Social movements | 19వ శతాబ్దంలో సాంఘికోద్యమాలు
మహాత్మా జ్యోతిరావు ఫూలే (1827-90)
-జ్యోతిరావు గోవిందరావు ఫూలే మహారాష్ట్రలో సతారా జిల్లాలోని మాలి అనే వ్యవసాయ కాపు కుటుంబంలో 1827, ఏప్రిల్ 11న జన్మించాడు.
-పీష్వాల కాలంలో వీరి పూర్వీకులు పూల (హిందీలో ఫూల్) వర్తకులుగా ప్రచారం పొందారు. అందువల్ల వీరి కుటుంబనామం ఫూలేగా స్థిరపడింది.
-జ్యోతిరావు ఫూలే సామాజిక విప్లవోద్యమ పిత. సమాజంలోని నిమ్నజాతులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు ఎలా దోపిడీకి గురవుతున్నారో, అణచివేయబడుతున్నారో చూసి వారిని చైతన్యపర్చి ప్రతిఘటనా మార్గం చూపాడు.
-బీఆర్ అంబేద్కర్‌పై జ్యోతిరావు సిద్ధాంతాల ప్రభావం చాలా ఉంది. అంబేద్కర్ తండ్రి రాంజీ జ్యోతిరావు శిష్యుడు.
-కిందివర్గాల వారు విద్యావంతులు కావాలి అనే జ్యోతిరావు సందేశాన్ని ఆచరణలో పెట్టినందువల్లే రాంజీ అంబేద్కర్ వంటి ప్రతిభాపాటవాలు కలిగిన మహోన్నత వ్యక్తిని దేశానికి అందించగలిగారు.
-అంబేద్కర్ తాను రచించిన who were shudras అనే గ్రంథం జ్యోతిరావుకు అంకితం చేశాడు.
-ఈయన తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి ఊరేగింపులో జరిగిన అవమానంవల్ల వర్ణవ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు.
-జ్యోతిరావు ఆలోచనారీతి కొత్తది. అట్టడుగువర్గాల ప్రజలు, దీనదశలో ఉన్న రైతులు, నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీల గురించి ఆలోచించిన మహనీయుడు జ్యోతిరావు.
-మూఢనమ్మకాలు, అజ్ఞానానికి నిలయంగా ఉన్న ఈ మూడు వర్గాలు ముందుకు వస్తేనే తప్ప సమాజం బాగుపడదని గుర్తించి, వారి పురోగతికి కంకణం కట్టుకున్నాడు.
-వారిని విద్యావంతులుగా చేయటమే జీవిత ధ్యేయంగా పెట్టుకొని దేశంలో మొదటగా నిమ్నకులాల బాలికలకు పాఠశాల తెరిచాడు. ఆ తర్వాత అగ్రవర్ణాల బాలికల కోసం పాఠశాల నడిపాడు.
-దేశంలో బాలికల విద్యపట్ల శ్రద్ధ వహించి వారికోసం పాఠశాలలు తెరిచిన మొదటి భారతీయుడు ఇతడు.
-కుల వ్యవస్థకు పునాది రాయి అయిన బ్రాహ్మణీయతను జ్యోతిరావు నిర్దాక్షిణ్యంగా ఎండగట్టాడు.
-ఈ బాలికల పాఠశాలలో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు దొరకలేదు. అప్పట్లో ఉపాధ్యాయునిలు లేరు. అందుకే కార్యదీక్ష కలిగిన జ్యోతిరావు ముందు తన భార్యకు చదువు నేర్పి ఆమెను ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దాడు.
-సత్యాగ్రహ మార్గాన్ని ఆచరణలో పెట్టిన మొదటి భారతీయుడు జ్యోతిబా. ఆయన లెటర్ ప్యాడ్ మీద సత్యమేవ జయతే అని రాసుకునేవాడు.
-స్త్రీలు, రైతులు, కార్మికులు, శూద్రులు, అతిశూద్రులు వంటి వర్గాలు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి ఆలోచించి ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టాలు చేయడానికి కారణమయ్యాడు.
-ఈవిధంగా సత్యాగ్రహ ఉద్యమం అనే ప్రతిఘటనా శక్తిని జ్యోతిబా ఏనాడో ఆచరించి చూపాడు. జ్యోతిబా ప్రసక్తి వచ్చినప్పుడు గాంధీజీ ఎంతో శ్లాఘించేవారు.
-రాళ్లు, ఎండుతుప్పలతో కప్పిన శివాజీ సమాధి స్థలాన్ని మొదట కనుగొని అందరికీ తెలియపర్చినవాడు జ్యోతిబా.
-బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ చరిత్రవల్ల ఉత్తేజితుడై 1869లో ఛత్రపతి శివాజీ రాజే భోసలే యాంచా పవాడా అనే పద్యం రాశాడు.
-హిందూ సమాజంలో పురోహితులు ప్రజలను ఎలా దోచుకుంటున్నారో, తప్పుదారిలో నడిపిస్తూ మూఢాచారాలను ఎలా ప్రోత్సహిస్తున్నారో వివరిస్తూ బ్రాహ్మణాంచే కసబ్ అనే గేయం రాశాడు.
-ఈయన 1872లో రాసిన గులాంగిరీ గ్రంథం వివాదాస్పదమైంది. ఇందులో బ్రాహ్మణుల శాస్ర్తాలు, పురాణాల్లోని లోపాలను బహిరంగంగా ఎత్తిచూపి చర్చించాడు.
సత్యశోధక్ సమాజ్ (1873)
-సమాజంలోని కిందివర్గాల ప్రజలను జాగృతం చేయడం కోసం పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించడంతో సరిపెట్టకుండా జ్యోతిబా వారికోసం ఈ సంస్థను స్థాపించాడు.
-శూద్రులు, అతిశూద్రులను బ్రాహ్మణ ప్రోక్తమైన పురాణాల ప్రభావం నుంచి తప్పించడం, మానవహక్కుల గురించి జాగ్రత్తపడేట్టు వారికి శిక్షణ ఇవ్వటం, మత సంబంధమైన మానసిక బానిసత్వం నుంచి వారిని విముక్తులను చేయటం ఈ సంస్థ ఆశయాలు.
-సత్యశోధక్ సమాజ్ నియమాలు ముఖ్యంగా.. 1. మానవులంతా ఒకే దేవుడి బిడ్డలు. దేవుడే వారికి తల్లి, తండ్రి. 2. తల్లినికానీ, తండ్రినికానీ సమీపించే బిడ్డకు మధ్యవర్తి అవసరం ఎలా లేదో దేవుడికి, మానవునికి మధ్య మరో మనిషి (పురోహితుడు గాని ప్రవక్తగానీ) అవసరం లేదు.
-బ్రాహ్మణుల నుంచి మహర్లు, మాంగ్ల వరకూ అందరికీ దీనిలో ప్రవేశార్హత ఉంది.
-మతపరంగా బ్రాహ్మణ పురోహితుల ప్రాధాన్యాన్ని తగ్గించటం, వీరి ప్రమేయం లేకుండా తక్కువ ఖర్చుతో వివాహాది శుభకార్యాలు జరపడం ఇతర ముఖ్య కార్యకలాపాలు.
-1888, మే 11న అభిమానులు ఆయనకు నిర్వహించిన సన్మానంలో జ్యోతిబాకు మహాత్మా బిరుదు ఇచ్చారు.
-ఇలా సమాజంలో కిందివర్గాలంతా కలిసి ఇంత గొప్ప బిరుదు ఇవ్వటం ఆధునిక భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ (1820-91)
-ఇతను బెంగాల్‌లోని వీరసింగీ గ్రామంలో 1820, సెప్టెంబర్ 26న జన్మించాడు.
-ఇతను వితంతు పునర్విహాలను సమర్థిస్తూ వితంతు వివేకం అనే గ్రంథాన్ని రచించాడు.
-ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1856, డిసెంబర్ 7న అగ్రవర్ణాల్లో తొలి వితంతు వివాహాన్ని జరిపించాడు.
-బ్రాహ్మణులు కానివారు కూడా సంస్కృతం నేర్చుకోవాలని చెప్పాడు. బెంగాల్ భాషకు వ్యాకరణం తయారుచేశాడు.
-ఇతను బాల్యవివాహాలు, బహుభార్యత్వానికి వ్యతిరేకి. బాలికల విద్య కోసం కృషి చేశాడు.
-బెతూన్ స్కూల్ సెక్రటరీగా ఉంటూ 35 బాలికల పాఠశాలలను నెలకొల్పాడు.
-ఈయన తన భావాలను ప్రచారం చేయడానికి బెంగాలీ భాషలో సోమ్‌ప్రకాష్ అనే వార్తా పత్రికను 1858లో ప్రారంభించాడు.
దివ్యజ్ఞాన సమాజం (థియోసోఫికల్ సొసైటీ)
-అంతర్జాతీయ సోదరభావాన్ని పెంపొందించడానికి దివ్యజ్ఞాన సమాజాన్ని మేడం బ్లావట్క్సీ, కల్నల్ ఆర్కాట్లు 1875లో అమెరికాలోని న్యూయార్క్‌లో స్థాపించారు.
-థియోస్ అంటే దైవం, సోఫియా అంటే జ్ఞానం, అందుకే దీనికి తెలుగులో దివ్యజ్ఞాన సమాజం అని పేరొచ్చింది.
-1879లో ఈ సమాజ ముఖ్య కార్యాలయం న్యూయార్క్ నుంచి బొంబాయికి, 1882లో బొంబాయి నుంచి మద్రాస్‌లోని అడయార్కి మార్చారు. అప్పటి నుంచి అడయార్ దివ్యజ్ఞాన సమాజానికి అంతర్జాతీయ కేంద్రస్థానమై వర్థిల్లుతూ ఉంది.
-ఈ సమాజ కార్యకలాపాల నిమిత్తం అనిబిసెంట్ భారతదేశానికి వచ్చారు.
-హిందూ మతానికి దగ్గరయ్యారు. హిందూకర్మ సిద్ధాంతాన్ని, హిందూ ప్రార్థనా విధానాన్ని చేపట్టారు. ఉపనిషత్తులు, సాంఖ్య, యోగ శాస్ర్తాలు, వేదాంత ఆలోచనలు వీరిని ఆకర్షించాయి.
-దివ్యజ్ఞాన సమాజం హిందూ మతాధిక్యాన్ని ఉద్ఘాటించింది. భారతీయ విజ్ఞాన గౌరవాన్ని విశ్వమంతా చాటిచెప్పింది.
-దివ్యజ్ఞాన సమాజాభివృద్ధి అంటే హిందూమత పునరుద్ధరణ అని అనిబిసెంట్ చెప్పారు. ఆమె వారణాసిలో హిందూ కళాశాలను స్థాపించారు. అదే ఇప్పుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయమైంది.
-ఇదేగాక అనిబిసెంట్ మదనపల్లిలో, అడయార్‌లో పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఇవి జాతీయ పాఠశాలలు, జాతీయ విద్యను నేర్పించడానికి స్థాపితమయ్యాయి.
-ఈవిధంగా దివ్యజ్ఞాన సమాజం కూడా మన సంఘసంస్కరణకు, సంస్కృతి పునరుద్ధరణకు ఎంతో సహాయపడింది.
సావిత్రిబాయి ఫూలే (1831-97)
-1831, జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు తొమ్మిదేండ్ల వయసులో 13 ఏండ్ల జ్యోతిరావు ఫూలేతో వివాహమైంది.
-భర్త సహకారంతో చదువుకొని శూద్ర, అతిశూద్ర బాలికలకు చదువు చెప్పిన సావిత్రిబాయి ఫూలే దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా భావించవచ్చు.
-పాఠశాలకు వెళ్తుంటే దారిలో ఆమెను అగ్రవర్ణాలవారు తిట్టడం, బురద చల్లడం, రాళ్లు విసరటం చేసేవారు. అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా అక్కడే సమాధానపర్చడానికి ప్రయత్నించేది.
-కులరహిత సమాజం, సార్వత్రిక విద్యకోసం తమ జీవితాంతం పోరాడారు జ్యోతిబా దంపతులు.
-ఆరోజుల్లో దళితుల కోసమని స్వయంగా తన ఇంట్లో బావిని తవ్వించి మంచినీళ్లను అందించారు.
-1852లో మహిళా సేవా మండలిని స్థాపించి గాంధీ పుట్టుకముందే చరఖాపట్టి సొంతంగా నేసుకున్న వస్ర్తాలను ధరించిన స్వదేశీ నినాద సృష్టకర్త.
-1870లో తీవ్ర కరువు కారణంగా చనిపోయిన కుటుంబాల అనాథ పిల్లలకు పాఠశాలలు నడిపించి భోజన కేంద్రాలు ఏర్పాటుచేసిన సావిత్రిబాయిఫూలే నేటి మధ్యాహ్న భోజన పథకానికి ఆద్యురాలు.
-భర్త సహకారంతో వయోజనులు, శ్రామికులకు రాత్రి పాఠశాలను నడిపింది. వితంతు పునర్వివాహాలు జరిపించి, బాల్య వివాహాలను అడ్డుకుంది.
-వితంతువులైన స్త్రీలు మగవారి దురహంకారం, అఘాయిత్యాలకు బలై గర్భవతులైతే గర్భవిచ్ఛిత్తి చేయడం వంటి ప్రమాదకర పద్ధతులు, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా 1868లో భ్రూణహత్య నిరోధక వసతిగృహం నడిపింది.
-ఆ గృహంలో బిడ్డలను కన్న మహిళలు గృహం విడిచి తమ ఇంటికి వెళ్లేటప్పుడు తమతో పాటు ఆ బిడ్డలను తీసుకెళ్లవచ్చు. లేదా గృహంలోనే వదిలిపెట్టిపోవచ్చు.
-అలా ఒక బ్రాహ్మణ వితంతువు వదిలిపెట్టి పోయిన శిశువునే 1874లో యశ్వంత్‌రావు ఫూలేగా సావిత్రిబాయి దంపతులు పెంచుకున్నారు.
-స్త్రీల కోసం కావ్యఫూలే, భావన్ కషి సుబోధ రత్నాకర్ కవితాసంపుటాలను వెలువరించింది.
-1890లో జ్యోతిబాఫూలే చనిపోయిన తర్వాత సత్యశోధక్ సమాజ్ బాధ్యతలు చేపట్టి బలహీనవర్గాలకు ఎంతో సేవ చేసింది.
-1897లో ప్లేగు వ్యాధిగ్రస్తులకు వైద్యుడైన యశ్వంత్రావుఫూలేతో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ మార్చి 10న అదే ప్లేగు వ్యాధికి గురై మరణించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు