తరుముకొస్తున్న జనముప్పు
మానవవనరుల్లో జనాభా ముఖ్యమైంది. ఒక దేశాభివృద్ధిని నిర్ణయించడంలో జనాభా కీలకపాత్ర వహిస్తుంది. సహజవనరులను సమర్థవంతంగా ఉపయోగించి అధిక ఉత్పత్తిని, దేశ ప్రగతిని పెంపొందించడం మానవవనరుల సామర్థ్యంపై ఆధారపడుతుంది. అంటే జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు, అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయ స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ప్రధానమైంది జనాభా పెరుగుదల.
– ఒక దేశ జనాభా పెరుగుదల అభిలషణీయమైన స్థాయిలో కంటే తక్కువగా ఉంటే అది దేశాభివృద్ధికి సూచికగా పరిగణించవచ్చు. అందుకే ప్రఖ్యాత జనాభా శాస్త్రవేత్త ఎడ్విన్ కానన్ భూమి మీద పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధికి కారకమవుతుంది అని అన్నారు.
– అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం 2022 నుంచి 2025 మధ్య కాలంలో చైనా జనాభాను భారత్ అధిగమిస్తుంది. భారత జనాభా 2050 నాటికి దాదాపు 160 కోట్లకు చేరుకుని అక్కడ స్థిరపడుతుంది. ఆ తర్వాత కొన్నేండ్లపాటు జనాభా పెరుగుదల ఉండదు.
– 2080 తర్వాత జనాభా తగ్గుదల ప్రారంభమవుతుంది. 2100 నాటికి 150 కోట్లకు దిగివచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ర్టాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే క్షీణించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ర్టాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.
– ప్రజలతో కిక్కిరిసిన మెగాసిటీలు ప్రపంచంలో 28 ఉండగా, 2030 నాటికి వీటి సంఖ్య 41కి చేరుతుంది. ఇప్పటికే అత్యధిక జనాభా గల తొలి 10 మెగాసిటీల్లో రెండు (ఢిల్లీ, ముంబై) మన దేశంలో ఉన్నాయి. భారత్లో జనసాంద్రత 1901లో 77 ఉంటే 2011 నాటికి 382కు చేరుకుంది. 2018లో జనసాంద్రత 455 (చ.కి.మీ.)గా ఉంది.
– మన దేశంలో అత్యధిక జనాభా పెరుగుదల నమోదైన దశాబ్దం 1961-71. ఆ సమయంలో 24 శాతం జనాభా పెరిగింది. 1911-21ల మధ్య జనాభా పెరుగుదల రేటు రుణాత్మకంగా (-0.31) నమోదైంది. అందుకే 1921ను మనదేశ జనాభా పరిమాణక్రమంలో గొప్ప విభాజక సంవత్సరంగా గుర్తించారు.
– భారత జనాభా అధికారికంగా 2000, మే 11న 100 కోట్లకు చేరుకుంది. అందుకు గుర్తుగా జనాభా పెరుగుదలను, కార్యకలాపాలను సమన్వయం చేయడం కోసం జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని 1987, జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించుకోవడానికి ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.
– 1989 నుంచి జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భౌగోళికంగా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏడో పెద్ద దేశంగా ప్రపంచ భూభాగంలో 2.4 శాతం, ప్రపంచ జనాభాలో దేశ జనాభా 17.5 శాతం కలిగి ఉన్నది. ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.
– 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 121 కోట్లు. మన దేశంలో ప్రతి నిమిషానికి 29 మంది, గంటకు 1768 మంది, రోజుకు 42,434 మంది, నెలకు 12,73,033 మంది, ఏడాదికి 1,55,31,000 మంది జన్మిస్తున్నారు. ప్రపంచంలో జన్మించే ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడు.
– ప్రతిరోజు 5 లక్షల శిశువులు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభాగల ఐదో పెద్ద దేశమైన బ్రెజిల్ జనాభా భారత్లో 2001-11 మధ్యకాలంలో పెరిగిన జనాభాకు సమానం.
– ప్రపంచ జనాభాలో భారతదేశ వాటా 17.50 శాతం. 2028 నాటికి మనదేశ జనాభా చైనాను అధిగమిస్తుంది. గత పదేండ్లతో పోలిస్తే భారతదేశ జనాభా వృద్ధిరేటు 4 శాతం తగ్గింది. ఏటా 1.6 శాతం చొప్పున పెరుగుతున్న ప్రస్తుత చైనా జనాభా 139 కోట్లు.
– 1990లో 21.54 శాతం పెరుగుదల ఉన్నా దేశ జనాభా 2001-11ల మధ్య జనాభా వృద్ధిరేటు 17.64 శాతం మాత్రమే. దేశంలో 24 రాష్ర్టాలు పాపులేషన్ స్టెబిలిటికి చేరుకున్నాయి.
– ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 జననాలు ఉంటే ఈ లెక్కన ప్రపంచ జనాభా పెరిగితే 2100 నాటికి 1100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
– ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం క్రీ.పూ. 5000 నాటికి ప్రపంచ జనాభా 50 లక్షలు ఉండేది. క్రీ.పూ. 4000 నాటికి 20 లక్షల జనాభా పెరిగి 70 లక్షల జనాభా ఉండేది. క్రీ.పూ. 3000 వచ్చేసరికి 70 లక్షలు రెట్టింపై 1.40 కోట్లకు చేరుకుంది. క్రీ.పూ. 2000 నాటికి 2.70 కోట్లకు పెరిగింది.
– ప్రపంచ జనాభా ఇలా పెరుగుతూ 1804 నాటికి 100 కోట్లకు చేరుకుంది. దాని తర్వాత 123 ఏండ్లకు అంటే 1927 నాటికి ప్రపంచ జనాభా 200 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత కేవలం 33 ఏండ్లకే అంటే 1960లో 300 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత 12 ఏండ్లకే అంటే 1972 నాటికి 400 కోట్లకు చేరుకుంది. ఇలా పెరుగుతూ 1987 నాటికి 500 కోట్లకు చేరుకుంది.
– ఇలా గత 100 ఏండ్లలోనే 600 కోట్ల జనాభా పెరిగింది. ప్రతి 14 నెలలకు ప్రపంచ జనాభా 600 మిలియన్లు పెరుగుతుంది. ప్రపంచ జనాభా 2016, ఫిబ్రవరి 6కు 740 కోట్లకు చేరుకుంది. 2017, ఏప్రిల్ 24న 750 కోట్లకు చేరింది.
– ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో వార్షిక జనాభా వృద్ధిరేటు 2000-10 మధ్యకాలంలో 1.23 శాతం ఉంటే చైనాలో వార్షిక జనాభా వృద్ధిరేటు 0.53 శాతం మాత్రమే నమోదైంది. కానీ, భారత్లో ఇదే కాలంలో వార్షిక జనాభా వృద్ధిరేటు 1.64 శాతం నమోదైంది.
– రష్యా, జపాన్లో ఇదే కాలంలో నమోదైన వార్షిక జనాభా వృద్ధిరేటు 0.7 శాతమే. పెరుగుతున్న జనాభావల్ల కలిగే దుష్ఫలితాలను గ్రహించి భారత ప్రభుత్వం 1952లో ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టి జనాభా పెరుగుదలను నియంత్రించడం కోసం రూ. 65 లక్షలు కేటాయించింది.
– 1966లో పూర్తిస్థాయి కుటుంబ నియంత్రణ శాఖను ఏర్పాటు చేశారు. 1976లో నూతన జనాభా విధానాన్ని ప్రకటించి అవసరమైతే కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. పురుషుల వివాహ వయస్సు 21 ఏండ్లు, మహిళల వయస్సు 18 ఏండ్లుగా నిర్ణయించారు.
– 8వ పంచవర్ష ప్రణాళికా కాలంలో జనాభా పెరుగుదలను అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి 1991, డిసెంబర్లో జాతీయాభివృద్ధి మండలిలో కరుణాకర్ అధ్యక్షతన నియమించిన కమిటీ 1993, ఏప్రిల్ 5న నివేదికను సమర్పించింది.
– ఏడో పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం అందిస్తున్న నిధులను 1.2 శాతం నుంచి 2 శాతానికి పెంచారు. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికాంతానికి నిధులను 3 శాతానికి పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికేతర నిధుల కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు 10 శాతం నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది.
– భవిష్యత్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు పోటీచేసే అర్హత లేకుండా చేయాలని 1992, డిసెంబర్లో నిర్ణయించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కుటుంబ నియంత్రణను అమలుచేసే బాధ్యతను పంచాయతీ వ్యవస్థకు ఇవ్వడంతో జనాభా సమస్య పరిష్కారానికి సుగమమైంది.
– ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ (యూఎన్పీఎఫ్) లెక్కల ప్రకారం 2011, అక్టోబర్ 31న ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరింది. ఆ సంఖ్య చేరుకోవడానికి అవసరమైన శిశువు భారత్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జన్మించింది. ఆ శిశువును బేబీ సెవన్ మిలియన్గా పిలుస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 722 కోట్లు ఉండవచ్చని అంచనా.
– ఒకవైపు ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతుంటే ఐరోపా ఖండంలో జనాభా తగ్గడం ఆ దేశాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రత్యేకించి తూర్పు రష్యాలో జనాభా క్రమంగా తగ్గుతున్నది. సంతాన సాఫల్య రేటు తక్కువగా ఉండటమనేది దీనికి ఒక కారణం.
– ప్రస్తుత యూరప్ జనాభా 740 మిలియన్లు కాగా, 2050 నాటికి ఐరోపా ఖండ జనాభా 732 మిలియన్లకు తగ్గుతుందని అంచనా. తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఖరోపా ఖండంలో కొన్ని దేశాలు జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తున్నాయి.
– అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపుపొందిన ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్, డెన్మార్క్, రష్యా, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్, నార్వే, స్వీడన్, పోర్చుగల్, స్పెయిన్, యూకే దేశాల్లో ఎక్కువ మంది పిల్లలు కనే జంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.
పెరుగుతున్న వృద్ధ జనాభా
– ఇటీవల విడుదల చేసిన వృద్ధుల జనాభా గణాంకాల ప్రకారం వృద్ధ జనాభా కూడా నిరంతరం పెరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వృద్ధుల జనాభా 10.39 కోట్లు. దేశ జనాభాలో వృద్ధుల శాతం 8.06 శాతం. 2001-11 మధ్య దశాబ్ద కాలంలో 2.7 కోట్లకుపైగా పెరిగింది. ఇలా పదేండ్ల కాలంలో 35 శాతం పెరిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు