నిజాం రాజ్యంలో గిరిజనపోరాటాలు

ఒక నిర్దిష్టమైన ఆధారం ప్రకారం 1857, ఏప్రిల్ 9న రాంజీగోండును ఉరితీశారు. ఇదే నిజమైతే 1857 నాటి సిపాయి తిరుగుబాటులో తొలి ఘట్టాన్ని నిర్వహించింది రాంజీగోండు అని చెప్పాలి. ఆయన అనుచరులు 1860 వరకు తిరుగుబాటును విజయవంతంగా సాగించి ఉంటారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.
– ప్రధానంగా గిరిజన సమాజానికి ఉన్న చైతన్యం ఎంతో దృఢమైంది. చాలా వరకు గిరిజనోద్యమాలు వ్యవసాయికమైనవి మాత్రమే కాకుండా, అటవీ ఆధారితమైనవి. కొన్ని తిరుగుబాట్లు స్వాభావికంగా జాతి పోరాటాలు. అయినప్పటికీ అవి క్రమంగా స్థానిక జమీందార్ల, వడ్డీ వ్యాపారుల దోపిడీకి, ప్రాంతీయేతరులైన కిందిస్థాయి ప్రభుత్వాధికారుల ఆగడాలకు వ్యతిరేకంగా నడిచాయి. గిరిజనులు తీసుకున్న అప్పులు చెల్లించలేని సమయంలో వడ్డీ వ్యాపారులు, భూస్వాములు వారి భూములను స్వాధీనం చేసుకునేవారు. ఆ విధంగా గిరిజనులు తమ భూములకు తామే కౌలుదార్లుగా మారిపోవడమే గాక, కొన్నిసార్లు నిర్బంధ కూలీలుగా ఉండాల్సి వచ్చేది. అలాంటి సందర్భాల్లో పోలీసులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ గిరిజనులకు ఏ మాత్రం సహాయపడకపోవడమేకాక, దానికి విరుద్ధంగా వారు గిరిజనులను ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా తమ సొంత పనులకు, ప్రభుత్వ పనులకు వెట్టిచాకిరి చేయించుకునేవారు. మరోవైపు అటవీ కాంట్రాక్టర్లు, వారి ఏజెంట్లు, వ్యాపారులు, మైదాన ప్రాంతాల ప్రజల దురాశతో అటవీ భూములను, ఉత్పత్తులను, గిరిజనుల సంపదను బలవంతంగా తరలించుకుపోయేవారు. ఇవన్నీ హైదరాబాద్ రాజ్యంలో గిరిజనుల తిరుగుబాట్లకు తక్షణ కారణాలయ్యాయి.
– హైదరాబాద్ రాజ్యంలో మొదటిసారిగా సాలార్జంగ్ కాలంలో 1857లో అటవీశాఖ ప్రారంభమైంది. ఆ తర్వాత 1890, 1900ల్లో అటవీ విధానం ప్రకటించారు. దీంతో అటవీ సంపదపై ప్రభుత్వాధికారం పెరిగింది. కానీ, వేల ఏండ్లుగా అడవిపై ఆధారపడిన గిరిజనుల సాంప్రదాయిక హక్కులు రద్దయ్యాయి. అటవీ ప్రాంతాలను ప్రభుత్వం రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ అనే రెండు భాగాలుగా విభజించింది. రిజర్వ్డ్ ఫారెస్ట్లో గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకోవడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం నిషేధించారు. తత్ఫలితంగా గిరిజనులు సామాజిక, ఆర్థికస్థితుల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి.
– ముఖ్యంగా పై చట్టాల వల్ల విసిగి వేసారిన నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లాలో గల గోండులు… గిరిజనేతరుల, అటవీ అధికారుల అనవసర ప్రమేయాన్ని, ఆధిపత్యాన్ని, ప్రభుత్వ దమననీతిని వ్యతిరేకిస్తూనే ప్రకృతిపై, వారు నివసించే ప్రాంతాలపై తమ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి తమ నాయకులైన రాంజీగోండు, కుమ్రం భీమ్ల నాయకత్వంలో పోరాటాలను సాగించారు.
రాంజీగోండు తిరుగుబాటు (1857- 1860)
– మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్, ఆనాటి దక్కన్ వైస్రాయికి ఇతర ఐదు సుభాలతోపాటు బెరార్ పరిపాలనా అధికారాన్ని కూడా అప్పగించాడు. 1769లో దక్కన్ రాజధాని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మారిన తర్వాత వారి రాజ్యాన్ని హైదరాబాద్ రాష్ట్రమని, దక్కన్ ప్రాంతమని వ్యవహరించడంతోపాటు ఆ రాజులను అసఫ్జాహీలని, నిజాములని పిలిచేవారు. ఆనాడు బెరార్ సుభాలో ఆదిలాబాద్ జిల్లా ఉండేది. మొదటగా పలు రాజకీయ పరిణామాలను ఆసరాగా చేసుకుని గోండులు, మణిక్గర్ కోటను హస్తగతం చేసుకున్నారు. ఇది రాజ్యానికి వ్యతిరేకంగా గోండులు సాధించిన మొదటి విజయం. ఫలితంగా గోండు రాజుల పూర్వ స్థానమైన సిరిపూర్ ప్రత్యక్షంగా అసఫ్జాహీ నిజాం పాలకుల చేతుల్లోకి వెళ్లింది. అయితే, 1853లో నిజాంకు, బ్రిటిష్ వారికి జరిగిన సంధి ప్రకారం బెరార్ సుభా బ్రిటిష్ పాలనలోనికి వచ్చింది. ఈ ఒప్పందం ప్రజలకు, హైదరాబాద్ రాజ్య ప్రధాని సిరాజ్ – ఉల్ – ముల్క్కు కూడా నచ్చలేదు.
-ఈ సమయంలోనే అంటే 1853 నుంచి 1860 మధ్య ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ తదితర ప్రాంతాల్లోని గోండులు అనే గిరిజనులు, రోహిల్లాలు అనే ముస్లింలు, రాంజీ గోండు- హాజీ రోహిల్లాల నాయకత్వంలో తిరుగుబాటును ప్రారంభించారు. ఆనాడు వీరికి తాంతియాతోపే వంటి జాతీయ నాయకుల సలహాలు, సహాయ సహకారాలు కూడా అందేవి. దానితో రామ్జీగోండు- హాజీరోహిల్లాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 నాటికి మరాఠా, తెలుగు, రోహిల్లా, గోండు సైన్యాలను తయారుచేసి, వారికి సాయుధ శిక్షణ ఇచ్చి ఆదిలాబాద్తోపాటు దాని చుట్టు పక్కల గల ప్రాంతాలను విముక్తి చేసి నిర్మల్ రాజధానిగా కొద్దికాలంపాటు స్వతంత్రంగా పరిపాలించారు. దానికితోడు 300 మంది గోండు సైనికులు, 200 మంది రోహిల్లా సైనికులు, 500 మంది తెలుగు, మరాఠా సైనికులతో పటిష్ఠమైన సైన్యాన్ని కూడా ఏర్పర్చుకున్నారు.
– అయితే, వెంటనే బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని, నిజాం సైన్యాన్ని పెద్ద సంఖ్యలో కల్నల్ రాబర్ట్ అనే సైనికాధికారి నాయకత్వంలో నిర్మల్ ప్రాంతానికి పంపించి, గోండులను, రోహిల్లాలను వేటాడటం, వేధించడం వంటి హింసాత్మక చర్యలు పాల్పడ్డారు. కానీ, గెరిల్లా యుద్ధ నైపుణ్యం ఉన్న రాంజీగోండు సైన్యాలు మొదట కొంతమంది ఆంగ్లేయ సైన్యాలను పలుచోట్ల ఓడించి చంపినప్పటికీ బ్రిటిష్, నిజాం సైన్యాల సంఖ్య, ఆయుధ సంపత్తి అధికం కావడంతో గోండుల సైన్యం విరోచితంగా పోరాడినా ఓడిపోయారు. నిజాం, బ్రిటిష్ సైన్యాలు రాంజీగోండు, హాజీ రోహిల్లాలతోపాటు వారి అనుచరులైన దాదాపు 1000 మంది గెరిల్లా సైనికులను బంధించాయి. చేతికి చిక్కిన వారందరినీ రాంజీగోండుతో సహా బ్రిటిష్ అధికారులు నిర్మల్లోని ఖజానాచెరువు గట్టున దాదాపు 1000 ఊడలు గల పెద్ద మర్రిచెట్టుకు ఊడకొక్కరి చొప్పున 1000 ఊడలకు 1000 మంది గోండు, రోహిల్లా, తెలుగు, మరాఠా గెరిల్లా సైనికులను నిర్ధాక్షిణ్యంగా ఉరితీశారు. ఆనాటి నుంచి ఆ చెట్టును 1000 ఉరుల మర్రి అని నిర్మల్ ప్రాంత ప్రజలు పిలుస్తుంటారు. ఇంకా, ఆ చెట్టును రాంజీగోండు- హాజీరోహిల్లా, వారి అనుచరుల స్మృతి చిహ్నంగా నేటికీ అక్కడి ప్రజలు గౌరవ సూచకంగా పూజిస్తారు.
– ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక నిర్దిష్టమైన ఆధారం ప్రకారం 1857, ఏప్రిల్ 9న రాంజీగోండును ఉరితీశారు. ఇదే నిజమైతే 1857 నాటి సిపాయి తిరుగుబాటులో తొలి ఘట్టాన్ని నిర్వహించింది రాంజీగోండు అని చెప్పాలి. అయితే, సిపాయిల తిరుగుబాటు రెండో ఘట్టంలో రాంజీగోండు మరణానంతరం, ఆయన అనుచరులు 1860 వరకు తిరుగుబాటును విజయవంతంగా సాగించి ఉంటారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఏదేమైనా రాంజీగోండు సాగించిన విరోచితమైన తిరుగుబాటు, సిపాయి తిరుగుబాటులో అంతర్భాగంగా నడిపించబడ్డప్పటికీ, స్వాతంత్య్ర ప్రియులైన గోండులు, ఇతర గిరిజనులు, తమపై స్థానికేతరులు చలాయిస్తున్న అధికార ఆధిపత్యాన్ని సహించరని ఈ పోరాటం ప్రపంచానికి తెలియజేసింది. ఇందుకు మరో ఉదాహరణగా కుమ్రంభీమ్ లేవనెత్తిన జోడేఘాట్ ఉద్యమాన్ని చెప్పవచ్చు.
కుమ్రం భీమ్ ప్రతిఘటనోద్యమం (1938-40)
– గోండు వీరుడైన కుమ్రం భీమ్ నాటి నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ డివిజన్లోని జోడేఘాట్ అటవీ ప్రాంతంలో సంకేపల్లి అనే గిరిజన గూడెంలో 1901, అక్టోబర్ 22న కుమ్రం చిన్నూ, సోమ్భాయి దంపతులకు జన్మించాడు. ఇతడు నిరక్షరాస్యుడు. బయటి ప్రపంచానికి తెలియనివాడు.
– ఆసిఫాబాద్ ప్రాంతమంతా హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఏలుబడిలో ఉండేది. ముఖ్యంగా జోడేఘాట్ ప్రాంతంలోని గోండులు, కొలాములు, పరధాన్లు, తోటీలు, నాయక్పోడ్లు అనే గిరిజనులు అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. అయితే, వారు రాజ్యం ప్రత్యక్ష నియంత్రణలో లేకపోవడంతో ఆదివాసుల భూముల పరిరక్షణ పేరుతో నిజాం ప్రభుత్వం 1917లో తెచ్చిన అటవీచట్టం గిరిజనుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించడమేకాక, అనేక పరిమితులు, రకరకాల పన్నులు విధించింది.
– ఈ చట్టం ప్రకారం గిరిజనులు అడవుల్లో తమ పశువులను మేపుకుంటే బంచెరాయి పన్ను, అడవి నుంచి కలప తెచ్చుకుంటే దుంపపట్టి, ఇంకా ఘర్పట్టి, నాగర్పట్టి, ఫసల్పట్టి, చేదీనా వంటి ఇతర పన్నులను కూడా గిరిజనులు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పోడు చేసుకొని, పంటలు పండించుకుని, అడవులనే ఆదాయ, ఆర్థిక వనరులుగా వాడుకుని జీవించడమే తప్ప డబ్బు వినియోగం తెలియని గిరిజనులు, నిజాం ప్రభుత్వం అటవీ చట్టాన్ని అమలు పరుస్తుండటంతో అయోమయంలో పడి అనేక బాధలు అనుభవించేవారు. దీనికితోడు 1918లో ఉట్నూరులో మొదటి తహసీల్ ఆఫీస్ ఏర్పడింది. అటవీ, రెవెన్యూపరమైన పన్నుల వసూలుకు శ్రీకారం చుట్టింది. అదేవిధంగా 1935లో సిర్పూర్- కాగజ్నగర్ ప్రాంతంలో పేపర్ మిల్లు ఏర్పడగా, దాని అవసరాల కోసం విశాలమైన అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, చేసేదిలేక చాలా మంది గోండులు ఫ్యాక్టరీ కార్మికులుగా మారిపోయారు.
– దీనికితోడు అధికారుల అండదండలతో మోసపూరితమైన వడ్డీవ్యాపారులు గోండులు, కొలాముల భూములను కబ్జా చేసుకోవడమే కాక, తిరిగి గిరిజనులపైనే కేసులు బనాయించి ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. ఇదంతా గమనిస్తున్న గోండు యువకుడైన కుమ్రంభీమ్ పరిష్కార మార్గాలను వెతుకుతున్న సమయంలోనే తన తండ్రి కుమ్రం చిన్నూ విషజ్వరం బారినపడి మృతిచెందడంతో భీమ్ కుటుంబం సంకెపల్లి నుంచి సుర్దాపూర్ గ్రామానికి వలసపోయింది. ఈ సమయంలోనే కుమ్రం భీమ్ తన సన్నిహితులైన మడావి మహదు, మోతీరామ్ల ద్వారా దోపిడీ వర్గాలకు ఎదురునిలిచి పోరాడిన గోండురాజుల వీరత్వాన్ని, బిర్సాముండా తిరుగుబాటును, రాంజీగోండు ధీరత్వాన్ని తెలుసుకుని తన గోండు ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు.
RELATED ARTICLES
-
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
-
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
-
DSC Special – Biology | Autogamy..Geitonogamy.. Xenogamy
-
Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
-
Economy | పశువైద్య సేవా సౌకర్యాలను అందించే టోల్ ఫ్రీ నంబర్
-
Indian Culture And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Latest Updates
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్లో అల్పం… దాద్రానగర్లో అధికం
Current Affairs | ఏ రాష్ర్టానికి చెందిన ‘మట్టి బనానా’కు జీఐ ట్యాగ్ లభించింది?
DSC Special – Social | భారతదేశంలో ఇనుప ఖనిజం లభించే ప్రాంతం?
General Studies – Groups Special | ఆదిత్య-ఎల్ 1 మిషన్
IELTS Exam | Language Tests for Overseas Education
Group 2,3 Special | వెట్టి చాకిరీ నిర్మూలనకు తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ?
Job updates | Job Updates 2023
Scholarships | Scholarships for 2023