105వ రాజ్యాంగ సవరణ చట్టం (Indian Polity groups special)
గ్రూప్స్ ప్రత్యేకం
గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో ‘ఇండియన్ పాలిటీ-గవర్నెన్స్’ అత్యంత కీలక విభాగం. దీని నుంచి అడిగే ప్రశ్నలన్నీ పూర్తిగా ‘కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్’పై ఆధారపడి ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ‘విషయ అవగాహన’పై పూర్తి పట్టు సాధించాలి. అదేవిధంగా పాలిటీకి సంబంధించిన వర్తమాన అంశాలపై దృష్టిసారించాలి. చదివేటప్పుడు నిర్దిష్టమైన అంశాన్ని 360 డిగ్రీల అప్రోచ్‌లో అధ్యయనం చేయాలి. అంటే ఒక అంశానికి సంబంధించిన అన్ని కోణాలను స్పృశించడం. 105వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 360 డిగ్రీల కోణంలో ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకుందాం.
105వ రాజ్యాంగ సవరణ చట్టం
పార్లమెంట్ ఆమోదం
లోక్‌సభ-2021, ఆగస్ట్ 10
రాజ్యసభ-2021, ఆగస్ట్ 11
రాష్ట్రపతి-2021, ఆగస్ట్ 18
ఉద్దేశం: సామాజికంగా, వెనుకబడిన తరగతుల (ఎస్ఈబీసీ)ను గుర్తించే అధికారం కేంద్రం నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బదిలీ చేయడం (అధికరణ 342ఏ(3))
రాజ్యాంగంలో సవరించిన అంశాలు: ఆర్టికల్ 342ఏ లోని క్లాజ్ 1, 2, ఆర్టికల్ 366(26సీ), ఆర్టికల్ 338బీ(9)
కొత్తగా 342ఏ క్లాజ్(3) చేర్చారు
లబ్ధిపొందే ఎస్ఈబీసీ కులాలు: 671
# ఇప్పుడు కేవలం 105వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెలుసుకొని అలా వదిలేయకుండా ఆ చట్టం తీసుకువచ్చిన వెనుకబడిన తరగతుల వారి నేపథ్యం, వారి సంక్షేమం, ప్రభుత్వం నియమించిన కమిషన్లు, వాటి సిఫారసులు, సుప్రీంకోర్టు తీర్పులు తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
వెనుకబడిన తరగతులవారి నేపథ్యం
# ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందని, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని వెనుకబడిన తరగతులవారు అని పిలుస్తారు. వీరినే బజనులు అని కూడా అంటారు.
# వీరిని కేంద్రంలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)గా, రాష్ట్రాల్లో వెనుకబడిన
తరగతులు (బీసీ)గా సంబోధిస్తారు.
# వెనుకబడిన తరగతులు అనే పదం తొలిసారి 1921లో మైసూర్ సంస్థానంలో ఉపయోగించారు.
# దేశంలో తొలిసారి స్వాతంత్య్రానికి పూర్వం 1931 జనాభా లెక్కల్లో బీసీలను కులాల వారీగా లెక్కించారు. అప్పుడు వీరి జనాభా 51.68 శాతం.
నోట్:
వెనుకబడిన తరగతుల వారికి విద్య, ఉద్యోగాల్లో తొలిసారి రిజర్వేషన్లు (50 శాతం) అమలు చేసిన వ్యక్తి- సా మహరాజ్ (1902, జూలై- కొల్హాపూర్ సంస్థానం)
వెనుకబడిన తరగతులు-వారి రాజ్యాంగ పరిరక్షణలు
# అధికరణ 15- రాజ్యం పౌరుల పట్ల కులం, మతం, జాతి, లింగ, పుట్టుక అనే 5 వివక్షతలను చూపరాదు.
# అధికరణ 15(4)- ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.
# అధికరణ 15(5)- ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యావకాశాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. ఈ అధికరణ ప్రకారమే ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎంలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.
# అధికరణ 16- ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ప్రభుత్వం కులం, మతం, జాతి, లింగ, పుట్టుక, వారసత్వం, స్థిరనివాసం అనే 7 రకాల వివక్షతలు చూపరాదు.
# అధికరణ 16(4)- ప్రభుత్వ ఉద్యోగాల్లో బలహీన వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. ఈ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
# అధికరణ 16(4)బీ ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల వారికి కేటాయించిన ఉద్యోగాలను వారితోనే భర్తీ చేయాలి. వీరికి ‘క్యారీ ఫార్వర్డ్ రూల్’ను అమలు చేయాలి.
# అధికరణ 340- సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి అధ్యయనం కోసం రాష్ట్రపతి ఒక కమిషన్‌ను నియమించాలి.
# అధికరణ 338బీ- జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు, నిర్మాణం, విధులు
# అధికరణ 342ఏ- ఒక్క కులాన్నయినా ఎస్ఈబీసీగా నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది.
# అధికరణ 342ఏ (3)- ఎస్ఈబీసీలను గుర్తించే అధికారాన్ని కేంద్రం నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బదిలీ చేశారు.
నోట్:
ప్రస్తుతం దేశంలో వెనుకబడిన తరగతుల వారిని సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకుబాటుతనం ఆధారంగా గుర్తిస్తున్నారు. వీరిని సామాజిక, విద్యాపరమైన వెనుకబడిన తరగతులు (సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్) అని పిలవాలి.
# బీసీల స్థితిగతుల అధ్యయనం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీలు
1) కాకా సాహెబ్ కాలేల్కర్ కమిషన్
ఏర్పాటు- 1953, జనవరి 29
నివేదిక- 1955, మార్చి 30
సిఫారసులు
# దేశం మొత్తంమీద 2399 బీసీ కులాలు ఉన్నట్లుగా గుర్తింపు. అందులో 837 ఉప కులాలు అత్యంత వెనుకబడిన కులాలు.
# వృత్తిపరమైన, సాంకేతిక విద్యాసంస్థల్లో బీసీలకు 70 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.
# 1961 జనాభా లెక్కల్లో కులాలవారీగా వివరాల సేకరణ జరపాలి.
-మహిళలను ప్రత్యేక వెనుకబడిన తరగతిగా గుర్తించాలి.
# కింద పేర్కొన్న విధంగా బీసీలకు ప్రభుత్వ సేవలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి.
# క్లాజ్ 1- 25 శాతం క్లాజ్ 2- 33 1/2 శాతం క్లాజ్ 3, 4- 40 శాతం
నోట్: ఈ సిఫారసులు అమలు కాలేదు.
బీపీ మండల్ కమిషన్
# ఏర్పాటు- 1979, జనవరి 1 (జనతా ప్రభుత్వం హయాంలో)
# చైర్మన్- బిందేశ్వరి ప్రసాద్ మండల్
# నివేదిక- 1980, డిసెంబర్ 31
ముఖ్యమైన సిఫారసులు
# సామాజిక (4 అంశాలు), ఆర్థిక (4 అంశాలు), విద్య (3 అంశాలు) ప్రాతిపదికగా మొత్తం 11 అంశాలతో నివేదిక తయారీ.
# దేశంలో మొత్తం 3743 బీసీ కులాలు ఉన్నట్లు గుర్తింపు. వీరు దేశ జనాభాలో 52 శాతం
# బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం
# ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న విధంగానే వయోపరిమితి సడలింపు, రోస్టర్ విధానం, క్యారీ ఫార్వర్డ్ రూల్ అమలు చేయాలి.
# ఓబీసీలకు అన్ని స్థాయిల్లో ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి.
నోట్:
1979లో జనతా ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఈ సిఫారసులు అమలు కాలేదు. 1990-91 మధ్య వీపీ సింగ్ ప్రభుత్వం, చంద్రశేఖర్ ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. చివరకు 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం వీటిని అమలు చేసింది. అదేవిధంగా 1993లో పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ చట్టబద్ధమైన బీసీ కమిషన్‌ను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నేపథ్యం
# దేశంలో వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి తొలిసారి 1953లో కాకా సాహెబ్ కాలేల్కర్ కమిటీని నియమించారు. ఈ కమిటీ 1955లో నివేదిక సమర్పించగా అందులో 2399 కులాలను బీసీలుగా చెప్పింది.
# మరొకసారి 1978లో బీపీ మండల్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ 1980లో నివేదిక సమర్పించగా అందులో 3743 కులాలను బీసీలుగా పేర్కొని, వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.
# 1990లో అప్పటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యింది.
# తరువాత వచ్చిన చంద్రశేఖర్ ప్రభుత్వం కూడా మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయలేదు.
# కానీ 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విద్య-ఉద్యోగ అవకాశాల్లో ఓబీసీ కులాల వారికి 27 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేసింది. ఈ విషయాన్ని ఇందిరా సహాని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
బెంచ్ సభ్యులు
జస్టిస్ ఎం వెంకటాచలయ్య (సీజేఐ)
జస్టిస్ ఎం కానియా
జస్టిస్ ఎస్ఆర్ పాండియన్
జస్టిస్ టీ అహ్మది
జస్టిస్ కే సింగ్
జస్టిస్ పీ సావంత్
జస్టిస్ ఆర్ సహాయి
జస్టిస్ బీజే రెడ్డి
తీర్పులోని ముఖ్యాంశాలు
# ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాల్లో కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధమే.
# రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితిల్లోనూ 50 శాతం మించరాదు.
# ఓబీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి)ని మినహాయించాలి.
# ఓబీసీల కోసం ఒక శాశ్వత చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలి (కేంద్ర, రాష్ట్ర స్థాయిలో).
# ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించరాదు
# ‘రూల్ ఆఫ్ క్యారీఫార్వర్డ్’ అమలు పరిచే విషయంలో రిజర్వేషన్లు 50 శాతం మించడం సబబే.
# ఈ కేసులో రాజ్యాంగంలోని అధికరణ 16(4), దాని విస్తరణను సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
# ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగా కేటాయించాలి.
# ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992 (మండల్ కేసు) తీర్పు వచ్చిన రోజు- 1992, నవంబర్ 15
ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లు
# ఓబీసీ- 27 శాతం
# ఎస్సీ- 15 శాతం
# ఈడబ్ల్యూఎస్- 10 శాతం
# ఎస్టీ- 7.5 శాతం
# మొత్తం- 59.50 శాతం
నోట్:
2019లో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
102వ రాజ్యాంగ సవరణ చట్టం
# రూపకల్పన- భారత పార్లమెంట్
# అమలు- 2018, ఆగస్ట్
# ఉద్దేశం- జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడం. కొత్తగా చేర్చిన అధికరణలు- 338బీ, 342ఏ
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
(నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్)
# ఏర్పాటు- 1993, ఆగస్ట్ 14 (పార్లమెంట్ చట్టం ద్వారా)
# రాజ్యాంగబద్ధత కల్పించిన సంవత్సరం- 2018
# రాజ్యాంగబద్ధత కల్పించిన చట్టం- 102వ రాజ్యాంగ సవరణ చట్టం
# సంబంధిత శాఖ- కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ
# ప్రధాన కార్యాలయం- ఢిల్లీ
# తొలి చైర్మన్- ఆర్ఎన్ ప్రసాద్
# ప్రస్తుత చైర్మన్- భగవాన్లాల్ సాహ్నీ
# నిర్మాణం (అధికరణ 33బీ)
# చైర్మన్+వైస్ చైర్మన్+ముగ్గురు సభ్యులు
# పదవీకాలం- 3 సంవత్సరాలు
# నియామకం, తొలగింపు- రాష్ట్రపతి
# నివేదిక- రాష్ట్రపతికి సమర్పించాలి
# అధికారాలు- సివిల్ కోర్టు అధికారాలు
అధికారాలు-విధులు
# బీసీల సంక్షేమం కోసం రాజ్యాంగంలో కల్పించిన నిబంధనలు, ప్రభుత్వ చట్టాలుగా సరిగా అమలయ్యేలా చూడటం
# బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు చేయడం, నివేదికను రాష్ట్రపతికి ఇవ్వడం
# బీసీ కులాల కేంద్ర జాబితాలో మార్పులు, చేర్పుల గురించి సిఫారసులు చేయడం
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు
# తీర్పు- 2021, మే 5
తీర్పులోని ముఖ్యాంశాలు
# మహారాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణాలుగా ఉన్న మరాఠా సామాజిక వర్గానికి విద్యలో 12 శాతం, ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం 50 శాతం కోటాకు విరుద్ధం.
# ఒక కులాన్ని సామాజిక, విద్యాపరమైన వెనుకబడిన తరగతిగా నిర్ణయించే అధికారం 102వ రాజ్యాంగ సవరణ చట్టం (అధికరణ 342ఏ) ప్రకారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రాలకు అధికారం లేదు.
తదనంతర ఫలితాలు
# ఈ తీర్పు పట్ల అనేక రాష్ట్రాల నుంచి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం కావడంతో కేంద్రం తన తీర్పును పునఃసమీక్ష చేయమని సుప్రీంకోర్టును అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో 2021లో 105వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. మరోవైపు దేశవ్యాప్తంగా బీసీల కులగణన నిర్వహించాలని, దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థను పునఃసమీక్షించాలనే డిమాండ్ వచ్చింది.
పీ శ్రీరామ్‌చంద్ర
గ్రూప్స్ మెంటార్
హైదరాబాద్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు