ఒత్తిడిని వదిలేద్దాం.. విజయం సాధిద్దాం
ఎంత చదివామన్నది కాదు.. ఏం చదివామన్న దాన్ని బట్టే సక్సెస్ ఉంటుంది.. ఏ పోటీ పరీక్షకు ప్రిపేరవుతున్నామో.. దానికి సంబంధించిన సిలబస్‌ను మాత్రమే చదవాలి.. అంతకుముందు జరిగిన పరీక్షల్లో ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి.. పక్కా ప్లానింగ్‌తో కష్టపడి చదివితే విజయం సొంతమని అంటున్నారు సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొవూరి పవన్‌కుమార్. ఆయన సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లి సెలెక్ట్ కాకపోవడం.. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న పాఠాలు, గ్రూప్-1 సాధించిన తీరుతెన్నులు ఆయన మాటల్లో తెలుసుకుందాం..
సామాజిక సేవ నుంచి ప్రభుత్వ కొలువు వైపు
హైదరాబాద్‌లో పుట్టిపెరిగాను. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 2006లో పూర్తి చేశాను. బీటెక్ చేస్తున్న రోజుల్లోనే సామాజిక స్పృహ ఉండేది. మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్ (ఎంవీఎఫ్)తో కలిసి కొన్నాళ్లు పనిచేశాను. చైల్డ్ లేబర్‌ను గుర్తించి, స్లమ్స్‌లో ఉండే చిన్నారులను బ్రిడ్జి స్కూళ్లలో చేర్పించేవాడిని. చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాఠశాలల నిర్వహణ, టాయిలెట్స్, ఇతర సదుపాయాలు, వాటిల్లో రాత్రివేళల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై కలెక్టర్లకు ఫిర్యాదు చేసేవాడిని. ఈ సామాజిక సేవే సివిల్స్ వైపు నడిపించింది. 2006 నుంచి సివిల్స్ కోసం ప్రయత్నించాను. ఒకసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లాను. కానీ విజయం సాధించలేదు. చాలా బాధపడ్డాను. కానీ ఆ ఫెయిల్యూరే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మనకు ఒక అపజయం ఎదురైతే కుంగిపోకుండా బలాలు, బలహీనతలేంటో తెలుసుకోవాలి. ఆ సమయంలో గ్రూప్-1 మరో కొత్త అవకాశంగా కనపడింది. అలా 2008లో గ్రూప్-1కు దరఖాస్తు చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టాను. సివిల్స్‌కు ప్రిపేరయ్యాను కాబట్టి గ్రూప్స్ కొంత సులువే అనిపించినా తేలికగా తీసుకోకుండా పక్కా ప్లానింగ్‌తో ఆరునెలలు ప్రిపేరయ్యాను. ఆ తర్వాత 2010లో ప్రిలిమ్స్, 2011లో మెయిన్స్ పూర్తి చేశాను. 2012లో ఇంటర్వ్యూలో విజయం సాధించాను. అప్పుడు అలా కష్టపడినందుకు ఇప్పుడు ఇలా ఎక్సైజ్‌శాఖలో సికింద్రాబాద్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాను.
ఒత్తిడిని తగ్గించుకోవాలి
సివిల్స్ మొదలు గ్రూప్-1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఏ పోటీ పరీక్ష అయినా సరే.. ఏ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాం? అందులో నెగ్గాలంటే ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై ఒక స్పష్టత ఉండాలి. చాలా మంది నెలల తరబడి ప్రిపేరవుతారు. కానీ విజయం సాధించలేరు. ఎందుకంటే వాళ్లకు సిలబస్‌లో ఏ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? పరీక్ష సమయంలో ప్రతి నిమిషాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది స్పష్టత ఉండదు కాబట్టి. ప్రిపరేషన్ మొదలు.. పరీక్ష పూర్తయ్యేవరకు తెలియని కంగారు, ఆందోళన, ఒత్తిడితో లక్ష్యం ముందు చతికిల పడుతుంటారు. అందుకే వీలైనంత వరకు మనపై భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకోవాలి. మార్కెట్లో కనిపించిన ప్రతి మెటీరియల్‌ను చదివితే టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. ఒకే టాపిక్‌పై పూర్తి పట్టు సాధించాలన్నంతగా చదవాల్సిన పనిలేదు. ఆ టాపిక్కు ఎన్ని మార్కులు కేటాయించారన్నదాన్ని బట్టి ప్రిపేరయితే సరిపోతుంది.
పక్కవాళ్లతో పోల్చుకోవద్దు
ఏ పోటీ పరీక్షకైనా ఎన్ని గంటలపాటు చదువుతున్నామన్నదానికంటే ఎంత ఏకాగ్రతతో చదువుతున్నామన్నదే ముఖ్యం. ఎప్పుడూ పక్కవాళ్లతో పోల్చుకోవద్దు. వాళ్లు చాలా ఏండ్లుగా చదువుతున్నారు, చాలా సబ్జెక్ట్లపై పట్టుంది లాంటి పోలికలు పెట్టుకోవద్దు. పరీక్షలో అడిగే ప్రశ్నలకు తగినట్టుగా తయారయ్యామా లేదా అన్నదే చూసుకోవాలి. సరిగా నిద్రపోకుండా చదివినా ప్రయోజనం ఉండదు. తప్పనిసరిగా శరీరానికి సరిపడినంత నిద్రపోవాలి.
షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి
మానసిక ఆందోళనను వీలైనంత తగ్గించుకుంటే సబ్జెక్ట్‌ను కరెక్ట్‌గా చదువగలుగుతాం. గ్రూప్-1లో ప్రశ్నలకు ఆన్సర్ చేసేటప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలనేది 20 సెకన్లు ఆలోచిస్తే ఒక ఫ్రేమ్ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ఫ్రేమ్‌లో రాస్తే సరైన సమయంలో సమాధానం రాయవచ్చు. ప్రతి దశలో, ప్రతి ప్రిపరేషన్లో ఏది అవసరం, ఏది అనవసరం అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే విలువైన సమయాన్ని నష్టపోతాం. ప్రిపరేషన్ టైంలో సొంతంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది రివిజన్లో అత్యంత కీలకం. దీంతో పూర్తి మెటీరియల్‌ను తిరగేయాల్సిన పనిలేకుండా చివరిగా ఒక్కసారి షార్ట్‌నోట్స్‌ను చదివితే సరిపోతుంది. మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది. ప్రిపరేషన్ సమయంలో మంచి ఆహారం, సమయానికి తగినంత నిద్ర తప్పనిసరి. శక్తి ఉంది కదా అని ఎక్కువ గంటలు చదువుతూ పోతే.. పరీక్ష సమయానికి డీలా పడిపోయి పడిన శ్రమంతా వృథా అవుతుంది. గ్రూప్స్‌కు ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టేవాళ్లకు ఆరు నెలల సమయం సరిపోతుంది. పూర్తిస్థాయిలో అంకితభావంతో చదవాలి. రోజుకు కనీసం 10 నుంచి 12 గంటల సమయం చదివేలా ప్లాన్ చేసుకోవాలి.
హాబీకి తగ్గట్టు రిలాక్స్ కావాలి
మన మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచుకుంటేనే చదివినవాటిని ఎక్కువగా గుర్తు పెట్టుకోగలుగుతాం. ఇందుకు ఎవరి హాబీకి తగ్గట్టు వారు రిలాక్స్ కావచ్చు. నేను మా గల్లీలో పిల్లలతో కాసేపు క్రికెట్ ఆడుకునే వాడిని. అలాగే ప్రిపరేషన్లో ఉన్న ఇతర మిత్రులతో కలిసి చాయ్ తాగుతూ రిలాక్స్‌గా ఏదైనా టాపిక్‌పై చర్చిస్తే టైం కలిసి వస్తుంది. ఒక సబ్జెక్ట్‌ను మనం చూస్తున్న కోణానికి, ఇతరులు అర్థం చేసుకునే విధానానికి తేడా ఉంటుంది. కాబట్టి చర్చించడం వల్ల దాన్ని మరింతగా నేర్చుకునే వీలు కలుగుతుంది. ఇది ముఖ్యంగా గ్రూప్-1 ఎస్సే రైటింగ్‌కు ఎంతో ఉపయోగకరం. ఉద్యోగార్థులు ఏవైనా సలహాలు, సూచనల కోసం 9032424126 నంబర్లో నన్ను సంప్రదించవచ్చు.
కొవూరి పవన్‌కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, సికింద్రాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?