విధిని ఎదిరించిన విజేతలు
సివిల్స్.. దేశంలో ప్రతిష్ఠాత్మక పరీక్ష. అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సుమారు 24 రకాల పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. సుమారు ఏడాదిన్నర సమయం పట్టే ఈ పరీక్షలో విజేతలుగా నిలువాలంటే ఓపిక, పట్టుదల, సహనం చాలా ముఖ్యం. అన్నింటికి మించి హార్డ్‌వర్క్+స్మార్ట్ వర్క్ అవసరం. పట్టుదల ఉంటే సివిల్స్ సాధించడానికి పేదరికం, అంగవైకల్యం, కుటుంబ స్థితిగతులు ఏవీ అడ్డంకులు కావని తాజా సివిల్స్ ఫలితాల్లో స్పష్టమైంది. ఈసారి మహిళలు టాప్ ర్యాంకుల్లో నిలవడం మరో విశేషం. రాష్ట్రం నుంచి విజయం సాధించిన అభ్యర్థుల్లో కూడా ఎక్కువ మంది సాధారణ దిగువ మధ్య తరగతికి చెందిన వారే. వీరి విజయం భవిష్యత్‌లో పరీక్ష రాసే వారికి స్ఫూర్తిదాయకం. కొందరు విజేతల విజయగాథ సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం…
తల్లి తోడుగా.. లక్ష్యం చేరగా….
కన్నతల్లి తోడుంటే బాలుడు కూడా యోధుడే.. అమ్మ ఇచ్చే ధైర్యం ముందు ఎంతటి కష్టమైనా మటుమాయమే.. ఇవన్నీ చెప్పుకోడానికి చాలా బాగుంటాయి.. కానీ ఓ యువకుడు చేతల్లోనూ నిరూపించాడు. ఆ మాతృమూర్తి నింపిన స్ఫూర్తితో దేశంలోనే ఉన్నత ఉద్యోగం సాధించి ఔరా అనింపించాడు. హైదరాబాద్ విద్యానగర్‌కు చెందిన బచ్చు స్మరణ్‌రాజ్ మృత్యువుతో పోరాడి సివిల్స్ ర్యాంకు సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే 676వ ర్యాంకు పొందాడు. 2017లో ఐఐటీ మద్రాసులో కెమికల్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతుండగా అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు.
వైద్యులు బ్రెయిన్ హ్యామరేజిగా నిర్ధారించారు. కుడిభాగం (చెయ్యి, కాలు) పక్షవాతం వచ్చినట్లు అయింది. 8 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడాడు. తర్వాత మూడేళ్లపాటు ఫిజియోథెరపీ చేశారు. అనంతరం సివిల్స్‌లో రాణించాలనే ఆయన కలను నెరవేర్చడానికి తల్లి ప్రోత్సాహం అందించింది. గాంధీనగర్‌లోని సీఎస్బీ అకాడమీ డైరెక్టర్ బాలలత పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాడు. పరీక్ష వేగంగా రాయలేకపోవడంతో స్క్రైబ్ సాయంతో రాసేందుకు యూపీఎస్సీ అనుమతించింది. కుమారుడి ఆశయ సాధన కోసం తల్లి నాగరాణి స్క్రైబ్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. దాదాపు 27 ఏళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసిన ఆమె కుమారుడి కోసం ఆంగ్లంలో వేగంగా రాయడానికి రోజుకు నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేసింది.స్మరణ్‌రాజ్ చదువుతుంటే.. తల్లి సాధన చేసేవారు. ఇద్దరూ పోటీ పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవారు. తల్లి సహకారంతో స్మరణ్‌రాజ్ సివిల్స్ ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు.
ఆకలి మంటలే సివిల్స్ వైపు నడిపించాయి
# మాది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద రైతు కుటుంబం. ఎకరం పొలం ఉన్నా రేయింబవళ్లు కూలి చేస్తేనే కుటుంబం గడుస్తుంది. నా తల్లిదండ్రులకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లల పోషణ భారంగా ఉన్నా.. మమ్మల్ని ప్రయోజకులను చేయాలనుకున్నారు. తల్లిదండ్రుల తపన, ఆకలి మంటలు చూసి గొప్పస్థాయిలో నిలువాలనుకున్నాను. తల్లిదండ్రుల ఆశయం కోసం పట్టుదలతో చదివి సివిల్స్‌లో 117వ ర్యాంకు సాధించాను. మాది జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లి గ్రామం. నా తల్లిదండ్రులు ఆకునూరి అయిలయ్య, సులోచన.
# స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు, 6 నుంచి 10 వరకు నర్సంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పూర్తిచేసి, బీటెక్ (ఎలక్టికల్ ఇంజినీరింగ్) ఐఐటీ మద్రాస్‌లో పూర్తిచేశాను.
# 2017లో చెన్నైలోని బ్యాంకులో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాను. నా లక్ష్యం సివిల్స్ సాధించడానికి ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కోసం వీకెండ్ ఆన్లైన్ అకాడమీలో చేరాను. 2018లో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కు వచ్చి సివిల్స్ ప్రిపరేషన్‌పై దృష్టి సారించాను. ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా 10 నుంచి 12 గంటలు చదివాను. ఎస్సీఈఆర్టీ పుస్తకాలు, దిన పత్రికలను క్షుణ్ణంగా చదివాను. గత ప్రశ్నపత్రాలను పరీశీలిస్తూ ప్రాక్టీస్ చేశాను. 2017, 2018లో సివిల్స్ రాసినా ర్యాంకు రాలేదు. 2019లో 782వ ర్యాంకు వచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ సివిల్స్‌కు ప్రిపేర్ అయి 117వ ర్యాంకు సాధించాను.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?