CA course | సీఏ కోర్సు ఎవరు చదవవచ్చు ?
-ఎవరు చదవవచ్చు: సీఏ చదవాలంటే ఒకప్పుడు డిగ్రీ తర్వాత గానీ సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ తర్వాతనే సీఏ కోర్సు చదవడం ప్రారంభించవచ్చు.
-ఇంటర్ ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఇలా ఏ గ్రూప్ వారైనా సీఏ కోర్సు చదవచ్చు. అయితే సీఏ చేయాలనుకునే చాలామంది విద్యార్థులు ఇంటర్లో ఎంఈసీ గ్రూపుతోపాటే సీఏ కూడా ఏకకాలంలో చదవడానికే సుముఖత చూపిస్తున్నారు.
సీఏలోని దశలు
మొదటి దశ- సీఏ ఫౌండేషన్
-ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్ష రాసినవారు ఎవరైనా సీఏ ఫౌండేషన్ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న నాలుగు నెలలకు సీఏ ఫౌండేషన్ పరీక్ష రాయవచ్చు.
-సహజంగా ప్రతి ప్రవేశ పరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలరూపంలో ఉంటుంది. గతంలో ఇప్పటి సీఏ ఫౌండేషన్ స్థానంలో నిర్వహించిన సీపీటీ పరీక్ష కూడా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలరూపంలోనే నిర్వహించేవారు. కానీ సీఏ ఫౌండేషన్ పరీక్షలో 50 శాతం మార్కులు డిస్క్రిప్టివ్ పరీక్ష, మరో 50 శాతం మార్కులు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుగా పరీక్ష నిర్వహిస్తారు.
-సీఏ ఫౌండేషన్‌లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉండటంవల్ల విద్యార్థులకు విశ్లేషణాత్మకత పెరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉండటంవల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంది.
-నేటి కాలమాన పరిస్థితులకనుగుణంగా, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా సీఏ విద్యార్థికి అన్ని రకాల నైపుణ్యాలుండాలన్న ఉద్దేశంతో సిలబస్‌ను ఇలా రూపొందించారు.
-సీఏ ఫౌండేషన్ పరీక్ష నాలుగు పేపర్లుగా, ఒక్కో పేపర్ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు ఉంటుంది. రోజుకో పేపర్ చొప్పున నాలుగు రోజులు పరీక్ష నిర్వహిస్తారు.
-పేపర్-1, పేపర్-2 పరీక్షలు డిస్క్రిప్టివ్ పద్ధతిలో, పేపర్-3, పేపర్-4 పరీక్షలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతాయి. సీఏ ఫౌండేషన్ పరీక్షలు ప్రతి ఏడాది మే, నవంబర్‌లో నిర్వహిస్తారు.
-సీఏ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత కావాలంటే విద్యార్థి ప్రతి పేపర్లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అలాగే నాలుగు పేపర్లు కలిపి 400 మార్కులకుగాను 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు సాధించాలి.
రెండో దశ- సీఏ ఇంటర్మీడియట్
-సీఏ ఇంటర్మీడియట్ కోర్సుని గతంలో సీఏ-ఐపీసీసీ అని పిలిచేవారు.
-సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు సీఏ ఇంటర్మీడియట్ చదవడానికి అర్హులు.
-సీఏ ఇంటర్మీడియట్ గ్రూప్-1లో నాలుగు పేపర్లు, గ్రూప్-2లో నాలుగు పేపర్లు మొత్తం 8 పేపర్లుగా సిలబస్‌ను రూపొందించారు.
-నూతన విధానంలో కూడా విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.
-సీఏ ఇంటర్మీడియట్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్లలో నిర్వహిస్తారు.
-ఈ పరీక్షను 8 పేపర్లు రెండు గ్రూపులుగా (గ్రూప్‌నకు 4 పేపర్లు) ఒక్కో పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు.
-ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 50 శాతం మార్కులు సాధించాలి.
-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు మూడేండ్ల ఆర్టికల్‌షిప్ చేయాలి.
ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రైనింగ్)
-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు ఒక ప్రాక్టీసింగ్ సీఏ వద్దగాని, ఆడిట్ సంస్థలోగాని మూడేండ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందాలి.
-పాత విధానంలో సీఏ-ఐపీసీసీ రెండు గ్రూపులూ పూర్తిచేసినవారు లేదా మొదటి గ్రూపు పూర్తిచేసినవారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్‌షిప్) చేయడానికి అర్హత లభించేది. కానీ నూతన విధానం ప్రకారం సీఏ ఇంటర్మీడియట్లో రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు (గ్రూప్-1గాని, గ్రూప్-2గాని) పూర్తిచేసినవారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడానికి అర్హత కల్పించారు. ఇది నిజంగా సీఏ విద్యార్థులకు కలిసొచ్చే అంశం.
-ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్న సమయంలోనే విద్యార్థికి తను ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రాంతాన్నిబట్టి రూ. 2000 నుంచి రూ. 7000 వరకు స్టయిఫండ్ లభించే అవకాశం ఉంది.
-రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్ష రాయడానికి అర్హులు.
మూడో దశ- సీఏ ఫైనల్
-సీఏ ఇంటర్మీడియట్ పూర్తిచేసి రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేయించుకొని పరీక్ష రాయవచ్చు.
-సీఏ ఫైనల్ పరీక్ష 8 పేపర్లు రెండు గ్రూపులుగా (గ్రూపునకు 4 పేపర్లు) ఒక్కో పేపర్ 100 మార్కులకు నిర్వహిస్తారు.
-సీఏ ఫైనల్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్‌లో నిర్వహిస్తారు. ఇది సీఏ కోర్సు పాత విధానంలాగే మొత్తం 8 పేపర్లు, 2 గ్రూపులుగా (గ్రూపునకు 4 పేపర్ల చొప్పున) ఒక్కో పేపర్ 100 మార్కులకు మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థి వీలునుబట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాయవచ్చు.
-విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్లో 40 శాతం మార్కులు, గ్రూపు మొత్తం 50 శాతం మార్కులను సాధించాలి.
-గ్రూపు-2లో 6వ పేపర్‌ను ఎలక్టివ్ పేపర్‌గా నిర్ణయించారు. ఈ పేపర్లో భాగంగా విద్యార్థి 6 సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టుని ఎంచుకొని చదవవచ్చు.
-ఇలాంటి ఎలక్టివ్ పేపర్ విధానంవల్ల విద్యార్థి తనకిష్టమైన పేపర్‌నే ఎంచుకుని దాన్ని బాగా చదివి ఆ సబ్జెక్టులో నైపుణ్యం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.
సీఏలకు అవకాశాలు
-పన్ను గణన, అకౌంటింగ్, డాటా విశ్లేషణ విభాగాల్లో సీఏలకు లక్షకుపైగా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. జీఎస్టీ అమలువల్ల నగదు చెలామణి లాభదాయకత, పాదర్శకత మెరుగుపడి పన్ను ఎగవేతలు తగ్గిపోతాయని ఫలితంగా సంభవించే ఆర్థిక అభివృద్ధివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేస్తున్నారు.
-జీఎస్టీ తీసుకురావడంవల్ల పరిశ్రమ లావాదేవీలు పెరిగి చార్టెర్డ్ అకౌంటెంట్లకు డిమాండ్ పెరుగబోతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
-పెద్దనోట్ల రద్దుతో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపుగా 3 రెట్లు పెరిగింది. దీనివల్ల సీఏలకు వకాశాలు రెట్టింపయ్యాయి.
-దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సీఏలకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, ఫైనాన్స్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటర్స్, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు. అంతేగాకుండా ట్రస్టీగా, అడ్మినిస్ట్రేటర్‌గా, వాల్యూయర్‌గా, మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా, ట్యాక్స్ కన్సల్టెంట్లుగా ఉద్యోగాలు లభిస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు