రెడ్డి హాస్టల్ సదస్సుకు అధ్యక్షత వహించినది ఎవరు?
1969, జనవరి 24న సదాశివపేటలో జై తెలంగాణ నినాదాలతో హైస్కూలు విద్యార్థులు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ను ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో చాలామంది విద్యార్థులకు తూటాలు తగిలాయి. కొందరు విద్యార్థులు సంగారెడ్డిలో, కొందరు హైదరాబాద్‌లోని గాంధీలో చికిత్స పొందారు. ఈ కాల్పుల్లో గాయపడిన శంకర్ 26న, కృష్ణ ఫిబ్రవరి 10న మరణించారు.
ఈగలపెంటలో ఆంధ్రోళ్ల దాడులు
ఆంధ్ర రక్షణోద్యమం పేరుతో ఆంధ్రలో విద్యార్థులు చేస్తున్న అలజడి తదితర కారణాల ప్రేరణతో శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం నిర్మాణ పనులు చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు, వర్కర్లు నివసించే ఈగలపెంట కాలనీపై జనవరి 30న రాత్రి ఆంధ్రా ప్రాంతీయులు దాడి చేశారు.
అర్ధరాత్రి ప్రారంభమైన ఈ విధ్వంసకాండ మరుసటి రోజు జనవరి 31 సాయంత్రం 5:30 దాకా కొనసాగిందని, ప్రాజెక్టు వద్ద జరిగిన దోపిడీ, లూటీ, గృహ దహనకాండ, రాక్షస చర్యలకు గురై కట్టుబట్టలతో కాలువ ఎడమవైపు (తెలంగాణ) చేరుకున్న వారికి ప్రాజెక్టు అధికారులు గాని, ఇతరులు గాని ఎవరూ ఏ విధమైన సహాయం చేయలేదని ఆంధ్రప్రదేశ్ జనసంబంధ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రకటించారు.
ఆంధ్ర పత్రికల దుర్మార్గం
ఈగలపెంటలో తెలంగాణ వారిపై ఇంత దుర్మార్గం జరిగినా, జనసంబంధ మంత్రి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ దౌర్జన్యాన్ని ఖండించినా ఒక్క పదాన్ని కూడా విశాలాంధ్రతో సహా ఆంధ్ర పత్రికలేవీ రాయలేదు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన చిన్న చిన్న దాడులకే ఆంధ్ర మంత్రులంతా గోల గోల చేశారు. సంఘీభావ కమిటీలు వేశారు. ఆంధ్ర కవులు కేవీఆర్, ఆరుద్ర, కుందుర్తి, కరుణశ్రీ వంటి వారు తెలంగాణపై విషాన్ని చిమ్ముతూ విద్వేష కవితలు రాశారు. ఈగలపెంట దుర్మార్గంపై వీరి కలాలు కదలలేదు, గొంతులు పెగల లేదు. ఆంధ్ర మంత్రులూ మౌనం పాటించారు. ఆంధ్ర కవుల ఆవేశపు అసత్య కవితలకు దీటుగా కాళోజీ ఘాటుగా స్పందించారు.
కుమార్ లలిత్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత కప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తెలంగాణ మిగులు నిధులు లెక్కకట్టడానికి ‘కుమార్ లలిత్’ నేతృత్వంలో కమిటీని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం 1969, జనవరి 23న ఆమోదించింది. ఈ కమిటీ 1956, నవంబర్ 1 నుంచి 1968, మార్చి 31 వరకు తెలంగాణ మిగులు నిధులను అంచనా వేసి 1969, మార్చి 5న నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కుమార్ లలిత్‌ను ఆదేశించింది.
ఈ కమిటీ క్యాపిటల్ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ నికర మిగులు నిధులు రూ.34.10 కోట్లు ఉన్నట్లు తమ నివేదికలో తెలిపింది. తెలంగాణ రీజినల్ కమిటీ కుమార్ లలిత్ మిగులు నిధులకు సంబంధించిన నిర్ధారణలతో ఏకీభవించలేదు.
విద్యార్థి నాయకుల జిల్లా పర్యటనలు
1969, మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లోని రెడ్డీ హాస్టల్లో తెలంగాణ సదస్సు ఏర్పాటు చేయాలని ఉస్మానియా విద్యార్థి నాయకుడు మల్లికార్జున నేతృత్వంలో 1969, జనవరి 27న ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ నిర్ణయించింది. ఈ సదస్సును విజయవంతం చేయడానికి 35 మంది విద్యార్థి నాయకులు తెలంగాణ జిల్లాల్లో పర్యటించారు.
రెడ్డి హాస్టల్ సదస్సు
35 మంది విద్యార్థి నాయకులు జిల్లా పర్యటనలు పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో 1969, మార్చి 8, 9 తేదీల్లో రెడ్డి హాస్టల్లో ‘తెలంగాణ సదస్సు’ నిర్వహించారు. ఈ సదస్సుకు సదాలక్ష్మి అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులోనే విద్యార్థి నాయకుడు ‘శ్రీధర్ రెడ్డి’ క్విట్ తెలంగాణ అనే నూతన నినాదాన్ని లేవదీశారు. ఈ సదస్సులోనే తెలంగాణ మ్యాప్‌ను శాసన సభ్యుడు టీ పురుషోత్తమరావు ఆవిష్కరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘తపాలా బిళ్ల’ ఆవిష్కరణ కోసం రాష్ట్ర గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ రావడంతో విద్యార్థులు గవర్నర్‌ను ఘెరావ్ చేశారు.
1969, మార్చి 17న విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల ముందు ‘ప్రజాస్వామ్య రక్షణ దినాన్ని’ నిర్వహించారు. 1969, మార్చి 28న ముల్కీ నిబంధనలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈ తీర్పునకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమించి జామై ఉస్మానియా రైల్వే స్టేషన్‌కు నిప్పంటించారు. ఈ రైల్వే స్టేషన్ మంటల్లో పొరపాటున చిక్కుకొని ప్రకాశ్‌కుమార్ జైన్, పీ సర్వారెడ్డి అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు.
మేడే ఊరేగింపు (1969)
తెలంగాణ ప్రజా సమితి మే డే నాడు డిమాండ్స్ డే (కోరికల దినం) పాటించాలని పిలుపునిచ్చింది. మే 1న రెండు ఊరేగింపులు నిర్వహించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. 1) చార్మినార్ నుంచి రాజ్‌భవన్‌కు, 2) సికింద్రాబాద్ నుంచి రాజ్‌భవన్‌కు. కానీ పోలీస్ కమిషనర్ చార్మినార్ నుంచి కాకుండా పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఊరేగింపునకు అనుమతి ఇచ్చారు. నాయకులు చార్మినార్ నుంచి ఊరేగింపు చేయాలని నిర్ణయించారు.
చార్మినార్ నుంచి ఊరేగింపునకు మొదటి సారథ్యం వహించనవారు మల్లికార్జున్, మదన్ మోహన్, కేశవరావ్ జాదవ్. తర్వాత కేవీ రంగారెడ్డి నాయకత్వంలో ఊరేగింపు బయలు దేరింది. ఈ ఊరేగింపు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఊరేగింపుతో పబ్లిక్ గార్డెన్ వద్ద కలుసుకొంది. సికింద్రాబాద్ నుంచి ఊరేగింపునకు నాయకత్వం వహించింది ఎస్బీ గిరి, నాగా కృష్ణ, గౌతు లచ్చన్న. రాజ్‌భవన్ దగ్గర కాల్పులు జరగడంతో సికింద్రాబాద్ సాయం కళాశాల విద్యార్థి నాయకుడు అయిన ‘ఉపేందర్ రావు’ మరణించారు. మే 1న జరిగిన హింసాకాండకు వ్యతిరేకంగా మే 2న నగరంలో బంద్ నిర్వహించారు. దీనికి నిరసనగా హింసకు హింసతోనే సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఉద్యమకారులు నరేందర్, కుమార్ సికింద్రాబాద్‌లో పోలీస్ వ్యాన్‌పై బాంబు విసిరారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సు
1969, మే 20న ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, లెక్చరర్లు తెలంగాణ సదస్సు వైఎంసీఏ హాల్లో ప్రొఫెసర్ మంజూర్ ఆలం అధ్యక్షతన నిర్వహించారు. ప్రొఫెసర్ రావాడ సత్యానారాయణ (ఉస్మానియా వైస్‌చాన్స్‌లర్) ఈ సదస్సు ప్రారంభోపన్యాసం చేశారు. ప్రొఫెసర్లు జయశంకర్ సార్, బషీరుద్దీన్, పెన్నా లక్ష్మీకాంతరావు, శ్రీధర్ స్వామి, తోట ఆనందరావు పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో సమర్పించిన పత్రాలన్నింటినీ కలిపి ‘తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు.
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ‘కుమార్ లలిత్’ కమిటీని నియమించింది?
1) కేంద్ర ప్రభుత్వం
2) రాష్ట్ర ప్రభుత్వం
3) రాష్ట్రపతి 4) 1, 2
2. 1969, మార్చి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన ‘రెడ్డి హాస్టల్ సదస్సు’కు అధ్యక్షత వహించినది?
1) సదాలక్ష్మి
2) రావాడ సత్యనారాయణ
3) మంజూర్ ఆలం
4) మల్లికార్జున్
3. 1969 ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన మంత్రిత్వ శాఖ?
1) హోం శాఖ 2) రెవెన్యూ
3) జనసంబంధ మంత్రిత్వ 4) చేనేత
4. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో తొలి అమరుడు?
1) శంకర్ 2) రవీంద్రనాథ్
3) కృష్ణ 4) యాదయ్య
5. కుమార్ లలిత్ కమిటీ తెలంగాణ మిగులు నిధులను ఎంతగా తేల్చింది?
1) రూ.39.10 కోట్లు
2) రూ.34.10 కోట్లు
3) రూ.38.09 కోట్లు
4) రూ.44.10 కోట్లు
6. 1969, మే 20న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సుకు అధ్యక్షత వహించింది?
1) ప్రొఫెసర్ జయశంకర్
2) ప్రొఫెసర్ తోట ఆనందరావు
3) ప్రొఫెసర్ మంజూర్ ఆలం
4) ప్రొఫెసర్ బషీరుద్దీన్
7. కింది వాటిలో సరైనవి?
1) 1969, మార్చి 8న జరిగిన రెడ్డీ హాస్టల్ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసింది- ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ
2) 1969, మే 20న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసింది- ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ
3) 1 4) 1, 2
8. కింది ఏ సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రాలన్నింటినీ కలిపి ‘తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్’ అనే పుస్తకంగా ప్రచురించారు?
1) రెడ్డి హాస్టల్ సదస్సు
2) ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సు
3) తెలంగాణ రచయితల సదస్సు
4) 1, 2
9. రెడ్డి హాస్టల్ సదస్సులో ‘క్విట్ తెలంగాణ’ అనే నినాదాన్ని ఇచ్చింది?
1) శ్రీధర్ రెడ్డి
2) మల్లికార్జున్
3) వెంకట్రామ రెడ్డి
4) మదన్ మోహన్
10. కింది వాటిలో సరైనవి?
1) తెలంగాణ ప్రజాసమితి మే డే నాడు ‘డిమాండ్స్ డే’ పాటించాలని పిలుపునిచ్చింది
2) ఈ సందర్భంలో రాజ్‌భవన్ దగ్గర కాల్పులు జరగడంతో సికింద్రాబాద్ సాయం కళాశాల విద్యార్థి నాయకుడు ‘ఉపేందర్ రావు’ మరణించాడు
3) 1 4) 1, 2
11. ప్రొఫెసర్ల సదస్సులో ‘డాక్టర్ కేఎల్ రావు-నాగార్జున సాగర్’ అనే పరిశోధన పత్రం సమర్పించింది?
1) పెన్నా లక్ష్మీకాంతరావు
2) తోట ఆనందరావు
3) ప్రొఫెసర్ జయశంకర్
4) శ్రీధర్ స్వామి
12. తెలంగాణ ప్రజాసమితి మేడే రోజు ఎక్కడి నుంచి ఊరేగింపు నిర్వహించి గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించింది?
1) చార్మినార్ నుంచి రాజ్‌భవన్‌కు
2) సికింద్రాబాద్ నుంచి రాజ్‌భవన్‌కు
3) 1 4) 1, 2
13. 1969, మార్చి 8, 9 తేదీల్లో జరిగిన ‘రెడ్డి హాస్టల్’ సదస్సులో ‘తెలంగాణ మ్యాప్’ను ఆవిష్కరించింది?
1) టీ పురుషోత్తమరావు
2) సదాలక్ష్మి
3) రావాడ సత్యనారాయణ
4) శ్రీధర్ రెడ్డి
14. ఉస్మానియా యూనివర్సిటీ సదస్సులో పరిశోధన పత్రాలను సమర్పించింది?
1) జయశంకర్, బషీరుద్దీన్
2) పెన్నా లక్ష్మీకాంతరావు, శ్రీధర స్వామి
3) తోట ఆనందరావు
4) పై అందరూ
15. ఎవరి ఆధ్వర్యంలోని ‘విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి’ రెడ్డి హాస్టల్లో తెలంగాణ సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది?
1) శ్రీధర్ రెడ్డి
2) మల్లికార్జున్
3) వెంకట్రామ రెడ్డి
4) ఉపేందర్ రావు
సమాధానాలు
1-2, 2-1, 3-3, 4-1, 5-2, 6-3, 7-4, 8-2, 9-1, 10-4, 11-3, 12-4, 13-1, 14-4, 15-2.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు