ప్రతి అంశమూ ముఖ్యమే ( గ్రూప్ -1 స్పెషల్ )

గ్రూప్ -I పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సిలబస్ విషయంలో సరైన అవగాహన కలిగి ఉండాలి. ప్రిలిమ్స్
సిలబస్‌లో మొత్తం 13 టాపిక్స్ ఉన్నాయి. భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర-సంస్కృతికి సంబంధించి రెండు టాపిక్స్ ఉంటాయి. అవి భారతదేశ చరిత్ర-సాంస్కృతిక వారసత్వం, తెలంగాణ సమాజం-సంస్కృతి,
వారసత్వం, కళలు, సాహిత్యం. సాధారణంగా సివిల్స్ పరీక్షకు ప్రిపేరయ్యేవారు గ్రూప్ -I సిలబస్ ప్రత్యేక అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సిలబస్‌లోని తెలంగాణ కంపోనెంట్ కు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. చారిత్రక వారసత్వం, హిస్టరీ, జాగ్రఫీ ప్రభుత్వ విధానాలు ప్రముఖంగా ఉంటాయి.
# సివిల్స్‌తో పోల్చినప్పుడు సిలబస్‌లో తెలంగాణ అంశాల ప్రాధాన్యతను అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. గ్రూప్ -I సిలబస్ మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటుంది. ముఖ్యంగా చరిత్ర, సంస్కృతికి సంబంధించి సంప్రదాయ పద్ధతిలో కాకుండా సామాజిక, ఆర్థిక, కళలు, వాస్తుశిల్పం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. పోటీ పరీక్షల సిలబస్ బీఏ, ఎంఏ సిలబస్ కంటే భిన్నంగా ఉంటుంది. జనరల్ డిగ్రీ స్థాయి సిలబస్, ఓరియంటేషన్ పోటీ పరీక్షల కంటే భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు గ్రూప్ -I ప్రిలిమ్స్ సిలబస్‌లో ‘చరిత్ర, భారతదేశ సాంస్కృతిక వారసత్వం’ అనే టాపిక్ ఉంది. సాధారణంగా అభ్యర్థులు చరిత్ర అంటే రాజ వంశాలు, యుద్ధాలు, సంధులు, ఒడంబడికలు, తేదీల ప్రాముఖ్యత ఉంటుందని అనుకుంటారు. అది తప్పుడు అవగాహన.
# చరిత్ర వారసత్వం అనే అంశం ప్రధానంగా సాంస్కృతిక, మత, తాత్వికత, కళలు, వాస్తుశిల్పాలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి రాజకీయ, వంశ, పాలనా సంబంధాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రిలిమ్స్ పరీక్షలో తేదీల ప్రస్తావన ప్రముఖంగా ఉండదు. అయితే ప్రముఖ రాజవంశాలు, ప్రసిద్ధ రాజుల గురించి అవగాహన కలిగి ఉండాలి.
# భారతేదేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించినంత వరకు నాగరికతా పరిణామక్రమాన్ని అవగాహన చేసుకోవాలి. సింధు నాగరికత, ఆర్యన్ /వైదిక నాగరికత మౌలిక లక్షణాలు, జైన, బౌద్ధ మతాల సిద్ధాంతాలు, తాత్వికత, ఈ రెండు మతాల మధ్య తేడాలు, పోలికలు, వైదిక వాజ్మయం, తాత్వికత, మత పరిస్థితుల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రాచీన భారత నాగరికత పరిణామక్రమంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రంలో రాజకీయ అంశాల కంటే సాంస్కృతిక, మత, తాత్విక అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు సామాజిక, సాంస్కృతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని నోట్స్ తయారు
చేసుకోవాలి.
# వైదిక యుగానికి సంబంధించినంత వరకు ఆనాటి సామాజిక వ్యవస్థ, మత పరిస్థితులు, సాహిత్యం, జీవన విధానం వంటి అంశాల పట్ల నిర్దిష్ట అవగాహన ఉండాలి. అదేవిధంగా తొలి వేద, మలి వేదకాలం నాటి సామాజిక, మత వ్యవస్థలో వచ్చిన మార్పులు, వాటి కారణాలపై అవగాహన ఉండాలి. ప్రాచీన భారత నాగరికతలో జైన, బౌద్ధ మతాల ప్రాముఖ్యం, వాటి సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు, వాటి పరిణామక్రమం, క్షీణత గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశంలో విలసిల్లిన శిల్పకళలు, లలిత కళలు, వాస్తుశిల్పం, పాళీ, సంస్కృత సాహిత్యం వంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
# మధ్య యుగాల భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించినంత వరకు భక్తి, సూఫీ ఉద్యమాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో విలసిల్లిన వివిధ భక్తి, సంస్కరణ ఉద్యమాల గురించి అవగాహన, ఇస్లాం మత ప్రభావం, సూఫీయిజం మౌలిక లక్షణాలపై తులనాత్మక దృక్పథం కలిగి ఉండాలి. ఢిల్లీ సుల్తాన్ లు, మొగల్ రాజులు, విజయనగర సామ్రాజ్యం, చోళులు, కాకతీయుల కాలం నాటి సాహిత్యం, కళలు, సామాజిక, మత, సాంస్కృతిక పరిస్థితులు, కట్టడాలు, నిర్మాణ శైలి గురించి అధ్యయనం చేయాలి.
# ఆధునిక యుగానికి సబంధించి ప్రధానంగా 19-20 శతాబ్దాల్లో జరిగిన సంఘ సంస్కరణ ఉద్యమాలు, వాటి ప్రాధాన్యత, ప్రభావం, ఉత్తర, దక్షిణ భారతదేశంలో వచ్చిన సామాజిక చైతన్యం, కుల వ్యతిరేక అస్తిత్వ ఉద్యమాల గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వివిధ ఘట్టాలు, గాంధీయుగం గురించిన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. స్థూలంగా ఆధునిక యుగంలో సంభవించిన సంఘ సంస్కరణలు, బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు, కార్మిక, కర్షక, ఆదివాసీ ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.
# తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల పాలన వరకు సిలబస్ ప్రకారం ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ రాజకీయ, పాలన అంశాలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కాకుండా సామాజిక, సాంస్కృతిక వారసత్వం, కళలు, సాహిత్యం ప్రస్తావన మాత్రమే ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. ప్రాచీన తెలంగాణకు సంబంధించినంత వరకు శాతవాహన, శాతవాహన అనంతరకాలం నాటి సామాజిక పరిస్థితులు, సాహిత్యం, కళలు, సంస్కృతి అంశాలు, మత పరిస్థితులు అంటే బౌద్ధం, జైనం, వైదిక మతం గురించి ఫోకస్ పెట్టాలి. శాతవాహన యుగానికి సంబంధించిన కట్టడాలు, వాస్తు శిల్పాలు ముఖ్యం.
# బౌద్ధ, జైన కట్టడాల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. మధ్యయుగ తెలంగాణలో కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీల కాలం నాటి సాంస్కృతిక, మత పరిస్థితులు, భక్తి, సూఫీ ఉద్యమాల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీల సాహిత్యంపై, కట్టడాలు, నిర్మాణ శైలి, వాస్తుశిల్పం, లలితకళల గురించి అవగాహన ఉండాలి. అదేవిధంగా అసఫ్ జాహీల కాలం నాటి మత, సాంస్కృతిక, సాహిత్య వికాసం గురించి కూడా తెలుసుకోవాలి. మొత్తంగా పరిశీలిస్తే సామాజిక పరిణామక్రమం, సాహిత్య వికాసం, వాస్తుశిల్ప శైలి, కళలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల విద్యార్థులు రాజకీయేతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
# ప్రిలిమ్స్ పరీక్షలో విద్యార్థుల తులనాత్మక, విమర్శనాత్మక, సాపేక్ష అవగాహనను బేరీజు వేస్తారు. అందువల్ల వీలైనంత వరకు విషయ నిపుణులు రాసిన పుస్తకాలను చదవాలి. మార్కెట్ లో లభ్యమయ్యే గైడ్స్, స్టడీ మెటీరియల్ , రెడీమేడ్ నోట్స్‌పై ఆధారపడకూడదు. ప్రిలిమ్స్ సిలబస్‌లో ఉన్న 13 టాపిక్స్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏ ఒక్క టాపిక్ నూ వదిలిపెట్టకూడదు. కొంతమంది విద్యార్థులకు ముఖ్యమైన టాపిక్ లేదా తమకిష్టమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి, కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసే అలవాటు ఉంటుంది. అది సరైన పద్ధతి కాదు. ప్రిలిమ్స్ పేపర్ సెట్టింగ్ లో ప్రతి టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి పూర్తి సిలబస్‌పై సరైన అవగాహన ఉండాలి. సిలబస్‌ను కూలంకషంగా అధ్యయనం చేసి తదనుగుణంగా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచిది.
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
ఉస్మానియా యూనివర్సిటీ
హైదరాబాద్
RELATED ARTICLES
-
Career Guidence | Career in Python Programming Language
-
NEET Success Stories | నీట్లో మెరిసిన తెలుగు తేజాలు
-
JEE Advanced 2023 – Success Stories | లక్ష్యం పెట్టుకున్నారు.. లక్షణంగా సాధించారు
-
Success Stories | ఆత్మవిశ్వాసం @ ఆరు ఉద్యోగాలు
-
Civil Services Success Stories | వీక్లీ టెస్టులతో లోపాలు సవరించుకున్నా..
-
Civil Services Success Stories | సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ తేజాలు
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
Biology | First Genetic Material.. Reactive Catalyst
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !