తెలంగాణలో ఆంధ్ర మహాసభలు
భారతదేశమంతటా బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కూడా హైదరాబాద్ రాజ్యంలో ప్రజలు నిజాం రాజుల నిరంకుశ పాలనకింద నలిగిపోతూనే ఉన్నారు. అయితే భారత స్వాతంత్య్రోద్యమం ప్రభావంతో నిజాం రాజ్యంలో కూడా కొందరు విద్యావంతులు పలు సంఘాలను స్థాపించి తమ నిరసనను తెలుపటం మొదలుపెట్టారు.
-భారత మహిళా సమాజం : 1907లో భారత మహిళా సమాజం సీతాబాయి స్థాపించారు.
-ఆంధ్రసోదరి సమాజం : 1905లో ఈ సంస్థను నడింపల్లి సుందరమ్మ స్థాపించారు.
-యువతి శరణాలయం : 1922లో యామినీ పూర్ణతిలకం ఈ సంస్థను స్థాపించారు.
-పై సంస్థలన్నీ మహిళాభుద్యయం కోసం కృషి చేశాయి. వీటి ఆధ్వర్యంలో పాఠశాలలు నిర్వహించాయి.
-ఆంధ్ర యువతి మండలి : ఈ మండలిని ఎల్లాప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతి స్థాపించారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రాంతాల్లో స్త్రీల సమస్యలపై చర్చించింది.
మహిళా నవజీవన మండలి
-ఇది స్త్రీల సమస్యల్ని పరిష్కరించడానికి, దూరం చేయడానికి కృషి చేసింది. గీతాదేవి, సీతాదేవి, యశోదాదేవి, మన్కుమారి చౌరాసియా మొదలైనవారు దీనిని స్థాపించారు.
-దీనిని 1935లో స్థాపించారు.
అంజుమన్ ఏకోవతి దక్కన్
-1895లో దీనిని హుమాయున్ మీర్జా అనే మహిళ స్థాపించారు.
హైదరాబాద్ లేడీస్ క్లబ్
-లేడీ హైద్రీ దీనిని స్థాపించారు.
నిజాం రాజ్యంలోని ప్రాంతాలు
నిజాం రాజ్యంలో మూడు ప్రాంతాలున్నాయి. అవి తెలంగాణ ప్రాంతం, మరఠ్వాడ ప్రాంతం, కన్నడ ప్రాంతం, తెలంగాణలో 8 జిల్లాలు, మరఠ్వాడలో 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు ఉండేవి. ఈ 16 జిల్లాల సమాహారమే హైదరాబాద్ సంస్థానం.
భాష
-ఈ మూడు ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే భాషలు తెలుగు, మరాఠి, కన్నడ. హైదరాబాద్ రాజ్యంలో అధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడే భాష తెలుగు. కానీ నిజాం రాజ్యంలో తెలుగు భాషకు ఆదరణ లేదు. మరాఠి భాషకు కొంత ఆదరణ ఉంది. అధికార భాషగా మాత్రం ఉర్దూ ఉండేది.
హైదరాబాద్ స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్
-హైదరాబాద్‌లోని వివేకవర్ధిని పాఠశాలలో 11, 12 నవంబర్, 1921లో హైదరాబాద్ స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్ అనే పేరుతో సమావేశం జరిగింది.
-ఈ సమావేశం డి.కె. కార్వే అధ్యక్షతన జరిగింది. (దొండూ కేశవ్ కార్వే మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు)
-ఈ సమావేశంలో పాల్గొన్నవారు ముఖ్యంగా ఉర్దూ, మరాఠి భాషల్లో మాట్లాడారు.
-ఈ సమావేశంలో కార్వే మరాఠి, ఆంగ్ల భాషల్లో మాట్లాడాడు.
-ఈ సమావేశంలో హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఆలంపల్లి వెంకటరామారావు తెలుగులో మాట్లాడుతుండగా సభికులు అభ్యంతరం చెప్పారు.
-ముఖ్యంగా మరఠ్వాడా ప్రాంతానికి చెందినవాళ్లు హేళన చేశారు. ఈ సంఘటనతో తెలుగువారు అవమానానికి గురయ్యారు.
-ఈ సంఘటన మాతృభాషకు జరిగిన అవమానంగా భావించిన తెలంగాణవారు దానికి నిరసనగా సభ మధ్యనుంచే బయటికి వచ్చారు.
-మహారాష్ర్టుల సంఖ్య తక్కువే అయినప్పటికీ అన్ని రంగాల్లో వారు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండేవారు.
ఆంధ్రజనసంఘం స్థాపన 12-11-1921
-సంఘ సంస్కార సభ నుంచి నిరసనగా బయటకు వచ్చిన తెలంగాణవారు అదే రోజు రాత్రి టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమయ్యారు.
-తెలుగు భాషకు, సంస్కృతికి నగరంలో సముచితస్థానం కల్పించాలన్న ఆశయంతో ఆంధ్రజనసంఘం అనే సంస్థను స్థాపించారు.
-ఈ సమావేశానికి బూర్గుల రామకృష్ణారావు, మందుముల నర్సింగరావు, మాడపాటి హనుమంతరావు, నడింపల్లి జానకి రామయ్య, టేకుమాను రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు, కొమ్మవరపు సుబ్బారావు, బోయినేపల్లి వెంకటరామారావు, పందిరి రామస్వామి నాయుడు మొదలైనవారు హాజరయ్యారు.
-ఆంధ్రజన సంఘం అధ్యక్షుడిగా రాజగోపాలరెడ్డి, కార్యదర్శిగా టేకుమాను రంగారావులను ఎన్నుకున్నారు.
-24 ఫిబ్రవరి 1922న రెడ్డి విద్యాలయం సమావేశ మందిరంలో కొండావెంకటరంగారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘ స్థాపన ఉద్దేశాలను చర్చించారు.
-ఆ తర్వాత 17 మార్చి, ఏప్రిల్ 4వ తేదీల్లో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన ఆ సంఘం సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో సంఘానికి సంబంధించి కొన్ని నియమాల్ని రూపొందించారు.
-అవి సంఘం పేరు – నిజాం రాష్ట్ర ఆంధ్రజన సంఘం నిజాం రాజ్యంలోని తెలుగువారి కోసం సంఘాల్ని స్థాపించాలి. నిజాం రాజ్యంలో 18 ఏండ్లు వయస్సు ఉండి, చదవడం, రాయడం వచ్చినవారు ఈ సంఘంలో చేరవచ్చు. తెలంగాణలో పుట్టినవారు మాత్రమే సంఘం సభ్యత్వానికి అర్హులని స్పష్టంగా చెప్పారు. స్త్రీ, పురుష భేదం లేకుండా సభ్యత్వం కల్పించారు.
-గమనిక: మద్రాస్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులు తమ ప్రాంతాల్లో కూడా ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. మొదటి ఆంధ్ర మహాసభ 1913లో బాపట్ల (గుంటూరు జిల్లా)లో జరిగింది.
-తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభల లక్ష్యాలు వేరు, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఆంధ్ర మహసభల లక్ష్యాలు వేరు.
-తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే ప్రజల్ని ఆంధ్రులని అప్పట్లో అనేవారు.
-మద్రాస్ రాష్ట్రంలో ఉన్న సీమాంధ్రులను ఆంధ్రులు అనేవారు.
-బ్రిటీష్ ఆంధ్ర ప్రాంతంలో జరిగే ఆంధ్ర మహాసభల ముఖ్యలక్ష్యాల్లో ఒకటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. కానీ నిజాం రాష్ట్రంలో జరిగే ఆంధ్ర మహాసభల లక్ష్యం సంస్కరణలు.
-ఉన్నవ లక్ష్మీనారాయణ, గురునాథం మొదలైనవారు 1912లోనే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలతో కూడిన ఆంధ్ర దేశపటాన్ని రూపొందించడం ద్వారా తమ కోరికను బయటపెట్టడం జరిగింది. అంటే ఏ మాత్రం అవకాశం దొరికినా భాష కారణంతో (తెలుగు మాట్లాడే తెలంగాణ, సీమాంధ్ర తెలుగు ప్రాంతాల్ని కలపాలని కలలుగన్నారు).
ఈ సంఘం ప్రచురించిన లఘు పుస్తకాలు
ఎ) నిజాం రాష్ర్టాంధ్రులు
బి) నిజాం రాష్ర్టాంధ్రుల అభివృద్ధి మార్గం
సి) వర్తక స్వాతంత్య్రం
డి) మొహతర్ఫా-మగ్గపుపన్ను
ఇ) వెట్టిచాకిరీ
ఎఫ్) మనవాక్ స్వాతంత్య్ర
జి) రుణభార నివారణ
హెచ్) గ్రంథాలయాలు
ఈ సంఘం ప్రచురించిన కరపత్రాలు
ఎ) నిజాం రాష్ట్ర ప్రశంస
బి) నిజాం రాష్ట్రపు జన పరిగణం
సి) వెట్టిచాకిరీ
డి) వరక్త సంఘం
సర్‌బరాహి
సర్ బరాహి అంటే అధికారులకు వర్తకులు ఉచితంగా సరుకులు సప్లయ్ చేసే పద్ధతి. ఈ పద్ధతిని వ్యతిరేకిస్తూ ఆంధ్ర జన సంఘం వరక్త సంఘాలను ఏర్పాటుచేసి పోరాటాలు చేసింది.
నిజాం రాష్ర్టాంధ్ర జన సంఘం సమావేశాలు
హనుమకొండలో ఆంధ్రజన కేంద్ర సంఘం ఏర్పడింది. మాదిరాజు కోటేశ్వరరావు ఈ సమావేశానికి తెలంగాణ ఆంధ్రులను ఆహ్వానించారు. 1923లో హనుమకొండలో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షుడు రావు బహద్దూర్ వెంకటరెడ్డి.
మొదటి సమావేశం
-ఆంధ్రజన కేంద్ర సంఘం మొదటి సమావేశం హైదరాబాద్‌లోని మాడపాటి హనుమంతరావు ఇంట్లో 27 జూలై 1923న జరిగింది.
-గ్రంథాలయాలు, పాఠశాలలను ప్రోత్సహించి వాటికి సహకరించాలని నిర్ణయించారు.
-ఆంధ్ర జన కేంద్రం సంఘం కార్యదర్శిగా మాడపాటి హనుమంతరావు (వడ్లకొండ నరసింహారావు స్థానంలో) ఎన్నికయ్యారు.
-ఆశయాలు
-గ్రంథాలయాలు, పాఠశాలల స్థాపన
-విద్వాంసుల్ని గౌరవించడం
-తాళపత్ర గ్రంథాల్ని, శాసన ప్రతుల్ని సేకరించడం, పరిశోధన చేయడం
భాషాభివృద్ధికి చర్యలు
-విజ్ఞాన అభివృద్ధి కోసం ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, కరపత్రాలు, చిన్న పుస్తకాలు ప్రచురించడం
రెండో సమావేశం
-ఈ సమావేశం 1924 మార్చి 21న నల్లగొండలో షబ్నవీసు వెంకట రామనరసింహారావు (నీలగిరి పత్రిక సంపాదకుడు) పత్రికా కార్యాలయంలో జరిగింది.
-దీనికి అధ్యక్షుడు – రావు బహద్దూర్ వెంకటరెడ్డి
-నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమ వ్యాప్తికోసం నిజాం రాష్ట్ర ఆంధ్రనిధి ఏర్పాటుచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముగింపు సభకు పింగళి వెంకట్రామారెడ్డి అధ్యక్షత వహించారు.
మూడో సమావేశం
-ఈ సమావేశం 1925 ఫిబ్రవరి 21న మధిరలో జరిగింది.
-ఈ సభ పింగళి వెంకట్రామారెడ్డి కర్మాగారం ఆవరణలో జరిగింది.
-ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా మాడపాటి తిరుమలరావు (హైకోర్టు వకీలు) వ్యవహరించారు. అయితే కార్యక్రమాలు వరుసగా జరుగుతుంటే నిజాం ప్రభుత్వం ఆంధ్ర జన సంఘం కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ సందర్భంలోనే పత్రికలు ఈ సభల గురించి అవి రాజకీయపరమైనవని, హిందూ పరమైనవని రాశాయి. ఇలాంటి రాతలతో ప్రభుత్వ అనుమానం మరింత బలపడింది. ఇకముందు సమావేశాలకు అనుమతి ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ప్రభుత్వం ఆలోచించింది. అందుకే త్వరలోనే నాలుగో సమావేశానికి అనుమతిని సాధించలేకపోయింది.
నాలుగో సమావేశం
-ఈ సమావేశాలు సూర్యాపేటలో 1928 మే 28, 29, 30 తేదీల్లో జరిగాయి.
-సమావేశానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా కోదాటి రామకృష్ణారావు వ్యవహరించారు.
-ఈ సభకు రావుబహద్దూర్ వెంకటరెడ్డి అధ్యక్షత వహించాలి. కానీ ఆయన హాజరుకాకపోవడంతో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షత వహించారు.
-ఈ సమావేశం కొన్ని నియమాల్ని ప్రకటించింది. అవి
-రాజకీయాంశాలు చర్చించకూడదు.
-సభాస్థలంలో పొగతాగరాదు, నిషేధ పదార్థాలను తాగరాదు. ఉపన్యాసకులు ముందస్తుగా తమ పేర్లను ఆహ్వాన సంఘానికి అందజేయాలి. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకొనేవారిపై చర్య తీసుకొనే అధికారం ఆహ్వాన సంఘం అధ్యక్షుడికి కట్టబెట్టారు. మాడపాటి హనుమంతరావు కొద్ది సంవత్సరాల్లోనే ఆంధ్ర జనసంఘం శాఖలు 50 ప్రాంతాల్లో స్థాపించారు.
-సుమారుగా 90 గ్రంథాలయాలు తెలంగాణలో స్థాపించి భాషా సేవ, విజ్ఞానవ్యాప్తి కలిగించారు. ఉర్దూలో మాట్లాడటమే నాగరికతగా భావించే పట్టణంలోని విద్యాధికులు క్రమక్రమంగా తెలుగులో ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు.
-ఆంధ్రసభ సంఘం ఆశయాల్ని తెలంగాణలోని పల్లెపల్లెకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఉన్నవ వెంకటరామయ్యను కేంద్ర సంఘం తరఫున నియమించారు. మాడపాటి హనుమంతరావు (ఆంధ్ర పితామహుడుగా ప్రసిద్ధి).
మొదటి ఆంధ్ర మహాసభ
-మొదటి ఆంధ్ర మహాసభ జోగిపేట (మెదక్)లో 1930 మార్చి 3,4,5 తేదీల్లో జరిగింది. దీనికి సురవరం ప్రతాపరెడ్డి (గోల్కొండ పత్రికా సంపాదకుడు) అధ్యక్షత వహించారు. ఆ సభలో జోగిపేట వర్తకులు ఆర్థికసహాయం చేశారు.
-గస్తీనిషాన్ జీవోకు లోబడి సభ జరుపుకోవడానికి అనుమతిని పొందింది ఈ సభ. సభాధ్యక్షుడు గైర్‌ముల్కీ కాకూడదు (అంటే నిజాం రాష్ర్టానికి చెందినవారై ఉండాలి). రాజకీయాలకు సంబంధించిన అంశాన్ని చేపట్టకూడదని, ఇతర మతస్థులకు ఇబ్బంది కలిగించకూడదనే నిబంధనల ప్రకారం ఈ సభ నడిచింది. ఆంధ్రప్రదేశపు మట్టి అదిమాకు కనకము అనే ప్రార్థనా గీతంతో ఈ సభ ప్రారంభమైంది.
-హైదరాబాద్ నుంచి ఆరుట్ల రామచంద్రారెడ్డితో సహ 15 మంది ఈ మహాసభకు వలంటీర్లుగా వెళ్లారు. ఆ వలంటీర్ల దళానికి నాయకుడు రావి నారాయణరెడ్డి. ఈ మహాసభకు మాడపాటి హనుమంతరావు కార్యదర్శి. జోగిపేట ఆంధ్ర మహాసభతో పాటు జరిగిన ఆంధ్ర మహిళా సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షురాలిగా శ్రీమతి విఠోబాయి వ్యవహరించగా, అధ్యక్షురాలిగా నడింపల్లి సుందరమ్మ వ్యవహరించారు.
రెండో ఆంధ్రమహాసభ
-రెండో ఆంధ్రమహాసభ దేవరకొండ (నల్లగొండ)లో 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పులిజాల వెంకటరంగారావు, ఆహ్వాన సంఘం కార్యదర్శిగా పగిడిమర్రి ఎల్లయ్య, అధ్యక్షుడిగా బూర్గుల రామకృష్ణారావు వ్యవహరించారు. మొదటి ఆంధ్ర మహసభలో చేసిన అనేక తీర్మానాల్ని ఈ సభ మళ్లీ తీర్మానాలు చేసింది. మరుసటి సంవత్సరమే 3వ ఆంధ్ర మహసభ జరపాలని తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు.
మూడో ఆంధ్ర మహసభ
-మూడో ఆంధ్ర మహాసభ ఖమ్మంమెట్టులో 1934లో జరిగింది. దీనికి నల్లగొండ వకీలు పులిజాల వెంకటరంగారావు అధ్యక్షుడు. ఖమ్మం వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. అధ్యక్షోపన్యాసాన్ని, తీర్మానాల్ని ముందే తమకు చూపించాల్సిందిగా ప్రభుత్వం షరతులు విధించింది. కలెక్టర్, ఇతర అధికారులు ఈ సమావేశానికి అనేక ఆటంకాల్ని సృష్టించింది. కానీ మాడపాటి హనుమంతరావు కలెక్టర్‌తో వాదించి అనుమతులు పొందారు. మూడో ఆంధ్ర మహిళా సభకు ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షత వహించింది.
నాలుగో ఆంధ్రమహాసభ
-నాలుగో ఆంధ్రమహాసభ 1935లో సిరిసిల్ల (కరీంనగర్)లో మాడపాటి హనుమంతరావు అధ్యక్షతన జరిగింది. ఈసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడిగా ఎ.వేణుగోపాల్‌రావు, కార్యదర్శిగా కొడిమెల భూమయ్య వ్యవహరించారు. ఈ సభా కార్యక్రమం తెలుగుభాషలోనే జరిగింది. సభా ప్రాంగణానికి భీమకవి (వేములవాడ భీమకవి) పేరు పెట్టారు.నాలుగో ఆంధ్రమహిళా సభకు మాడపాటి మాణిక్యాంబ అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
-సిరిసిల్ల మహాసభలో ఉపన్యాసకులందరూ తెలుగులోనే మాట్లాడమని మాడపాటి ప్రోత్సహించారు.
-ఆంధ్రమహాసభ వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలని, తీర్మానాలు, ఉపన్యాసాలు తెలుగులో మాత్రమే ఉండాలని తెలుగు భాషా వాదులు పట్టుబడటమే కాకుండా దీన్ని మహాసభ నిబంధనావళిలో చేర్చారు.
ఐదో ఆంధ్రమహాసభ
-1936లో షాద్‌నగర్‌లో జరిగిన ఐదో ఆంధ్రమహాసభకు కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షత వహించారు. మహాసభ నిర్మాణం కోసం ఒక ప్రత్యేక కట్టడం నిర్మించారు. ఇది వల్లూరి బసవరాజు పర్యవేక్షణలో జరిగింది.
-సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టాలని ఈ సభ సూచించింది.
-ఐదో ఆంధ్రమహిళాసభకు అధ్యక్షురాలిగా బూర్గుల అనంతలక్ష్మీదేవి వ్యవహరించింది.
6వ ఆంధ్రమహాసభ
-ఈ సభ 1937లో నిజామాబాద్‌లో జరిగింది.
-ఈ సభకు మందుముల నరసింగరావు (రయ్యత్ పత్రికా సంపాదకుడు) అధ్యక్షత వహించారు.
-నాలుగో మహాసభలో భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాసు వల్ల ఈసభలో కొంత అలజడి జరిగింది. మహారాష్ట్ర నాయకుడైన కాశీనాథరావు ముఖ్పాల్కర్, మౌల్వీ గులాంబాషా అనేవారు ఆహ్వానసంఘం సభ్యులుగా ఉన్నారు. అయితే వీరు ఆంధ్రేతర(తెలుగేతర) భాషలో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు నందగిరి వెంకటరావు నాయకత్వంలో రెండు ఓట్ల మెజార్టీలో వారు మాట్లాడటానికి సభ అనుమతించింది. అయితే రావినారాయణ రెడ్డి భాషావాదుల్ని సమర్థించలేదు. ఇది ఆంధ్రమహాసభ అని ఆంధ్రభాషా మహాసభ కాదని, ఒకవేళ గాంధీజీయే స్వయంగా వచ్చి ఈ మహాసభలో సందేశం ఇవ్వాలనుకుంటే మహాసభ క్లాజుతో ఆయనకు అవకాశం రాదని మాట్లాడారు.
-మొదటిసారిగా ఈ సభ సంస్కరణలు కావాలని సూచనలు చేసింది. అరవముద్ అయ్యంగార్ కమిటీకి ఈ రాజకీయ తీర్మానాన్ని పంపింది. అంటే 6వ మహాసభతో ఆంధ్రమహాసభకు రాజకీయ ప్రతిపత్తి వచ్చింది. ఈ మహాసభలోనే రావి నారాయణరెడ్డి, మందుముల రామచంద్రరావులు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
7వ ఆంధ్రమహాసభ
-1940లో ఏడో ఆంధ్రమహాసభ మల్కాపురంలో జరిగింది. దీనికి మందుముల రామచంద్రరావు అధ్యక్షత వహించారు.
-తెలంగాణలో భూమిశిస్తు ఎక్కువ. తరి భూములపై రూ.15 నుంచి రూ.22 వరకు శిస్తు ఉంది. అదే మద్రాసు రాష్ట్రంలో తక్కువగా ఉండేది. మద్రాసులో మాదిరిగా తెలంగాణలో భూమిశిస్తును తగ్గించాలని ప్రభుత్వాన్ని ఈ సభ కోరింది. ఈ సభ నాటికే యువకుల నాయకత్వం బలపడింది.
8వ ఆంధ్రమహాసభ
-ఈ సభ 1941లో చిలుకూరు గ్రామం (హుజూర్నగర్ తాలుకా, నల్లగొండ జిల్లా)లో జరిగింది.
-ఈ సభకు యువనాయకుడైన రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ తరపున సత్యాగ్రహ ఉద్యమంలో రావినారాయణ రెడ్డి పాల్గొన్నారు.
(నోట్: ఆనాటికే రావి నారాయణరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని రహస్యంగా స్థాపించారు)
-రావి నారాయణరెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో అంతర్జాతీయ సమస్యలు, సామ్రాజ్యవాద యుద్ధం, సామ్రాజ్యవాద వ్యతిరేకత, దేశీయ సంస్థానాలపై విమర్శ, స్త్రీ స్వాతంత్య్రం, స్థానిక సమస్యలు మొదలైన వాటిపై మాట్లాడారు.
-ఈ విషయాన్ని మాడపాటి హనుమంతరావు తన ఆంధ్రోద్యమంలో వివరించారు.
-ఆంధ్రమహిళ సభకు రంగమ్మ ఓబుల్‌రెడ్డి అధ్యక్షత వహించారు.
9వ ఆంధ్రమహాసభ
-ఈ సభ 1942లో ధర్మవరం (వరంగల్)లో జరిగింది. ఈ సభకు మాదిరాజు కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మహిళాసభకు రంగమ్మ ఓబుల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఆంధ్రమహాసభకు పెరుగుతున్న ఆదరణను నిజాం ప్రభుత్వం గుర్తించింది. మితవాదులు, కమ్యూనిస్టులు అనే భేదాలు స్పష్టమైనవి.
10వ ఆంధ్రమహాసభ
-ఈ సభ 1943లో హైదరాబాద్‌ని రెడ్డి హాస్టల్లో జరిగింది. సమావేశానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ జయసూర్య వ్యవహరించారు. ఈ సభలో అధ్యక్ష పదవికోసం కొండా వెంకటరంగారెడ్డి, బద్దం ఎల్లారెడ్డిల మధ్య పోటీ ఏర్పడింది. చివరకు కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డిలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. హైదరాబాదు సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చర్చించారు.
11వ ఆంధ్రమహాసభ
-ఈ సభ 1944లో భువనగిరిలో జరిగింది. ఈ సభకు అధ్యక్షుడిగా రావి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై వ్యవహరించారు. సభకు 12వేల మంది ప్రజలు హాజరయ్యారు. కాళోజీ నారాయణ రావు, పొల్కంపల్లి వెంకటరామారావు మొదలైనవారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఆంధ్రమహాసభకు చండ్ర రాజేశ్వరరావు రావడమే కాకుండా మహాసభ ఏర్పాట్లలో, సభ నిర్వహణలో సహకరించారు.
-జాతీయ, అంతర్జాతీయ, స్థానిక సమస్యల్ని సభలో చర్చించారు. సభ్యత్వ రుసుమును రూపాయి నుంచి నాలుగు అణాలకు తగ్గించారు.
12వ ఆంధ్రమహాసభ
-ఈ సభ 1945లో మడికొండ (వరంగల్)లో జరిగింది. ఈ సభకు మందముల నర్సింగరావు అధ్యక్షత వహించారు. ఈ సభను విజయవంతంగా నడిపించడంలో కొండా వెంకట రంగారెడ్డి అధిక శ్రద్ధ తీసుకున్నారు.
ఖమ్మం సభ- 1945
-రావి నారాయణరెడ్డి మరికొంతమంది ఈ సభను ఖమ్మంలో నిర్వహించారు. ఈ సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. అప్పటికే ఆంధ్రమహాసభ నాయకత్వంలో జనగామ, తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఖమ్మం సభకు 40 వేల మంది హాజరయ్యారు.
13వ ఆంధ్రమహాసభ
-ఈ సభ 1946లో కంది (మెదక్)లో జరిగింది. ఈ సభకు జమలాపురం కేశవరావు (తెలంగాణ సర్దార్) అధ్యక్షత వహించారు. కేశవరావు స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇతను గొప్ప జాతీయవాది. ఆ తర్వాత మితవాదులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతివాదులు కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
కరీంనగర్ సభ -1946
-అతివాదులు కరీంనగర్లో 1946లో జరిపారు. ఈ సభకు బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రమహాసభ తన మహాసభలను జరిపి ఆంధ్రోద్యమానికి కృషి చేసింది.
ఆంధ్ర మహిళా సభ
ఆంధ్ర మహాసభల సమావేశాలతో పాటు ఆంధ్ర మహిళా సభలను నిర్వహించే సంప్రదాయం ఉండేది. 10 మహిళా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు నడింపల్లి సుందరమ్మ, టి.వరలక్ష్మమ్మ, ఎల్లాప్రగడ సీతాకుమారి, మాడపాటి మాణిక్యమ్మ, బూర్గుల అనంతలక్ష్మీదేవి, నందగిరి ఇందిరాదేవి, యోగ్య శీలాదేవి, మొదలైనవారు అధ్యక్షత వహించారు. వీరు స్త్రీ విద్య కోసం, స్త్రీ జనోద్ధరణ కోసం పాటు పాటుపడ్డారు.
తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలు
-వరంగల్
-కరీంనగర్
-ఆదిలాబాద్
-నిజామాబాద్
-మెదక్
-నల్లగొండ
-మహబూబ్‌నగర్
-ఆత్రాఫ్బల్దా
మరఠ్వాడా ప్రాంతం 5 జిల్లాలు
-ఔరంగాబాద్
-ఉస్మానాబాద్
-నాందేడ్
-బీడ్
-పర్బని
కన్నడ ప్రాంతం 3 జిల్లాలు
-రాయ్‌చూర్
-గుల్బర్గా
-బీదర్
ఆంధ్ర మహాసభలు-అధ్యక్షులు
1 జోగిపేట 1930 సురవరం ప్రతాపరెడ్డి
-దేవరకొండ 1931 బూర్గుల రామకృష్ణారావు
3 ఖమ్మంమెట్టు 1934 పులిజాల వెంకటరంగారావు
4 సిరిసిల్ల 1935 మాడపాటి హనుమంతరావు
5 షాద్‌నగర్ 1936 కొండా వెంకట రంగారెడ్డి
6 నిజామాబాద్ 1937 మందుముల నరసింగరావు
7 మల్కాపురం 1940 మందుముల రామచంద్రారావు
8 చిలుకూరు 1941 రావి నారాయణ రెడ్డి
9 ధర్మవరం 1942 మాదిరాజు కోటేశ్వరరావు
10 హైదరాబాద్ 1943 కొండా వెంకట రంగారెడ్డి
11 భువనగిరి 1944 రావి నారాయణరెడ్డి
12 మడికొండ 1945 మందుముల నరసింగరావు
13 కంది 1946 జమలాపురం కేశవరావు
ఖమ్మం సభ – 1945- అధ్యక్షుడు – రావి నారాయణరెడ్డి
కరీంనగర్ – 1946 – అధ్యక్షుడు – బద్దం ఎల్లారెడ్డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు