సక్సెస్ ఊరికే రాదు
# ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వేణుగోపాల్
సక్సెస్ ఊరికే రాదు.. సమయపాలన పాటించాలి..
ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి.. వీలైనంత తక్కువ సమయంలో ప్రజెంట్ చేయగలిగే నేర్పు ఉండాలి… అందుకు నిరంతర సాధన తప్ప మరో మార్గం లేదని అంటున్నారు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వేణుగోపాల్. ప్రిపరేషన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లో ఉద్యోగార్థుల కోసం..
సివిల్స్ కూడా సాధించవచ్చు
-పోటీపరీక్షలకు, అకడమిక్ సబ్జెక్టులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అకడమిక్ అనేది ఒక సబ్జెక్టుకు సంబంధించి పరిమితమైనది. పోటీపరీక్ష అనేది అనేక సబ్జెక్టుల సమాహారం. ఈ వ్యత్యాసాన్ని చాలామంది గుర్తించడం లేదు. పోటీపరీక్షలను సైతం అకడమిక్ చదువులాగానే భావిస్తున్నారు. అకడమిక్స్‌లో నిష్ణాతులైనవారు కూడా ఉద్యోగాలను సాధించకలేపోవడానికి కారణం ఇదే. పోటీపరీక్షల్లో ఎప్పుడూ ఆయా సబ్జెక్టుల్లో ఏ మేరకు ప్రవేశం ఉందని మాత్రమే పరిశీలిస్తారు. దీనిని అవగాహన చేసుకోవాలి. పరీక్షను బట్టి సబ్జెక్టు లోతులకు వెళ్లకుండా సిద్ధం కావాలి. టెన్త్, ఇంటర్మీడియట్ సబ్జెక్టులపై పూర్తిస్థాయి పట్టు ఉంటే సివిల్స్ కూడా సాధించవచ్చు.
అపనమ్మకమే అపజయం
# కొందరు బయటకు ఎన్నో విషయాలు తెలిసినట్టుగా ప్రవర్తించినా, గాంభీర్యాన్ని ప్రదర్శించినా ఎక్కడో కొంత వారిపై వారికే అపనమ్మకం ఉంటుంది. ఆ అపనమ్మకమే అపజయానికి దారితీస్తుంది. మన మీద మనకు ఎంత నమ్మకం ఉన్నదనేదే ముఖ్యం. తల్లిదండ్రులు, స్నేహితులు, ఇతర బంధువుల కోసం కాకుండా స్వయం ప్రేరితంగా పరీక్షకు సిద్ధం కావాలి. అలా కానివారు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ కాలేరు. అలా అని అతివిశ్వాసం కూడా పనికిరాదు.
తదేక దీక్షతో చదవాలి
#పోటీ పరీక్షలపై స్పష్టత లేకపోవడం, లక్ష్యమంటూ లేకుండా గాలివాటుగా ప్రయత్నించడం వల్ల లాభం ఉండదు. ప్రతి ఒక్కరూ ఒక విలక్షణమైన వ్యక్తి. విభిన్న అవసరాలు ఉన్నవారు. కాబట్టి వ్యక్తిత్వాన్ని బట్టి ఒక రంగాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఇష్టంగా చేయగలం. దానివల్ల కష్టం అనిపించదు. మంచి ఫలితం వస్తుంది. ఇష్టం లేని రంగంలోకి వెళ్లినా, పడిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ చదివినా ఒరిగే ప్రయోజనం శూన్యం. అది పరోక్షంగా సామాజిక వికాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇలా ప్రిపేరయితేనే వస్తుందని ఏదీ లేదు. కాకపోతే పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఇదే చివరి అవకాశం అని తదేక దీక్షతో చదవాలి. అప్పుడే కచ్చితంగా విజయం సాధిస్తారు. అవసరమనేది మనలో ఉండే శక్తిని బయటకు తీసుకొస్తుంది.
ఇంట్లోనే ప్రిపేర్ కావచ్చు
#కోచింగ్ అనేది మన శక్తిసామర్థ్యాలు, బలాలు, బలహీనతలపై ఆధారపడి ఉంటుంది. మా రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఊరికీ టీవీలు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఇంటివద్దనే ఉంటూ సిద్ధం కావచ్చు. నాలుగైదు రకాల స్టడీ మెటీరియల్స్‌ను కొనుక్కోవడం, చదవడం కూడా వృథానే. ఏ మెటీరియల్ చదివినా ఫర్వాలేదు. కానీ సంబంధిత సబ్జెక్టు మూల భావం అర్థం చేసుకోవాలి. పూర్తిగా విశ్లేషించగలగాలి. ఆ మేరకు నైపుణ్యాలు పెంచుకోవాలి. అన్నింటికంటే ప్రధానంగా సాధ్యమైనంత వరకు సాధన చేయాలి. శిక్షణ ఎన్ని రోజులు, ఎలా తీసుకున్నావు? మెటీరియల్ ఏం చదివావు అన్నది కాదు, ఎంత ప్రాక్టీస్ చేశావన్నదే కీలకం.
స్థాయిని బట్టి సాధన
l స్వశక్తి మీద పూర్తి నమ్మకం, విద్వత్తు మీద విశ్వాసం ఉండాలి. పసిపిల్లలకు ఉగ్గులాగా చేసి అన్నం పెడతాం. పెద్దవాళ్లకు మసాలాలు వేసి కాస్త గట్టిగానే పెడతాం. స్థాయిని బట్టి భోజనం లాగానే స్థాయిని బట్టి సాధన ఉండాలి. తద్వారా గెలుపు సాధ్యమవుతుంది. స్ట్రెంత్ పాయింట్ ఏంటి? లూజ్ పాయింట్ ఏంటి? అనే అంశాలను తెలుసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మనల్ని మనం తెలుసుకుంటే విజయం అందుకోవచ్చు. అలాగే వ్యవస్థపై కూడా నమ్మకం ఉండాలి. వదంతులు నమ్మొద్దు. ఎక్కువ కాంపిటీషన్ ఉందని, పేపర్ లీకయిందని, రికమండేషన్లు, డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందట అని రకరకాల వార్తలు వస్తుంటాయి. అవన్నీ నిరాధారమైనవి. వాటిని నమ్మితే అంతే సంగతి.
సద్వినియోగం చేసుకోవాలి
# 80 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉన్నతస్థానాలకు ఎదగడానికి, నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా మారడానికి ఇదొక మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని వృథా చేయకండి. దీక్షతో చదవండి. ఈ పోటీ ద్వారా చాలా నేర్చుకుంటారు. ఉద్యోగం రాకున్నా మిమ్మల్ని మీరు జయించిన వ్యక్తిగా.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
జిల్లా కేంద్రానికో ఎస్సీ స్టడీ సర్కిల్
# గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కలుపుకొని మొత్తంగా 11 ఎస్సీ స్టడీ సర్కిళ్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం వాటిని ప్రతి జిల్లా కేంద్రానికి విస్తరించాం. ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి అందిస్తున్నాం. స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం. గ్రూప్స్, ఇతర పోటీపరీక్షలపై ప్రత్యేకంగా రెండు నెలల స్వల్పకాలిక ఫౌండేషన్ కోర్సును నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే గ్రూప్-1 నోటిఫికేషన్ రాగా, అందుకు సంబంధించి ప్రత్యేకంగా అభ్యర్థులను ఎంపికచేసి శిక్షణ ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 19 సెంటర్లను ఏర్పాటు చేశాం. మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. మొత్తంగా 4వేల మందికిపైగా అభ్యర్థులకు శారీరక దారుఢ్యంతో పాటు పోటీపరీక్షలపై శిక్షణను ఇస్తున్నాం. త్వరలో గ్రూప్-2తో పాటు గ్రూప్-4 పరీక్షలకు సంబంధించి కూడా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఎస్సీ స్టడీ సర్కిళ్లను దళిత అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. కలను సాకారం చేసుకోవాలి.
గెలుస్తామన్న ధీమా ఉండాలి
ఒత్తిడి, ఆదుర్దా అనేవి ఉద్యోగార్థులకు సర్వసాధారణం. అవి పరిమితిగా ఉంటే పర్లేదు. పాజిటివ్‌గా పనిచేస్తాయి. కానీ లిమిట్ క్రాస్ అయితే ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. గెలుస్తామనే ధీమాతోనే యుద్ధంలోకి దిగాలి. అంతేకాని ఓడిపోతామనే అపోహను రానివ్వకూడదు. అబ్దుల్ కలాంనే ఉదాహరణగా తీసుకుందాం. ఆయన ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నం చేసినా రాలేదు. కానీ నిరాశ పడలేదు. అక్కడితో ఆగిపోలేదు. సంబంధం లేని ఏరోనాటిక్ సబ్జెక్టు తీసుకుని ఎవరూ ఊహించని శాస్త్రవేత్తగా ఎదిగారు. అలాగే అబ్రహం లింకన్ అన్ని ఎన్నికల్లో, వ్యాపారాల్లో నష్టపోయాడు. ఎప్పుడూ నిరాశ పడలేదు. వారు డిప్రెషన్లోకి వెళ్లి ఉంటే ఆ స్థాయికి చేరుకునే వాళ్లు కాదు. ప్రయత్నం చేయాలి. ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకుంటే చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.
… మ్యాకం రవికుమార్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం