Whose autobiography is ‘My Prison Memories, Experiences’ | ‘నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు’ ఎవరి ఆత్మకథ? ( తెలంగాణ హిస్టరీ )
గ్రూప్స్ ప్రత్యేకం
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయాలు
– 1956, నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, వేతనాలను సవరించడం, బదిలీ, విధుల నిర్వహణ అంశాల్లో ఆంధ్ర ఉన్నతోద్యోగులు, ఆంధ్ర పాలకులు చాలా అన్యాయం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగ నిబంధనలను, సుప్రీంకోర్టు ఆదేశాలను వేటినీ ఆంధ్ర ఆధిపత్యవాదులు ఖాతరు చేయలేదు.
– మరొకవైపు ప్రభుత్వం, రెవెన్యూ శాఖలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు, అవినీతిపరులైన అధికారులు విచ్చలవిడిగా బోగస్ ముల్కీ సర్టిఫికెట్లను జారీ చేశారు. అవసరం లేని, తెలంగాణ విద్యావంతులకు ఈ ప్రాంతంలో అందుబాటులో లేని విద్యార్హతలను ఉద్యోగ నియామకాలకు అర్హతలుగా పెట్టి అర్హులైన వారు లభించలేదనే సాకుతో నాన్-ముల్కీలను చట్టబద్ధంగానే తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్లో నియమించారు. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. భవిష్యత్తులో తమకు ఇక ఉద్యోగాలు లభించవేమోననే భయం, ఆందోళన తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువయ్యింది.
– ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 12 ఏండ్లలో తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని యథేచ్ఛగా ఆంధ్రకు తరలించి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. చట్టబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రీజినల్ కమిటీని నామమాత్రపు సలహా సంఘంగా మార్చారు ఆంధ్ర పాలకులు. ఒప్పందంలో అంగీకరించినట్లు 20 మంది సభ్యులను కాకుండా తెలంగాణ ప్రాంతంలోని మొత్తం శాసన సభ్యులను రీజినల్ కమిటీలో సభ్యులుగా చేసి వారి మధ్య గ్రూపులు, ముఠాల సంస్కృతికి తెరతీశారు.
– తెలంగాణ ప్రాంతానికి పరిమితమైన ‘హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (హెచ్పీసీసీ)’ని ఐదేండ్లపాటు కొనసాగించాలని పెద్ద మనుషుల ఒప్పందంలో ఒప్పుకొని 13 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో విలీనం చేశారు. తెలంగాణ రాజకీయ నాయకులను తమ బానిసలుగా మార్చుకోవాలనే ఆంధ్ర పాలకుల కుట్రలో భాగమే ఈ హెచ్పీసీసీని ఏపీసీసీలో విలీనం చేయడం.
వ్యవసాయ రంగంలో ఉల్లంఘనలు
– హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం-1950 ప్రకారం స్థానికేతరులు తెలంగాణ వ్యవసాయ భూములను కొనడం చట్టవిరుద్ధం. కానీ 1968వ సంవత్సరంలో ‘హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం’ను సవరించి దీంతో గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పెద్ద మొత్తంలో మాగాణి భూమిని తక్కువ ధరకే ఆంధ్రులు కొనుగోలు చేశారు.
ఉద్యోగ రంగంలో ఉల్లంఘనలు
– పార్లమెంట్ 1957లో ప్రభుత్వ ఉద్యోగాల (నివాస అర్హత చట్టం సెక్షన్-3) చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల (నివాస అర్హత) నిబంధనలను 1959లో జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి, తెలంగాణ ప్రాంతంలోని స్థానిక సంస్థల్లో ఉద్యోగాల కోసం 12 సంవత్సరాల స్థిర నివాసాన్ని ఒక అర్హతగా గుర్తించాయి. అదేవిధంగా సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోనూ ప్రతి మూడు ఉద్యోగాల్లో రెండో ఉద్యోగానికి విధిగా నివాస అర్హతను పాటించాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నివాస అర్హతకు మినహాయింపు ఇన్వొచ్చు.
మినహాయింపు పేరుతో ఉల్లంఘనలు
– 1968, మే నాటికి 1730 సందర్భాల్లో మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. స్థానికంగా అర్హులైన అభ్యర్థులు లేరన్న నెపంతో చాలామందిని స్థానికేతరులను నియమించారు. భార్యాభర్తలను ఇద్దరిని ఒకే దగ్గర పోస్టింగ్ చేయాలనే కారణంతో అనేకమంది స్థానికేతరులను నియమించారు. ఆంధ్రలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని ముల్కీ నియమానికి విరుద్ధంగా వారిని తెలంగాణకు కేటాయించారు.
కొత్తగూడెం ధర్మల్ స్టేషన్లో అన్యాయాలు
– 1961లో పాల్వంచలో ధర్మల్ పవర్ స్టేషన్ను స్థాపించారు. పాల్వంచలోని పవర్ స్టేషన్ను తెలంగాణ మిగులు నిధులతో నిర్మించారు. కాబట్టి దీనిలోని ఉద్యోగాల్లో మిగతా ప్రాంతాల వారికి అవకాశం లేదు. కానీ పెద్ద సంఖ్యలో స్థానికేతరులను నియమించారు.
అసెంబ్లీలో అన్యాయాల ప్రస్తావన
– ఆర్థికపరమైన అంశాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై అసెంబ్లీలో మరి చెన్నారెడ్డి మాట్లాడారు. 1958, మార్చి 1న అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొంటూ.. ‘బడ్జెట్లోని అంకెలను బట్టి చూస్తే తెలంగాణలో రెండున్నర కోట్ల రూపాయల మిగులు ఉన్నట్లు, ఆంధ్రలో కోటి రూపాయల లోటు ఉన్నట్లు స్పష్టం కాగలదు. తెలంగాణ పట్ల ప్రభుత్వం శ్రద్ధగా వ్యవహరించడం లేదనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణలో వివిధ పద్దుల కింద కేటాయించిన మొత్తాలను వినియోగించడం లేదనడానికి కూడా ఇదే తార్కాణం. ఉదాహరణకు విద్యాశాఖ కింద కేటాయింపు కంటే అమలు జరిగిన ఖర్చు రూ.63 లక్షలు తక్కువగా ఉన్నదన్నారు. ‘తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు కలిసి ఆంధ్రలోని ఒక్క గుంటూరు జిల్లాతో విద్యా విషయంలో తులతూగ జాలవు’ అన్నారు. తెలంగాణలో విద్యపై ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరమై ఉండగా, మంజూరయిన డబ్బునే పూర్తిగా ఖర్చు చేయలేకపోవడాన్ని చెన్నారెడ్డి తప్పుబట్టారు.
– ‘తెలంగాణ ప్రాంతీయ సంఘం కార్యవిధానానికి సంబంధించిన నియమావళిని తయారు చేయడానికి ప్రభుత్వానికి 14 నెలలు పట్టింది. తెలంగాణ రీజినల్ కమిటీని నియమిస్తూ ప్రెసిడెంట్ ప్రకటన జారీ చేసి నెలరోజులు దాటినప్పటికీ ఆ కమిటీని సమావేశపర్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని చెన్నారెడ్డి విమర్శించారు.
మాదిరి ప్రశ్నలు
1. హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల చట్టం-1950ను ఏ సంవత్సరంలో
సవరించారు?
1) 1968 2) 1969
3) 1956 4) 1958
2. విద్యారంగంలో జరిగిన అభివృద్ధిని గమనిస్తే తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు కలిసి ఆంధ్రలోని ఒక్క గుంటూరు జిల్లాతో తులతూగజాలవు అని శాసనసభలో పేర్కొన్నది?
1) కేవీ రంగారెడ్డి 2) మరి చెన్నారెడ్డి
3) అచ్యుత రెడ్డి 4) హయగ్రీవాచారి
3. ‘పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనండి’ అనే శీర్షికతో 1959, డిసెంబర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపన పత్రం ఇచ్చింది?
1) హరిశ్చంద్ర హేడా
2) గులాం పంజాతన్
3) బూర్గుల రామకృష్ణారావు
4) పై అందరూ
4. ‘తెలంగాణ రక్షణల దినం’గా ఏ రోజును పాటించారు?
1) 1956, జూలై 10
2) 1969, జూలై 10
3) 1968, జూలై 10
4) 1968, జూన్ 10
5. కింది వాటిలో సరైనవి?
1) 1961లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు హరిశ్చంద్ర హేడా లోక్సభలో మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద మనుషుల ఒప్పందంలోని మౌలిక విషయాలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు
2) రాజ్యసభ సమావేశాల్లో వీకే ధగే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టకపోతే తెలంగాణలో మహోపద్రవాన్ని ఎదుర్కోవలసి వస్తుందని
పేర్కొన్నారు
3) 1 మాత్రమే సరైనది 4) 1, 2 సరైనవి
6. ‘ఆంధ్రాలోని తెలుగు వారితో పోల్చుకుంటే తెలంగాణలోని తెలుగు వారు 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు’ అని పేర్కొన్నది?
1) మందుముల నరసింగరావు
2) అఘోరనాథ ఛటోపాధ్యాయ
3) కాళోజీ నారాయణ రావు
4) మరి చెన్నారెడ్డి
7. ‘నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు’ ఎవరి ఆత్మకథ?
1) యశోదా దేవి
2) సంగం లక్ష్మీబాయి
3) సరోజినీ నాయుడు
4) మాడపాటి మాణిక్యాంబ
8. తెలంగాణ భాష, యాసలతో స్థానికతను ప్రతిబింబిస్తూ నిర్మించిన తొలి చిత్రం?
1) మా భూమి 2) జై బోలో తెలంగాణ
3) చిల్లర దేవుళ్లు 4) కుమ్రం భీం
9. ‘తెలంగాణ తోవలు’ గ్రంథ రచయిత?
1) కాసుల ప్రతాపరెడ్డి
2) అంబటి సురేందర్ రెడ్డి
3) సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
4) అల్లం నారాయణ
10. ‘చందా రైల్వే పథకం-1863’ గురించి ప్రచురించిన ఆంగ్ల పత్రికలు?
1) టైమ్స్ ఆఫ్ ఇండియా
2) బెంగాల్ గెజిట్
3) 1 4) 1, 2
11. కింది వాటిలో సరైనవి?
1) హైదరాబాద్లో మొట్టమొదటి స్త్రీ సంఘం ‘భారత మహిళా సమాజం’ను 1907లో ఈశ్వరీబాయి స్థాపించారు
2) దీనిని రావి చెట్టు లక్ష్మీనరసమ్మ ఇంట్లో స్థాపించారు
3) 1 4) 1, 2
12. ‘ఆంధ్ర సోదరీ సమాజం’ను స్థాపించింది?
1) పందిటి వీర రాఘవమ్మ
2) నడింపల్లి సుందరమ్మ
3) సంగం లక్ష్మీబాయి 4) 1, 2
13. ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలని తీర్మానించారు?
1) సిరిసిల్ల-1935
2) దేవరకొండ-1931
3) చిలుకూరు-1941
4) నిజామాబాద్-1937
14. 1908లో మూసీనదికి వరదలు వచ్చినప్పుడు 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ ప్రజల ఇక్కట్లను చూసి పడిన బాధను ‘టియర్స్ ఆఫ్ అసఫ్’ అనే కవితలో వర్ణించింది?
1) స్వామి రామానంద తీర్థ
2) సరోజినీ నాయుడు
3) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
4) ఎవరూ కాదు
15. ‘నిజాం రాష్ట్రాంధ్ర జన కేంద్ర సంఘం’ ప్రచురించిన లఘు పుస్తకాలు?
1) నిజాం రాష్ట్ర ఆంధ్రులు
2) నిజామాంధ్ర రాష్ట్ర ప్రశంస
3) నిజాం రాష్ట్ర అభివృద్ధి మార్గాలు
4) పైవన్నీ
16. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో (1942) హైదరాబాద్ రెసిడెన్సీ ప్రాంతంపై జాతీయ జెండా ఎగురవేసింది?
1) పద్మజానాయుడు
2) జ్ఞాన్కుమారి హిడా
3) టీ రామస్వామి 4) పై అందరూ
17. నిజాం సర్కారు ‘ప్రజా కవిరాజు’ బిరుదును ఎవరికి ఇచ్చింది?
1) గంగుల శాయిరెడ్డి
2) సర్వదేశభట్ల నరసింహమూర్తి
3) కాళోజీ నారాయణ రావు
4) దాశరథి
18. కింది వాటిని జతపర్చండి?
1. తెలంగాణ ఆంధ్రోద్యమం
ఎ. మాడపాటి హనుమంతరావు
2. సలాం హైదరాబాద్
బి. పరవస్తు లోకేశ్వర్
3. తెలంగాణలో ఏం జరుగుతుంది
సి. కొత్తపల్లి జయశంకర్
4. ఒడువని ముచ్చట
4) కొంపల్లి వెంకట్గౌడ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
19. ‘దౌర్జన్యాన్ని ఎదురించడం అంటే దేవుడిని పూజించినట్లు, లెండి ఎదురించండి’ అని నినాదం ఇచ్చింది?
1) మాడపాటి హనుమంతరావు
2) దాశరథి రంగాచార్యులు
3) స్వామి రామానంద తీర్థ
4) మల్లు స్వరాజ్యం
సమాధానాలు
1-1, 2-2, 3-2, 4-3, 5-4,
6-1, 7-2, 8-3, 9-1, 10-4,
11-4, 12-4, 13-1, 14-2, 15-4,
16-4, 17-2, 18-1, 19-3.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు