సరైన ప్రణాళికతో సత్తా చాటుదాం ( గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్)
రెండంచెల విధానంలో నిర్వహించే గ్రూప్-1లో మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో 503 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అందువల్ల ప్రిలిమ్స్ కటాఫ్ పెరిగే అవకాశం ఉంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుంది. అంటే కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే ఈ రెండు నెలల్లో ఎలా చదవాలో తెలుసుకుందాం.
ప్రిలిమ్స్‌లో 13 అంశాలు
# గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్‌లో 13 అంశాలను పేర్కొన్నారు. వీటిలో నుంచి అబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల్లో రెండున్నర గంటల్లో సమాధానాలు గుర్తించాలి. అంటే ఒక ప్రశ్నకు ఒక నిమిషం సమయాన్ని కేటాయించారు.
# ఆబ్జెక్టివ్ ప్రశ్నల స్వరూపం సివిల్ సర్వీసెస్ విధానంలో ఉండే అవకాశం ఉంది. కేవలం ఒక లైన్లో అడిగే ప్రశ్నల సంఖ్య తగ్గి స్టేట్మెంట్స్ రూపంలో మ్యాచ్ ది ఫాలోయింగ్, అసెర్షన్ అండ్ రీజనింగ్, భిన్నమైన వాటిని గుర్తించే విధానానికి సంబంధించిన ప్రశ్నల సంఖ్య పెరగవచ్చు. సమయపాలన, ప్రశ్నల స్థాయి స్వరూపం మారడం, ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేరైతే ప్రిలిమ్స్‌లో విజేతలవుతారు.
కరెంట్ అఫైర్స్
# ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి సంవత్సర కాలంగా జరిగిన పరిణామాలను నిశితంగా అధ్యయనం చేయాలి. సమాచారం పరంగా పరీక్ష కోణాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అధిక వర్తమాన అంశాలను మీడియా ప్రచారం చేస్తూనే ఉంటుంది. వీటిలో పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న విషయాలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారించాలి. ఈ విభాగం నుంచి కనీసం 10 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఉన్న వ్యక్తులు, సంస్థలు, ప్రదేశాలు, నియామకాలు, దినోత్సవాలు, అవార్డులు, సదస్సులు వాటి విధానాలు, వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు వంటి అంశాలు వస్తాయి.
అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
# కరెంట్ అఫైర్స్‌లో అంతర్జాతీయంగా ఉన్న ఈ అంశం నుంచి పరీక్షలో కనీసం ఐదు నుంచి ఎనిమిది ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం ఇతర దేశాలతో నెలకొల్పుకుంటున్న అంతర్జాతీయ సంబంధాల గురించి తెలుసుకోవాలి. ఉడా: భారత్-బ్రిటన్, భారత్-అమెరికా, భారత్-రష్యా, భారత్-యూరోపియన్ యూనియన్, భారత్-ఆసియాన్, భారత్-ఆఫ్రికన్ యూనియన్. వివిధ అంతర్జాతీయ కూటముల్లో (బ్రిక్స్, బిమ్స్టెక్) భారతదేశం పాత్ర గురించి, ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సైనిక, శాస్త్ర సాంకేతిక కూటముల్లో భారతదేశం సభ్యత్వం ఫలితంగా కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి.
# అంతర్జాతీయ సంఘటనలకు సంబంధించి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పర్యావరణ సదస్సులు, ఇతర అంతర్జాతీయ సదస్సుల్లో ప్రకటించిన తీర్మానాలు, కొవిడ్ సహా అనేక విపత్తులు, వాటి నివారణకు ప్రభుత్వ యంత్రాంగాలు తీసుకున్న, తీసుకుంటున్న చర్యలపై దృష్టిసారించాలి.
# కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలను రెండింటిని విడివిడిగా కాకుండా కలిపి చదవాలి. ముఖ్యమైన సంఘటనలు, వాటి నేపథ్యం, ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేస్తేనే ఈ రెండు విభాగాల నుంచి సగటున వచ్చే 15 ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు. వీటి కోసం ప్రామాణికమైన ఒకటి లేదా రెండు మాసపత్రికలు, రోజూ ఒక దిన పత్రికను తప్పక చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్స్‌లో రాసుకోవాలి.
జనరల్ సైన్స్: శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశ పురోగతి
# జనరల్ సైన్స్‌లో ఫిజికల్సైన్స్, బయాలజికల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలుంటాయి. ఈ విభాగం నుంచి కనీసం 20 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. జనరల్ సైన్స్‌ను జనరల్‌గా చదవాలి. ముఖ్యంగా నిత్యజీవితంలో సైన్స్ అనువర్తనాలను ప్రశ్నల రూపంలో అడుగుతారు. ఎందుకంటే అభ్యర్థుల అకడమిక్ బ్యాగ్రౌండ్ వేర్వేరుగా ఉంటుంది. ఒరిజినల్ సైన్స్‌ను ప్రశ్నలుగా అడిగితే కేవలం సైన్స్ బ్యాగ్రౌండ్ అభ్యర్థులు మాత్రమే సమాధానాలు గుర్తిస్తారు. మిగతా వాళ్లు గుర్తించలేరు. కాబట్టి అందరి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమాన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రశ్నలను రూపొందిస్తారు.
పర్యావరణ సమస్యలు విపత్తు నిర్వహణ
# పర్యావరణ కాలుష్యం, పర్యావరణ సంక్షోభం, గ్లోబల్ వార్మింగ్, విపత్తులకు కారణాలు, ప్రభావాలను వాటి పరిష్కార మార్గాలను చదవాలి. ముఖ్యంగా కాలుష్య నివారణ చట్టాలు, పర్యావరణ పరిరక్షణ యంత్రాంగాలు. విపత్తు నిర్వహణ చట్టంలోని అంశాలను సగటున పది ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. వీటిలో వర్తమాన అంశాలను నిశితంగా పరిశీలించాలి.
భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
# భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మౌలిక రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దేశ ఆర్థికాభివృద్ధిలో ఈ రంగాల వాటా, పాత్ర, ఈ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి ప్రభుత్వపరంగా పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇందులో సామాజిక అభివృద్ధి ప్రత్యక్షంగా పేర్కొన్నారు. కాబట్టి సామాజిక, ఆర్థిక పరమైన మార్పులను గమనించాలి. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య ప్రమాణాల గురించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలు, పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్ ఏర్పాటుతో పాటు గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగం నుంచి సగటున 10 నుంచి 15 ప్రశ్నలు వస్తాయి.
జాగ్రఫీ
# ప్రపంచ భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణస్థితి, భౌగోళిక విభాగాలు, భారతదేశం, తెలంగాణలో భౌగోళిక పరిస్థితులు, నదులు, నేలలు, వ్యవసాయం, ఖనిజ సంపద పరిశ్రమలు, శక్తి వనరులు, జనాభా సంబంధిత విషయాలను అధ్యయనం చేయాలి. ఈ విభాగం నుంచి సగటున 10 నుంచి 15 ప్రశ్నలు రావచ్చు.
భారతదేశ చరిత్ర-తెలంగాణ చరిత్ర
# భారతదేశ చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజ వంశాల పరిణామక్రమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన అంశాలకు పరీక్షలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక భారత దేశ చరిత్ర పరీక్ష కోణంలో అతిముఖ్యమైనది.
# ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన సంఘటనల గురించి పరీక్షలో అనేకసార్లు ప్రశ్నలు అడిగారు. భారతదేశ చరిత్రకు సంబంధించి సగటున 15 నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.
# తెలంగాణ చరిత్ర, సమాజం, సంస్కృతి, సాహిత్యం, కళలు, వారసత్వ సంపద గురించి సిలబస్‌లో పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రాచీనకాలం నుంచి ఆధునికకాలం వరకు వివిధ రాజవంశాల కాలంలో వారసత్వ సంపద వికాసం జరిగిన తీరును అధ్యయనం చేయాలి. తెలంగాణ చరిత్రకు సంబంధించి సగటున 10 నుంచి 15 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది.
భారత రాజ్యాంగం – రాజకీయ వ్యవస్థ
# భారత రాజ్యాంగం మౌలిక నిర్మాణం, రాజ్యాంగ పరిణామక్రమం మొదలు నేటి వరకు జరిగిన రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాల గురించి అవగాహన కలిగి ఉండాలి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు, వాటికి సంబంధించిన కోర్టు తీర్పులు. ప్రభుత్వ చట్టాలు పరీక్ష కోణంలో రాజ్యాంగంలోని ముఖ్యమైన నిబంధనలు, షెడ్యూల్స్ గురించి తెలుసుకోవాలి. ఈ విభాగం నుంచి సగటున 10 నుంచి 15 ప్రశ్నలు రావచ్చు.
సామాజిక వెలి
# ఈ అంశాలను పోటీపరీక్షల్లో మొదటిసారిగా చేర్చారు. ఇది ఒక అంతర్జాతీయ అంశం. సమాజంలోని బలహీన వర్గాలు అణగారిన వర్గాలు సామాజిక దోపిడీకి, వివక్షలకు కారణమైన తీరు, తత్ఫలితంగా సంభవించిన పరిణామాలు, వాటికి ప్రభుత్వపరంగా చేపడుతున్న పరిష్కార మార్గాలను ముఖ్యంగా సమ్మిళిత విధానాల గురించి 10 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది.
లాజికల్ రీజనింగ్
# లాజికల్ రీజనింగ్‌లో భాగంగా అనలిటికల్ ఎబిలిటీ, దత్తాంశ విశ్లేషణకు సంబంధించిన ప్రాథమిక అంశాలను అడుగుతారు. పదో తరగతి స్థాయిలో గణితానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలి.
# కాలం-పని, వేగం-సమయం-దూరం, సాధారణ వడ్డీ, నంబర్ సిరీస్, సంఖ్యా వ్యవస్థలు నిష్పత్తి, వాటాలు, లాభ-నష్టాలు, స్టాటిస్టికల్డేటాపై అనలిటికల్ ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి 10 నుంచి 15 ప్రశ్నలు వస్తాయి.
ప్రభుత్వ విధానాలు
# కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం కాలానుగుణంగా రూపొందించి అమలుచేస్తున్న సామాజిక, ఆర్థిక విధానాల గురించి చదవాలి. 1952లో ప్రారంభమైన సాముదాయక అభివృద్ధి కార్యక్రమం మొదలు నేటి వరకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి సగటున 10 ప్రశ్నలు వస్తాయి.
# తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు పరీక్షల్లో అధిక ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. తెలంగాణ వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక, విధానాలు, ముఖ్యమైన పథకాలు, వాటి ప్రభావం గురించి పరీక్షలో సగటున 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
కటాఫ్ ఎంత ఉండవచ్చు?
# ప్రశ్నల స్థాయి ఆధారంగా సగటున 95 నుంచి 110 మధ్యలో కటాఫ్ ఉంంటుంది. సివిల్స్ ఓరియంటేషన్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఉండవచ్చు. గ్రూప్-2లో పేపర్-1 జనరల్ స్టడీస్, గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్ దాదాపు ఒకే విధంగా ఉండటం వల్ల గ్రూప్-2 అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. సరైన ప్రణాళికతో శాస్త్రీయ పద్ధతిలో ప్రిపేరయితే గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో విజయం సాధించవచ్చు.
సిలబస్
1. కరెంట్ అఫైర్స్- ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్: శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశ పురోగతి
4. పర్యావరణ సమస్యలు: విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమన వ్యూహాలు
5. భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ,
తెలంగాణ రాష్ట్ర జాగ్రఫీ
7. భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
8. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ
9. భారతదేశంలో పాలన, ప్రభుత్వ విధానాలు
10. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు
11. తెలంగాణ సమాజం, సంస్కృతి,
వారసత్వ సంపద, కళలు, సాహిత్యం
12. సామాజిక వర్ణన (సోషల్ ఎక్స్‌క్లూజన్): లింగ, కుల, తెగ, దివ్యాంగుల హక్కులు వంటి అంశాలు, సమ్మిళిత విధానాలు
13. లాజికల్ రీజనింగ్: విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ విశ్లేషణ
నూతనకంటి వెంకట్
పోటీపరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం