JEE Advanced 2023 – Success Stories | లక్ష్యం పెట్టుకున్నారు.. లక్షణంగా సాధించారు
జేఈఈ అడ్వాన్స్డ్ ఆలిండియా మొదటి ర్యాంక్
వావిలాల చిద్విలాస్ రెడ్డి
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా పేరుగాంచిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక ఎంతో కఠోర శ్రమ, చక్కటి ప్లానింగ్ ఉన్నాయి. మొదటి ర్యాంక్ సాధించిన చిద్విలాస్ రెడ్డి మన రాష్ర్టానికి చెందిన వాడు కావడం గమనార్హం. ర్యాంక్ సాధన కోసం చేసిన కృషి గురించి చిద్విలాస్ మాటల్లో….
కుటుంబ నేపథ్యం..
- మాది నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట. అమ్మ నాగలక్ష్మి, నాన్న రాజేశ్వర్‌రెడ్డి. ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో స్థిరపడ్డాం. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు నాగర్‌కర్నూల్‌లో, తర్వాత నాలుగు, ఐదు తరగతులు హస్తినాపురంలో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివాను. ఇక్కడే జేఈఈకి శిక్షణ తీసుకున్నాను. మ్యాథ్స్ సమస్యల పరిష్కారానికి నాన్న రాజేశ్వర్‌రెడ్డి చిట్కాలు చెప్పేవారు.
రోజుకు 15 గంటలు.. - జేఈఈ పరీక్ష కోసం ప్రతి రోజు 15 గంటలు, అది కూడా ప్రణాళికాబద్ధంగా చదివాను. సమయం వృథా చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. సెల్‌ఫోన్‌తో టైంపాస్ చేయడం, క్రికెట్ తదితర వాటికోసం సమయాన్ని వెచ్చించేవాడిని కాదు. నిమిషం వృథా చేయొద్దన్న ఆలోచనతో ప్రిపేరయ్యాను.
ఒత్తిడిని ఇలా అధిగమించాను.. - ప్రిపరేషన్.. ఫోకస్ అంతా జేఈఈ పైనే. ఎప్పుడూ చదవడం మంచిది కాదని తల్లిదండ్రులు సలహాలిచ్చేవారు. విరామ సమయంలో రోజుకు అరగంట నుంచి గంటపాటు టీటీ, ఫూజ్ బాల్ అడుతూ ఒత్తిడి నుంచి బయటపడేవాడిని. దీంతో ప్రిపరేషన్ కష్టమనిపించలేదు. చదివే సమయంలో కూడా అరగంట విశ్రాంతి తీసుకునేవాడిని.
విజయం వెనుక.. - నా విజయం తల్లిదండ్రులు, కాలేజీ ఫ్యాకల్టీ సపోర్ట్ వల్ల సాధ్యమైంది. ముఖ్యంగా మా అన్న నాకు స్ఫూర్తి. అన్నయ్య ప్రస్తుతం బిట్స్ పిలానీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
ప్రణాళిక ప్రకారం చదివా.. - కాలేజీలో ఏ రోజు చెప్పిన పాఠాలను ఆరోజు చదివేవాడిని. ప్రతి సబ్జెక్టునూ ప్రణాళిక ప్రకారం చదివాను. రెండు గంటలు గణితం, మూడు గంటలు ఫిజిక్స్‌కు కేటాయించి మిగిలిన సమయాన్ని వీలును బట్టి చదివాను. రాత్రిపూట కెమిస్ట్రీ పాఠాలను రివిజన్ చేశాను. నెగెటివ్ మార్కులుండటంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రశ్నలకే ఆన్సర్ చేశా. 360 మార్కులకు 341 మార్కులతో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాను.
భవిష్యత్తులో జేఈఈ రాసే వారికి.. - ముఖ్యంగా ఇంటర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రామాణిక పుస్తకాలను చదవడం తప్పనిసరి. మంచి బుక్స్‌ను ఒకటికి రెండు సార్లు చదవడం మేలు. మార్కెట్లో దొరికేవన్నీ ముందేసుకోవద్దు. వీలైనన్నీ ఎక్కువ మాక్‌టెస్ట్‌లు రాయాలి. ప్రణాళికతో చదవాలి. సబ్జెక్టు తప్ప మరేం చేయరాదు.
ఆటంకాలను అధిగమించాలి… - ప్రతి పనిలోను ఆటంకాలు తప్పక ఎదురవుతాయి. జాతీయస్థాయి పరీక్షలో విజయం సాధించాలంటే సంకల్ప బలం తప్పనిసరి. నేను చేసింది అదే. సోషల్ మీడియాకు, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నాను. అప్పుడప్పుడు ఇండోర్‌గేమ్స్ ఆడటం. రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదవడం. ఫ్యాకల్టీ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయడం వల్ల నేను విజయం సాధించగలిగాను.
జేఈఈ మెయిన్.. - మొదట రెండేండ్లు అంటే జేఈఈ ఎగ్జామ్ నెల రోజుల ముందు వరకు జేఈఈ సిలబస్‌ను పూర్తిస్థాయిలో చదువుకోవాలి. తర్వాత నెల లేదా రెండు నెలల ముందు నుంచి జేఈఈ మెయిన్ ప్యాట్రన్ ప్రకారం ప్రిపరేషన్, ప్రీవియస్ పేపర్స్ సాల్వింగ్ చేయడం ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటర్ అకడమిక్ పరీక్షలు పూర్తికాగానే తిరిగి జేఈఈ మెయిన్ (రెండో సెషన్ రాయాలనుకుంటే) లేదా అడ్వాన్స్డ్ పరీక్షకు సిద్ధం కావాలి.
- జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం మొదట పరీక్ష స్వభావాన్ని తెలుసుకోవాలి. ప్రీవియస్ పేపర్లను బాగా సాల్వ్ చేయాలి.
- పరీక్షకు ముందు ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ను బాగా చదవాలి. అదేవిధంగా కెమిస్ట్రీ కోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి
- చదివే కాలేజీలో వారు పెట్టే మాక్ టెస్ట్‌లను తప్పనిసరిగా రాయాలి. దానిలో లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పోతే తప్పక విజయం సాధించవచ్చు.
భవిష్యత్తు లక్ష్యం.. - జేఈఈ ర్యాంకుతో ఐఐటీ ముంబైలో సీఎస్ఈ కోర్సులో చేరి, రిసెర్చ్ రంగంలో రాణించి.. సామాన్యుల అవసరాలు తీర్చే సాంకేతికతను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను.
జేఈఈ ర్యాంక్ కోసం ఎప్పటి నుంచి చదవాలి? - నేను తొమ్మిదో తరగతి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించాను. నిజానికి జేఈఈ ప్రిపరేషన్ అనేది విద్యార్థి స్థాయి బట్టి ఉంటుంది. కొంతమంది ఆరో తరగతి నుంచే ఫౌండేషన్ పేరిట చదువుతారు. కొంత మంది ఇంటర్లో చదివి కూడా మంచి ర్యాంక్ సాధించారు. అది వారి వారి స్థాయిని బట్టి నిర్ణయించుకోవాలి.
చదివిన పుస్తకాలు
మ్యాథ్స్: వినయ్ కుమార్, ఎస్ఎల్ లోని
ఫిజిక్స్: హెచ్‌సీ వర్మ (2 వ్యాల్యూమ్స్), ఫిజిక్స్ గెలాక్సి, ఇర్డోవ్ (Irodov)
కెమిస్ట్రీ: ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి హిమాన్షు పాండే, ఎంఎస్ చౌహాన్, ఫిజికల్ కెమిస్ట్రీకి నీరజ్ కుమార్, ఇన్ ఆర్గానిక్ కోసం జేఈ లీ, కే కుమార్ పుస్తకాలను చదివాను. దీంతోపాటు ఎన్సీఈఆర్టీ కెమిస్ట్రీ తప్పనిసరిగా చదవాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ ఆలిండియా 56 ర్యాంక్
భవ్యశ్రీ
నమ్మకం, కష్టపడేతత్వం, సాధించాలనే తపన ఉంటే అసాధ్యమనేది ఉండదని అంటోంది జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్ నాగ భవ్యశ్రీ. తెలుగు విద్యార్థులు ప్రణాళికతో చదివి ఇటీవల విడుదలైన ఫలితాల్లో ర్యాంకులు కొల్లగొట్టారు. ఆలిండియా 56వ ర్యాంకు సాధించిన భవ్యశ్రీ తన ప్రిపరేషన్ గురించి ‘నిపుణ’తో పంచుకున్న వివరాలు ఇలా..
కుటుంబ నేపథ్యం?
- మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. నాన్న నయకంటి నాగేంద్రకుమార్, అమ్మ ఇంద్రలత. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. చెల్లి పదో తరగతి చదువుతుంది.
ర్యాంకు, మార్కుల వివరాలు? - సీనియర్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. 360కి 298 మార్కులు వచ్చాయి.
ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? - 8వ తరగతి నుంచే జేఈఈకి ప్రిపేర్ కావాలని ఉండేది. అప్పటి నుంచే చదువుతున్నా. అమ్మానాన్నలు నన్ను గైడ్ చేస్తుంటారు. జేఈఈ వైపు రావడం నా సొంత నిర్ణయమే. ఇంటర్ హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో పూర్తి చేశాను.
ఏయే మెటీరియల్, రోజూ ఎన్నిగంటలు చదివారు? - మా టీచర్లు ఇచ్చిన మెటీరియల్‌తో పాటు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివాను. రోజూ 12-13 గంటలు పుస్తకాలతో గడిపేదాన్ని. ఒక్కో సబ్జెక్టుకు కనీసం 4 గంటలు కేటాయించా. టాపిక్‌ను బట్టి ఎంత సమయం వెచ్చించాలనేది నిర్ణయించుకునేదాన్ని. నాకు మ్యాథ్స్ సబ్జెక్టు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఆర్గానిక్ కెమిస్ట్రీకి పీటర్ సైట్, ఫిజిక్స్‌కు యూనివర్సిటీ ఆఫ్ ఫిజిక్స్ బుక్స్ చదివా. ఆదివారాల్లో రిలాక్స్ కోసం మాత్రమే సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు చూశాను.
ఇంటర్లో ఉన్నప్పుడు మ్యాథ్స్, కెమిస్ట్రీ ఒలింపియాడ్ ఏమైనా వెళ్లారా? - ఫస్టియర్‌లో మ్యాథ్స్, సెకండియర్‌లో కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లకు వెళ్లాను. మన దేశం నుంచి మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు నలుగురం అమ్మాయిలం స్లొవేనియా దేశానికి వెళ్లాం. దాదాపు 56 దేశాల నుంచి విద్యార్థులొచ్చారు. ఇండియా తరఫున రిప్రజెంట్ చేశాం. అక్కడ హానరబుల్ మెన్షన్ అందుకున్నాను.
జేఈఈ మెయిన్స్‌కు, అడ్వాన్స్‌డ్‌కు ఎలా ప్రిపేరయ్యారు? - కంబైన్డ్‌గానే చదివాను. బోర్డ్ పరీక్షలకు ముందే వీటికి సంబంధించి కంటెంట్‌పై ఫోకస్ పెట్టాలి. జనవరి తర్వాత నుంచి బోర్డ్ పరీక్షలకు సమయం కేటాయించాలి.
- పేద అనే తేడా లేకుండా శ్రద్ధ ఉంటే ఎవరైనా ర్యాంకు దక్కించుకోవచ్చు.
నెగెటివ్ మార్కింగ్ ఉంది కదా.. పరీక్షలో ఎలాంటి టెక్నిక్ పాటించారు? - ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాను. ముందు ప్రశ్నలు బాగా అర్థం చేసుకున్నాకే సమాధానం ఎంచుకున్నాను. తెలిసినట్టు అనిపించినా తప్పు సమాధానం ఇస్తే ర్యాంకుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే సులభంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాశాను. తర్వాత కఠిన స్థాయి ప్రశ్నలపై దృష్టి పెట్టాను. గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేశాను.
ఏ ఐఐటీలో చదవాలనుంది, భవిష్యత్తు లక్ష్యం ఏంటి? - ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుంది. భవిష్యత్‌లో మ్యాథ్స్‌కు సంబంధించిన రంగంలో సెటిలవుతాను.
సివిల్స్ వైపు వెళ్లే ఆలోచన ఉందా? - లేదు. కానీ భవిష్యత్తులో చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా సామాజిక సేవ చేయాలనుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ రాసే వారికి మీరిచ్చే సలహాలు, సూచనలు? - మనపై మనకు నమ్మకం ఉండాలి. దానికి తోడు హార్డ్‌వర్క్, ఓపిక చాలా అవసరం. ఎగ్జామ్ టెంపర్మెంట్, స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలి. పోటీ ప్రపంచంలో సబ్జెక్టుపై పట్టు ఉంటేనే ర్యాంకు వస్తుంది. అలా అని విరామం లేకుండా చదివితే ప్రయోజనం ఉండదు. నచ్చిన విధంగా కాలక్షేపం చేయాలి.
– సురేంద్ర బండారు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు