేరణగా నిలిచాయని తుమ్మల సాయికృష్ణారెడ్డి చెప్పారు. అనుభవాలు ఆయన మాటల్లో..
కుటుంబం
మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లె. నాన్న రాజశేఖర్‌రెడ్డి, అమ్మ సంతోష, అన్నయ్య సాయితేజ. వ్యవసాయ కుటుంబం. 2020లో వరంగల్ నిట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. సివిల్ సర్వీసెస్ వైపు రావడానికి నాన్న ప్రోత్సాహం చాలా ఉన్నది. సివిల్ సర్వీసెస్‌తోనే ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం వస్తుంది. మన వంతు సమాజానికి ఏదో ఒకటి చేయవచ్చు. రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో 640వ ర్యాంకు సాధించాను. మొదటి ప్రయత్నంలో మెయిన్స్‌లో క్వాలిఫై కాలేదు. ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అనాలిసిస్ చేసుకొని, తప్పులను సరిదిద్దుకున్నాను. నిరుత్సాహ పడకుండా మళ్లీ ప్రయత్నించాను.
ఇంటర్వ్యూ
నన్ను ప్రీతిసుదన్ మేడం బోర్డు ఇంటర్వ్యూ చేసింది. కరెంట్ అఫైర్స్, పర్యావరణం వర్సెస్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్, జమ్ముకశ్మీర్, వరంగల్ గురించి ప్రశ్నలు అడిగారు. వరంగల్ నిట్‌లో చదివాను కాబట్టి వరంగల్ చరిత్ర, ప్రత్యేకత గురించి అడిగారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయింది అని అడిగారు? కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇవ్వమంటే ఏం ఇస్తావ్ అని అడిగారు.
నా సలహా..
రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలు చదవాలి. న్యూస్ పేపర్స్, స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ఆన్సర్స్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. మిమ్మల్ని మీరు నమ్మి, కష్టపడితే కచ్చితంగా గెలుపు సొంతమవుతుంది.
పిన్నింటి గోపాల్
(నమస్తే తెలంగాణ ప్రతినిధి, వరంగల్)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?